Monday, September 6, 2021

"మొగుడు ఊరెళితే ..."

 "పెళ్ళాం ఊరెళితే ..." అనే పదం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది కానీ ....

"మొగుడు ఊరెళితే ..." అనే పదం ఎందుకు ఫేమస్ కాలేదు ..?!
పతివ్రతలు నిండుగా నివసిస్తున్న దేశం కదా మనది ...అంతేలే ...!
అసలు ఇలా వ్రాసినందుకు నన్ను కూడా అందరూ వ్రాత సమాజం నుండి వెలివేస్తారనుకుంటా ...
సరే వెలివేయనీ ...
అదేమో గానీ ...అందరి సంగతి నాకు తెలియదు ...నా మటుకు నాకు మొగుడు ఊరెళితే ఎక్కడలేని స్వాతంత్ర్యం సొంతమవుతుంది ...
ఈ కనికరం లేని కరోనా మహమ్మారి వలన గత కొన్నేళ్లుగా ...ఆ స్వాతంత్ర్యానికి ఎందరో అభాగ్యుల లాగే నేనూ దూరమయ్యాను ...
అంతకుముందు ...ఇంటికి ఎందుకు రావాలి అని ప్రశ్నించిన పత్నీ వ్రతులు అంతా ....
ఇప్పుడు ఇల్లొదిలి నేనెక్కడికి పోను అని తిష్ఠ వేసుకుని కూర్చున్నారు ...
అంతా కరోనా మహాత్మ్యం ...
కానీ ....అదృష్టం దురదృష్టాన్ని తరిమేసి ...కరోనా ని వాక్సిన్ కాటేసి ..అనుకోకుండా ...
----------------------
మొన్నా మధ్య మావారు .... ట్రైనింగ్ ఉంది లాంగ్ వీకెండ్ ....న్యూ జెర్సీ వెళ్ళాలి ...అని చెప్పారు...
గురువారం వెళ్తాను ...మళ్ళీ మంగళవారం వెనక్కి వస్తాను అన్నారు ...
ఓహ్ అవునా ...ఇప్పుడది అంత అవసరమా ఈ కరోనా టైం లో అడిగా ....
"టికెట్స్ బుక్ చేసేసాను ..." చెప్పారు ...
'ఓహ్ అవునా ..." ఇంకేం మాట్లాడలేదు ...
ఎప్పుడైనా నిర్ణయం తీసుకోకముందు నాకు చెబితే ఆ విషయం మీద మాట్లాడడం ....అమలు పరిచాక నాకు చెబితే ...మౌనంగా ఉండడం ... మా మధ్య గొడవలు తగ్గడం కోసం ....నేను చేసుకున్న ఉత్తమమైన అలవాట్లలో ఒకటి ...
అనుకున్నట్టు గురువారం రానే వచ్చింది ...
"నన్ను airport దగ్గర డ్రాప్ చేస్తావా ..." అడిగారు ...
"సరే ..." చెప్పా ...
ఆ రోజు ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు ..,
గురువారం సాయంత్రం ...శుక్రవారం , శనివారం , ఆదివారం , సోమవారం ...మంగళవారం ఉదయం ...ఎవ్వరూ లేరు ...నేనొక్కదాన్నే ...ఎంత ఫ్రీడమ్ రాబోతుందో ... Can You Imagine That?" చెప్పా ..
గురువారం airport దగ్గర డ్రాప్ చేసి ...హాయిగా పాటలు పెట్టుకుని డ్రైవ్ చేసుకుని ఇంటికి వచ్చాక ...మా ఆయన చేసిన మెసేజ్ చూసా ...సేఫ్ బోర్డింగ్ అని ...
ఇంటిదగ్గర ఉన్నప్పుడు ఒక్క విషయం కూడా భార్యకి చెప్పాలనిపించదు....
అదేంటో ...బయటికెళ్తే మాత్రం ....తిన్నాం, పడుకున్నాం , తెల్లారింది ...పొద్దుపోయింది ....అని ఒకటే మెసేజ్ లు ...అనుకుని ...,,
ఫోన్ సైలెంట్ లో పడేసి ..కార్ తీసుకెళ్లి గరాజ్ లో పడేసి ...ఇంటిముందు ఉన్న ట్రాష్ కాన్స్ తీసి లోపల పడేసి ....డోర్స్ అన్ని లాక్ చేసేసి ...హాయిగా ఇంట్లోకొచ్చి రిలాక్స్ అయ్యా ...
బయట లైట్ ఒక్కటి ఉంచేసి ...బెడ్ రూమ్ లైట్ ఒక్కటి ఆన్ చేసుకుని ...మిగతా లైట్స్ అన్ని ఆఫ్ చేసి ...ఇవ్వాళ చేయాల్సిన పనులేమైనా ఉన్నాయా అని అలోచించి ...ఏమీ లేవని నిర్ధారించుకుని ...ఉన్నదేదో వేసుకుని తినేసి ...హాయిగా బెడ్ మీదకు వచ్చేసా ...
కాసేపు ఏదో మూవీ చూసేసి ఇక పడుకుందాం అనుకునే లోపు ....
ఫైర్ అలారమ్ బీప్ బీప్ అని సౌండ్ చేయడం మొదలుపెట్టింది ...
నిజానికి ఆ అలారమ్ గత రెండు మూడు రోజుల నుండి ...అప్పుడప్పుడు సౌండ్ చేస్తుంది ...
"ఆ అలారమ్ బ్యాటరీ అయిపోతున్నట్టుంది ....కాస్త అది చూసి మార్చండి ...చాలా ఎత్తుగా ఉంది.. నిచ్చెన వేసుకుని ఎక్కాలి అది ...నేను ఎక్కలేను ..." అని మావారికి రెండు మూడు సార్లు చెప్పా ...
ఎప్పుడూ నేను ఒకసారి చెబితే ఏ పనీ చేయరు ...వినిపించుకోరు ...
ఓ పదిసార్లు చెప్పి ....గొడవలు పడి...తిట్టి ...పంచాయితీలు పెడితే గానీ చిన్న చిన్న పనులైనా పూర్తి కావు ...
ఇది నాకు మాత్రమే సొంతం కాదు ....మన దేశంలో 99 శాతం మంది భర్తలు అంతే ...
భార్య పోస్ట్ కి ఉన్న తీసివేత తనం ....భర్త పోస్ట్ కి సంక్రమించిన నిర్లక్ష్యం అనే సంప్రదాయం వలన ఇలా జరుగుతూ ఉంటుంది ....
చివరకు అడగడం విసుగేసి ...ఆ పని నేనైనా చేసుకుంటాను ...
లేదా "నువ్వు తిట్టావు కాబట్టి నేను చేయలేదు ...నువ్వు మంచిగా అడిగితే నేను చేసేవాడిని" అంటారు ...నేను మంచిగా మొదలుపెట్టిన సంగతి మర్చిపోయి ...
సరే అన్ని పనుల్లాగే ఈ పని కూడా ....
మంచిగా మొదలుపెట్టిన దగ్గరే ఆగిపోయింది కాబట్టి ....దాని మొహం కూడా చూడలేదు ...
ఈ అర్ధరాత్రి ఇప్పుడు ఈ నిచ్చెన ఎక్కడినుండి తేవాలి ....అని ...దాని మెయిన్ స్విచ్ ఎక్కడుందో అని ఇల్లంతా వెతికా ....ఎక్కడా కనపడలేదు ....
లక్కీగా ....మావారు లైబ్రరీ లో పుస్తకాల కోసం పెట్టిన నిచ్చెన కనిపించింది ....
అది తీసుకుని ...నెమ్మదిగా గోడకి వేసుకుని ...పైకెక్కి ...బాలన్స్ చేసుకుంటూ ...అలారం మీద ఏవైనా ఆఫ్ చేసే బటన్స్ ఉన్నాయా అని వెతిగా ...అక్కడ ఏదో కనిపించిన బటన్ మీద ప్రెస్ చేశా ...
ఆ అలారం ఇంకా ఎక్కువ మోగడం మొదలుపెట్టింది ....
ఆ సౌండ్ భరించలేక వెంటనే కిందకు దిగా ...టైం ఒంటి గంట అవుతుంది ....ఈ సౌండ్ ఎలా ఆపాలో తెలియదు ...ఎవరికైనా కాల్ చేద్దాం అన్నా అర్ధరాత్రి ఎవరికీ కాల్ చేయడం ఇష్టం లేదు ....ఎమర్జెన్సీ కి కాల్ చేద్దామా అని ఆలోచించా ....
సరే ముందు ఎలా ఆపాలో ప్రయత్నం అయితే చేద్దాం అని ....మళ్ళీ నిచ్చెన ఎక్కి ...రెండు చోట్ల మార్చి మార్చి మళ్ళీ బటన్స్ కోసం వెతికా ....ఏదీ కనిపించలేదు ...
ఈ లోగా ఆ సౌండ్ ఇంకా ఎక్కువై భరించడం నరకంలా ఉంది ....
ఇదేమైనా సెక్యూరిటీ సిస్టం కి లింక్ అయిందా ....ఎవరైనా దొంగ లోపలి రావడానికి ప్రయత్నిస్తున్నారా అని డౌట్ వచ్చింది ....లోపల లైట్స్ అన్ని ఆఫ్ చేసి ....బయట లైట్స్ వేసి .... అన్ని కిటికీల దగ్గరికి వెళ్లి ...కర్టెన్స్ తీసి బయటకు తొంగి చూశా ....ఎందుకైనా మంచిదని ఫోన్ చేతిలో పట్టుకుని ..
ఎవరూ కనిపించలేదు ...
ఛీ ...ఏంటి ....భయపడుతున్నానా ....అని నవ్వొచ్చింది ....
మళ్ళీ అలారం దగ్గరకొచ్చి ....నిచ్చెన ఎక్కి ...రెండు అలారమ్స్ లో ఉన్న బ్యాటరీ ఎలాగో తొలగించా ....
అయినా సౌండ్ ఆగలేదు...
ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే ....గూగుల్ గుర్తొచ్చింది ...వెంటనే system తీసి ... How Do I Turn off Home Alarm System? అని ఓ రెండు మూడు వీడియో లు క్లిక్ చేసి చూశా ....
అందులో మా అలారం మోడల్ లో ఉన్న వీడియో దొరికింది ....అది చూసాక అర్ధమైంది ... బ్యాటరీ తీసినా కొన్నిసార్లు అలారం ఆగదు ....ఆ పవర్ ఆఫ్ చేసేలా wires cut చెయ్యాలి అని ....
మళ్ళీ నిచ్చెన ఎక్కి ...అక్కడ కనపడిన మూడు వైర్లు పీకడానికి ట్రై చేశా ....
బాలన్స్ లేకపోవడం వలన ....ఒక్క చేత్తో పీకితే అవి రాలేదు ....చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి ....
ఆ క్రితం రోజే ..కొన్ని టెస్టర్స్ షాప్ నుండి మావారు పట్టుకొచ్చారని గుర్తొచ్చింది ....ఎక్కడ పెట్టారా అని ఇల్లంతా వెతికా ...ఎక్కడా కనిపించలేదు ...ఫోన్ చేద్దాం అనుకుని ....ఈ అర్ధరాత్రి ఎందుకులే అని ....కిచెన్ లో కనిపించిన ఓ పట్టకారు పట్టుకుని మళ్ళీ ఎక్కా నిచ్చెన ....
ఆ వైర్లు పట్టుకుని లాగా ...రాలేదు .....
చిన్నప్పుడు చదువుకున్న కథలాగా (గుర్తు రాలేదు ....కానీ మైండ్ లో ఉండి ఉంటుంది )....ఒక్కసారి అన్ని వైర్లు పట్టుకుని లాగలేనని ....ముందుగా ఓ రెండు వైర్లు పట్టుకుని బలంగా లాగా ....
ఒక్కసారిగా పెద్ద ఫ్లాష్ వచ్చి చిచ్చు బుడ్డి లాగా నిప్పు రవ్వలు పేలిపోయాయి ...
వార్నీ అనుకుని ....నాకు షాక్ కొట్టకపోయినా నేను షాకయ్యా ....
ఇంకొక్క వైరు అక్కడే ఉండిపోయింది ....బీప్ సౌండ్ ఇంకా ఆగలేదు ....మళ్ళీ పీకడానికి నాకు ధైర్యం సరిపోలేదు ....
పవర్ పీకేసినా ఇంకా ఎందుకు మోగుతుంది అది అని ఆలోచిస్తూ ఉండిపోయా ...
అప్పుడు మళ్ళీ వచ్చి సగంలో వదిలేసిన వీడియో చూడడం కొనసాగించా ....ఏం మిస్సయ్యానా అని ....
చివర్లో ...కొన్నిసార్లు పవర్ పీకేసినా ఇంకా కొంత స్టోరేజ్ పవర్ ఉంటుంది ....అది కూడా పోవాలంటే ....బటన్ ను 20 సెకన్లు అలాగే ప్రెస్ చేసి ఉంచితే మొత్తం పవర్ డ్రైన్ అయిపోతుంది .....అని చెప్పాడు ...
మళ్ళీ నిచ్చెన ఎక్కి ....బటన్ ప్రెస్ చేసి చెవులు మూసుకుని 20 Sec అలాగే పట్టుకున్నా .....
అరచి అరచి ....ఆగిపోయింది...
రెండిట్లో గ్రీన్ లైట్ కూడా ఆగిపోయింది ....
నిచ్చెన తీసి వెనక్కి పెట్టి ....,
ఈ ఫ్లాష్ వల్ల ఇంటర్నెట్ ....మిగతా పవర్ పాయింట్స్ పోకుండా ఉన్నాయా అని చెక్ చేశా ....అన్ని బాగానే ఉన్నాయి ....
అప్పటికే రెండున్నర అయింది టైం ....
ఇక ప్రశాంతంగా నిద్రపోయా ....
తెల్లవారి లేచి నా పని నేను చేసుకుంటూ ఉన్నా ....
రాత్రి నిద్ర సరిపోక ...చాలా నిద్రొస్తుంది .....కానీ వర్క్ ఉంది కదా అని ఆపుకుని పని చేసుకుంటూ ఉన్నా ...
ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది...నా మనసులాగే ....అంత అలసటలోనూ హాయిగా అనిపించింది ...
హాయి అంటే గుర్తొచ్చింది ....ఒక్క కాఫీ పెట్టుకుని వస్తా ....ఇంకా హాయిగా అనిపిస్తుంది ...
------------------------
అంతలో ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ దగ్గరనుండి ఫోన్ వచ్చింది ...ఎత్తలేదు ...
నిన్న కూడా ఆమె రెండు సార్లు ఫోన్ చేయడం గుర్తొచ్చింది ...
ఇప్పుడు వీళ్లకు అంత అవసరం ఏమొచ్చింది ...అని విసుగ్గా అనిపించింది ...
నాకు ఈ ప్రశాంత సమయంలో ఎవరితోనూ మాట్లాడాలని లేదు ...అది ఒక కారణం ....
పైగా ఈమె తో అస్సలు మాట్లాడాలని లేదు ...
మొన్నామధ్య చేసిన కొన్ని కన్నింగ్ బుద్ధుల వలన (అవి మరో సందర్భంలో చెప్పుకుందాం )
అంతలో అర్ధం కాని భాషలో ఒక మెసేజ్ పెట్టింది ....ఏదో గునపం అదీ ఇదీ అని ...
నాకు అర్ధం కాలేదు ...
మళ్ళీ అంతలో ఫోన్ ...
సరే ఏమడుగుతుంది అర్ధం చేసుకుందాం అని ఫోనెత్తా ...
"ఎలా ఉన్నారు ..." అడిగింది ...
"బాగున్నా .... " చెప్పా ...పొడిగా ...
"ఆ మీవారు ఊరెళ్ళారు కదా ..." అడిగింది ...
"అవును ..." చెప్పా ...
"మీకేమన్నా హెల్ప్ కావాలంటే అడగండి ....తను వెళ్ళేటప్పుడు ఏదైనా అవసరం అయితే చూసుకోమని కూడా చెప్పారు ...." చెప్పింది ...
నాకు నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు ....
ఆవిడ పనులు ఆవిడకు చేసుకోవడం రాదు ... ఎక్కడికైనా వెళ్లాలంటే ...."లక్ష్మిగారు ...నన్ను కూడా తీసుకుని వెళ్తారా ...హైవే మీద డ్రైవ్ చేయడం నాకు రాదు అని ఫోన్ చేస్తుంది .... " ఇక మా అయన ....ఇంటిదగ్గర ఉన్నప్పుడు ఒక్కటీ పట్టించుకోరు ....వెళ్ళాక ఫోన్ చేసి ఎలా ఉన్నావ్ అని అడగరు ...
ఆవిడ నాకు హెల్ప్ చేసేది ....ఈయన చేపించేవారు ...
ఇలాంటి సమయాల్లోనే ....నాకు నవ్వొచ్చేది ....నవ్వాలనిపించేది ....అందరూ అసందర్భంగా నవ్వుతానని అపార్ధం చేసుకునేది ....
మా అయన వేసే జోకుల్లో ...ఇది అతిపెద్ద జోకు ...
అయినా అన్ని కంట్రోల్ చేసుకుని ...."సరే ...." అని చెప్పా ...
"ఇంతకీ మీరు మెసేజ్ లో ఏం అడిగారో అర్ధం కాలేదు..." అడిగా ....
"మాది ఒక ఎల్లో కలర్ గునపం ఉంది మీ ఇంట్లో ...అది పట్టుకెళ్ళడానికి నిన్న వద్దాం అనుకున్నాం ....మీవారు మీకు కాల్ చేసి చెబుతా అన్నారు ...మీరు నిన్న ఫోన్ తియ్యలేదు ....ఇవ్వాళ వస్తాం ...ఎప్పుడు రమ్మంటారు ..." అడిగింది ....గుక్కతిప్పుకోకుండా ...
"ఏమో ....నాకు ఆయన ఏం చెప్పలేదు ....మీరు చెబుతున్న గునపం ఏంటో నాకసలు ఐడియా లేదు ...ఆయనొచ్చాక తీసుకోండి .." చెప్పా ...
"ఆ అయ్యో ...అది మాకు అవసరం ఇవ్వాళ ...ఇంటికొచ్చి పోనీ మేమే వెతుక్కుంటాం ....ఇవ్వాళ సాయంత్రం వస్తాం ....సరేనా ...."అడిగింది ....
అంత అర్జెంటు ఏంటి గునపం తో ....ఇవ్వాళ తవ్వకపోతే సచ్చిపోద్దా ....వెధవ సంత....ఎదో ఒకటి నెత్తినపెట్టి పోతాడు ...అనుకుని ...,
"నేను ఉండనండీ ...ఇవ్వాళ ఫ్రెండ్ వాళ్ళింటికి వెళ్లిపోతున్నా ....ఇప్పుడల్లా రాను ..." దొరికిన అబద్ధం చెప్పేశా ...
"అయ్యో పోనీ ...ఇంటి ముందు చెట్లు దగ్గర పెట్టెయ్యమ్మా ...మేం పట్టుకుపోతాం వచ్చి ...." చెబుతూ ఉంది ....
"నాకు వేరే కాల్ వస్తుంది ....తర్వాత చేస్తాను ...." ఎందరో చెప్పే అబద్ధం చెప్పి ....ఫోన్ పెట్టేసా ....
కాసేపాగి పెరట్లోకి వెళ్లి చూస్తే ఎల్లో కలర్ గునపం కనపడింది ....
అది తీసుకుని వెళ్లి ....ఇంటి ముందు జామ చెట్టు మొదట్లో వాళ్ళకి మాత్రమే కనపడేలా పెట్టి ....తలుపు గడులేసేసా ....
మళ్ళీ పెరట్లోకి వాళ్ళంతట వాళ్ళు రాకుండా ....
అలా వాళ్ళు రావడం మావారిచ్చిన చనువు ....
వాళ్ల ఫ్రెండ్స్ అందరికీ ఆ మధ్య ..." పర్వాలేదు ....మీరు పెరట్లోకి సరాసరి వచ్చెయ్యొచ్చు" అని చెప్పారంట ...
"అలా ఎలా చెబుతారు డాడీ ....మమ్మి నైటీ వేసుకుని బ్యాక్ యార్డ్ లో ఫ్రీ గా తిరుగుతుంది ....ఎవరు పడితే వాళ్లొస్తే ప్రయివసీ ఉండొద్దా ..." అని నా కూతురు వాళ్ల డాడీ ని అడిగేవరకు ....నాకు తట్టనేలేదు ....
కొన్నిసార్లు అంతే ....నాకసలు కొన్ని హక్కులున్నాయని ...వాటి గురించి ప్రశ్నించాలని కూడా నాకు ఆలోచన రాదు ...నా కోసం నా ఆత్మీయులు అడిగేవరకు ....
అడిగాక ... "అవును కదా ....నాకు ఈ హక్కు ఉంది కదా ..." అనుకుంటా ....
అది మన సంప్రదాయం / సమాజం స్త్రీ కి ఇచ్చిన ఫ్రీ గిఫ్ట్ ....
ఆ తరువాత ...మళ్ళీ ఫ్రెండ్స్ కి ...."మీరలా పెరట్లోకి మేం పిలవకుండా రావద్దు ... ....పొరపాటుగా చెప్పాను" అని మెసేజ్ ఇచ్చాను అని చెప్పారు ....అది సరిదిద్దుకున్న విషయం అనుకోండి ....
ఆ తర్వాత ...గునపం పట్టుకెళ్ళాం ...అని మెసేజ్ పెట్టారు ...నేను నిద్రలేచాక ఎప్పుడో చూశా ...
-----------------------
వర్క్ అయిపోయాక ....హాయిగా నిద్రపోయి ఎప్పుడో ఏడింటికి నిద్ర లేచా ....కాసిని కాఫీ పెట్టుకుని పెరట్లో కూర్చుని , పాటలు పెట్టుకుని ....ప్రశాంతంగా చల్లటి గాలిని ఆస్వాదిస్తూ ...తాగా...
రోజూ కాఫీ తాగనని కాదు ...
కానీ ఒంటరిగా తాగుతున్నప్పుడు ....నా గురించి మాత్రమే నేను ఆలోచించుకుంటూ ....జీవితాన్ని నెమరు వేసుకుంటూ ....జ్ఞాపకాల్ని తడిమి చూసుకుంటూ తాగుతానేమో ....చాలా హాయిగా అనిపిస్తుంది ...
అమ్మకు కాల్ చేశా ...కాసేపు మాట్లాడి ...పిల్లలకు కాల్ చేసి కాసేపు మాట్లాడి ...(ఒకళ్ళు ఎత్తలేదు ...పర్వాలేదు అని చెప్పేశా )
మొక్కలకు నీళ్లు పోసి ...
ఇంట్లో కొచ్చి ...తలుపులన్నీ లాక్ చేసి ....పాటలు పెట్టుకుని ....ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసుకుని ....
టమాటో పప్పు చేసుకుని ....వేడి వేడి అన్నం వండుకుని ....హాయిగా తిని ....నిద్రపోయా ...
ఓపికుంటే క్లీన్ చేసుకోవడం ....లేదా సినిమాలు చూసుకోవడం ....నిద్రపోవడం ...కావలసింది వండుకోవడం ....తినడం ....మళ్ళీ నిద్రపోవడం ....
ఫేస్ బుక్ లో కూడా ఏం వ్రాయాలనిపించలేదు ....
ఒకానొక రాత్రి ...పదకొండు గంటలకు మావారు కాల్ చేసారు ....
ఎలా ఉన్నానో అడగడానికి కాదు ...ప్రోగ్రాం ఎలా జరుగుతుందో చెప్పఁడానికి ....
"ఊ" కొట్టా ....గారేజ్ లో ఏం చేయాలనుకుంటున్నానో ....ఎలా చేయాలనుకుంటున్నానో ... అని డిజైన్ వివరించడం మొదలు పెట్టారు ...."నీకు సౌండ్ ఇంట్లో పెట్టడం ఇష్టం లేదు కదా ....స్పీకర్లు గరాజ్ లో పెడదాం అనుకుంటున్నా ...." కొనసాగింపుగా చెబుతున్నారు ....
"హలో ..హలో ....రాత్రి పడుకునే టైంలో అవన్నీ ఆలోచించే ఓపిక నాకు లేదు ...." వాక్ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ ...చెప్పా ప్రశాంతంగా ....
"సరే సరే ...పడుకో ...." చెప్పారు ....
ఫోన్ పెట్టేసి ....హాయిగా కామెడీ షోస్ చూసుకుని నిద్రపోయా ....
ఇన్నేళ్ల ఉరుకుల పరుగుల జీవితం ....తలకు మించిన బాధ్యతలు ...నా గురించి ఆలోచించుకునే సమయం నాకు దొరకకపోవడం ....అన్ని వెరసి ...
నా మనసు ప్రశాంతత కోరుకుంటుంది ....ఒంటరి తనం కోరుకుంటుంది ....మౌనం కోరుకుంటుంది ....సమూహపు విడుదల కోరుకుంటుంది ....
నా సాంగత్యం నాకు అవసరం అని అర్ధమవుతుంది ...
అందులో దొరికిన ఒక అద్భుత అవకాశమే ..."మొగుడు ఊరెళితే ...."!😇





No comments:

Post a Comment