Sunday, September 12, 2021

కొన్ని సంఘర్షణలు వదిలివేయడానికి ...ఓ జీవిత కాల కృషి అవసరం అనిపిస్తుంది ...

 మొన్నామధ్య ...నేనూ నా కూతురు షాపింగ్ పనిమీద బయటికెళ్ళాం ...


సరే వచ్చేటప్పుడు బయట ఫుడ్ తెచ్చుకుందాం అని డిసైడ్ అయ్యి ......ఫలానా టైం కి పికప్ అని ఆర్డర్ చేసి ...ఆర్డర్ పికప్ చేసుకోవడానికి వెళ్ళాం ...

కానీ అక్కడికి వెళ్ళగానే ..."నాకు ఇడ్లి తినాలనిపిస్తుంది అని చెప్పింది నా డాటర్ ..."

ఉదయం నుండి అది ఏం తినలేదు ..నేను బయల్దేరే ముందు కీరా తిన్నాను ...నాకంత ఆకలిగా లేదు ...

ఆర్డర్ లో ఇడ్లి లేదు ...

"సరే ...ఇప్పుడు ఇడ్లి ఆర్డర్ చేసుకుని తిందాం ...ఇంటికెళ్ళాక ప్యాక్ చేసుకున్నవి తిందాం..." చెప్పా ...

"పర్వాలేదా...మళ్ళీ ఆర్డర్ చేసింది వేస్ట్ అయిపొతుందెమో ...." కాస్త సంశయిస్తూ చెప్పింది ...

"మరేం పర్లేదు ...ఎప్పడు ఏది తినాలనిపిస్తే అది తినాలి ...పైగా ఆకలితో ఉన్నప్పుడు ..." (ఇదే విషయం తనకు చెప్పా కానీ నేను పాటించను ...పిల్లలు ఉన్నప్పుడు తప్ప) చెప్పి ...

ఇద్దరం ఇడ్లి ఆర్డర్ చేసి ...కూర్చుని వెయిట్ చేస్తున్నాం ...

ఏదో పిచ్చా పాటీ మాట్లాడుతున్న సందర్భంలో ...వాళ్ళు ఈ ఫంక్షన్ కి పిలిచారు ..వీళ్ళు ఈ ఫంక్షన్ కి పిలిచారు ..వెళ్ళాలి ...అని చెబుతూ ...

"మీ కోసం నేను ఒక్క ఫంక్షన్ కూడా చేసుకోలేకపోయాను ......ఎంతో ముచ్చటపడి కనీసం చెల్లికయినా ఓణీల ఫంక్షన్ చేసుకుందామని ఆశపడ్డా ... ...అది కూడా చేసుకోలేకపోయా ..." అని చెప్పా ...

ఒకింత బాధ ద్వనించిందేమో నా గొంతులో ....

"మమ్మి ....నువ్వు మాకేం చేయకపోయినా మేమిద్దరం బాధపడం ....కానీ అది తలచుకుని నువ్విప్పుడు బాధపడుతుంటే ....నాకు నిజంగా బాధగా ఉంది ....నువ్వు సంతోషంగా ఉండడమే మేం కోరుకునేది అయినప్పుడు ....అది ఇవ్వకుండా ...ఎప్పుడో ఏదో ఇవ్వలేదని ఇప్పుడు బాధ పడతావెందుకు ...అవన్నీ వదిలేయి మమ్మి" చెప్పింది ఎంతో ఊరడింపుగా ...

అది చేయాల్సిన సమయంలో చేయలేకపోవడానికి కారణాలేంటో మా ఇద్దరికీ తెలిసినా ....అవన్నీ తవ్వుకోవడం ఇష్టం లేక ...మౌనంగా ఉండిపోయా ...

ఇదంతా పక్కన పెడితే ...

"అన్ని వదిలేయమని" నా కూతురు నా కోసం పెట్టుకునే ఆశ ...గురించే నేను ఎక్కువగా ఆలోచించా ...

వాళ్ళనైతే అన్ని వదిలేసేలా పెంచగలిగానేమో ....కానీ నేను అలా పెరిగానా...లేక అలా జీవించానా ....

ఎందుకు వదిలేయలేకపోతున్నా ....

కానీ పిల్లలు ఆశపడ్డారని కాదు ....క్రమేణా నా కోసం అయినా నేను అన్ని వదిలేయాలి ....

తరచి ఆలోచిస్తే ....అదంత తేలికైన పనా అనిపిస్తుంది ....

అదంత కష్టమైన పని కూడా కాదేమో అని కూడా అనిపిస్తుంది ....

=======================

ఏమో ...ఈ సంఘర్షణ ఎప్పుడూ ఉండేదే ....

అయినా…కొన్ని సంఘర్షణలు వదిలివేయడానికి ...ఓ జీవిత కాల కృషి అవసరం అనిపిస్తుంది ...

=======================

అప్పుడేనేమో నాకు కాస్త ప్రపంచం తెలుస్తున్న రోజులు ....

మా పెద్దోళ్ళు ...నాకు పెళ్లి సంబంధం చూసేటప్పుడు ...ఒక గవర్నమెంట్ జాబ్ కోసం చూసారు ...

అది స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగమా ....లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగమా ...జీతం ఎంతొస్తుంది ...పై డబ్బులు ఏమైనా వస్తాయా ...రిటైర్ అయ్యాక పెన్షన్ వస్తుందా ... మన కులమా కదా ... అని వెతికారు ...

వాళ్ళు ఏదైతే వెతకడం మొదలు పెట్టారో ...నేను, నా మనసు కూడా క్రమేణా దానికే విలువనివ్వడం నేర్చుకున్నాం ...

గవర్నమెంట్ జాబ్ ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ..( అంటే గవర్నమెంట్ జాబ్ ని ...) ఏ దిగులూ చెందాల్సిన పని లేదని ...

గవర్నమెంట్ జాబ్ ఉండి ...మన కులం అయ్యుంటే ...మావాళ్లకు సగం దిగులు తగ్గిపోతుంది కాబట్టి ....అలాంటి వ్యక్తి ని నేను పెళ్లి చేసుకోవచ్చని ....అనుకోవడం నా ఆలోచనల్లో భాగం అయింది ...

అనుకున్నట్టే ....నన్ను నా కులానికి ఉన్న గవర్నమెంట్ జాబ్ కిచ్చి ...కాదు కాదు ....సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కి ఇచ్చి పెళ్లి చేసారు ...

సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నాకు తాళి కట్టింది ....

ఈ దేశంలో ఉన్న ఎందరో అమాయకపు ఆడపిల్లల్లాగే.... సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ తో నేను కాపురం మొదలు పెట్టాను ....

ఆ జాబ్ కి వచ్చిన డబ్బులతోనే మేం ...కొచ్చిన్ లో ....తీవ్ర లో ...ఓ కిరాణా షాప్ లో ....ఓ రెండు గిన్నెలు , ఒక చిన్న కడాయి , ఒక బకెట్ , ఒక చీపురు , గిన్నెలు కడుక్కోవడానికి వాడే VIM సోప్ ...బట్టలు ఉతుక్కోవడానికి వాడే RIN సోప్ ....ఇంకా చిన్న చిన్న సరుకులు తెచ్చుకుని జీవితాన్ని మొదలు పెట్టాం ....

విచిత్రం ఏమిటంటే ...ఆ గవర్నమెంట్ జాబ్ కి ఎంత డబ్బులొస్తాయి ....ఎంత ఇంట్లో ఖర్చు పెట్టుకోవాలి ....ఎంత పొదుపు చేసుకోవాలి అనేవి ఏవీ నాకు తెలియవు ...

అయినా ఏదో నా వెనక మావాళ్లు నాకు ఆశ చూపించి పెళ్లాడిన జాబ్ అనే ఒక సెక్యూరిటీ ఉందని తెలియని భరోసా ...

చాలా ఏళ్ళ కాపురం తరువాత కూడా నాకెప్పుడూ ఆ జాబ్ కి ఎంత డబ్బులొస్తాయి ...ఎంత నేను అడగాలి అనే ధ్యాసే లేదు ....

ఇంట్లో అవసరాలకు సరిపోయినంత అడగడం ...ఇంట్లో పనులు చూసుకోవడం ...ఇంతే నాకు తెలుసు ...

మనకేం తెలియదని, మనమేం పట్టించుకోము అని ..మనకేవో నమ్మకాలు ఉన్నాయని ...నమ్మకాలు లేవని ....జీవితం ఆగిపోదు ....

జీవన ప్రయాణంలో ఎన్నో మార్పుల అనంతరం ....ఎన్నో ప్రదేశాలు తిరిగిన అనంతరం ...

ఆ గవర్నమెంట్ జాబ్ రిటైర్ అయిన తర్వాత ....రిటైర్ మెంట్ కి వచ్చిన డబ్బులు నా ప్రమేయం లేకుండానే చేతులు మారినప్పుడు ...
నాకు గవర్నమెంట్ జాబ్ మీద మొదటిసారిగా నా హక్కు గురించి గుర్తొచ్చింది ....

"అదేంటి ....నన్ను అడగకుండానే ఎలా ఇచ్చారు ...అసలెందుకిచ్చారు" అని అడిగా ...

సరైన జవాబు లేదు...

నా పేరు అనేది లేకుండానే .. పెన్షన్ అకౌంట్ ఒకటి ఉందని గుర్తించేసరికి ....చాలా ఏళ్ళు గడిచిపోయింది ...

దానికీ జవాబు లేదు...

కానీ కొన్నేళ్ల తరువాత గట్టిగా అడగాల్సిన సందర్భం నాకు ఎదురైంది ....

అప్పటికే అమెరికా వచ్చి చాలా ఏళ్లయింది ....

ఇక్కడికొచ్చిన కొన్నాళ్ళకి ....తను చేసిన కొన్ని అప్పులను తీర్చుకోవడానికి .....బ్యాంకు లోన్ తీసుకుని ....ఆ లోన్ కే పెన్షన్ అంతా కట్టుకుంటూ .....
ఆ పెన్షన్ అకౌంట్ కి ఒక పాస్ వర్డ్ పెట్టి ....దానికి నాకు యాక్సిస్ లేకుండా చేసి .... అది వాళ్ళ బంధువులకి మాత్రమే ఇచ్చినప్పుడు ....

అప్పుడు నా హక్కు గురించి ప్రశించాల్సొచ్చింది ...

"అలా ఎందుకు చేసారు ....పెన్షన్ అకౌంట్ మీ ఒక్కరిదే కాదు కదా ....దాని మీద నాకు కూడా హక్కుంది కదా ...." అడిగా మావారిని ....

నిజానికి అది డబ్బు కోసం అడుగుతున్నానా అంటే ....అది కూడా కాదు ...ఈ అమెరికాలో నేను బ్రతకడానికి సరిపోయే డబ్బు నేను సంపాదించుకోగలుగుతున్నాను ....

నా కంటూ హక్కు ఉందని నేను మాత్రమే అనుకుంటున్నానా ....లేదా సమాజం నన్ను నమ్మించిందా ....లేదా హక్కు ఉందని నా జీవిత భాగస్వామి కూడా అనుకుంటున్నాడా ....అని తెలుసుకోవాలనిపించింది ....

ఎక్కడో నాకు ఈ గవర్నమ్నెట్ జాబ్ కి నా పెద్దవాళ్ళు ఏర్పరచిన ఒక కనెక్షన్ కి ...నమ్మకానికి లింక్ తెగిపోతున్నట్టుగా అనిపించి ...ప్రశ్నించే తీరాలని నిర్ణయించుకున్నా ....

"నీకు హక్కు లేదు ....అది నాది మాత్రమే ...."చెప్పారు

"నాకెందుకు హక్కు లేదు ....మిమ్మల్ని చూసి మావాళ్లు నన్నిచ్చి పెళ్లి చేయలేదు ...మీకు జాబ్ ఉందని ...ఆ జాబ్ తో నన్ను బ్రతికిస్తారని .....దాని మీద నాకు కూడా హక్కుందని చెప్పి మా వాళ్ళు మీకిచ్చి పెళ్లి చేసారు ....అందులో సగం హక్కు నాకు లేదా..." అడిగా ...

అసలిది తప్పు గా అడగడం అని నా విచక్షణకు తెలుసు ....

కానీ నిస్సహాయతలో ఉన్న సగటు ఆడపిల్ల ఇలాగే అడుగుతుంది ....ఇలాగే అడగగలదు...
అప్పుడు వచ్చే సమాధానం ఎలా ఉంటుందో వినాలని ....

"లేదు ...అది నేను కష్టపడి సంపాదించుకున్న జాబ్ ...నేను సర్వీస్ చేస్తే వచ్చిన పెన్షన్ ....నీకెలా హక్కుంటుంది ...."అడిగారు ...

"నేను మీతో కాపురం చేశాను ....మీరు వర్క్ చేయడానికి సపోర్ట్ చేస్తూ ....ఇంట్లో పనులన్నీ నేను చూసుకుని ....పిల్లలని చూసుకున్నాను ...మీరు సగం పని చేస్తే ....నేనూ సగం పని చేశాను కాబట్టి ....నాకూ సగం హక్కు ఉంటుంది కదా ...." అడిగా ....

"లేదు ...నీకు ఏ మాత్రం హక్కు లేదు ..." కరాఖండిగా చెప్పారు ...

"మరి మీ బంధువులకి ఇందులో హక్కు ఎలా వచ్చింది ...." అడిగా ...

"నేను వాళ్ళకి హక్కు ఇవ్వలేదు ....వాళ్ళు నా పనులు చూస్తున్నారు కాబట్టి ....నాకున్న అప్పులు కడుతున్నారు కాబట్టి వాళ్ళకిచ్చాను ...." చెప్పారు ....

"చివరిగా అడుగుతున్నాను ...ఎందుకు ఏమిటి ఎలా అనేది వదిలేస్తే ....నాకు సగం హక్కు ఉందా లేదా ....చెప్పండి " అడిగా ....

"నేను అప్పులు తీర్చుకోవాలి నేను ఇవ్వలేను ...నీకు తెలిసిన వాళ్ళయినా ....నాకు తెలిసిన వాళ్ళయినా ....ప్రపంచంలో ఒక్కరంటే ఒక్కరితో ....నీకు కూడా సగం హక్కు ఉందని చెప్పించు .....నేను ఒప్పుకుంటా ....నువ్వడిగిన సగం ఇస్తా " చెప్పారు ....

"నాకెవరు తెలుసు ....అయినా నేనెవర్ని అడుగుతాను .....నాకు తెలిసింది మీరొక్కరే ....మీరే మీకు తెలిసిన వాళ్ళని అడిగి చెప్పండి ....ఎవరో ఎందుకు ....మీ జాబ్ గ్రూప్ ఉంది కదా ....వాళ్లనే అడగండి... " చెప్పా ....

ఇండియన్ నేవీ లో జాబ్ చేసేవాళ్ళు / చేస్తున్నవాళ్లు అంతా ఒక గ్రూప్ పెట్టుకున్నారు ...

ఆ గ్రూప్ లోన్ తన సందేహాన్ని పోస్ట్ చేసారు ....భార్యకి నాకొచ్చే పెన్షన్ లో సగం హక్కు ఉందా అని ....

కొందరు ....ఎందుకా సందేహం వచ్చింది అన్నారు ....

కొందరు ఏమైంది డియర్ అన్నారు ....

కొందరు ....హక్కు లేదు అది పూర్తిగా నీదే అన్నారు ...

కొందరు ....మనం బ్రతికి ఉన్నప్పుడు హక్కు ఉండదు ....పోయాక వస్తుంది అన్నారు ....

మరి కొందరు ...లీగల్ గా లేకపోవచ్చు ...మోరల్ గా ఉంది అన్నారు ....

చివరికైతే అందరూ లేదు అన్నారని తేల్చేసారు ....

"వావ్ ....కట్టుకుని ఇన్నేళ్లు కాపురం చేసిన భార్య కి పెన్షన్ లో సగం హక్కు లేదని ఇంత గా పోరాటం చేస్తున్నారు ... మీరా ...దేశానికి ....దేశంలోని పౌరులకు రక్షణ కల్పించే రక్షణ వ్యవస్థలో పని చేసేవారు ....మిమ్మల్ని చూసుకుని మీరు సిగ్గుపడండి ...." చెప్పా ...

ఆక్షణంలో నన్ను బ్రతికించడం కోసం ...నాలో ఉన్న గవర్నమెంట్ జాబ్ అనే నమ్మకాన్ని చంపేశా ....

నన్ను పెళ్లి చేసుకున్న గవర్నమెంట్ జాబ్ ని చంపేశా ....

ఇంకెప్పుడూ ఆ తరువాత ఆ ప్రస్తావన తీసుకురాలేదు ...

ఇప్పుడు ఏ గవర్నమెంట్ జాబ్ మీద ఆధారపడడం నా జీవితం కాదు ...

"నాలుగు వేళ్ళు నోట్లోకి పోవడానికి కష్టపడి చేసే ఓ పని ....

నన్నంటూ ఇంట్లోనుండి ఎవరూ బయటకు పొమ్మనకుండా ఓ గూడు ...

నన్ను నన్నుగా ప్రేమించే పిల్లలు , అమ్మ ...

ఇవేవీ లేకపోయినా ....కష్టపడి ఏ పనైనా చేసుకుని బ్రతకగలననే ఓ నమ్మకం ...." నా జీవితం ....

========================

వదిలేసాననే అనుకున్నా కొన్ని వదిలేయడం అంత తేలికైన విషయం కాదు ....

ఏమో ...ఈ సంఘర్షణ ఎప్పుడూ ఉండేదే ....

అయినా…కొన్ని సంఘర్షణలు వదిలివేయడానికి ...ఓ జీవిత కాల కృషి అవసరం అనిపిస్తుంది .....

=========================

ఆ మధ్య ...ఆత్మీయులు ఒకరు కాల్ చేసి ....

"లక్ష్మి ...అమ్మాయి బాగా చదువుకుంటుంది ...మంచి సంబంధం కూడా వచ్చింది ...అమెరికా వచ్చి చదువుకుందాం అని కూడా ఆలోచిస్తుంది ....ఏం చేస్తే బాగుంటుంది అంటావ్ ...." అని అడిగారు ....

"తనకు అమెరికా వచ్చి చదువుకోవాలనే ఆలోచన ఉంటే...పెళ్ళెందుకు చేద్దామనుకుంటున్నావ్ ...." అడిగా ....

"అంటే ....ఆడపిల్ల ....మంచి సంబంధం ....అమెరికా ...ఒక్కతే వచ్చి ...పెళ్లి ...సెటిల్ ...." ఇలాంటి ఏవో కొన్ని మాటలు వినిపించాయి .....

"నువ్వు పెళ్లి గురించి ఆలోచించకు ....మంచి సంబంధం కూడా నువ్వు చూసి నీ కూతురికి పెళ్లి చేయాల్సిన అవసరం లేదు ....వాళ్లకేం కావాలో వాళ్ళని ఆలోచించుకునేలా చూడు ....వాళ్లేది చేయాలనుకుంటే అది చేయనివ్వు ....ఒకవేళ అమెరికా రావాలనుకుంటే రానివ్వు ....వాళ్ళని చదువుకోనివ్వు ....వాళ్ళే నిర్ణయించుకుంటారు వాళ్లకేం కావాలో ....వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా వాళ్ళకి చేయూతనివ్వు ....

కానీ ఇక్కడికి వచ్చే ముందు ఏం జాగ్రత్తలు పాటించాలో అవి నేర్పించు ....ఉదాహరణకు ఇక్కడ కార్ డ్రైవింగ్ రావడం అనేది చాల ఇంపార్టెంట్ ....అది నేర్పించు ...

అంతే గానీ ...తనకి పెళ్లి అవీ ఇవీ చేస్తే సెటిల్ అవుతుంది అనుకోకు ...." చెప్పా ...

"అమ్మాయికి అమెరికా సంబంధం చూసి పెళ్లి చేస్తున్నాం ...."
"అబ్బాయి ఎన్నారై ...రెండు చేతులా సంపాదిస్తాడు ....అమ్మాయికి దిగుల్లేదు ..."
"అబ్బాయి ఆస్థి పరుడు "
ఇలాంటి ఎన్నో మాటలు తల్లితండ్రుల దగ్గరనుండి నేను వింటూ ఉంటా ....

ఇదా తల్లితండ్రుల బాధ్యత ....

ఇవన్నీ లేకపోతే మా అమ్మాయి ఎలా బ్రతుకుతుంది అని తల్లితండ్రులు ఒక్క క్షణం ప్రశ్నించుకోవాలి ....

అమ్మాయిలకి ఎప్పుడూ ...."నీ పనులు నువ్వే చేసుకోవాలి , నీ డ్రైవింగ్ నువ్వు నేర్చుకోవాలి , నీ బాధ్యత ఎవరో తీసుకోరు .....నువ్వే తీసుకోవాలి ....నీ ఎమోషన్స్ నువ్వే బాలన్స్ చేసుకోవాలి ....నీ తిండి తినే సంపాదన నీదే కావాలి ...." అని నేర్పించినప్పుడే ....వాళ్ళ జీవితానికి తల్లితండ్రులు న్యాయం చేసినట్టు ....

అప్పుడు ఏ గవర్నమెంట్ జాబ్ మీద ....ఏ అమెరికా మీద , ఏ ఆస్థి మీద ....అమ్మాయిలు ఆధారపడాల్సిన అవసరం ఉండదు ...

నా పిల్లలకి నేను అది చెప్పలేదు ...ఆచరిస్తూ పోతున్నా .....వాళ్ళే అర్ధం చేసుకుంటారు ...అనే ఆశతో ...

వాళ్ళకి వాళ్ళ పిల్లలు ఏదీ వదిలేయమని చెప్పే స్థితి రాకూడదు ....
వాళ్ళు నాలా ఏదీ మోసుకుంటూ బ్రతకకూడదు ....అనే చిన్న ఆశ...


=======================

వదిలేసాననే అనుకున్నా కొన్ని వదిలేయడం అంత తేలికైన విషయం కాదు ....

ఏమో ...ఈ సంఘర్షణ ఎప్పుడూ ఉండేదే ....

అయినా…కొన్ని సంఘర్షణలు వదిలివేయడానికి ...ఓ జీవిత కాల కృషి అవసరం అనిపిస్తుంది .....!

============== *********** ============

Monday, September 6, 2021

"మొగుడు ఊరెళితే ..."

 "పెళ్ళాం ఊరెళితే ..." అనే పదం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది కానీ ....

"మొగుడు ఊరెళితే ..." అనే పదం ఎందుకు ఫేమస్ కాలేదు ..?!
పతివ్రతలు నిండుగా నివసిస్తున్న దేశం కదా మనది ...అంతేలే ...!
అసలు ఇలా వ్రాసినందుకు నన్ను కూడా అందరూ వ్రాత సమాజం నుండి వెలివేస్తారనుకుంటా ...
సరే వెలివేయనీ ...
అదేమో గానీ ...అందరి సంగతి నాకు తెలియదు ...నా మటుకు నాకు మొగుడు ఊరెళితే ఎక్కడలేని స్వాతంత్ర్యం సొంతమవుతుంది ...
ఈ కనికరం లేని కరోనా మహమ్మారి వలన గత కొన్నేళ్లుగా ...ఆ స్వాతంత్ర్యానికి ఎందరో అభాగ్యుల లాగే నేనూ దూరమయ్యాను ...
అంతకుముందు ...ఇంటికి ఎందుకు రావాలి అని ప్రశ్నించిన పత్నీ వ్రతులు అంతా ....
ఇప్పుడు ఇల్లొదిలి నేనెక్కడికి పోను అని తిష్ఠ వేసుకుని కూర్చున్నారు ...
అంతా కరోనా మహాత్మ్యం ...
కానీ ....అదృష్టం దురదృష్టాన్ని తరిమేసి ...కరోనా ని వాక్సిన్ కాటేసి ..అనుకోకుండా ...
----------------------
మొన్నా మధ్య మావారు .... ట్రైనింగ్ ఉంది లాంగ్ వీకెండ్ ....న్యూ జెర్సీ వెళ్ళాలి ...అని చెప్పారు...
గురువారం వెళ్తాను ...మళ్ళీ మంగళవారం వెనక్కి వస్తాను అన్నారు ...
ఓహ్ అవునా ...ఇప్పుడది అంత అవసరమా ఈ కరోనా టైం లో అడిగా ....
"టికెట్స్ బుక్ చేసేసాను ..." చెప్పారు ...
'ఓహ్ అవునా ..." ఇంకేం మాట్లాడలేదు ...
ఎప్పుడైనా నిర్ణయం తీసుకోకముందు నాకు చెబితే ఆ విషయం మీద మాట్లాడడం ....అమలు పరిచాక నాకు చెబితే ...మౌనంగా ఉండడం ... మా మధ్య గొడవలు తగ్గడం కోసం ....నేను చేసుకున్న ఉత్తమమైన అలవాట్లలో ఒకటి ...
అనుకున్నట్టు గురువారం రానే వచ్చింది ...
"నన్ను airport దగ్గర డ్రాప్ చేస్తావా ..." అడిగారు ...
"సరే ..." చెప్పా ...
ఆ రోజు ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు ..,
గురువారం సాయంత్రం ...శుక్రవారం , శనివారం , ఆదివారం , సోమవారం ...మంగళవారం ఉదయం ...ఎవ్వరూ లేరు ...నేనొక్కదాన్నే ...ఎంత ఫ్రీడమ్ రాబోతుందో ... Can You Imagine That?" చెప్పా ..
గురువారం airport దగ్గర డ్రాప్ చేసి ...హాయిగా పాటలు పెట్టుకుని డ్రైవ్ చేసుకుని ఇంటికి వచ్చాక ...మా ఆయన చేసిన మెసేజ్ చూసా ...సేఫ్ బోర్డింగ్ అని ...
ఇంటిదగ్గర ఉన్నప్పుడు ఒక్క విషయం కూడా భార్యకి చెప్పాలనిపించదు....
అదేంటో ...బయటికెళ్తే మాత్రం ....తిన్నాం, పడుకున్నాం , తెల్లారింది ...పొద్దుపోయింది ....అని ఒకటే మెసేజ్ లు ...అనుకుని ...,,
ఫోన్ సైలెంట్ లో పడేసి ..కార్ తీసుకెళ్లి గరాజ్ లో పడేసి ...ఇంటిముందు ఉన్న ట్రాష్ కాన్స్ తీసి లోపల పడేసి ....డోర్స్ అన్ని లాక్ చేసేసి ...హాయిగా ఇంట్లోకొచ్చి రిలాక్స్ అయ్యా ...
బయట లైట్ ఒక్కటి ఉంచేసి ...బెడ్ రూమ్ లైట్ ఒక్కటి ఆన్ చేసుకుని ...మిగతా లైట్స్ అన్ని ఆఫ్ చేసి ...ఇవ్వాళ చేయాల్సిన పనులేమైనా ఉన్నాయా అని అలోచించి ...ఏమీ లేవని నిర్ధారించుకుని ...ఉన్నదేదో వేసుకుని తినేసి ...హాయిగా బెడ్ మీదకు వచ్చేసా ...
కాసేపు ఏదో మూవీ చూసేసి ఇక పడుకుందాం అనుకునే లోపు ....
ఫైర్ అలారమ్ బీప్ బీప్ అని సౌండ్ చేయడం మొదలుపెట్టింది ...
నిజానికి ఆ అలారమ్ గత రెండు మూడు రోజుల నుండి ...అప్పుడప్పుడు సౌండ్ చేస్తుంది ...
"ఆ అలారమ్ బ్యాటరీ అయిపోతున్నట్టుంది ....కాస్త అది చూసి మార్చండి ...చాలా ఎత్తుగా ఉంది.. నిచ్చెన వేసుకుని ఎక్కాలి అది ...నేను ఎక్కలేను ..." అని మావారికి రెండు మూడు సార్లు చెప్పా ...
ఎప్పుడూ నేను ఒకసారి చెబితే ఏ పనీ చేయరు ...వినిపించుకోరు ...
ఓ పదిసార్లు చెప్పి ....గొడవలు పడి...తిట్టి ...పంచాయితీలు పెడితే గానీ చిన్న చిన్న పనులైనా పూర్తి కావు ...
ఇది నాకు మాత్రమే సొంతం కాదు ....మన దేశంలో 99 శాతం మంది భర్తలు అంతే ...
భార్య పోస్ట్ కి ఉన్న తీసివేత తనం ....భర్త పోస్ట్ కి సంక్రమించిన నిర్లక్ష్యం అనే సంప్రదాయం వలన ఇలా జరుగుతూ ఉంటుంది ....
చివరకు అడగడం విసుగేసి ...ఆ పని నేనైనా చేసుకుంటాను ...
లేదా "నువ్వు తిట్టావు కాబట్టి నేను చేయలేదు ...నువ్వు మంచిగా అడిగితే నేను చేసేవాడిని" అంటారు ...నేను మంచిగా మొదలుపెట్టిన సంగతి మర్చిపోయి ...
సరే అన్ని పనుల్లాగే ఈ పని కూడా ....
మంచిగా మొదలుపెట్టిన దగ్గరే ఆగిపోయింది కాబట్టి ....దాని మొహం కూడా చూడలేదు ...
ఈ అర్ధరాత్రి ఇప్పుడు ఈ నిచ్చెన ఎక్కడినుండి తేవాలి ....అని ...దాని మెయిన్ స్విచ్ ఎక్కడుందో అని ఇల్లంతా వెతికా ....ఎక్కడా కనపడలేదు ....
లక్కీగా ....మావారు లైబ్రరీ లో పుస్తకాల కోసం పెట్టిన నిచ్చెన కనిపించింది ....
అది తీసుకుని ...నెమ్మదిగా గోడకి వేసుకుని ...పైకెక్కి ...బాలన్స్ చేసుకుంటూ ...అలారం మీద ఏవైనా ఆఫ్ చేసే బటన్స్ ఉన్నాయా అని వెతిగా ...అక్కడ ఏదో కనిపించిన బటన్ మీద ప్రెస్ చేశా ...
ఆ అలారం ఇంకా ఎక్కువ మోగడం మొదలుపెట్టింది ....
ఆ సౌండ్ భరించలేక వెంటనే కిందకు దిగా ...టైం ఒంటి గంట అవుతుంది ....ఈ సౌండ్ ఎలా ఆపాలో తెలియదు ...ఎవరికైనా కాల్ చేద్దాం అన్నా అర్ధరాత్రి ఎవరికీ కాల్ చేయడం ఇష్టం లేదు ....ఎమర్జెన్సీ కి కాల్ చేద్దామా అని ఆలోచించా ....
సరే ముందు ఎలా ఆపాలో ప్రయత్నం అయితే చేద్దాం అని ....మళ్ళీ నిచ్చెన ఎక్కి ...రెండు చోట్ల మార్చి మార్చి మళ్ళీ బటన్స్ కోసం వెతికా ....ఏదీ కనిపించలేదు ...
ఈ లోగా ఆ సౌండ్ ఇంకా ఎక్కువై భరించడం నరకంలా ఉంది ....
ఇదేమైనా సెక్యూరిటీ సిస్టం కి లింక్ అయిందా ....ఎవరైనా దొంగ లోపలి రావడానికి ప్రయత్నిస్తున్నారా అని డౌట్ వచ్చింది ....లోపల లైట్స్ అన్ని ఆఫ్ చేసి ....బయట లైట్స్ వేసి .... అన్ని కిటికీల దగ్గరికి వెళ్లి ...కర్టెన్స్ తీసి బయటకు తొంగి చూశా ....ఎందుకైనా మంచిదని ఫోన్ చేతిలో పట్టుకుని ..
ఎవరూ కనిపించలేదు ...
ఛీ ...ఏంటి ....భయపడుతున్నానా ....అని నవ్వొచ్చింది ....
మళ్ళీ అలారం దగ్గరకొచ్చి ....నిచ్చెన ఎక్కి ...రెండు అలారమ్స్ లో ఉన్న బ్యాటరీ ఎలాగో తొలగించా ....
అయినా సౌండ్ ఆగలేదు...
ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే ....గూగుల్ గుర్తొచ్చింది ...వెంటనే system తీసి ... How Do I Turn off Home Alarm System? అని ఓ రెండు మూడు వీడియో లు క్లిక్ చేసి చూశా ....
అందులో మా అలారం మోడల్ లో ఉన్న వీడియో దొరికింది ....అది చూసాక అర్ధమైంది ... బ్యాటరీ తీసినా కొన్నిసార్లు అలారం ఆగదు ....ఆ పవర్ ఆఫ్ చేసేలా wires cut చెయ్యాలి అని ....
మళ్ళీ నిచ్చెన ఎక్కి ...అక్కడ కనపడిన మూడు వైర్లు పీకడానికి ట్రై చేశా ....
బాలన్స్ లేకపోవడం వలన ....ఒక్క చేత్తో పీకితే అవి రాలేదు ....చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి ....
ఆ క్రితం రోజే ..కొన్ని టెస్టర్స్ షాప్ నుండి మావారు పట్టుకొచ్చారని గుర్తొచ్చింది ....ఎక్కడ పెట్టారా అని ఇల్లంతా వెతికా ...ఎక్కడా కనిపించలేదు ...ఫోన్ చేద్దాం అనుకుని ....ఈ అర్ధరాత్రి ఎందుకులే అని ....కిచెన్ లో కనిపించిన ఓ పట్టకారు పట్టుకుని మళ్ళీ ఎక్కా నిచ్చెన ....
ఆ వైర్లు పట్టుకుని లాగా ...రాలేదు .....
చిన్నప్పుడు చదువుకున్న కథలాగా (గుర్తు రాలేదు ....కానీ మైండ్ లో ఉండి ఉంటుంది )....ఒక్కసారి అన్ని వైర్లు పట్టుకుని లాగలేనని ....ముందుగా ఓ రెండు వైర్లు పట్టుకుని బలంగా లాగా ....
ఒక్కసారిగా పెద్ద ఫ్లాష్ వచ్చి చిచ్చు బుడ్డి లాగా నిప్పు రవ్వలు పేలిపోయాయి ...
వార్నీ అనుకుని ....నాకు షాక్ కొట్టకపోయినా నేను షాకయ్యా ....
ఇంకొక్క వైరు అక్కడే ఉండిపోయింది ....బీప్ సౌండ్ ఇంకా ఆగలేదు ....మళ్ళీ పీకడానికి నాకు ధైర్యం సరిపోలేదు ....
పవర్ పీకేసినా ఇంకా ఎందుకు మోగుతుంది అది అని ఆలోచిస్తూ ఉండిపోయా ...
అప్పుడు మళ్ళీ వచ్చి సగంలో వదిలేసిన వీడియో చూడడం కొనసాగించా ....ఏం మిస్సయ్యానా అని ....
చివర్లో ...కొన్నిసార్లు పవర్ పీకేసినా ఇంకా కొంత స్టోరేజ్ పవర్ ఉంటుంది ....అది కూడా పోవాలంటే ....బటన్ ను 20 సెకన్లు అలాగే ప్రెస్ చేసి ఉంచితే మొత్తం పవర్ డ్రైన్ అయిపోతుంది .....అని చెప్పాడు ...
మళ్ళీ నిచ్చెన ఎక్కి ....బటన్ ప్రెస్ చేసి చెవులు మూసుకుని 20 Sec అలాగే పట్టుకున్నా .....
అరచి అరచి ....ఆగిపోయింది...
రెండిట్లో గ్రీన్ లైట్ కూడా ఆగిపోయింది ....
నిచ్చెన తీసి వెనక్కి పెట్టి ....,
ఈ ఫ్లాష్ వల్ల ఇంటర్నెట్ ....మిగతా పవర్ పాయింట్స్ పోకుండా ఉన్నాయా అని చెక్ చేశా ....అన్ని బాగానే ఉన్నాయి ....
అప్పటికే రెండున్నర అయింది టైం ....
ఇక ప్రశాంతంగా నిద్రపోయా ....
తెల్లవారి లేచి నా పని నేను చేసుకుంటూ ఉన్నా ....
రాత్రి నిద్ర సరిపోక ...చాలా నిద్రొస్తుంది .....కానీ వర్క్ ఉంది కదా అని ఆపుకుని పని చేసుకుంటూ ఉన్నా ...
ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది...నా మనసులాగే ....అంత అలసటలోనూ హాయిగా అనిపించింది ...
హాయి అంటే గుర్తొచ్చింది ....ఒక్క కాఫీ పెట్టుకుని వస్తా ....ఇంకా హాయిగా అనిపిస్తుంది ...
------------------------
అంతలో ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ దగ్గరనుండి ఫోన్ వచ్చింది ...ఎత్తలేదు ...
నిన్న కూడా ఆమె రెండు సార్లు ఫోన్ చేయడం గుర్తొచ్చింది ...
ఇప్పుడు వీళ్లకు అంత అవసరం ఏమొచ్చింది ...అని విసుగ్గా అనిపించింది ...
నాకు ఈ ప్రశాంత సమయంలో ఎవరితోనూ మాట్లాడాలని లేదు ...అది ఒక కారణం ....
పైగా ఈమె తో అస్సలు మాట్లాడాలని లేదు ...
మొన్నామధ్య చేసిన కొన్ని కన్నింగ్ బుద్ధుల వలన (అవి మరో సందర్భంలో చెప్పుకుందాం )
అంతలో అర్ధం కాని భాషలో ఒక మెసేజ్ పెట్టింది ....ఏదో గునపం అదీ ఇదీ అని ...
నాకు అర్ధం కాలేదు ...
మళ్ళీ అంతలో ఫోన్ ...
సరే ఏమడుగుతుంది అర్ధం చేసుకుందాం అని ఫోనెత్తా ...
"ఎలా ఉన్నారు ..." అడిగింది ...
"బాగున్నా .... " చెప్పా ...పొడిగా ...
"ఆ మీవారు ఊరెళ్ళారు కదా ..." అడిగింది ...
"అవును ..." చెప్పా ...
"మీకేమన్నా హెల్ప్ కావాలంటే అడగండి ....తను వెళ్ళేటప్పుడు ఏదైనా అవసరం అయితే చూసుకోమని కూడా చెప్పారు ...." చెప్పింది ...
నాకు నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు ....
ఆవిడ పనులు ఆవిడకు చేసుకోవడం రాదు ... ఎక్కడికైనా వెళ్లాలంటే ...."లక్ష్మిగారు ...నన్ను కూడా తీసుకుని వెళ్తారా ...హైవే మీద డ్రైవ్ చేయడం నాకు రాదు అని ఫోన్ చేస్తుంది .... " ఇక మా అయన ....ఇంటిదగ్గర ఉన్నప్పుడు ఒక్కటీ పట్టించుకోరు ....వెళ్ళాక ఫోన్ చేసి ఎలా ఉన్నావ్ అని అడగరు ...
ఆవిడ నాకు హెల్ప్ చేసేది ....ఈయన చేపించేవారు ...
ఇలాంటి సమయాల్లోనే ....నాకు నవ్వొచ్చేది ....నవ్వాలనిపించేది ....అందరూ అసందర్భంగా నవ్వుతానని అపార్ధం చేసుకునేది ....
మా అయన వేసే జోకుల్లో ...ఇది అతిపెద్ద జోకు ...
అయినా అన్ని కంట్రోల్ చేసుకుని ...."సరే ...." అని చెప్పా ...
"ఇంతకీ మీరు మెసేజ్ లో ఏం అడిగారో అర్ధం కాలేదు..." అడిగా ....
"మాది ఒక ఎల్లో కలర్ గునపం ఉంది మీ ఇంట్లో ...అది పట్టుకెళ్ళడానికి నిన్న వద్దాం అనుకున్నాం ....మీవారు మీకు కాల్ చేసి చెబుతా అన్నారు ...మీరు నిన్న ఫోన్ తియ్యలేదు ....ఇవ్వాళ వస్తాం ...ఎప్పుడు రమ్మంటారు ..." అడిగింది ....గుక్కతిప్పుకోకుండా ...
"ఏమో ....నాకు ఆయన ఏం చెప్పలేదు ....మీరు చెబుతున్న గునపం ఏంటో నాకసలు ఐడియా లేదు ...ఆయనొచ్చాక తీసుకోండి .." చెప్పా ...
"ఆ అయ్యో ...అది మాకు అవసరం ఇవ్వాళ ...ఇంటికొచ్చి పోనీ మేమే వెతుక్కుంటాం ....ఇవ్వాళ సాయంత్రం వస్తాం ....సరేనా ...."అడిగింది ....
అంత అర్జెంటు ఏంటి గునపం తో ....ఇవ్వాళ తవ్వకపోతే సచ్చిపోద్దా ....వెధవ సంత....ఎదో ఒకటి నెత్తినపెట్టి పోతాడు ...అనుకుని ...,
"నేను ఉండనండీ ...ఇవ్వాళ ఫ్రెండ్ వాళ్ళింటికి వెళ్లిపోతున్నా ....ఇప్పుడల్లా రాను ..." దొరికిన అబద్ధం చెప్పేశా ...
"అయ్యో పోనీ ...ఇంటి ముందు చెట్లు దగ్గర పెట్టెయ్యమ్మా ...మేం పట్టుకుపోతాం వచ్చి ...." చెబుతూ ఉంది ....
"నాకు వేరే కాల్ వస్తుంది ....తర్వాత చేస్తాను ...." ఎందరో చెప్పే అబద్ధం చెప్పి ....ఫోన్ పెట్టేసా ....
కాసేపాగి పెరట్లోకి వెళ్లి చూస్తే ఎల్లో కలర్ గునపం కనపడింది ....
అది తీసుకుని వెళ్లి ....ఇంటి ముందు జామ చెట్టు మొదట్లో వాళ్ళకి మాత్రమే కనపడేలా పెట్టి ....తలుపు గడులేసేసా ....
మళ్ళీ పెరట్లోకి వాళ్ళంతట వాళ్ళు రాకుండా ....
అలా వాళ్ళు రావడం మావారిచ్చిన చనువు ....
వాళ్ల ఫ్రెండ్స్ అందరికీ ఆ మధ్య ..." పర్వాలేదు ....మీరు పెరట్లోకి సరాసరి వచ్చెయ్యొచ్చు" అని చెప్పారంట ...
"అలా ఎలా చెబుతారు డాడీ ....మమ్మి నైటీ వేసుకుని బ్యాక్ యార్డ్ లో ఫ్రీ గా తిరుగుతుంది ....ఎవరు పడితే వాళ్లొస్తే ప్రయివసీ ఉండొద్దా ..." అని నా కూతురు వాళ్ల డాడీ ని అడిగేవరకు ....నాకు తట్టనేలేదు ....
కొన్నిసార్లు అంతే ....నాకసలు కొన్ని హక్కులున్నాయని ...వాటి గురించి ప్రశ్నించాలని కూడా నాకు ఆలోచన రాదు ...నా కోసం నా ఆత్మీయులు అడిగేవరకు ....
అడిగాక ... "అవును కదా ....నాకు ఈ హక్కు ఉంది కదా ..." అనుకుంటా ....
అది మన సంప్రదాయం / సమాజం స్త్రీ కి ఇచ్చిన ఫ్రీ గిఫ్ట్ ....
ఆ తరువాత ...మళ్ళీ ఫ్రెండ్స్ కి ...."మీరలా పెరట్లోకి మేం పిలవకుండా రావద్దు ... ....పొరపాటుగా చెప్పాను" అని మెసేజ్ ఇచ్చాను అని చెప్పారు ....అది సరిదిద్దుకున్న విషయం అనుకోండి ....
ఆ తర్వాత ...గునపం పట్టుకెళ్ళాం ...అని మెసేజ్ పెట్టారు ...నేను నిద్రలేచాక ఎప్పుడో చూశా ...
-----------------------
వర్క్ అయిపోయాక ....హాయిగా నిద్రపోయి ఎప్పుడో ఏడింటికి నిద్ర లేచా ....కాసిని కాఫీ పెట్టుకుని పెరట్లో కూర్చుని , పాటలు పెట్టుకుని ....ప్రశాంతంగా చల్లటి గాలిని ఆస్వాదిస్తూ ...తాగా...
రోజూ కాఫీ తాగనని కాదు ...
కానీ ఒంటరిగా తాగుతున్నప్పుడు ....నా గురించి మాత్రమే నేను ఆలోచించుకుంటూ ....జీవితాన్ని నెమరు వేసుకుంటూ ....జ్ఞాపకాల్ని తడిమి చూసుకుంటూ తాగుతానేమో ....చాలా హాయిగా అనిపిస్తుంది ...
అమ్మకు కాల్ చేశా ...కాసేపు మాట్లాడి ...పిల్లలకు కాల్ చేసి కాసేపు మాట్లాడి ...(ఒకళ్ళు ఎత్తలేదు ...పర్వాలేదు అని చెప్పేశా )
మొక్కలకు నీళ్లు పోసి ...
ఇంట్లో కొచ్చి ...తలుపులన్నీ లాక్ చేసి ....పాటలు పెట్టుకుని ....ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసుకుని ....
టమాటో పప్పు చేసుకుని ....వేడి వేడి అన్నం వండుకుని ....హాయిగా తిని ....నిద్రపోయా ...
ఓపికుంటే క్లీన్ చేసుకోవడం ....లేదా సినిమాలు చూసుకోవడం ....నిద్రపోవడం ...కావలసింది వండుకోవడం ....తినడం ....మళ్ళీ నిద్రపోవడం ....
ఫేస్ బుక్ లో కూడా ఏం వ్రాయాలనిపించలేదు ....
ఒకానొక రాత్రి ...పదకొండు గంటలకు మావారు కాల్ చేసారు ....
ఎలా ఉన్నానో అడగడానికి కాదు ...ప్రోగ్రాం ఎలా జరుగుతుందో చెప్పఁడానికి ....
"ఊ" కొట్టా ....గారేజ్ లో ఏం చేయాలనుకుంటున్నానో ....ఎలా చేయాలనుకుంటున్నానో ... అని డిజైన్ వివరించడం మొదలు పెట్టారు ...."నీకు సౌండ్ ఇంట్లో పెట్టడం ఇష్టం లేదు కదా ....స్పీకర్లు గరాజ్ లో పెడదాం అనుకుంటున్నా ...." కొనసాగింపుగా చెబుతున్నారు ....
"హలో ..హలో ....రాత్రి పడుకునే టైంలో అవన్నీ ఆలోచించే ఓపిక నాకు లేదు ...." వాక్ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ ...చెప్పా ప్రశాంతంగా ....
"సరే సరే ...పడుకో ...." చెప్పారు ....
ఫోన్ పెట్టేసి ....హాయిగా కామెడీ షోస్ చూసుకుని నిద్రపోయా ....
ఇన్నేళ్ల ఉరుకుల పరుగుల జీవితం ....తలకు మించిన బాధ్యతలు ...నా గురించి ఆలోచించుకునే సమయం నాకు దొరకకపోవడం ....అన్ని వెరసి ...
నా మనసు ప్రశాంతత కోరుకుంటుంది ....ఒంటరి తనం కోరుకుంటుంది ....మౌనం కోరుకుంటుంది ....సమూహపు విడుదల కోరుకుంటుంది ....
నా సాంగత్యం నాకు అవసరం అని అర్ధమవుతుంది ...
అందులో దొరికిన ఒక అద్భుత అవకాశమే ..."మొగుడు ఊరెళితే ...."!😇





Wednesday, August 25, 2021

ఒక సంవత్సరం నుండి గరాజ్ లో గోడలకి పెయింటిగ్ వేయడానికని తెచ్చిన ...

 ఒక సంవత్సరం నుండి గరాజ్ లో గోడలకి పెయింటిగ్ వేయడానికని తెచ్చిన ...పెయింటింగ్స్ అలాగే పడున్నాయి ...

ఆ పెయింట్స్ ఎండిపోయేలా ఉన్నాయి ....ఎవరైనా పెయింటర్ ని తీసుకు రండి అని చాలా సార్లు మా వారిని అడిగా ...
లేకపోతే మీరయినా కాస్త ఆ పని మొదలు పెట్టండి అని కూడా చెప్పా ...
నాకు ఆ పెయింట్స్ వాసన పడదు ....పైగా పెయింట్ కలిపాక అది వెంటనే వెయ్యకపోతే పాడయిపోతుంది ...అందుకే ...
నిన్న బయట షాపింగ్ కి వెళ్లిన మనిషి ....ఎవరో ఒకతన్ని వెంటబెట్టుకొచ్చి ..., "హోమ్ డిపో దగ్గర కి వెళ్తే పని కోసం అడిగాడు ఇతను...పెయింటింగ్ వేయడం వచ్చంట ...అందుకే తెచ్చాను ..." అని చెప్పారు ...
అతను రావడంతోనే ...గారేజ్ లో ఉన్న సామాను తీసి బయటకు సర్దడం మొదలు పెట్టాడు ....
సరిగా చేయకపోతే మనం వద్దని చెప్పొచ్చు అని సర్ది చెప్పారు ...నేను అనుమానంగా చూడడం చూసి ...
సరేలే పోనీ చేసుకోనీ అనుకుని ఊరుకున్నా ...
అతను నిన్న ఓ రెండు గంటలు అంతా సామాను సర్దేసి ....డబ్బు తీసుకుని పొద్దున్నే వస్తానని వెళ్ళిపోయాడు ...
సాధారణంగా ఇక్కడ పనిలోకి వచ్చేవాళ్ళు కూడా ....కార్లోనే వస్తారు ...
వెళ్ళేటప్పుడు మా వారు తనని డ్రాప్ చేసి రావడానికి వెళ్ళాను అంటే ...."
అదేంటి అతనికి కారు లేదా" అడిగా ...
"అతను ఈ దేశంలోకి కొత్తగా వచ్చాడంట ...ఏదైనా పని చేసుకుని బ్రతుకుదాం అని ....కార్ లేదు ...ఫోన్ లేదు అతనికి ....
నేనిచ్చిన డబ్బులు చూడగానే చాలా హ్యాపీ అయ్యాడు..." చెప్పారు అతని గురించి ...
ఇవ్వాళ పొద్దున్నే వచ్చి మధ్యాహ్న్నము వరకు పని చేసుకుని ...ఆ డబ్బులు తీసుకుని ...ఆ డబ్బుల్తో ఫోన్ , సైకిల్ కొనుక్కుంటాను ...కొన్ని వీసా పనులు కూడా ఉన్నాయి ...అవి చూసుకుని ...తొందరగా పనులు అయిపోతే మళ్ళీ కాల్ చేస్తాను ...సాయంత్రం వచ్చి మళ్ళీ పనులు చేసుకుంటాను అని వెళ్ళిపోయాడు అంట ...
ఫోన్ తీసుకుని ఫస్ట్ మావారికి కాల్ చేసాడు ఇందాక ఆనందంగా . పనిలోకి వచ్చి రాత్రిపూట పదకొండు గంటల వరకు చేసుకుంటా అన్నాడు ...
అతనికి ఇంగ్లీష్ కొద్దిగా వచ్చు ...నాకైతే అస్సలు అర్ధం కావట్లా తనేం మాట్లాడుతున్నాడో ...
మా వారికి అర్ధం అవుతుంది ...
డిన్నర్ టైం కి వచ్చాడు కదా అని ..అసలే డబ్బులు లేవు తిన్నాడో లేదో అని ...ఒక పిజ్జా తెచ్చి పెట్టండి అతనికి అని చెప్పా ఇందాక మావారికి ...
ఆ పిజ్జా తింటూ మధ్యలోనే తనని పిలిచి ....చాలా బాగుంది పిజ్జా ...ఎప్పుడూ తినలేదు ...థాంక్స్ అని చెప్పాడంట ...
అమెరికా అంటే ...అంతా రిచ్ పీపుల్ ఉంటారు ...కోరుకున్నవి తింటారు..సౌకర్యవంతమైన కారుల్లో తిరుగుతారు ...విలాసవంతమైన భవంతుల్లో ఉంటారు ...అనుకుంటూ ఉంటాం ...
చాలా మంది పని కోసం ఎదురు చూస్తూ.. పని దొరికితే సంబరపడుతూ ....కష్టపడి పని చేస్తూ ...
ఎన్నో ఆశలతో జీవితాన్ని మళ్ళీ మొదలు పెడుతూ కూడా కనిపిస్తారు ...
ఏది ఏమైనా అతని జీవితం మళ్ళీ మొదలైంది ...ఎన్నో ఆశలతో ...
అతను ఫోన్ కొనుక్కున్న ఆనందం ...మొదటిసారి పిజ్జా తిన్న ఆనందం చూసి ...మావారు కూడా చాలా హ్యాపీ అయిపోయారు ...
నాకు ఇప్పటినుండే బెంగ పట్టుకుంది ...ఈ పని అయిపోయిన తరువాత అతని కి మరో పని దొరుకుతుందా లేదా అని ...
మావారు ..అమెరికా వచ్చిన దగ్గరనుండి ..ఇండియాలో ఎంతో మంది పనీ పాటా లేకుండా కూర్చుని తినేవాళ్ళకి ఫోన్లు పట్టుకెళ్లి ఇచ్చారు ...మళ్ళీ ఇండియా వచ్చేటప్పుడు ....లాస్ట్ టైం తెచ్చిన ఫోన్ పాడై పోయింది మళ్ళీ కొత్త ఫోన్ తెమ్మని ఫోన్ చేసేవాళ్ళు ...అయినా మళ్ళీ పట్టుకెళ్లి ఇచ్చేవాళ్ళు ...ఏంటో ...మేమిక్కడ ఆపిల్ ఫోన్ల కొట్టు పెట్టుకున్నట్టు ...
ఇలా ఇచ్చి ఇచ్చి ...ఊరులో మెజారిటీ ప్రజానీకానికి ఐ ఫోన్లు ఏర్పాటు చేసారు ...ఊరు మొత్తం ఐ ఊరు అయిపోయింది దాదాపుగా ...
కానీ ఇవ్వాళ ...ఇతనికి పనిచ్చి ..ఫోన్ కొనుక్కోవడానికి డబ్బులు సంపాదించుకునేలా చేసి ...ఆ ఫస్ట్ కాల్ చేసిన ఆనందం షేర్ చేసుకున్నారు ....అది బెస్ట్ అని నా అభిప్రాయం ...🙏

Monday, August 23, 2021

ఎవరితోనైనా అపరిచితులతో (పరిచితులు కూడా కావచ్చులెండి ) మాట్లాడేటప్పుడు ...

 ఎవరితోనైనా అపరిచితులతో (పరిచితులు కూడా కావచ్చులెండి ) మాట్లాడేటప్పుడు ...

ఎక్కువ వినయంగా ...అమాయకంగా ... మాట్లాడితే ....అవతలి వాళ్ళకి vulnerable గా కనిపిస్తాం ...అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు ...
అలాగే ...ఎక్కువ పొగరుగా మాట్లాడితే ....వాళ్ళు డిఫెన్సివ్ లో పడిపోతారు ...
మనం అడ్వాంటేజ్ తీసుకుంటామేమో అని భయపడతారు ...ఇంకాస్త ఎక్కువగా మనపై దాడి చేయడానికి ప్రయత్నిస్తారు ....
మామూలుగా ....సాధారణంగా ...కాన్ఫిడెంట్ గా ...తెలియనిది నిజాయితీగా తెలియదని వ్యక్తపరుస్తూ ...విషయ పరిజ్ఞానం ఉన్నంతవరకు మాట్లాడితే ...అవతని వాళ్ళు వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి మాట్లాడడం మొదలు పెడతారు ....మనం వాళ్ళతో ఎలా ప్రవర్తించాలో మనకు అర్ధం అవుతుంది ...!
(గమనిక: నేను మానసిక శాస్త్ర నిపుణురాలిని కాదు ...నాకు రోజూ ఎదురయ్యే సంఘటనల ఆధారంగా వ్రాసినవి ఇవి ... )

Sunday, August 22, 2021

ఈ మధ్య ఒక అమెరికన్ లేడీ నా మీద కంప్లైంట్ చేస్తాను ...

 ఈ మధ్య ఒక అమెరికన్ లేడీ నా మీద కంప్లైంట్ చేస్తాను అని నాతో చెప్పింది ...

నాకు వెంటనే నవ్వొచ్చింది ...
అదేదో మనసులో నవ్వుకున్నా పోయేది ....
నేను పెద్దగానే ఫక్కుమని నవ్వా ...
ఆమెకి ఇంకా కోపం వచ్చింది ...నా మీద ఫైర్ అయ్యింది ...
"అసలు ఇందులో నవ్వడానికి ఏముంది ....నీకెందుకు నవ్వొచ్చింది ...నేను మాట్లాడిన దానిలో నీకేం నవ్వొచ్చే విషయం కనపడింది ...." అని అడిగింది ...
"నువ్వు కంప్లైంట్ చేస్తాను అని అంటే నవ్వొచ్చింది అన్నా ... " క్షమించమని అడగకుండా ...నెమ్మదిగా ...
"అందులో ఏముంది నవ్వొచ్చే విషయం ..."అడిగింది కోపంగా ...
"నువ్వు నీ పని చేస్తున్నావ్ ....నేను నా పని చేస్తున్నా ..ఒకవేళ ఏదైనా కమ్యూనికేషన్ గాప్ ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకునే అవకాశం ఇద్దరికీ ఉంది ...దాని కోసం ప్రయత్నించకుండా ....కంప్లైంట్ చేస్తానని నన్ను బెదిరిస్తే నాకు నవ్వు రాదా" అని అడిగా ...
"నువ్వే నన్ను వివరాలన్నీ అడగాలి ....నన్ను అడగలేదు అంది ...." నా బాధ్యత గుర్తు చేస్తూ ...
"నేను అడగడం మిస్ అయినా ..నీ వివరాలు మళ్ళీ నేను ఎంటర్ చేసే ఆప్షన్ ఒకటి ఉంది ....అది తెలుసుకోవాలని నువ్వు అనుకోలేదు ....చెప్పే అవకాశం నాకివ్వలేదు ...అంతలోనే కంప్లైంట్ దాకా వెళ్ళావు ....సరే అలాగే కంప్లైంట్ చెయ్యి ...తరువాత చూసుకుందాం ..." అని చెప్పి ...సంభాషణ ముగించా ....
నిజానికి నాకు నవ్వొచ్చిన కారణాలు వేరే ఉన్నాయనుకోండి ...
ఎక్కడినుండి ఎక్కడిదాకా వచ్చాం...ఎన్ని దాటుకుని వచ్చాం...ఇలాంటోళ్లని ఎంతమందిని చూసుంటాం ... ఎన్ని బెదిరింపులు ఎదుర్కొని ఉంటాం ....ఎంత రాటుదేలిపోయాం ...నన్నా నువ్వు బెదిరించేది ...అని అనుకుని నాకు నవ్వొచ్చింది ....అని ... ఆమెకు చెప్పినా అర్ధం కాదు ...చెప్పే అవసరం లేదు ...
అదన్నమాట ...
కొన్నిసార్లు నేను నవ్వినప్పుడు .....ఒక జీవితకాల చరిత్ర దాగి ఉంటుంది ఆ నవ్వు వెనక ....అది బాధ తో కావచ్చు , కోపంతో కావచ్చు , ఎగతాళి కావచ్చు , భరోసా కావచ్చు ....అసలే భావమూ లేకపోవచ్చు కూడా ....
ఏమో ...చెప్పలేం ....
దీనివలన నేను ఎలాంటి చిక్కుల్లో పడబోతానో ...😇
అయినా నవ్వడం కూడా తప్పేనా చెప్పండి ...!😀😇 ( అదిగో మళ్ళీ నవ్వు ఎమోజీనే ...🤬)

అసలు వాళ్ళకి వాళ్లే అర్ధం కారు ..

 "లక్ష్మి గారూ ...ఇలా కాదా ఉండాలి భర్త అంటే ...ఇలా కదా మనతో ఏ విషయం అయినా చెప్పాలి ...ఇలా కదా ఒక భార్యని భర్త అర్ధం చేసుకోవాలి ..." అడిగింది ఓ భార్య నన్ను ..నేను చెప్పిన ఏదో నిర్వచనానికి స్పందనగా ...

"అసలు వాళ్ళకి వాళ్లే అర్ధం కారు ...వాళ్లకేం కావాలో వాళ్ళకే తెలియదు ...ఇంకా భార్యల్ని అర్ధం చేసుకుంటారని నువ్వెలా అనుకుంటున్నావు ...అందుకని అలాంటి కలలు కనకుండా ...నీకేం కావాలో నిన్ను నువ్వు అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించు ..." చెప్పా నవ్వి ...😇🙏😇