Wednesday, February 2, 2022

ఇప్పటికీ ఎక్కడైనా సంతకం పెట్టాలంటే ...నా చెయ్యి కి కుదురు ఉండదు .

 "నీ చేతి వ్రాతతోనే ఇక్కడ పోస్ట్ లు వేసుకోవాలి" అంటే ....నేను ఒక్క పోస్ట్ కూడా వ్రాసి ఉండేదాన్ని కాదు ...ఏదో తెలుగు టైపింగ్ టూల్స్ పుట్టుకొచ్చాయి కాబట్టి ...రెండు ముక్కలు వ్రాసుకోగలుగుతున్నా ....నా పోస్ట్ లు నేను ధైర్యంగా చదువుకోగలుగుతున్నా ...

అంత అందంగా ఉంటుంది మరి నా చేతి వ్రాత ...
"అదేం రాతే...కుదురుగా వ్రాయడం నేర్చుకోలేవూ...కోడి కెలికినట్టు వ్రాయకపోతే ...." అనేది మా అమ్మ ...నా చేతి వ్రాత చూసి ...
అప్పుడు నాకు అర్ధం కాలేదు ....నా చేతి వ్రాతలాగే నేనూ కుదురుగా ఉండను అని ....
మా ఆయన నా పెళ్ళికి ముందు ...మా నాన్నకి ఒక ఉత్తరం వ్రాశారు ....గౌరవనీయులైన మామగారికి అంటూ ....ఆ ఉత్తరం ఇప్పుడెక్కడుందో తెలియదు ...కానీ చేతివ్రాత నా రాతకంటే కొంచెం బాగానే ఉందే అనుకున్నా ...అప్పటి ఆలోచనలు అలాంటివి ...
ఇప్పుడు ఏదైనా వ్రాస్తే ..."ఏంటి కోడి కెలికినట్టు ఈ రాత...ఒక్క ముక్క అర్ధమై చస్తుందా ..." అంటూ ఉంటా ....
కాలానుగుణంగా అభిప్రాయాలూ మారిపోతూ ఉంటాయి ....ఒకప్పుడు అద్భుతం అనుకున్నవి ...కొన్నాళ్ళు పోయాక అలా అనిపించవు ...
చేతి వ్రాతలు చూసి ఎవరూ ప్రేమించరు ....ప్రేమించాక చేతి వ్రాత నచ్చుతుంది ...అది వేరే విషయం ...
మేము ఒకసారి ఇండియాలో ఏవో ప్రయివేట్ క్లాసులకి వెళ్ళినప్పుడు ...ఒక మాష్టారు చెప్పారు ....కొందరు పిల్లల్ని కొందరు మేస్టార్లు ....నీ చేతి వ్రాత ఎంతో అందంగా ఉంటుంది ...నువ్వు కలెక్టర్ అయిపోతావు అని చెప్పేవారట ...
ఇలా మోసం చేస్తారమ్మా కొందరు అని చెప్పేవారు ....
ఓహో ఇలా కూడా చెబుతారా అనుకునేవాళ్లం ....
నేను ఫస్ట్ టైం సంతకం ఎప్పుడు పెట్టానో గుర్తులేదు ....కానీ నా సంతకం ఎలా పెట్టాలి అనేది ఇప్పటికీ నాకు సందిగ్ధమే ...
చిన్నతనంలో శ్రీలక్ష్మి అని నా పూర్తి పేరే వ్రాసిన గుర్తు ....అయినా మనకేమైనా విచ్చవిడిగా చెక్కుబుక్కుల మీద సంతకాలు పెట్టాల్సిన అవసరం ఏదైనా ఉందా ఏమిటి ...
నా పెళ్లయ్యాక ....మా ఆయనే నాకు, సంతకం శ్రీలు అని పెట్టుకో ...అని ఒక రెండు మూడు స్టైల్స్ నేర్పించి చూపించారు ...సరే ..అందులో ఏదో ఒకటి నచ్చి ఒకదానికి ఫిక్స్ అయిపోయా అనుకోండి...
కానీ ఏ స్టైల్ అప్పుడు నాకు నచ్చిందో ....అమాసకో పూర్ణనికో పెట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు గుర్తొచ్చేది కాదు ....
అప్పుడు మా ఆయనే ....శ్రీలు అని వ్రాసి ....కింద గీత గీసి చుక్కలు పెడతావు .....అదే అనుకుంటా అని గుర్తు చేసేవారు ....
కాలం కలానికి అంతగా సంతకాలు పెట్టే అవసరం కల్పించకపోవడం వలన ....నాకూ పెద్దగా ఇబ్బందులు ఎదురు కాలేదు ....
ఆ మధ్య కాలంలో ....ఎప్పుడో ...నాకు ఈ సంతకం మీద కాస్త కాన్ఫిడెన్స్ వచ్చేసి ...కోడి కెలికినట్టు కాకుండా ....కోడి పొదిగినట్టు పెట్టేస్తుంటే ...మా పిల్లలు ..."శ్రీలు అని కాకుండా ....షార్ట్ గా స్టైల్ గా ఉండేలా పెట్టుకో మమ్మి ...." అని సలహా ఇచ్చారు ...
అప్పుడు మళ్ళీ నా సంతకం జీవితం సందిగ్ధంలో పడింది ....
స్టెయిలా...అంటే ఎలారా అడిగా ....నాకు రాదురా .....ఇది డాడీ చూపించారు .....ఫాలో అయిపోతున్నా ....చెప్పా ....
డాడీ సంతకం కూడా బాగుండదు మమ్మి ....పూర్తి పేరు వ్రాసుకుంటారు ....
అలా కాదు అని ....నాకు కొన్ని స్టైల్స్ వ్రాసి చూపించారు ....
సరే పిల్లలు చెప్పింది ఫాలో అయిపోయి మార్చుకుందాం అని డిసైడ్ అయ్యా ....
ఇంతకు ముందు నా సంతకం ఇప్పుడు నా సంతకం మ్యాచ్ అవకుండా ఉంటుందా అని ....బ్రహ్మానందం దూకుడు సినిమాలో వేసిన లెక్కలు లాగా ఆలోచించా ....
ఆ అంతోటి లక్షల కోట్ల ఆస్తులు నా పేరు మీద ఏం ఉన్నాయిలే అని ....సంతకం మార్చుకోవడానికి డిసైడ్ అయ్యా ....
సరే పిల్లలు చెప్పిన స్టైల్ కోసం పేజీలు పేజీలు నా సంతకాలు ప్రాక్టీస్ తో నింపేసి ....సంతకాలు పెట్టిన పేపర్లతో ...చెత్త బుట్టలు నిండిపోయాయి కానీ నాకు స్టైల్ అయితే రాలేదు ....
చివరకు ఏదో ఒక స్టైల్ కి పిల్లలతో మమ అనిపించి దానికి ఫిక్సయ్యా ...
పాతది మర్చిపోయి ....కొత్తది గుర్తుపెట్టుకుని ...రెండు సంతకాలు పెడదాం అనుకునేసరికి ....డిజిటల్ వరల్డ్ వచ్చేసింది ....ఇప్పుడు మరీ దారుణం ....
స్వైప్ మిషన్స్ మీద .... e signature లు ....ఒక గీత గీకి వదిలేస్తా ....అది నాకే అర్ధం కాదు ...ఇంకా ఎవరికైనా అర్ధం అవుతుందనే నమ్మకం కూడా నాకు లేదు ....
ఇప్పటికీ ఎక్కడైనా సంతకం పెట్టాలంటే ...నా చెయ్యి కి కుదురు ఉండదు ...నా బుర్రకు జ్ఞాపకం ఉండదు ...
ఏ మాటకామాటే ....నా కూతురు చేతివ్రాతకు ....అచ్చు పుస్తకానికి తేడా కనిపెట్టడం కాస్త కష్టం .....అది చూసి ఎంతో మురిసిపోతూ ఉంటా ....
ఇందాక ఇంకు పెన్ మీద....జర్నల్ లో వ్రాసుకుంటుంటే ....ముచ్చటగా అనిపించింది ....
కాబట్టి ...ఈ టైపింగ్ టూల్ నా చేతివ్రాతకు అందరూ వంకలు పెట్టకుండా నన్ను కాపాడింది ...
కాబట్టే రెండుముక్కలు వ్రాసుకుంటున్నాం ....!😇✍

No comments:

Post a Comment