Sunday, September 12, 2021

కొన్ని సంఘర్షణలు వదిలివేయడానికి ...ఓ జీవిత కాల కృషి అవసరం అనిపిస్తుంది ...

 మొన్నామధ్య ...నేనూ నా కూతురు షాపింగ్ పనిమీద బయటికెళ్ళాం ...


సరే వచ్చేటప్పుడు బయట ఫుడ్ తెచ్చుకుందాం అని డిసైడ్ అయ్యి ......ఫలానా టైం కి పికప్ అని ఆర్డర్ చేసి ...ఆర్డర్ పికప్ చేసుకోవడానికి వెళ్ళాం ...

కానీ అక్కడికి వెళ్ళగానే ..."నాకు ఇడ్లి తినాలనిపిస్తుంది అని చెప్పింది నా డాటర్ ..."

ఉదయం నుండి అది ఏం తినలేదు ..నేను బయల్దేరే ముందు కీరా తిన్నాను ...నాకంత ఆకలిగా లేదు ...

ఆర్డర్ లో ఇడ్లి లేదు ...

"సరే ...ఇప్పుడు ఇడ్లి ఆర్డర్ చేసుకుని తిందాం ...ఇంటికెళ్ళాక ప్యాక్ చేసుకున్నవి తిందాం..." చెప్పా ...

"పర్వాలేదా...మళ్ళీ ఆర్డర్ చేసింది వేస్ట్ అయిపొతుందెమో ...." కాస్త సంశయిస్తూ చెప్పింది ...

"మరేం పర్లేదు ...ఎప్పడు ఏది తినాలనిపిస్తే అది తినాలి ...పైగా ఆకలితో ఉన్నప్పుడు ..." (ఇదే విషయం తనకు చెప్పా కానీ నేను పాటించను ...పిల్లలు ఉన్నప్పుడు తప్ప) చెప్పి ...

ఇద్దరం ఇడ్లి ఆర్డర్ చేసి ...కూర్చుని వెయిట్ చేస్తున్నాం ...

ఏదో పిచ్చా పాటీ మాట్లాడుతున్న సందర్భంలో ...వాళ్ళు ఈ ఫంక్షన్ కి పిలిచారు ..వీళ్ళు ఈ ఫంక్షన్ కి పిలిచారు ..వెళ్ళాలి ...అని చెబుతూ ...

"మీ కోసం నేను ఒక్క ఫంక్షన్ కూడా చేసుకోలేకపోయాను ......ఎంతో ముచ్చటపడి కనీసం చెల్లికయినా ఓణీల ఫంక్షన్ చేసుకుందామని ఆశపడ్డా ... ...అది కూడా చేసుకోలేకపోయా ..." అని చెప్పా ...

ఒకింత బాధ ద్వనించిందేమో నా గొంతులో ....

"మమ్మి ....నువ్వు మాకేం చేయకపోయినా మేమిద్దరం బాధపడం ....కానీ అది తలచుకుని నువ్విప్పుడు బాధపడుతుంటే ....నాకు నిజంగా బాధగా ఉంది ....నువ్వు సంతోషంగా ఉండడమే మేం కోరుకునేది అయినప్పుడు ....అది ఇవ్వకుండా ...ఎప్పుడో ఏదో ఇవ్వలేదని ఇప్పుడు బాధ పడతావెందుకు ...అవన్నీ వదిలేయి మమ్మి" చెప్పింది ఎంతో ఊరడింపుగా ...

అది చేయాల్సిన సమయంలో చేయలేకపోవడానికి కారణాలేంటో మా ఇద్దరికీ తెలిసినా ....అవన్నీ తవ్వుకోవడం ఇష్టం లేక ...మౌనంగా ఉండిపోయా ...

ఇదంతా పక్కన పెడితే ...

"అన్ని వదిలేయమని" నా కూతురు నా కోసం పెట్టుకునే ఆశ ...గురించే నేను ఎక్కువగా ఆలోచించా ...

వాళ్ళనైతే అన్ని వదిలేసేలా పెంచగలిగానేమో ....కానీ నేను అలా పెరిగానా...లేక అలా జీవించానా ....

ఎందుకు వదిలేయలేకపోతున్నా ....

కానీ పిల్లలు ఆశపడ్డారని కాదు ....క్రమేణా నా కోసం అయినా నేను అన్ని వదిలేయాలి ....

తరచి ఆలోచిస్తే ....అదంత తేలికైన పనా అనిపిస్తుంది ....

అదంత కష్టమైన పని కూడా కాదేమో అని కూడా అనిపిస్తుంది ....

=======================

ఏమో ...ఈ సంఘర్షణ ఎప్పుడూ ఉండేదే ....

అయినా…కొన్ని సంఘర్షణలు వదిలివేయడానికి ...ఓ జీవిత కాల కృషి అవసరం అనిపిస్తుంది ...

=======================

అప్పుడేనేమో నాకు కాస్త ప్రపంచం తెలుస్తున్న రోజులు ....

మా పెద్దోళ్ళు ...నాకు పెళ్లి సంబంధం చూసేటప్పుడు ...ఒక గవర్నమెంట్ జాబ్ కోసం చూసారు ...

అది స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగమా ....లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగమా ...జీతం ఎంతొస్తుంది ...పై డబ్బులు ఏమైనా వస్తాయా ...రిటైర్ అయ్యాక పెన్షన్ వస్తుందా ... మన కులమా కదా ... అని వెతికారు ...

వాళ్ళు ఏదైతే వెతకడం మొదలు పెట్టారో ...నేను, నా మనసు కూడా క్రమేణా దానికే విలువనివ్వడం నేర్చుకున్నాం ...

గవర్నమెంట్ జాబ్ ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ..( అంటే గవర్నమెంట్ జాబ్ ని ...) ఏ దిగులూ చెందాల్సిన పని లేదని ...

గవర్నమెంట్ జాబ్ ఉండి ...మన కులం అయ్యుంటే ...మావాళ్లకు సగం దిగులు తగ్గిపోతుంది కాబట్టి ....అలాంటి వ్యక్తి ని నేను పెళ్లి చేసుకోవచ్చని ....అనుకోవడం నా ఆలోచనల్లో భాగం అయింది ...

అనుకున్నట్టే ....నన్ను నా కులానికి ఉన్న గవర్నమెంట్ జాబ్ కిచ్చి ...కాదు కాదు ....సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కి ఇచ్చి పెళ్లి చేసారు ...

సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నాకు తాళి కట్టింది ....

ఈ దేశంలో ఉన్న ఎందరో అమాయకపు ఆడపిల్లల్లాగే.... సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ తో నేను కాపురం మొదలు పెట్టాను ....

ఆ జాబ్ కి వచ్చిన డబ్బులతోనే మేం ...కొచ్చిన్ లో ....తీవ్ర లో ...ఓ కిరాణా షాప్ లో ....ఓ రెండు గిన్నెలు , ఒక చిన్న కడాయి , ఒక బకెట్ , ఒక చీపురు , గిన్నెలు కడుక్కోవడానికి వాడే VIM సోప్ ...బట్టలు ఉతుక్కోవడానికి వాడే RIN సోప్ ....ఇంకా చిన్న చిన్న సరుకులు తెచ్చుకుని జీవితాన్ని మొదలు పెట్టాం ....

విచిత్రం ఏమిటంటే ...ఆ గవర్నమెంట్ జాబ్ కి ఎంత డబ్బులొస్తాయి ....ఎంత ఇంట్లో ఖర్చు పెట్టుకోవాలి ....ఎంత పొదుపు చేసుకోవాలి అనేవి ఏవీ నాకు తెలియవు ...

అయినా ఏదో నా వెనక మావాళ్లు నాకు ఆశ చూపించి పెళ్లాడిన జాబ్ అనే ఒక సెక్యూరిటీ ఉందని తెలియని భరోసా ...

చాలా ఏళ్ళ కాపురం తరువాత కూడా నాకెప్పుడూ ఆ జాబ్ కి ఎంత డబ్బులొస్తాయి ...ఎంత నేను అడగాలి అనే ధ్యాసే లేదు ....

ఇంట్లో అవసరాలకు సరిపోయినంత అడగడం ...ఇంట్లో పనులు చూసుకోవడం ...ఇంతే నాకు తెలుసు ...

మనకేం తెలియదని, మనమేం పట్టించుకోము అని ..మనకేవో నమ్మకాలు ఉన్నాయని ...నమ్మకాలు లేవని ....జీవితం ఆగిపోదు ....

జీవన ప్రయాణంలో ఎన్నో మార్పుల అనంతరం ....ఎన్నో ప్రదేశాలు తిరిగిన అనంతరం ...

ఆ గవర్నమెంట్ జాబ్ రిటైర్ అయిన తర్వాత ....రిటైర్ మెంట్ కి వచ్చిన డబ్బులు నా ప్రమేయం లేకుండానే చేతులు మారినప్పుడు ...
నాకు గవర్నమెంట్ జాబ్ మీద మొదటిసారిగా నా హక్కు గురించి గుర్తొచ్చింది ....

"అదేంటి ....నన్ను అడగకుండానే ఎలా ఇచ్చారు ...అసలెందుకిచ్చారు" అని అడిగా ...

సరైన జవాబు లేదు...

నా పేరు అనేది లేకుండానే .. పెన్షన్ అకౌంట్ ఒకటి ఉందని గుర్తించేసరికి ....చాలా ఏళ్ళు గడిచిపోయింది ...

దానికీ జవాబు లేదు...

కానీ కొన్నేళ్ల తరువాత గట్టిగా అడగాల్సిన సందర్భం నాకు ఎదురైంది ....

అప్పటికే అమెరికా వచ్చి చాలా ఏళ్లయింది ....

ఇక్కడికొచ్చిన కొన్నాళ్ళకి ....తను చేసిన కొన్ని అప్పులను తీర్చుకోవడానికి .....బ్యాంకు లోన్ తీసుకుని ....ఆ లోన్ కే పెన్షన్ అంతా కట్టుకుంటూ .....
ఆ పెన్షన్ అకౌంట్ కి ఒక పాస్ వర్డ్ పెట్టి ....దానికి నాకు యాక్సిస్ లేకుండా చేసి .... అది వాళ్ళ బంధువులకి మాత్రమే ఇచ్చినప్పుడు ....

అప్పుడు నా హక్కు గురించి ప్రశించాల్సొచ్చింది ...

"అలా ఎందుకు చేసారు ....పెన్షన్ అకౌంట్ మీ ఒక్కరిదే కాదు కదా ....దాని మీద నాకు కూడా హక్కుంది కదా ...." అడిగా మావారిని ....

నిజానికి అది డబ్బు కోసం అడుగుతున్నానా అంటే ....అది కూడా కాదు ...ఈ అమెరికాలో నేను బ్రతకడానికి సరిపోయే డబ్బు నేను సంపాదించుకోగలుగుతున్నాను ....

నా కంటూ హక్కు ఉందని నేను మాత్రమే అనుకుంటున్నానా ....లేదా సమాజం నన్ను నమ్మించిందా ....లేదా హక్కు ఉందని నా జీవిత భాగస్వామి కూడా అనుకుంటున్నాడా ....అని తెలుసుకోవాలనిపించింది ....

ఎక్కడో నాకు ఈ గవర్నమ్నెట్ జాబ్ కి నా పెద్దవాళ్ళు ఏర్పరచిన ఒక కనెక్షన్ కి ...నమ్మకానికి లింక్ తెగిపోతున్నట్టుగా అనిపించి ...ప్రశ్నించే తీరాలని నిర్ణయించుకున్నా ....

"నీకు హక్కు లేదు ....అది నాది మాత్రమే ...."చెప్పారు

"నాకెందుకు హక్కు లేదు ....మిమ్మల్ని చూసి మావాళ్లు నన్నిచ్చి పెళ్లి చేయలేదు ...మీకు జాబ్ ఉందని ...ఆ జాబ్ తో నన్ను బ్రతికిస్తారని .....దాని మీద నాకు కూడా హక్కుందని చెప్పి మా వాళ్ళు మీకిచ్చి పెళ్లి చేసారు ....అందులో సగం హక్కు నాకు లేదా..." అడిగా ...

అసలిది తప్పు గా అడగడం అని నా విచక్షణకు తెలుసు ....

కానీ నిస్సహాయతలో ఉన్న సగటు ఆడపిల్ల ఇలాగే అడుగుతుంది ....ఇలాగే అడగగలదు...
అప్పుడు వచ్చే సమాధానం ఎలా ఉంటుందో వినాలని ....

"లేదు ...అది నేను కష్టపడి సంపాదించుకున్న జాబ్ ...నేను సర్వీస్ చేస్తే వచ్చిన పెన్షన్ ....నీకెలా హక్కుంటుంది ...."అడిగారు ...

"నేను మీతో కాపురం చేశాను ....మీరు వర్క్ చేయడానికి సపోర్ట్ చేస్తూ ....ఇంట్లో పనులన్నీ నేను చూసుకుని ....పిల్లలని చూసుకున్నాను ...మీరు సగం పని చేస్తే ....నేనూ సగం పని చేశాను కాబట్టి ....నాకూ సగం హక్కు ఉంటుంది కదా ...." అడిగా ....

"లేదు ...నీకు ఏ మాత్రం హక్కు లేదు ..." కరాఖండిగా చెప్పారు ...

"మరి మీ బంధువులకి ఇందులో హక్కు ఎలా వచ్చింది ...." అడిగా ...

"నేను వాళ్ళకి హక్కు ఇవ్వలేదు ....వాళ్ళు నా పనులు చూస్తున్నారు కాబట్టి ....నాకున్న అప్పులు కడుతున్నారు కాబట్టి వాళ్ళకిచ్చాను ...." చెప్పారు ....

"చివరిగా అడుగుతున్నాను ...ఎందుకు ఏమిటి ఎలా అనేది వదిలేస్తే ....నాకు సగం హక్కు ఉందా లేదా ....చెప్పండి " అడిగా ....

"నేను అప్పులు తీర్చుకోవాలి నేను ఇవ్వలేను ...నీకు తెలిసిన వాళ్ళయినా ....నాకు తెలిసిన వాళ్ళయినా ....ప్రపంచంలో ఒక్కరంటే ఒక్కరితో ....నీకు కూడా సగం హక్కు ఉందని చెప్పించు .....నేను ఒప్పుకుంటా ....నువ్వడిగిన సగం ఇస్తా " చెప్పారు ....

"నాకెవరు తెలుసు ....అయినా నేనెవర్ని అడుగుతాను .....నాకు తెలిసింది మీరొక్కరే ....మీరే మీకు తెలిసిన వాళ్ళని అడిగి చెప్పండి ....ఎవరో ఎందుకు ....మీ జాబ్ గ్రూప్ ఉంది కదా ....వాళ్లనే అడగండి... " చెప్పా ....

ఇండియన్ నేవీ లో జాబ్ చేసేవాళ్ళు / చేస్తున్నవాళ్లు అంతా ఒక గ్రూప్ పెట్టుకున్నారు ...

ఆ గ్రూప్ లోన్ తన సందేహాన్ని పోస్ట్ చేసారు ....భార్యకి నాకొచ్చే పెన్షన్ లో సగం హక్కు ఉందా అని ....

కొందరు ....ఎందుకా సందేహం వచ్చింది అన్నారు ....

కొందరు ఏమైంది డియర్ అన్నారు ....

కొందరు ....హక్కు లేదు అది పూర్తిగా నీదే అన్నారు ...

కొందరు ....మనం బ్రతికి ఉన్నప్పుడు హక్కు ఉండదు ....పోయాక వస్తుంది అన్నారు ....

మరి కొందరు ...లీగల్ గా లేకపోవచ్చు ...మోరల్ గా ఉంది అన్నారు ....

చివరికైతే అందరూ లేదు అన్నారని తేల్చేసారు ....

"వావ్ ....కట్టుకుని ఇన్నేళ్లు కాపురం చేసిన భార్య కి పెన్షన్ లో సగం హక్కు లేదని ఇంత గా పోరాటం చేస్తున్నారు ... మీరా ...దేశానికి ....దేశంలోని పౌరులకు రక్షణ కల్పించే రక్షణ వ్యవస్థలో పని చేసేవారు ....మిమ్మల్ని చూసుకుని మీరు సిగ్గుపడండి ...." చెప్పా ...

ఆక్షణంలో నన్ను బ్రతికించడం కోసం ...నాలో ఉన్న గవర్నమెంట్ జాబ్ అనే నమ్మకాన్ని చంపేశా ....

నన్ను పెళ్లి చేసుకున్న గవర్నమెంట్ జాబ్ ని చంపేశా ....

ఇంకెప్పుడూ ఆ తరువాత ఆ ప్రస్తావన తీసుకురాలేదు ...

ఇప్పుడు ఏ గవర్నమెంట్ జాబ్ మీద ఆధారపడడం నా జీవితం కాదు ...

"నాలుగు వేళ్ళు నోట్లోకి పోవడానికి కష్టపడి చేసే ఓ పని ....

నన్నంటూ ఇంట్లోనుండి ఎవరూ బయటకు పొమ్మనకుండా ఓ గూడు ...

నన్ను నన్నుగా ప్రేమించే పిల్లలు , అమ్మ ...

ఇవేవీ లేకపోయినా ....కష్టపడి ఏ పనైనా చేసుకుని బ్రతకగలననే ఓ నమ్మకం ...." నా జీవితం ....

========================

వదిలేసాననే అనుకున్నా కొన్ని వదిలేయడం అంత తేలికైన విషయం కాదు ....

ఏమో ...ఈ సంఘర్షణ ఎప్పుడూ ఉండేదే ....

అయినా…కొన్ని సంఘర్షణలు వదిలివేయడానికి ...ఓ జీవిత కాల కృషి అవసరం అనిపిస్తుంది .....

=========================

ఆ మధ్య ...ఆత్మీయులు ఒకరు కాల్ చేసి ....

"లక్ష్మి ...అమ్మాయి బాగా చదువుకుంటుంది ...మంచి సంబంధం కూడా వచ్చింది ...అమెరికా వచ్చి చదువుకుందాం అని కూడా ఆలోచిస్తుంది ....ఏం చేస్తే బాగుంటుంది అంటావ్ ...." అని అడిగారు ....

"తనకు అమెరికా వచ్చి చదువుకోవాలనే ఆలోచన ఉంటే...పెళ్ళెందుకు చేద్దామనుకుంటున్నావ్ ...." అడిగా ....

"అంటే ....ఆడపిల్ల ....మంచి సంబంధం ....అమెరికా ...ఒక్కతే వచ్చి ...పెళ్లి ...సెటిల్ ...." ఇలాంటి ఏవో కొన్ని మాటలు వినిపించాయి .....

"నువ్వు పెళ్లి గురించి ఆలోచించకు ....మంచి సంబంధం కూడా నువ్వు చూసి నీ కూతురికి పెళ్లి చేయాల్సిన అవసరం లేదు ....వాళ్లకేం కావాలో వాళ్ళని ఆలోచించుకునేలా చూడు ....వాళ్లేది చేయాలనుకుంటే అది చేయనివ్వు ....ఒకవేళ అమెరికా రావాలనుకుంటే రానివ్వు ....వాళ్ళని చదువుకోనివ్వు ....వాళ్ళే నిర్ణయించుకుంటారు వాళ్లకేం కావాలో ....వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా వాళ్ళకి చేయూతనివ్వు ....

కానీ ఇక్కడికి వచ్చే ముందు ఏం జాగ్రత్తలు పాటించాలో అవి నేర్పించు ....ఉదాహరణకు ఇక్కడ కార్ డ్రైవింగ్ రావడం అనేది చాల ఇంపార్టెంట్ ....అది నేర్పించు ...

అంతే గానీ ...తనకి పెళ్లి అవీ ఇవీ చేస్తే సెటిల్ అవుతుంది అనుకోకు ...." చెప్పా ...

"అమ్మాయికి అమెరికా సంబంధం చూసి పెళ్లి చేస్తున్నాం ...."
"అబ్బాయి ఎన్నారై ...రెండు చేతులా సంపాదిస్తాడు ....అమ్మాయికి దిగుల్లేదు ..."
"అబ్బాయి ఆస్థి పరుడు "
ఇలాంటి ఎన్నో మాటలు తల్లితండ్రుల దగ్గరనుండి నేను వింటూ ఉంటా ....

ఇదా తల్లితండ్రుల బాధ్యత ....

ఇవన్నీ లేకపోతే మా అమ్మాయి ఎలా బ్రతుకుతుంది అని తల్లితండ్రులు ఒక్క క్షణం ప్రశ్నించుకోవాలి ....

అమ్మాయిలకి ఎప్పుడూ ...."నీ పనులు నువ్వే చేసుకోవాలి , నీ డ్రైవింగ్ నువ్వు నేర్చుకోవాలి , నీ బాధ్యత ఎవరో తీసుకోరు .....నువ్వే తీసుకోవాలి ....నీ ఎమోషన్స్ నువ్వే బాలన్స్ చేసుకోవాలి ....నీ తిండి తినే సంపాదన నీదే కావాలి ...." అని నేర్పించినప్పుడే ....వాళ్ళ జీవితానికి తల్లితండ్రులు న్యాయం చేసినట్టు ....

అప్పుడు ఏ గవర్నమెంట్ జాబ్ మీద ....ఏ అమెరికా మీద , ఏ ఆస్థి మీద ....అమ్మాయిలు ఆధారపడాల్సిన అవసరం ఉండదు ...

నా పిల్లలకి నేను అది చెప్పలేదు ...ఆచరిస్తూ పోతున్నా .....వాళ్ళే అర్ధం చేసుకుంటారు ...అనే ఆశతో ...

వాళ్ళకి వాళ్ళ పిల్లలు ఏదీ వదిలేయమని చెప్పే స్థితి రాకూడదు ....
వాళ్ళు నాలా ఏదీ మోసుకుంటూ బ్రతకకూడదు ....అనే చిన్న ఆశ...


=======================

వదిలేసాననే అనుకున్నా కొన్ని వదిలేయడం అంత తేలికైన విషయం కాదు ....

ఏమో ...ఈ సంఘర్షణ ఎప్పుడూ ఉండేదే ....

అయినా…కొన్ని సంఘర్షణలు వదిలివేయడానికి ...ఓ జీవిత కాల కృషి అవసరం అనిపిస్తుంది .....!

============== *********** ============

No comments:

Post a Comment