Friday, October 26, 2018

జీవితం ఎప్పుడూ అద్భుతమే ....

జీవితం ఎప్పుడూ అద్భుతమే ....
అలాగే జీవితం సమస్యల వలయం కూడా ...
మనం ఎన్నో సందర్భాల్లో ....అనుకోకుండా వచ్చిన ఎన్నో సమస్యల్ని అధిగమిస్తూ ఉంటాం ....కొన్ని మనంతట మనమే అధిగమిస్తాం ....కొన్ని మన చుట్టూ ఉన్నవాళ్లు మనకు సహాయం చేస్తే అధిగమిస్తాం .....కానీ ఎలా అయినా ...సమస్యలు ఎదురవక తప్పదు ...మనం అధిగమించక తప్పదు కదా అనిపిస్తుంది ....
అలాగే ఎన్నో అద్భుతాలను కూడా ఆస్వాదిస్తాం ....
అంటే ..., ఒక కీకారణ్యంలో మొదటిసారి ఎవరూ లేకుండా వెలుగులోనూ చీకట్లోనూ ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందో ....అలా ఉంటుందన్నమాట జీవితం ....
వెలుగులో ప్రయాణం చేయడం అంటే ....వచ్చే సమస్యలను , అద్భుతాలను కాస్త ముందుగా గమనించే అవకాశం ....ఆ సమస్యల్ని తప్పించుకునే అవకాశం ....లేదా అద్భుతాలను ఆస్వాదించే అవకాశం ఉంటుంది ....
ఉదాహరణకు ...ఏ పులో దాడి చేస్తుంది అని పసిగడితే ....దగ్గర్లో ఉన్న చెట్టుమీదకో పుట్టమీదకో ఎక్కి ప్రాణాలని కాపాడుకోవడం .....లేదా అద్భుతమైన లోయలో , సరోవరాలో ఎదురైతే ....కాసేపు ఆగి ఆస్వాదించడమో.....ఇలాంటి సందర్భాలు వెలుగు ఉంటే ఏర్పడే ప్రయాణం ....
ఇక చీకట్లో ప్రయాణం అంటే....వచ్చే సమస్యలనూ చూడలేం ....అద్భుతాలనూ చూడలేం ....అద్భుతాలను చూడకపోయినా పర్వాలేదు ....కానీ సమస్యను చూడలేక పోయామంటే ....సమస్యల వలయంలో చిక్కుకున్నట్టే ....ప్రాణాలను కోల్పోయినట్టు జీవితాలను కోల్పోయినట్టే ....
అఫ్కోర్స్ ఏ ప్రయాణానికి గమ్యం తెలియదనుకోండి ....
కొందరికి వాళ్ళ జీవితం అంతా పగటి ప్రయాణమే కావచ్చు ....రాత్రిని చూసే అవసరమే కలగకపోవచ్చు ....కొందరికి వాళ్ళ జీవితం అంతా రాత్రి ప్రయాణమే కావచ్చు ....పగటిని చూసే అవకాశమే రాకపోవచ్చు ...
లేదా వాళ్ళ వాళ్ళ జీవితాల్లో పగలు రాత్రి అనేవి ...అప్పుడప్పుడు మెరిసే మెరుపులు కావచ్చు ....చూడాలనుకునేంతలో మాయమైపోవచ్చు ....
చెప్పలేం ....
నా జీవితం లో ....పగలు రాత్రి అనే కాల చక్రం మొదలయ్యే నాటికి (ఊహకు వయసొచ్చేనాటికి ) ...కీకారణ్యంలోరాత్రి ప్రయాణం చేయాల్సి వచ్చింది ....
నాకు సమస్యలనేవి ఎదురై ....అవి నేను ఊహించనివి అని తెలుసుకునేవరకు ....అది పగటి ప్రయాణమే అనుకున్నా ...సమస్యలే లేవనుకున్నా ....అన్నీ అద్భుతాలే అనుకున్నా ....
సమస్యలు ఎదురయ్యాక ....అవి ఊహించలేకపోయాక తెలిసింది ....నాది రాత్రి ప్రయాణం అని ....జీవితాలే కోల్పోయే ప్రయాణం అని ....అప్రమత్తమవ్వాల్సింది నేనే అని .....
కీకారణ్యం ....చుట్టూ చిమ్మ చీకటి ....దారి తెలియక ....గమ్యం లేక ....పగలును వెతుక్కుంటూ ....వెలుగుని ఊహించుకుంటూ ....గుండెల్లో గంపెడంత మరణ భయంతో.... ప్రయాణం ....
దారిలో ...ఏ రాళ్లు గుచ్చుకున్నాయో ....ఏ క్రూర జంతువులు నాపై దాడి చేశాయో ...ఏ రక్కసి తన కోరల్ని నా శరీరంలో దాచుకుందో ....ఏ అవయవాల్లోనుండి రక్తం ధారలై ప్రవహిస్తుందో ....గమనించడం వృధా అనుకున్నా ....
గుచ్చుకున్న రాళ్లను పూలేమో అనుకున్నా .....
క్రూరజంతువులు దాడి చేస్తుంటే నాకు ప్రేమ పంచుతున్నాయేమో అనుకున్నా ....
కాలికి తగిలిన విషపు నాగుల్ని తాడుగా చేసుకుని చెట్లు ఎక్కడానికి ఉపయోగించుకున్నా...అసలు ఈ దేహం నాది కాదు అనుకున్నా ....
ప్రేమను ద్వేషమేమో అని భ్రమించి వదులుకున్నా ....ద్వేషాన్ని ప్రేమేమో అని ఆశించి హృదయానికి హత్తుకున్నా .....
ఇంతా చేస్తున్నా....మనసులో ఒకటే లక్ష్యం ...
వెలుగుని చూడాలి ....పగటిలో ప్రయాణం చేయాలి ...పగటి వెలుగులో అద్భుతాల్ని చూడాలి .....
నన్ను నేను వెలుగులో చూసుకోవాలి ....నన్ను నేను వెలుగులో చూసుకుంటే ఎలా కనిపిస్తానో ...అని ఆసక్తి గా ఉంది ....
ఇప్పుడిప్పుడే నా జీవితంలో వెలుగు రేఖలు తూరుపు కొండల్ని దాటుకుని రావాలని ....నన్ను తనివితీరా స్పృశించాలని ....ఆరాటపడుతూ నా చెంతకు చేరుకుంటున్నాయి ....
నా వాళ్ళు ...ప్రపంచం ....రూపు రేఖలు మారిపోయిన నన్ను ....మనిషిగా గుర్తించలేకపోవచ్చు ....సభ్య సమాజంలో నేను సభ్యురాలిని కాదేమో అని అనుమానించొచ్చు ....అసలు మనిషినా కాదా అని నాకే అనుమానం రావచ్చు .....
ప్రేమను ప్రేమగా, ద్వేషాన్ని ద్వేషంగా గుర్తించలేకపోతున్నానని నన్ను వెలివేయవచ్చు .....
కానీ నాకు వెలుగు రేఖలు కనిపిస్తున్నాయి ....సూర్యోదయం చూడగలననే నమ్మకం కలుగుతుంది ...😍

No comments:

Post a Comment