Wednesday, January 24, 2024

అంతా మానవ మనుగడలో భాగమే ...!

 ఒక వ్యక్తిని,

ఇష్ట పడడం కన్నా ...కష్ట పెట్టడం చాలా కష్టం ...
క్షమించడం కన్నా ... తప్పుల్ని ఎత్తి చూపడం చాలా కష్టం ...
ప్రోత్సహించడం కన్నా ... నిరుత్సాహ పరచడం చాలా కష్టం ...
మాట్లాడడం కన్నా ... మౌనంగా ఉండడం చాలా కష్టం ...
బంధం లో ఉండడం కన్నా ... వదిలివేయడం చాలా కష్టం ...
ప్రేమించడం కన్నా ...ద్వేషించడం చాలా కష్టం ...
ఏ మనిషీ పుట్టుకతోనే ...ద్వేషంతో, కోపంతో ..పుట్టరు ..
కానీ అవన్నీ పులుముకుని జీవించాల్సి వస్తుంది అంటే అది తప్పనిసరై ...లేదా తప్పకుండా మనుగడ కోసమే ...అయ్యుంటుంది
అందుకే ...
మానవత్వం మూర్తీభవించిన శాంత, సహన , క్షమా గుణ సంపన్నులందరు మంచివాళ్ళు కారు ....
ద్వేషం నింపుకుని బ్రతుకుతూ ...ఇతరుల తప్పుల్ని ఎత్తి చూపే వాళ్ళు అందరూ చెడ్డవాళ్ళు కాదు ...
ఎవరెవరి జీవితాల్లో ఏముందో ...ఎవరెవరి మనస్సులో ఏం జరుగుతుందో చదివినప్పుడే వాళ్ళ వాళ్ళ ప్రవర్తనకు అర్ధం తెలుస్తుంది ...
అంతా మానవ మనుగడలో భాగమే ...!

Saturday, September 30, 2023

బాధ్యత కలిగిన భర్తలు ...!

 "హాయ్" ఫ్లైట్ లో కిటికీ పక్క సీట్ లో కూర్చున్న నన్ను చూస్తూ విష్ చేసాడు ... మధ్యలో ఉన్న సీట్ తనదే అని చూపించి కూర్చుంటూ ఓ వ్యక్తి ...

అతని వయసు ఓ ఇరవై ...ఇరవై అయిదు మధ్యలో ఉండొచ్చు ...
"హలో ..." చెప్పా నేను కూడా అతన్ని వెల్కమ్ చేస్తూ ...
అవతలివైపు మూడో సీట్లో ఒక పాప (తెలుగు వాళ్ళ పాపే ) కూర్చుని ఉంది ...
కూర్చున్న వెంటనే అతను ఫోన్ తీసి ఏదో చాటింగ్ చేస్తూ ఉన్నాడు ...మధ్య మధ్యలో నా వైపు చూసి ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు ...
ఇక్కడ ఎవరైనా అపరిచితులతో మాటలు కలపడానికి ప్రయత్నిస్తుంటే ...ముందుగా... చాలామంది వాతావరణం గురించి గానీ ...ఆ రోజు ఎలా జరిగింది అని గానీ ...లేదా ప్రయాణం ఎలా ఉంది అని గానీ మొదలు పెడతారు ...
అందరిలాగే అతను కూడా మధ్యలో వాతావరణం గురించి ఏవో రెండు మూడు మాటలు మాట్లాడాడు ...మాటలు కలుపుతూ ...
అంతలో అవతలి వైపు కూర్చున్న పాప ఎక్కడికో వెళ్ళింది ...
"ఇక్కడ కూర్చున్న పాప ఎక్కడికి వెళ్ళింది ..." అడిగాడు నా వైపు తిరిగి ...
నేను చుట్టూ చూశా ఎక్కడకు వెళ్లిందా అని ...
"మళ్ళీ వస్తుందా ..." అడిగాడు ...
"వస్తుంది ...రెస్ట్ రూమ్ కి వెళ్ళింది అనుకుంటా.." చెప్పా నాకు తెలియకపోయినా ...
అతను ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉన్నాడు ...
కాసేపు ఆగాక ..
ఆ పాప ఇంకా రాకపోవడం గమనించి ...
"ఇంకా రాలేదు ...ఇక రాదా ..." అడిగాడు ...
ఏంటి ఇన్నిసార్లు నన్ను పాప గురించి అడుగుతున్నాడు ...బహుశా తను నా పాప అనుకున్నాడేమో అని ...
"ఇక రాదనుకుంటా ...బహుశా వాళ్ళ పేరెంట్స్ దగ్గరకు వెళ్లి ఉంటుంది ..." చెప్పా ..వాళ్ళ పేరెంట్స్ కూడా ఆ ఫ్లైట్ లోనే ఉన్నారని నాకు తెలుసు కాబట్టి ..
"నా వైఫ్ కూడా ఈ ఫ్లైట్ లోనే ఉంది ...తను ఇక్కడ కూర్చోవచ్చా ..." అడిగాడు మొహం వెలిగిపోతుండగా ...
ఖాళీగా ఉన్న సీట్లో కూర్చోవడానికి అభ్యంతరం ఎందుకు ఉంటుంది అని ఆలోచిస్తూ ...
"కూర్చోవచ్చు ...ఆ పాప కూడా ఇక రాకపోవచ్చు ..." చెప్పా ...
ఆ తర్వాత అతను వాళ్ళ వైఫ్ ని అడగడం ...తను ఫ్లైట్ స్టాఫ్ ని అడగడం ...వాళ్ళు ఒకే అనడంతో.. తను కూడా నా పక్కన ఉన్న సీట్ కి షిఫ్ట్ అయింది ..
అంతలో నేను రెస్ట్ రూమ్ కి వెళ్లాల్సి వచ్చింది ...
ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని ...నా కిటికీ పక్క సీట్ వాళ్ళకిచ్చి ...నేను చివరి సీట్ కి మారిపోయా...
వాళ్లిద్దరూ చాలా హాపీగా చేతిలో చెయ్యేసుకుని మాట్లాడుకుంటూ కబుర్లలో లోకాన్ని పట్టించుకోవడం మానేశారు ...
ఇప్పుడా అబ్బాయి ...నాతో , లేదా ఎవరితోనూ మాటలు కలిపే పనిలో లేడు...వాళ్ళ వైఫ్ తో తప్ప ...
నాలుగుగంటలు జర్నీలో విడిగా కూర్చోలేరా అంటే ...
ప్రేమికులు తప్పకుండా కూర్చోలేరు అనే అంటాను ...పాపం ఎంత తపన పడిపోయాడు ...తన భార్య తన పక్కన కూర్చోవాలని ...
నేనిలా ఆలోచిస్తూ ఉండగానే ...అదే ఫ్లైట్ లో ప్రయాణిస్తున్న మా ఆయన చీకట్లో తడుముకుంటూ నా సీట్ దగ్గరకొచ్చి ..
"నా పక్క సీట్ ఖాళీగా ఉంది ...అక్కడ వచ్చి కూర్చుంటావా ..." అడిగారు ...
"ఎందుకు ...నాకిక్కడ బాగానే ఉంది ...నేను రాను ..." చెప్పా ...
"అక్కడకొస్తే మనం మాట్లాడుకోవచ్చు ..." అడిగారు ...
"ఏముంది మనం మాట్లాడుకోవడానికి ..." ఆశ్చర్యంగా అడిగా ...
సమాధానం లేదు ...
"అబ్బో ఇంతోటి ప్రేమికులు ...ఈ నాలుగు గంటలు మాట్లాడకపోతే ఊపిరాగి పోతుంది ...పొండి...పొయ్యి మీ సీట్ లో కూర్చోండి ..." చెప్పా మెల్లగా విసుక్కుంటూ ...
ఏంటో ...విచిత్రం ...బయటికెళ్లినప్పుడు ...అందరిముందూ ...ఫ్లైట్ లో , ఎయిర్ పోర్ట్ లో , పార్టీల్లో ...ఎక్కడ లేని ప్రేమ పొంగుకొస్తుంది ...
పార్టీల్లో కూడా అంతే ఫుడ్ తెచ్చుకోవడానికి నాకు ఓపిక లేనట్టు ...నేను తినకుండా తను ఎప్పుడూ తిననట్టు అతి వినయంగా ఫుడ్ తెచ్చి నా ముందు పెడుతూ ఉంటాడు ...అది కూడా లేడీస్ ముందు ..
నిజంగా నా గురించి తెలియని వాళ్లయితే ..."ఈవిడ చూడమ్మా మొగుడితో ఎలా అన్నం పెట్టించుకుని తింటుందో ...ఇంట్లో కూడా అంతేనేమో ..." అనుకోగలరు ...కానీ వాళ్లకేం తెలుసు ...ఇంట్లో తిన్న కంచం కూడా అక్కడే విసిరేసి పోతారని ...
ఎవరి పనుల్లో వాళ్ళు నా ఆలోచనల్లో నేను ఉండగానే ఫ్లైట్ గమ్యం చేరుకుంది ...
ఇదంతా ఎందుకు గుర్తొచ్చిందంటే ...
ఈ రోజు శుక్రవారం ...ఇవ్వాళ సాయంత్రం అయిదింటికి పోయాడు మనిషి ...ఇంతవరకు అంతు లేదు .. 12 అయింది ...ఎప్పుడొస్తారో తెలియదు ...
ఫ్రైడే వచ్చిందంటే చాలు ఎక్కడికి వెళ్తారో తెలియదు , ఎప్పుడొస్తారో తెలియదు ... భార్యకు చెప్పాలని బాధ్యత ఉండదు ...
కానీ ఫ్లైట్ లో మాత్రం ఓ నాలుగుగంటలు మాట్లాడకుండా నోరుమూసుకుని కూర్చోలేరు ...బాధ్యత కలిగిన భర్తలు ...!
Happy weekend!😇✍️

Monday, September 25, 2023

Ayothi

 Ayothi

-------
రిలీజ్ అయ్యి చాలా రోజులైంది కాబట్టి కొంచెం కథ చెప్పొచ్చు అనిపించింది ..
"పుణ్యక్షేత్రం రామేశ్వరం చూడాలని ఉత్తర భారతదేశం నుండి (కఠినమైన సనాతన నియమాలు అమలుపరిచే ఒక ఇంటిపెద్ద ఉన్న ) ఒక ఫామిలీ ప్రయాణం అవుతారు ...
ఆ కుటుంబంలో భార్య భర్తతో పాటు ... కాలేజ్ చదివే వయసున్న ఒక కూతురు ...స్కూల్ లో చదివే వయసున్న ఒక కొడుకు ఉంటారు ...
ట్రైన్ దిగాక రామేశ్వరం వెళ్ళడానికి ఒక కార్ అద్దెకు తీసుకుంటారు.. కార్ లోకి ఎక్కేముందు ... వాళ్ళ డాటర్ "అమ్మా బాత్ రూమ్ కి వెళ్ళాలి.." అడుగుతుంది ...
సనాతన నియమాలు పాటించే భార్య ...సనాతన నియమాలు అమలుపరచే భర్త అనుమతి కోసం భర్తని అడుగుతుంది ... తన కూతురికి బాత్ రూమ్ కి వెళ్లాల్సిన అవసరం ఉందని పెర్మిషన్ ఇవ్వమని ...
భర్త అందుకు అంగీకరించడు.. అందువలన ఆ అమ్మాయి బాత్ రూమ్ కి వెళ్లకుండానే కార్ ఎక్కుతుంది ...
ఆ తర్వాత సినిమా లో ఆ అమ్మాయి అది మర్చిపోయి ...కార్ కిటికీ లో నుండి ప్రకృతి అందాలను తమ్ముడితో కలిసి చూడడంలో నిమగ్నం అవడంతో .. చూసే ప్రేక్షకులమైన మనం కూడా ఆ అమ్మాయి బాత్ రూమ్ కి వెళ్ళలేదు అనే విషయం మర్చిపోతాం ..
ఆ తర్వాత కొన్ని వరుస సంఘటనలతో ...అనుకోని మలుపులతో ...ఆ కారుకి యాక్సిడెంట్ కావడం ...ఆ మదర్ కి సీరియస్ అవ్వడం ... ఆమెని హాస్పిటల్ లో అడ్మిట్ చేయడం ... ఆ టాక్సీ డ్రైవర్ తాలూకా వాళ్ళు అనుకోకుండా వీళ్ళ దగ్గరకొచ్చి ఈ పిల్లలని చూసి జాలి పడడం... ఈ పిల్లలు కూడా సహాయం చేయమని అర్ధించడం.. ఆ హాస్పిటల్ నుండి మరో హాస్పిటల్ కి ట్రావెల్ చేయాల్సి రావడం ... అంబులెన్స్ లోనే ఆమెకు సీరియస్ కావడం ... ఆమె చనిపోవడం ...
ఇవన్నీ జరిగినంతసేపు ... క్షణ క్షణం ... అనే సమయానికి ప్రాణం విలువను ముడిపెట్టి మనం కూడా ఆ పిల్లల్తో అంబులెన్స్ లో ప్రయాణిస్తూనే ఉంటాం ...
ఇక సమయానికి మించి ప్రాణం ప్రయాణించింది తెలిసాక. అప్పటి దాకా ... అమ్మా అమ్మా అని ఆ ప్రాణానికే పేరు పెట్టి శబ్దం చేసిన ఆ పాప నిశ్శబ్దమై ... వచ్చి ... "భయ్యా ..నేను బాత్ రూమ్ కి వెళ్ళాలి ..." అని ఆ అపరిచిత వ్యక్తిని అడిగినప్పుడు ...
ఎవరిని నిందించాలి నిజంగా నాకు అర్ధం కాలేదు ...
అందుకే చెలియలి కట్టను తెంచుకుని విలయము విజృంభించినట్టు ... కళ్ళ పొరలను చీల్చుకుని కన్నీరు వరదలై ప్రవహించింది ...
ఎప్పుడూ అనుకునేదే అయినా మళ్ళీ అనుకుంటే తప్పేం లేదు ...
"ఈ తమిళ్ డైరెక్టర్స్ సినిమాని సినిమాలా తీయరు ఎందుకో ...ఒక జీవితంలా తీస్తారు ...అందుకే తీసేటప్పుడు వాళ్ళు జీవిస్తారు ...చూసేటప్పుడు మనం మరణిస్తాం ...మళ్ళీ జన్మించడం కోసం ..."!
PS: ఈ సినిమా చూడమని నా పిల్లలకు నేను సజెస్ట్ చేయలేను ... ఇంత దుఃఖాన్ని భరించలేరేమో అని నా భయం ...అంతే !

Sunday, May 28, 2023

ఆ పుస్తకం మా ఊరు వాళ్ళు వ్రాసిందే ...

 "ఎవరు వ్రాసారు ఈ పుస్తకం ... మీ ఊరు వాళ్ళ లాగా ఉన్నారు ..." టీపాయ్ మీద ఒక పుస్తకాన్ని తీసి చూస్తూ అడిగారు కొన్నాళ్లక్రితం మావారు

ఆ పుస్తకం మా ఊరు వాళ్ళు వ్రాసిందే ...నాకు ఇండియా వెళ్ళినప్పుడు గిఫ్ట్ గా ఇచ్చారు ...
"అవును మా ఊరు వాళ్ళే వ్రాసారు ...." చెప్పా ...ఒకింత గర్వంగా
"అబ్బో ...మీ ఊర్లో పుస్తకాలు వ్రాసేంత గొప్ప వాళ్ళు ఉన్నారా ..." పేజీలు తిరగేస్తూ నా వైపు చూడకుండానే చెప్పారు ...
ఒకవేళ వాళ్ళ ఊరు ఆడవాళ్లను వాళ్ళ భర్తలు కూడా అలాగే అంటారేమో మరి ...
మగవాళ్లకు కొందరికి ..., ఆడవాళ్ళ పుట్టింటి వాళ్ళను , వాళ్ళ ఊరుని , వాళ్ళ జిల్లాని, వాళ్ళని ...తక్కువగా చేసి చూస్తే వచ్చే ఆనందం ఏమిటో నాకు ఎంత ఆలోచించినా అర్ధం కాదు కొన్నిసార్లు ...
అదే వాళ్ళ వాళ్ళ సొంత ఊరులో నేరస్థులు కూడా గొప్పవాళ్లే అని ... నిశానీలు కూడా ఎంతో ప్రతిభ కలవారని .. తాగుబోతులు కూడా పద్దతి కలవారని .. దొంగలు కూడా నిజాయితీ పరులని ...సమర్ధించుకుంటూ బ్రతికేస్తూ ఉంటారు ...
ఇలాంటి ప్రశ్నలకు ఏమైనా సమాధానం చెప్పడం కన్నా మౌనంగా ఉండడం బెటర్ అని ...సైలెంట్ గా నా పని నేను చేసుకుంటూ ఉన్నా ....
"ఎవరు ఈయన ...ఈయన వయసు ఎంత ఉంటుంది ...." ఆరాగా అడిగారు మళ్ళీ ఆయనే ....
"మీరనుకునే వయసు కాదులే ...అంత అనుమానం అవసరం లేదు ...ఆయన మా నాన్న వయసు వారు ..." క్లారిటీ ఇచ్చా ...
"అనుమానం కాదు .. ఇంత బాగా వ్రాసారు కదా ....ఎంత వయసు ఉంటుందో అని అడిగా ..." సమర్ధించుకుంటూ చెప్పారు ...
"చదవకుండానే బాగా వ్రాసారని తెలిసిందా ...వేషాలు కాకపోతే ..."
"ముందుమాట చదివా ..." 😀
ఎప్పటికీ మారరు.. మనసులో అనుకున్నా .. పైకి అనలేదు !
Happy long weekend!😇✍️

Saturday, April 22, 2023

కాపాడడాలు లేవు...కాపాడుకోవడాలు లేవు ...

 మా ఆయన ఫ్రెండ్స్ ... మా ఆయన్ని అనుక్షణం కాపాడాలని ప్రయత్నిస్తూ ఉంటారు ....అంటే , ఎక్కడికైనా వెళ్లి ఫోన్ ఎత్తకపోతే ...వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లారేమో అని వాళ్ళ నెంబర్ కి చేసాననుకోండి ...వాళ్ళు వెంటనే నిజాలు చెప్పరు.. అయ్యో ఎవరి దగ్గర ఉన్నానని చెప్పారో అని ఆలోచిస్తారు ....అతి కష్టం మీద ...ఇక్కడకు రాలేదండీ అని చెప్పి ...తర్వాత మళ్ళీ ఆయనకి కాల్ చేసుకుని ....ఎక్కడ ఉన్నావు ....ఇరుక్కు పోలేదు కదా అని కన్ఫర్మ్ చేసుకుంటారు ...

ఒక్క కాల్ చేస్తే ఇంత బ్యాక్ గ్రౌండ్ వర్క్ జరుగుతుంది ... అది ఫ్రెండ్స్ అందరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ ... ఒకరికొకరు చక్కగా కాపాడుకుంటారు ....
ఇక పిల్లల విషయానికి వస్తే ... వాళ్ళూ అంతే ...ఒకరికి సంబంధించిన సీక్రెట్స్ మరొకరి దగ్గరినుండి రాబట్టలేం .. నాకు తెలియదు మమ్మి అదెక్కడికి వెళ్లిందో అంటారు ... తన ప్లాన్స్ ఏంటో కనుక్కుని చెబుతాను అంటారు ...ఒకవేళ ఏదైనా మనతో చెప్పినా కూడా మళ్ళీ అడగొద్దు అని ప్రామిస్ తీసుకుని మరీ చెప్తారు ...వాళ్ళను వాళ్ళూ చక్కగా కాపాడుకుంటారు ...
అదే లేడీస్ ..అంటే మా విషయానికి వస్తే ...ఎవరి సీక్రెట్స్ వాళ్ళు దాచుకుని ....ఎవరి తిప్పలు వాళ్ళు పడాల్సిందే తప్ప ...ఈ సహకారం , అండర్స్టాండింగ్ ఏమీ ఉండవు ..
కాపాడడాలు లేవు...కాపాడుకోవడాలు లేవు ...
పైగా ఏదైనా తప్పులు చేసేస్తామేమో అని ....నాలుగు నీతి కథలు , నీతి వాక్యాలు తగిలించి మనల్ని సన్మార్గంలో పెడుతూ ఉంటారు లేడీ ఫ్రెండ్స్ ...
ఇట్లుంటది .., Happy Weekend!😇✍️

Sunday, March 19, 2023

ఇవ్వాళ కాసేపు గార్డెన్ వర్క్ చేసుకున్నాను ...

 ఇవ్వాళ కాసేపు గార్డెన్ వర్క్ చేసుకున్నాను ....అంటే ...గడ్డి అంత క్లీన్ చేసి ... మొక్కల కోసం రెడీ చేయడం అన్నమాట ..

గార్డెన్ లో మొక్కలన్నీ చచ్చిపోయాయి ... మళ్ళీ అన్ని మొదలుపెట్టుకోవాలి ...
నేను ఇండియా వచ్చేటప్పుడు ...నీళ్లు లేక చచ్చిపోతాయేమో అని ....రోజూ నీళ్లు పోయండి అని ఇంట్లోవాళ్ళకి గుర్తు చేసేదాన్ని ...
కానీ అవి నీళ్లు లేక చచ్చిపోలేదు ....చలి ఎక్కువై , వర్షాలు ఎక్కువై ...చలికి వర్షాలు తోడై ...చనిపోయాయి ...
నీళ్లు ఎక్కువైతే ఇంక ఎవరు మాత్రం చేసేదేం ఉంది ...
అయినా ...కాలిఫోర్నియా వచ్చాక ..ఇంత వర్షాలు నేనెప్పుడూ చూడలేదు ...
ఇంకో మూడు రోజులు వరసనే వర్షాలున్నాయి ...
ఆ తర్వాత కూడా ఇంకో వారం చలి ఉండొచ్చు ...
అప్పుడు మొక్కలు మొదలుపెడదాం అని ఎదురు చూస్తున్నా ...
అంతవరకూ ఖాళీ దొరికితే గడ్డి పీకడం తప్ప ...గార్డెన్ లో పనేం లేదు ...
నేను వర్షం ఇండియాలో పడితే ఎంజాయ్ చేస్తానా ...లేక అమెరికాలోనా అని ఆలోచిస్తూ ఉంటా ...
కానీ నాకు వర్షం మా ఊరులో పడితే ఇష్టంగా ఉంటుంది ...
అక్కడైతే మా అమ్మ పకోడీలు , గారెలు, అట్లు, పులిహోర ...ఇలాంటివి వండిపెడుతూ ఉండేది ...అప్పుడప్పుడు గొడుగేసుకుని పరిగెత్తుకుంటూ బయటకు వెళ్లి ...కావాల్సినవి తేవడం ...రేడియో వింటూ ...తింటూ కూర్చోవడం ...ఇదే పని ...
ఇక్కడేంటొ వర్షం పడితే కూడా రూల్స్ కి తగ్గట్టు సైలెంట్ గా పడి వెళ్ళిపోతుంది అనిపిస్తుంది ...
ఓ ఉరుము ఉండదు ...ఓ మెరుపు ఉండదు ...
అదే మా ఊరులో అయితే ....పెళ పెళ మని ఉరుములు ...మెరుపులు ..గాలి ...(అది మళ్ళీ పెద్దగా వస్తే భయం ) ఇవన్నీ వస్తే గానీ వాన రాదు ...
ముందుగా వచ్చే ఈ హంగామా తోనే మనసంతా హాయిగా ఉంటుంది ....
అందుకే మా ఊరులో వర్షం నాకిష్టం ...
విత్తనాలు తెచ్చావా వచ్చేటప్పుడు అని కొందరు ఫ్రెండ్స్ ఇక్కడ అడిగారు ...
అలాంటివి కొన్ని నేను చెప్పకూడదు ...వాళ్ళు అడగకూడదు ...అవి మొలిచినప్పుడు ...మొక్కలు వచ్చినప్పుడు అందరికీ తెలుస్తుంది ...
కాబట్టి ...ఈ వర్షాలు / చలి ...తొందరగా తగ్గాలని అందరూ కోరుకోండి ...!😇🥳

Tuesday, March 7, 2023

ఇవ్వాళ పొద్దున్నే కాఫీ పెట్టుకోవడనికి పాలు

 ఇవ్వాళ పొద్దున్నే కాఫీ పెట్టుకోవడనికి పాలు కోసం చూస్తే పాలు అయిపోయాయి ...

"అయ్యో ...పాలు లేవు కాఫీ కి" చెప్పారు మావారు దిగాలుగా ...
నేనేం బదులు చెప్పలేదు ...
"తెస్తాను ..వెళ్లి " చెప్పారు
దానికీ నేనేం మాట్లాడలేదు ...
కాసేపు అక్కడే తారట్లాడి ...,
"పోనీ స్టార్ బక్స్ కాఫీ తాగుదామా ...ఈ రోజుకి ..., తెమ్మంటావా ..." అడిగారు ...
"వద్దు ...." చెప్పా ..
స్టార్ బక్స్ దగ్గరికి వెళ్ళినోళ్లు పాలు తేలేరా?! అనుకున్నా ...అనలేదు ...
"ఉండు ఉండు ...బ్లాక్ కాఫీ తాగుదాం ...మిషన్ ఆన్ చేస్తా ..." అంటూ హడావిడిగా మిషన్ ఆన్ చేసారు ...
నాకా బ్లాక్ కాఫీ ఇష్టం ఉండదు ....అయినా సరే మీ ఇష్టం అని చెప్పా ...
ఏమనుకున్నారో తెలియదు ... కాఫీ మాట మర్చిపోయి నా పని నేను చేసుకుంటుంటే ...వచ్చి " పాలు తేవడానికి వెళ్తున్నా " చెప్పారు ...
నేనేం బదులు చెప్పలేదు ...
అది ఎంతో దూరం ఉండదు.. కార్ వేసుకుని వెళ్తే ఒక్క నిమిషం పడుతుంది .. 0.7 మైల్స్ ఉంటుంది..
అయినా పాలు అయిపోయాయని చూసుకుని ...రాత్రి అయినా తెచ్చి ఉండొచ్చు ...
పొద్దున్నే వర్క్ టెన్సన్స్ ఉంటాయి కాబట్టి ...
పిల్లలుంటే వాళ్ళే తెస్తారు అయిపోయిన వెంటనే ...
ఇదివరకంతా.. మాఆయన చదువుకుంటున్నాడు ....మా ఆయన ఉద్యోగం వెలగబెడుతున్నాడు .. మా ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు అని అన్ని నేనే తెచ్చేదాన్ని అనుకోండి ...
ఒక్క పాలు మాత్రం ...అయిపోయినప్పుడు తెచ్చుకోవాలి కదా ...
కానీ ఆ ఒక్కటి తెమ్మంటే కూడా ...వంద కారణాలు ...నూటొక్క వంకలు వెతుక్కునే మనస్తత్వం చూసి చూసి విసిగిపోయా ...
ఇప్పుడు మాత్రం ..పిల్లలు లేనప్పుడు ... మాట్లాడకుండా తెచ్చినప్పుడే కాఫీ తాగుదాంలే అని నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం నేర్చుకున్నా ...
తెచ్చే ముందు ...ఆయనగారు వేసే డాన్సులు, చెప్పే వంకలు చూసి కూడా మౌనంగానే ఉంటా ...
తెస్తే కాఫీ తాగుతా.. లేకపోతే ఎన్నాళ్లయినా కాఫీ లేదు ఏం లేదు ...అంతే ..
---------------------
ఆడవాళ్లంటే ... వీరనారిలా ...ఆ పని చేయాలి ...ఈ పని చేయాలి ...అది సాధించాలి ...ఇది సాధించాలి ... ఆ చేతిలో సుత్తి...ఈ చేతిలో కత్తి ...చేతులు సరిపోకపోతే మరో పది చేతులు సృష్టించి మరీ ...చేతికో పలుగూ పారా ఇచ్చి ... బయట పనులు ....ఇంట్లో పనులు ...అని ఏ మాత్రం తేడా లేకుండా నెత్తి మీద వేసుకుని చేయడం మాత్రమే కాదు ....
కొన్ని పనులు చేయకుండా ఉండడం నేర్చుకోవాలి ...
ఇంట్లో బాధ్యతలు అనేవి అందరూ సమిష్టిగా పంచుకోవాలి అని కుటుంబ సభ్యులకు తెలియజేయాలి ...మనకు నచ్చనప్పుడు ....చేయలేనప్పుడు ....చేయడం ఇష్టం లేనప్పుడు ...ఆ పని నేను చేయలేను , చేయను అని స్పష్టంగా చెప్పగలగాలి ...
ఒత్తిడికి గురవుతూ కూడా ఎవరికీ చెప్పలేక ...తలకు మించిన బాధ్యతలతో సతమతమవ్వకుండా ...కొంత ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి ...
పనులు నేర్చుకోవడం ...అసాధ్యం అయినవి సాధించడం మాత్రమే కాదు ...
పనులు చేయకుండా ఉండడం ...విశ్రాంతి తీసుకోవడం ... పనుల భారాన్ని పంచడం ఎలాగో కూడా తెలుసుకోవాలని .. నా ప్రయత్నం ...!
Happy women's day!