Sunday, October 10, 2021

చిన్నతనంలో స్కూల్ కి వెళ్లే వయసులో ...

 చిన్నతనంలో స్కూల్ కి వెళ్లే వయసులో ... గోరింటాకు మొక్క ఒకటి మా గడ్డి వాము దగ్గర వేశా ...

అప్పట్లో విత్తనాలు వేయడం తక్కువ ....అందరూ కొమ్మలు నాటేవారు ...
నేను వేసిన కొమ్మ బాగా బతికింది ...దానికి కంచె అడ్డుగా వేసి ఉంచేవాళ్ళం ...మేకలు లోపలికి పోకుండా ...
రోజూ స్కూల్ నుండి రాగానే ఒకసారి వెళ్లి ఆ మొక్క చూసుకుని వచ్చేదాన్ని ...ఎంత సంతోషం వేసేదో...మా ఇంట్లో కూడా గోరింటాకు మొక్క ఉందని ...
ఒకరోజు అలవాటుగా స్కూల్ నుండి రాగానే ...మొక్క చూసుకుందాం అని వెళ్తే ...మొక్క పీకి ఉంది దాని మొదట్లోనే పెట్టి ...
దానికి ఉన్న కొమ్మలు కూడా ఎవరో విరిచేసారు ...విరిచేసిన కొమ్మలు మాత్రం కనిపించలేదు ...
అక్కడేమైనా సిసి కెమెరాలు ఉంటాయా ఎవరు చేసారో కనిపెట్టడానికి ...
మేకలు పడ్డాయా అంటే ...అవి మొక్కలు పీకలేవు ...మహా అయితే ఆకులు తినగలవు అంతే ...
ఒక రెండు మూడు రోజులు తరువాత అనుకుంటా ...
మా నాయనమ్మ.. మా బాబాయి వాళ్ళ కొష్టంలో ఏదో తేవడానికి వెళ్ళినప్పుడు ....(అక్కడ ఎడ్లబండి పైన దూలానికి కట్టేసి ఉండేది ...)ఆ కట్టేసిన బండి మీద చివర్లో కనిపించాయి మా నాయనమ్మకు గోరింటాకు కొమ్మలు ...
నేనేమో బాగా ఏడ్చాను ...మా నాయనమ్మ వాళ్ళ కుళ్ళుమోతు తనాన్ని తిట్టి పోసింది ...
అదే కాదు ....కనకాంబరం మొక్కలు ...ఇతర పూల మొక్కలు ఏవీ బతికేవి కావు ....స్కూల్ కి వెళ్లకుండా నేను కాపలా ఉండడం కుదరదు కాబట్టి ...మా అమ్మ మొక్కలు లేవు ఏం లేవు ....ఈ తగాదాలు మేం పడలేం ....అని వేయొద్దు అని చెప్పేది ....
ఆ తర్వాత కాలంలో ...ఇక గోరింటాకు మొక్క వేసే అవకాశం నాకు కలగలేదు ....
నా పెళ్లయ్యాక కొన్నాళ్ళకి మా అమ్మ ఒక మొక్క ఇంటి ముందే వేసింది ....
పిల్లలు నేను సెలవుల్లో వెళ్ళినప్పుడు ....గోరింటాకు రుబ్బి పిల్లలకు పెట్టేదాన్ని ...
అమెరికా వచ్చాక ....మా అమ్మ దగ్గరనుండి తెచ్చిన గోరింటాకు విత్తనాలు వేద్దాం అని చాలా సార్లు ప్రయత్నించా ....ఈ చలి వాతావరణంలో సాధ్యం కాదని వాటి గురించి మర్చిపోయా ....
గత సంవత్సరం నుండి ...ఈ కాలిఫోర్నియా వాతావరణంలో ...మళ్ళీ మొదలు పెట్టి ...కుండీలో చాలాసార్లు విత్తనాలు వేశా ....కానీ మొలకెత్తలేదు ....
మళ్ళీ ఓ నెల క్రితం వేశా ...లక్కీగా కొన్ని మొక్కలు వచ్చాయి ...కానీ అనుకున్నంతగా ఎదగడం లేదు ....
రోజూ దాన్ని ప్రాణంలా కాపాడుతున్నా....
అంతలో ....,,
ఈ రోజు గడ్డి శుభ్రం చేద్దాం అని గార్డెన్ లోకి వెళ్ళా ....గత కొన్ని రోజులుగా తీరిక దొరకక మావారిని అడిగా చాలాసార్లు ....కాస్త ఆ గడ్డి పీకొచ్చు కదా అని ....
అహ...నేను లేకుండా ....నేను మొదలు పెట్టకుండా ....అయన అటువైపు అడుగు పెట్టరు...ఏ పనైనా అఱంగుళం కూడా కదలదు ...
సరే నేనే చేసుకుందాం లే అని ఇవ్వాళ వెళ్తే .... అక్కడ గడ్డిలో మహాలక్ష్మిలా కనిపించింది ..ఈ గోరింటాకు మొక్క ....
ఎప్పుడో కుండీలో మట్టి అక్కడ విసిరేసి ఉంటాను ...అది మొలిచింది ...
లంకె బిందెలు దొరికినప్పుడు కళ్ళు ఎలా వెలిగిపోతాయో అలా వెలిగిపోయాయి ....గోరింటాకు మొక్క చూడగానే ....
వెంటనే ....చుట్టూ ఉన్న గడ్డి శుభ్రం చేసి ...దాని చుట్టూ కేజ్ పెట్టేసి ...మావారికి చెప్పా ...పొరపాటున కూడా ఇటువైపు రావద్దు ...గడ్డి అనుకుని పీకొద్దు అని ....
ఈయన బద్ధకం కూడా ఒకోసారి నాకు కలిసి వస్తుంది ....పరమానందయ్య శిష్యుల్లాగా ....
ఆయన నేను చెప్పిన వెంటనే గడ్డి పీకేసి ఉంటే ...ఈ మొక్క కూడా పీకేసి ఉండేవారు ....
థాంక్స్ చెప్పా ...మీరు పీకకపోవడం వలెనే ఆ మొక్క బతికింది అని ...🙏
అయినా ఆ మధ్య ఇక్కడ ఒక ఫ్రెండ్ తన దగ్గర మొక్క ఉంది ఇస్తాను అని అంది ...
నేనేమో మా అమ్మ ఇచ్చిన విత్తనం ఎలా అయినా బతికించాలని ....
ఇన్నేళ్లకి నా గోరింటాకు చెట్టు కల నెరవేరింది ....
చుట్టూ ఉన్న ఫిగ్ ట్రీ కొమ్మలు కొన్ని కట్ చేయాలి ....నా బంగారానికి ఎండ తగిలేలా ...
ఏంటో ...ఇవ్వాళ నా కాళ్ళు అటువైపు పోకుండా ఆగడం లేదు ...ఎన్ని సార్లు చూసుకున్నానో ...నా దిష్టే తగిలేలా ఉంది ...!😍🥰😘

No comments:

Post a Comment