Monday, April 10, 2017

నా నంబర్ 4 ....అవును అక్షరాలా నాలుగే ....


నా నంబర్ 4 ....అవును అక్షరాలా నాలుగే ....
ఖైదీ లకు జైలుకి వెళ్ళగానే ఒక నంబర్ ఇచ్చి ....ఆ నంబర్ తో పిలుస్తారు ....వాళ్ళ పేరు పెట్టి పిలవరు ....అలా నన్ను ఇక నుండి శ్రీలక్ష్మి అని, పేరు పెట్టి పిలవకుండా ...."నంబర్ నాలుగు" అని పిలిచినా నాకు ఇష్టమే ....
బహుశా ఈ దేశంలో చాలా మంది స్త్రీలకు నాలాగే నాలుగు నంబర్ ఉండొచ్చు ....లేదా ఒకటి ఉండొచ్చు ....లేదా ఏ పదో నంబరో ఉండొచ్చు ....లేకపోతే అసలు లేకుండానూ పోవచ్చు ....నాకు తెలియదు ..... :(
======================
అవును ....గత కొన్నేళ్లుగా ....అంటే దాదాపు చాలా ఏళ్లుగా అన్నమాట ....నా నంబర్ నాలుగే ....
అసలు చెప్పాలి అంటే ....నాకు నాలుగు అనే నెంబర్ ఎవరైనా ఇచ్చారా ??!! ....నేనే తీసుకున్నానా ...??!! అని ఆలోచిస్తే ....ఏమో, సమాధానం దొరకని ప్రశ్నే ....
ఒకప్పుడు ...అంటే నాకు ఊహ తెలిశాక నా నంబర్ ఒకటే ....
అప్పుడు ....నాకేం కావాలన్నా ఒకటో స్థానంలో సాధించుకోవడం అలవాటు ....
పాకెట్ మనీ కావాలంటే.... నాకు ఇప్పుడే కావాలి అని పేచీ ....
కొత్తబట్టలు తెస్తే ...నాకు ముందు ఇవ్వలేదని అలక ....
నాకూ సైకిల్ కొనిపెట్టాలి అని .....నాకూ వాచ్ కావాలి అని ....పళ్ళూ ....పూలు ...ఇలా ....ఒకటనేమిటి ... అన్నీ నాకూ కావాలి ....అని తల్లి తండ్రుల్ని అడిగి సాధించుకోవడమే .....నాకు తెలిసినప్పుడు ....నాకు నేను విలువ ఇచ్చుకున్న రోజుల్లో ...నన్ను నేను వరుసలో 
ముందు నిలుపుకున్న రోజుల్లో ....నా నంబర్ నాకు ఒకటే ....
=====================
తర్వాత నా నంబర్ రెండుగా మారింది ....ఎందుకు మారింది ....ఎప్పుడు మారిందో నాకు తెలియదు ....
వివాహం తర్వాత .... నన్ను నేనే రెండో స్థానం లోకి మార్చుకున్నాను ....
సమయం సందర్భం ఏమిటి అని నాకు గుర్తు లేదు కానీ ....ఏది కావాలనుకున్నా ....ముందుగా మొదటి స్థానంలో ఉన్న వాళ్ళ అవసరాలు తీరాక ....నాకు ఏది కావాలో అని ఆలోచించడం నేర్చుకున్నాను .....
అది నిజానికి నా తప్పా ....చుట్టూ ఉన్న సమాజం తప్పా ....లేక ఇచ్చేవన్నీ మొదటి స్థానంలో ఉంచి ఇచ్చి .... వివాహం తర్వాత నువ్వు రెండో స్థానంలో ఉండాలి అని నన్ను నా ఆలోచనను చిన్నతనం నుంచి శాసించిన తల్లితండ్రుల, బంధువుల, సమాజం తప్పా ...??!!
ఏమో ....నేను ఎవరినీ నిందించను ....నన్ను నేను తప్ప ....
ఎందుకంటే ....నా నంబర్ ను నా మాతృప్రేమ నాలుగో స్థానంలోకి చేర్చడం .....నాకు తెలియకుండా చేసింది కాదు ....నాకెవరూ అలా చేయమని చెప్పలేదు .....(బహుశా మా అమ్మ కూడా అందుకే మొదటి స్థానం నాకు ఇచ్చిందేమో .... ??!! )
====================
అప్పటి నుండి నా స్థానం నాలుగే .....
నేను నాలుగో స్థానంలో ఉన్నాను అని నాకు తెలియడానికి నాకు చాలా ఏళ్ళు పట్టింది ....
తెలిశాక నా తప్పు నేను తెలుసుకుని .....మళ్ళీ మొదటి స్థానం లోకి రావాలని ప్రయత్నించాను ....
కానీ ఇప్పటివరకు నేనే వాళ్లకి ఆ స్థానం ఇచ్చి ....నా స్థానం నేను నిర్ణయించుకుని ....మళ్ళీ ఇప్పుడు నాది నాకు కావాలి అంటే ఎలా కుదురుతుంది .....??!! పైగా చిన్నతనంలో నా తల్లితండ్రులు ఇచ్చిన స్థానాన్ని నేను ఆస్వాదించలేదూ ....??!!
అందుకే ....ప్రస్తుతానికి నా స్థానం నాలుగే ...
నా ఒకటో స్థానం నాకు వచ్చేవరకు నా నంబర్ నాలుగే ....
====================
అందుకు నేను బాధపడడం లేదు .....చివరి క్షణాల వరకూ ఎదురు చూస్తాను .....
ఎవరో నాకు మొదటి స్థానం ఇవ్వడం కోసం కాదు ......నా ఆలోచనల్లో మార్పు కోసం ....
"నా కోసం" ....అని నాకు నేను పేచీ పెట్టుకోవడం కోసం ....నాకు ముందుగా కావాలి అని నా మీద నేను అలగడం కోసం...ఎవరిగురించీ ఆలోచించకుండా అవసరమైంది నాకు నేను ముందుగా కొనుక్కోవడం కోసం ....
మొత్తానికి ....నాకు ....నా కోసం ..."ముందుగా కావాలి ..."అని ఏదైనా నేను కోరుకోవడం కోసం ....
నాకు నేను ఇచ్చుకునే ఎప్పుడో కోల్పోయిన నా మొదటి స్థానం కోసం .... <3 <3 <3