Thursday, July 13, 2017

కాలమే ప్రశ్నించాలి ....కాలమే సమాధానము చెప్పాలి ....💙❤️

నేను నా బాధ్యతలు నిర్వర్తిస్తున్నంత వరకు ,
నేను ఎవరికీ ఏ విధమైన కష్టం కలిగించనంత వరకు,
నేను ఎవరినుండీ ఏమీ ఆశించినంత వరకు ....,,
నేను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ....ఎవరు ఏమన్నా లెక్క చేయాల్సిన అవసరం లేదు అని గట్టిగా అనుకుంటూ ఉంటా ఎప్పుడూ ...🤔
అయితే కొంతమంది అన్న మాటలు / కొంతమంది చేసిన చేతలు , ఎంత "కాదు" అనుకున్నా ....ఒక్కోసారి నన్ను బాధపెడుతూ ఉంటాయి ..😢
ఎందుకా అని.... ,, ఈ రోజు నన్ను నేను ప్రశ్నించుకుంటే...నాకు మరో ప్రశ్న ఎదురైంది .....1️⃣
కొంతమంది అన్న మాటలు / చేసిన చేతలు నాకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి కదా ....అప్పుడు ఎందుకు ఈ ఆలోచన నాకు రాలేదు అని .... 2️⃣
అప్పుడు నాకు మూడో ప్రశ్న ఎదురైంది .. బాధ కలిగినప్పుడు మాత్రమే నేను ఎందుకు సమాధానం కోసం ప్రశ్నించుకున్నాను అని ...3️⃣
ఇక ఈ ప్రశ్నలకు అంతం ఉండదులే అని ఓ నిర్ణయానికి వచ్చేసి ....సమాధానాల కోసం వెతకడం మొదలు పెట్టా ....👀
మొదటి ప్రశ్నకు ....ఇంకా కొంతమంది మాటల్ని నేను లెక్క చేస్తున్నా అని ..అలా లెక్క చేయని పరిస్థితులు సృష్టించుకోవాలి అని , లెక్క చేయని స్థైర్యం నేను సంపాదించుకోవాలి అనిపించింది ....❤️
రెండో ప్రశ్నకు నాకు దొరికిన సమాధానం ఏమిటంటే .....ఆనందాన్ని / బాధను నేను ఒకేలా స్వీకరిస్తున్నాను ....అందుకే రెండు భావాలను సమానంగా ఆస్వాదిస్తున్నాను అని .....ఇదీ ఒకందుకు మంచిదే కదా ....బాధ కలిగినప్పుడు మాత్రమే ఈ ఆలోచన రాకుండా చూసుకోవాలి అని ....💚
ఇక ఆఖరి ప్రశ్నకు ....ఈ బాధను నేను భరించే శక్తి లేక / తక్కువై ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతున్నాయి ....మనో బలాన్ని పెంపొందించుకోవాలి అని ....💜
ఏది ఏమైనా ....కాలమే ప్రశ్నించాలి ....కాలమే సమాధానము చెప్పాలి ....💙❤️

Tuesday, July 11, 2017

పురుషుడు ఎంత నమ్మకం కలిగిస్తే, స్త్రీ మనసు అంత అర్ధం చేసుకోవచ్చు.......!!!!!!!

ఈ మధ్యకాలంలో ఓ వ్యక్తి నుండి నాకెదురైన ఒక ప్రశ్న....."ఎన్నో పుస్తకాలు చదివాను......ఎంతో ప్రపంచాన్ని చదివాను......ఎంతో జీవితాన్ని చూశాను........కానీ స్త్రీ మనసు మాత్రం అర్ధం కావడం లేదు ఎందుకో తెలియడం లేదు......"అని
నేను గమనించిన ఒక విశ్లేషణ.....ఊహ తెలిసినప్పటి నుండి ఆడపిల్ల తన మనసులో ఉన్న భావం ఏదైనా చెప్పిన వెంటనే తన చుట్టూ ఉన్న సమాజం అంతా ఒకటే అంటుంది....."ఆడపిల్లలు అలా మాట్లాడకూడదు తప్పు" అని ,
అబ్బాయి అదే భావాన్ని చెప్పిన వెంటనే "అబ్బాయివి కాబట్టి నువ్వేం చేసినా తప్పు కాదంటుంది......"
ఇక అప్పటినుండి మొదలవుతుంది ......అమ్మాయి భావాల అణచివేత.......అబ్బాయి భావాల విజృంభణ .......
అలా అలా అణచివేతకు గురైన భావాలు కొంతకాలానికి మరుగున పడిపోతాయి......(కొందరికి చచ్చిపోవచ్చు కూడా).....
ఏ పరిస్థిల్లోనూ తన మనసులో భావాలు బయటపడకుండా జాగ్రత పడుతుంది స్త్రీ.....పురుషుడు మాత్రం అన్ని వేళలా అన్ని సమయాల్లోనూ .....తన మనసు బయటపెడుతూ......తన కోరికలన్నీ నెరవేర్చుకుంటూ ఉంటాడు......
మరిచిపోయిన భావాలను,గమనించే వ్యక్తి.......గమనించిన భావాలను,గుర్తించే వ్యక్తి.....గుర్తించిన భావాలను,మనసులో దాచుకునే వ్యక్తి.......మనసున దాచిన భావాలను,లాలించే వ్యక్తి.......తనకెదురైనప్పుడు... స్త్రీ తన మనసుకి కప్పిన పరదాలను ఒకటొకటే తొలగిస్తుంది.......!!!!!!
పురుషుడు ఎంత నమ్మకం కలిగిస్తే, స్త్రీ మనసు అంత అర్ధం చేసుకోవచ్చు.......!!!!!!! <3
ఇది నా అభిప్రాయం మాత్రమే.......!!!!!

Sunday, July 9, 2017

తప్పు .....తప్పు ....తప్పు ....

నా జీవిత లక్ష్యాల్లో ఒక లక్ష్యం ....  
========================
తప్పు .....తప్పు ....తప్పు ....
ఏది తప్పు ...??!! ఏది తప్పు కాదు ...??!!
---------------
చిన్నతనం నుండి ....నాకు ఈ ఒక్క పదానికి అర్ధం తెలిసేది కాదు ....
ఎప్పుడు నన్ను ఎదుటివాళ్ళు తప్పు చేశావు అన్నా ....అది నా దృష్టిలో తప్పు అని అనిపించేది కాదు ....
ఇది ఒప్పు చేశావు అన్నప్పుడు కొన్నిసార్లు ఇది తప్పు కదా అనిపించేది .....
ఆలోచించి ఆలోచించి ...ఎన్నో నిఘంటువులు వెదికి వెదికి ....చివరకు ఒక నిర్ణయానికి వచ్చేసా ....
ఈ ఒక్క పదానికి ఏ నిర్వచనం కరెక్ట్ కాదు ....ఈ పదానికి మాత్రం మనమే మన సొంతంగా ఒక నిర్వచనం సృష్టించుకోవాలి అని .....
అంతే ....
నెమ్మదిగా ప్రతి చర్యలోనూ నా నిర్వచనం నేను సృష్టించుకోవడం మొదలు పెట్టా ....
వాళ్ళు సృష్టించిన నిర్వచనాలను నేను ఆచరించడం లేదని ....,,,
తల్లితండ్రుల దగ్గరనుండి ఎన్నో తిట్లు తిన్నా ....  సమాజం నుండి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నా....  అయినా నా నిర్వచనాన్ని సృష్టించే పని ఆపలేదు .... 
---------------------------
అయితే కొంతకాలం తర్వాత ...,,,,
సమాజంలో నేను బ్రతుకుతున్నాను కాబట్టి ....సమాజంలో నేను ఒక వ్యక్తిని కాబట్టి ....కొన్ని సమాజం ఏర్పరిచిన నిర్వచనాలను కూడా నేను గౌరవించాలి అని నిర్ణయించుకున్నా ....
అందులో ఈ తప్పు (అనే పదానికి) కి నిర్వచనం ఒకటి ....
--------------------------------------
ఇక్కడే నాకు కొన్ని సమస్యలు ఎదురయ్యాయి ....
సమాజం తాను నిర్వచించిన ప్రతి తప్పుకు శిక్ష అనుభవించి తీరాలి అని రూల్ పెట్టింది ...(నా నిర్వచనంలో ఉన్న తప్పుకు శిక్షలే లేవు అనుకోండి...  )
దానికి కూడా నేను అంగీకరించా .... 
ఏదైతే నేను తప్పు చేశానో... దానికి ...సమాజం ఏర్పరచిన శిక్ష అనుభవించడం అలవాటు చేసుకున్నా ....
అయితే కొంతకాలానికి ...,,,
సమాజం దృష్టిలో నేను చేసిన తప్పులకు .... శిక్ష ...సమాజం ఇవ్వకుండానే .....నేనే స్వచ్చందంగా తీసుకోవడం అలవాటు చేసుకున్నా ...
శిక్షను నేనే తీసుకునే ధైర్యం నాకు ఉన్నప్పుడు ....ఏడుస్తూ ఎందుకు శిక్ష అనుభవించాలి ....??!!
నవ్వుతూ స్వీకరించాలి అని కూడా తర్వాత నా శిక్షా పద్ధతిని తీర్చి దిద్దుకున్నా ....
అప్పుడు నాకు చాలా సంతృప్తిగా అనిపించింది ...... 
----------------------------------------
అలా నా జీవితం సాగిపోతూ ఉంది అనుకుంటే ....మళ్లీ ఒక చిక్కొచ్చింది ... 
నేను చేయని తప్పుకు నేను శిక్ష అనుభవించాల్సిన స్థితి కొన్నిసార్లు ఎదురైంది ..... 
“ఇదేం సమస్య ....??!! ఇది నేను ఊహించలేదు ....నేను అనుభవించను ….” అని నా జీవితం నన్ను తిట్టి పోసింది .... 
జీవితాన్ని కాసేపు వూరుకోబెట్టి ....పరిశోధన చేశా ....
ఎన్ని పరిశోధనలు చేసినా ...."నేను చేయని తప్పుకు బలైపోయాను ...." "చేయని తప్పుకు నన్ను శిక్షించారు .." "నేనే పాపం ఎరుగను ...అయినా నా జీవితం సర్వ నాశనం చేశారు ...." అని దీనంగా చరిత్రను వేడుకున్న వాక్యాలు కళ్ళకు కట్టినట్టు కనిపించాయి ..... 
నా జీవితానికి ఎప్పుడూ అలా వేడుకునే పరిస్థితి కల్పించకూడదు అని నిర్ణయించుకున్నా ....ధైర్యం చెప్పా ....
చేసిన తప్పుకు నవ్వుతూ శిక్ష అనుభవించడం ఎలా నీకు నేర్పానో .....చేయని తప్పుకు బలైపోకుండా నిన్ను నువ్వు కాపాడుకునే మార్గాన్ని కూడా నేర్పిస్తానని భరోసా ఇచ్చా ....
నా జీవితం నన్ను మెచ్చుకుంది ....నా వలన తనకు ఏ కష్టం కలగదు అనే నమ్మకంతో కృతజ్ఞతలు చెప్పింది .......
----------------------------------
ఇప్పుడు నేను .....చేసిన తప్పుకు ఆనందంగా శిక్ష అనుభవించడం నా జీవితానికి ఎలా నేర్పానో ...,,,,,"చేయని తప్పుకు శిక్ష అనుభవించకుండా ఉండడం ఎలా??!!" అనే విషయాన్ని కూడా నేర్పిస్తున్నా ....   
నా మీదే ఆధారపడిన నా జీవితాన్ని చేయని తప్పులకు ఎప్పుడూ బలి కానివ్వకూడదు ....
ఎప్పుడూ నా జీవితాన్ని గెలిపించాలి .....తన ద్వారా నేను గెలవాలి ....ఇది నా జీవిత లక్ష్యాల్లో ఒక లక్ష్యం ....   

Saturday, July 8, 2017

జీవితం అంతమై పోయి ....మళ్ళీ ఈ జీవితమే పుట్టే అవకాశం వస్తే ఎలా ఉంటుంది ....??!!

జీవితం అంతమై పోయి ....మళ్ళీ ఈ జీవితమే పుట్టే అవకాశం వస్తే ఎలా ఉంటుంది ....??!!
---------------------------
ఒక్కోసారి జీవితం అంతమై పోయినట్టే అనిపిస్తుంది .....
అన్ని అవకాశాలు ,అన్ని దారులూ మూసివేయబడి ...జీవితం అంతా అంధకారమైపోతుంది ....ఇంక అయిపోయింది ఈ జీవితం అనిపిస్తుంది ....ఇదే మరణం అంటే అనిపిస్తుంది ....
కానీ ఎక్కడో చిన్న ఆశ మిణుకు మిణుకు మంటూ ...వెంటనే ప్రాణం పోసుకుంటుంది ....,,మళ్ళీ ...దానికి ...తప్పటడుగులు , పడడాలు ,లేవడాలు ..ఉరుకులు ,పరుగులు ..... నేర్పిస్తాం ....
ఎక్కడో మళ్ళీ ఆ పరుగులో పడిపోవడాలు ...గాయాలు ...ఆశలు ...నిరాశలు .......
ఇదే జీవితం అనిపిస్తుంది ....ఇది నిరంతరం జరిగే ప్రక్రియే అనిపిస్తుంది ....
అయినా ...
జీవితం అంతమై పోయిన ప్రతిసారీ మరణ యాతన అనుభవిస్తాం ....
జీవించిన ప్రతిసారీ ....జన్మించిన అనుభూతికి లోనవుతాం ....
నాకు రెండూ అద్భుతంగా అనిపిస్తాయి ....
ఈ రెండు అద్భుతాలను ఎన్ని సార్లు అయినా అనుభవించాలి అనిపిస్తుంది .....అసలు ఆ అద్భుతాల కోసమే బ్రతకాలనిపిస్తుంది .....
మరణ యాతన లేకుండా జీవితం లేదు .....
జీవితం లేకుండా మరణ యాతన లేదు ....
ఎన్నిసార్లు మరణిస్తే అన్నిసార్లూ జన్మిస్తూనే ఉంటాం ....
ఎన్నిసార్లు జన్మిస్తే అన్నిసార్లూ మరణిస్తూనే ఉంటాం .....
ఏది ఏమైనా ....నేను జన్మించాక ....జన్మించడంతో జీవించడం మొదలు పెట్టాక.... మరణంతో జీవితం ముగించక ముందు ....
మధ్య కాలంలో ...
ఎన్నిసార్లు మరణించే అవకాశం వస్తే అంత అదృష్టవంతురాలిని అని అనుకుంటూ ఉంటా .....
ఎందుకంటే ...,, మళ్ళీ అన్నిసార్లు సరి కొత్త జీవితాన్ని ఆస్వాదించడం కోసం ఎదురుచూస్తూ ఉంటా .....   

Friday, July 7, 2017

నేను నా జీవితంలో ...కొంతమందికి కృతజ్ఞతలు తెలియజేయాలి ....

నేను నా జీవితంలో ...కొంతమందికి కృతజ్ఞతలు తెలియజేయాలి ....
మరి కొందరిని క్షమాపణలు అడగాలి .....ఎప్పటికైనా .....,,,,
కృతజ్ఞతలు చెప్పాల్సిన వాళ్ళల్లో మొదటి వరసలో ...నన్ను అవమానించిన వాళ్ళు ,నన్ను ఎగతాళి చేసిన వాళ్ళు , నన్ను విమర్శించిన వాళ్ళు , నన్ను దూషించిన వాళ్ళు , నా శత్రువులు ఉంటే.........,,,,
క్షమాపణలు అడగాల్సిన వాళ్ళల్లో మొదటి వరసలో .....నన్ను ఇష్టపడినవాళ్ళు , నన్ను ప్రేమించిన వాళ్ళు ,నన్ను ఆరాధించిన వాళ్ళు ....ఉంటారు ..... !!

Monday, July 3, 2017

మన జీవిత కాలాన్ని మనం తరచి చూసుకుంటే

మన జీవిత కాలాన్ని మనం తరచి చూసుకుంటే కొన్ని బాధలు ,మరి కొన్ని సంతోషాలు ,ఎన్నో అనుభవాలు ,అనుభూతులు కనిపిస్తూ ఉంటాయి ....😍
అయితే.... జీవిత కాలంలో మనం ఎంత కాలం, ఎలా జీవించాం అనేది ఆయా కాలాల్లో ... సంతోషానికి ,బాధకు మనం స్పందించిన విధానం ఆధారంగా నిర్ణయించుకోవచ్చు అని కూడా అనిపిస్తూ ఉంటుంది ....
ఎప్పుడో నా చిన్నతనంలో .....

మా అమ్మ కానీ,నాన్న కానీ ,స్నేహితులు కానీ , బంధువులు కానీ ,చుట్టుపక్కల వాళ్ళు కానీ ,తెలిసిన వాళ్ళు కానీ .....ఏదో ఒక చిన్న మాట అనేవాళ్ళు ....🤔
అది ఉదాహరణకు ....."ఏం పిల్లలమ్మా ....వేళకి నిద్ర లేచి ఇంట్లో ఆ పనీ ,ఈ పనీ చేసుకోవాలని తెలియదూ .....బాధ్యతగా లేకపోతే పెద్దయ్యాక అత్తగారింట్లో మాట పడాల్సి వస్తుంది ....అనీ ...."
"చేసుకున్న వాళ్ళు ఇలా చేస్తే ఊరుకుంటారా ....అనీ ...."
"ఆ పూలు అలా చెట్టుకి పూసి రాలిపోతున్నాయే...మీరు ఆడపిల్లలు కాదూ ....కోసి మాల కట్టుకుని కాస్త సందకాడనే ఆ పూలు పెట్టుకోకూడదూ .... అనీ""అనేవాళ్ళు ......😥
అలా ఒక చిన్న జాగ్రత్త హెచ్చరిక చేసినందుకే ....వాళ్లకి ఎదురు సమాధానం చెప్పి ......నన్ను అలా అంటారా ..ఇలా అంటారా ...ఎంతగా తిట్టారో అని వెక్కి వెక్కి ఏడ్చి ....ఇంట్లోకి బయటకీ చిందులేసి కోపాన్ని ప్రదర్శించి ....మమ్మల్ని చేసుకున్నవాళ్ళే మాకు కాఫీలు అందిస్తారు ...అని కలల కూతలు కూసి ....ఓ రెండు రోజులు అన్న తినకుండా అలిగి ....ఇదే వంక అని యేవో కొన్ని కోరికలు కోరి, సాధించుకున్నాక , శాంతించి ....అవే చాలా పెద్ద పెద్ద కష్టాలు కింద జమ కట్టే వాళ్ళం .....😢
ఇప్పుడు ....
ఎవరో తెలియదు ,ఎప్పుడూ చూడలేదు ,వ్యక్తి గత పరిచయం లేదు .....అయినా కాస్త అభిమానం ఎవరైనా చూపిస్తే .....ఒక మనిషిని ఇంతగా అభిమానించే వాళ్ళు ఉన్నారా ....అని ...భరించలేక ....ఒక రోజంతా వెక్కి వెక్కి ఏడ్చి .....అలసిపోతున్నాం .....🤔
ఎందుకో అనిపిస్తుంది .....
ఎప్పుడు మనం సుఖంగా ఉన్నాం .ఎప్పుడు బాధగా ఉన్నాం అనేది నిర్ణయించుకోవడం కూడా కాలానుగుణంగా , మనసానుగుణంగా... ....క్లిష్టమైన విచిత్రమే అని....🤔

Sunday, July 2, 2017

కృష్ణుడు గీతలో చెప్తాడు ....

కృష్ణుడు గీతలో చెప్తాడు ...."అర్జునా ....మనసు నాయందు లగ్నం చేసి ...నన్ను చూడాలి అనుకునే వాళ్లకు మాత్రమే నేను కనిపిస్తాను ....నన్ను దర్శించగలరు అని ...." 
నిజమే కదా అనిపిస్తుంది .... 
అసలు కృష్ణుడంటే ఎవరు ....???!!!
ప్రేమ ....
మనసు నిండా ప్రేమను నింపుకున్న వ్యక్తి ....
మనసు నిండా ప్రేమను ఎవరైతే నింపు కుంటారో ....వాళ్ళ మనసు లో నుండి ప్రేమను ప్రపంచం అంతా విస్తరింప జేస్తారో ...వాళ్లకు ప్రపంచం అంతా ప్రేమే కనిపిస్తుంది ....ఇంకా ఇంకా ఎదిగిపోయి ,విస్తరించి... ప్రపంచం అంతా నిండిపోయి కనిపిస్తుంది ...
ఆ విశావ్యాప్త ప్రేమ మనకు కనిపించాలి అంటే ,మనం చూడాలి అంటే ....మన మనసులో ప్రేమ నింపు కుంటేనే అది సాధ్యం ....చూడగలం ....
అదే మన మనసులో ద్వేషాన్ని నింపుకుంటే మనం అణువంత ప్రేమను కూడా చూడలేం ....అంతే కాకుండా ద్వేషం మనల్ని ఇంకా ఇంకా కుంచించుకు పోయేలా చేసి ఈ ప్రపంచంలో మన ఉనికి మనకే ప్రశ్నార్ధకం చేసి ....మనం ఇతరుల ఉనికి ని చెప్పుకుని బ్రతికేలా చేస్తుంది ....
ప్రేమ మనం ఇంకా ఇంకా ఎదిగేలా చేసి ....ప్రపంచం అంతా మనమే నిండిపోయేలా చేస్తుంది .....ప్రతి అణువులోనూ మనమే కనిపించేలా చేస్తుంది ......
ప్రేమకు నేనే ప్రతిరూపాన్ని అని కృష్ణుడు భావించాడు కాబట్టే ....అర్జునా... నా యందే మనసు లగ్నం చేసి చూస్తే ప్రపంచం అంతా నిండిపోయి నేనే కనిపిస్తాను అన్నాడు ....ప్రేమను మనసు నిండా నింపుకుని ... ప్రేమను చూడమని అర్ధం ....
ఎలాంటి నమ్మకంతో కృష్ణుడు అర్జునిడితో ఈ మాట అనగలిగాడు అని మొన్నామధ్య భగవద్గీత వింటున్నప్పుడు ఆలోచిస్తే ....నేను తెలుసుకున్న అర్ధం ఇది ...