Monday, June 28, 2021

మొన్న ​డ్రైవ్ లో దారిలో ..

మొన్న డ్రైవ్ లో దారిలో ...పక్కనే నర్సరీ లాగా కనిపిస్తే ...ఊరికే చూద్దాం అని ...అక్కడ కారాపి లోపలి వెళ్ళాం ...కానీ దగ్గరకు వెళ్లి చూస్తే అది నర్సరీలాగా కనిపించలేదు ...

తర్వాత అక్కడ కనిపించిన ఒక లేడీ తో మాట్లాడితే తను చెప్పింది ...అది కమ్యూనిటీ గార్డెన్ అని ....
అంటే కొంతమంది అపార్ట్మెంట్స్ వాళ్ళు కానీ.. ఇళ్ల సముదాయం ఉన్నవాళ్లు (గార్డెన్ కి తగినంత చోటు లేనివాళ్లు ) కానీ ...కొంత పొలంలో .. కొంత చోటు చిన్న చిన్న భాగాలుగా చేసుకుని ..లీజ్ కి తీసుకుని ఎవరి గార్డెన్ వాళ్ళు పెంచుకుంటారు ...
ఎవరిష్టం వచ్చిన మొక్కలు వాళ్ళు పెంచుకుంటారు ...
చిన్న చిన్న బెడ్స్ లా చేసి ...భలే పెంచుకుంటున్నారు మొక్కలు ...
నాతో మాట్లాడిన లేడీ ..Kale మొక్కలు పెంచుతుంది ...నాకు కొన్ని Kale ఆకులు కూడా ఇచ్చింది ...
అక్కడ అందరూ కలిసి నీళ్లు పెట్టుకోవచ్చు ...గార్డెన్ లో వర్క్ చేసుకోవడానికి Tools కూడా అందరికీ కలిపే ఉంటాయి ...
ఇక్కడున్న గొప్ప విషయం ఏమిటంటే ...పలు రకాల దేశాల వాళ్ళు ఒకే చోట వాళ్ళ వాళ్ళ దేశాలకు చెందిన రక రకాల మొక్కలను పెంచడం వలన ....అన్ని ఒకే చోట చూసే అవకాశం అద్భుతంగా ఉంది ...
చాలా అందంగా ఉంది కదా ...!😇😍















Monday, June 7, 2021

నాన్న ఉద్యోగ రీత్యా నెలకు కోన్ని రోజులు మాత్రమే ఇంటి దగ్గర ఉండేవారు ...

 నాన్న ఉద్యోగ రీత్యా నెలకు కోన్ని రోజులు మాత్రమే ఇంటి దగ్గర ఉండేవారు ...లేదా సెలవుల్లో పూర్తిగా ఇంటిదగ్గర ఉండేవారు ...

ఇంటిదగ్గర ఉన్నారంటే అది వేసవికాలం కాబట్టి కూరగాయలు , ఆకు కూరలు చాలా పరిమితంగా దొరికేవి ...
మా అమ్మ వంటలు చాలా బాగా చేస్తుంది ...
ఉన్నవాటిల్లోనే రోజూ రకరకాలు వండి పెట్టాలని ప్రయత్నం చేసేది ...
ఎన్ని కూరలయినా ఉండనీ.. పళ్లెంలో అన్నం పెట్టగానే మా నాన్న చూసేది తోటకూర పప్పు కోసం ...
పళ్లెంలో చికెన్ పెట్టనీ గాక ..."ఏంటే ...తోటకూర పప్పు వండలేదా ..."అని అడిగేవారు ...
భోజనానికి రమ్మనగానే ..."అమ్మ తోటకూర పప్పు చేసిందా " అని అడిగేవారు ..
"రోజూ తోటకూరే...తోటకూర... తోటకూర ...రేపు వండుతాలే గానీ ...ఇప్పటికిది తిను " అని విసుక్కునేది మా అమ్మ ...
కొన్నిసార్లు ..."నాన్నా ...అలమారలో రాత్రి పప్పు కొద్దిగా ఉంది నాన్నా ..." చెప్పేదాన్ని ....మా నాన్న ఇష్టం చూసి ...
అమ్మ నాన్నకు ...మిగిలినవి ...నిన్నటివి అసలు పెట్టేది కాదు ....
ఎప్పుడూ వేడి వేడి అన్నం కూరలు పెట్టాల్సిందే ...
"తీసుకుని రామ్మా ....నిన్నటిదయితే ఏం ....తోటకూర బంగారం ..." అనేవారు నాన్న ...
ఎందుకో తెలీదు ...తోటకూర పప్పు అంటే నాన్నకు అంత ఇష్టం ... మళ్ళీ పులుసు కూర చేసినా తినరు ...
తోటకూరపప్పు , కన్న తల్లి , గుంటూరు, పకోడి , చెక్కెరకేళి , ఉల్లిపాయ దోస ...ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లిస్టే ఉంది ...
ఇప్పటికీ నాన్నకి ఇష్టమైనవి ...తిన్నప్పుడల్లా "ఇది నాన్నకి ఇష్టం కదా " అని అనుకోకుండా ఉండలేను ...
ఒక్క నాన్నే కాదు ...ఎవరికి ఏది ఇష్టమో ...గుర్తు పెట్టుకుని ...చేసి పెట్టడమో ....తెచ్చి పెట్టడమో చేయడమే కదా ఇష్టం అంటే ...
తోటకూర మాకెప్పుడూ దొరకదు ...అది కూడా తెల్ల తోటకూర ...
ఇప్పుడు గార్డెన్ లో కాసిన్ని మొక్కలు వచ్చాయి ...చాలా రోజుల తర్వాత ....కాదు కాదు చాలా ఏళ్ళ తర్వాత ....నాన్నని గుర్తు చేసుకుంటూ తోటకూర పప్పు తింటున్నా ...!




Friday, May 7, 2021

నాకు May 3rd ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ అయింది ...

 నాకు May 3rd ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ అయింది ...ఫస్ట్ డోస్ కి ఎలాంటి symptoms లేవు అన్నారు నాకు తెలిసిన వారు కొందరు ...

నాకు మాత్రం రెండు రోజులు ఫీవర్, ఒళ్ళు నెప్పులు , శ్వాస సమస్యలు ఎదురయ్యాయి ...
మరి రెండో డోస్ కి ఎలా ఉంటుందో తెలియదు ...
వ్యాక్సినేషన్ తీసుకునేముందు చాలా ప్రశ్నలు వేశాను ...
నేను వేసిన తిక్క ప్రశ్నలన్నికి సమాధానం ఇచ్చాకే ...ఇంకేమీ అడగాల్సింది లేదు కదా అని నిర్ధారించుకుని నాకు వాక్సిన్ వేశారు ...
అందులో ముఖ్యంగా ..."వాక్సిన్ ఎంత శాతం పనిచేస్తుంది" అని అడిగా
"ఇప్పుడు ఇదంతా ప్రయోగాత్మకమే తప్ప ...ఏదీ ఖచ్చితంగా చెప్పలేం" అని చెప్పారు ....
"నేను వాక్సిన్ ని ఎంచుకోవచ్చా నాకు ఏది కావాలో ...." అడిగా ...
"మా దగ్గర ఇది ఒక్కటి మాత్రమే ఉంది .... " చెప్పారు ..
"జాన్సన్ అండ్ జాన్సన్ వాక్సిన్ కి కొన్ని సమస్యలు వచ్చాయి అని విన్నాను ....అది కొంతకాలం ఆపేసారు అని విన్నాను ....మీ కామెంట్ " అడిగా ....
"దానివలన కొందరికి సమస్యలు వచ్చిన మాట నిజమే ...కానీ తర్వాత విచారణలో తేలింది ఏమిటంటే ...వాళ్ళు , వాక్సిన్ తీసుకునే ముందు తప్పనిసరిగా జవాబివ్వాల్సిన కొన్ని ప్రశలకు తప్పు సమాధానం ఇచ్చారని ...దానివల్లనే సమస్యలు ఎదురయ్యాయని...అందుకే అడిగిన అన్ని ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం ఆశిస్తున్నాం" చెప్పారు ...
ప్రశ్నలు ...ఉదాహరణకు ....గత 14 రోజుల్లో ఇంకేదైనా వాక్సిన్ తీసుకున్నారా ..., కోవిడ్ ఉన్నవాళ్లను ప్రత్యక్షంగా గత 14 రోజుల్లో కలిశారా ...మీకు కోవిడ్ symptoms ఏమైనా ఉన్నాయా ....(జ్వరం, దగ్గు, శ్వాస సమస్యలు మొదలైనవి ), వాక్సిన్ కి ఎలర్జీలు లాంటివి ఇంతకు ముందు ఎప్పుడైనా కలిగాయా .., ఏదైనా మెడికేషన్ తీసుకుంటున్నారా , దీర్ఘకాల సమస్యలు ఉన్నాయా , వాటికి ఏదైనా మందులు వాడుతున్నారా ...ఇలాంటివి ....
"ఎందుకో నాకు కాస్త భయంగా ఉంది ....ఇది సేఫ్ గా ఉంటుందా ...లేదా అని" అడిగా ...
"నేను కూడా రెండు డోస్ లూ వేసుకున్నాను ...చాలా శాతం వాక్సిన్స్ వేస్తున్నాం ...ఇప్పటివరకూ అంతా బాగానే ఉంది ..." చెప్పారు ...
ఇలాంటి కొన్ని ప్రశ్నలు ....సమాధానాలు అయ్యాక ...నేను రెడీ అన్నప్పుడు వాక్సిన్ వేశారు ....
వేశాక ...ఓ పదిహేను నిమిషాలు అక్కడే కూర్చోమన్నారు ...ఆ తర్వాత వెళ్లొచ్చు అని చెప్పారు ....
ఓ ఐదు రోజులు వరసగా కోవిడ్ symptoms రావడం మాములే అని ...అప్పుడు కూడా తగ్గకపోతే ....అరవరోజు ...హాస్పిటల్ కి కాల్ చేయమని చెప్పారు ....
అలా ఫస్ట్ డోస్ కంప్లీట్ అయింది ....
మా అమ్మ అడిగింది ...వాక్సిన్ వేసుకున్నావా అని ....
తీసుకున్నాను, అని చెప్పాలంటే చాలా గిల్టీగా అనిపించింది ....
మా అమ్మకు వాక్సిన్ అందుబాటులో లేదు ....ఎప్పుడొస్తుందో తెలియదు ...అప్పుడే నేను తీసుకున్నాను ....అని ...
ఎందుకంటే నా పిల్లలు ...నన్ను కూడా తీసుకోమని ఎన్నోసార్లు అడిగారు ఇప్పటికే ...
నేను తీసుకుంటేనే వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు ...
మాకు ఏప్రిల్ 15 తర్వాతే ....వాక్సిన్ అందరికీ అందుబాటులోకి వచ్చింది ...!
ప్రపంచం లో అందరికీ వాక్సిన్ అందుబాటులోకి రావాలని ....అందులో మా అమ్మ కూడా ఉండాలని నా ప్రార్ధన !!🙏

Friday, April 16, 2021

స్త్రీలు ఉత్తమ ఇల్లాలు కావాలి ...

 ఇతరుల భార్యల్లో ఉన్న సుగుణాలు అన్ని నాలో ఉండాలి ...

ఏ ఒక్కటి లేకపోయినా మా వారు చాలా నిరాశకు లోనవుతారు ...
ఆ సుగుణాలను నేను అలవరచుకునే వరకు ...పదే పదే ...వాటిని ...తారక మంత్రంలా జపిస్తూనే ఉంటారు ...
కానీ ...,
అదే సమయంలో నేను ఇతరుల భర్తల్లో ఉన్న సుగుణాలు... పొరపాటున ఒక్కటి ప్రస్తావించినా.... విపరీతమైన అసహనానికి లోనవుతారు ...
అవి వాళ్ళు చేయడం లేదు...ఆ సుగుణాలు వాళ్ళకి లేవు ....ఉన్నా అవి అసలు సుగుణాలు కానే కాదు అని ...నన్ను నమ్మించడానికి శతవిధాలా ప్రయత్నిస్తారు ....
ఒకవేళ చేసినా అదేమంత గొప్ప పని కాదంటారు ....
అవి వాళ్ళు అలవరచుకోవడానికి వాళ్లకు చిన్నప్పటి పరిస్థితులు ఎలా సహకరించాయి అని మూలాల్లోకి వెళ్తారు....
ఇంకాస్త ముందుకెళ్లి ...వాళ్ళ భార్యలు వాళ్ళకి ఎంతగానో సపోర్ట్ చేయడం వలన ...వాళ్ళకి అమితమైన ప్రేమని పంచడం వలన ...వాళ్ళు అవి చేయగలుగుతున్నారు అంటారు ....
నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా ...ఇంత బిజీగా ఉన్నా అంత బిజీగా ఉన్నా అది సాధించా ...ఇది సాధించా ...అంటారు ...
చివరకు, అవన్నీ చేయడానికి నాకు టైం లేదు అంటారు ...
ఇవన్నీ ఎందుకు స్వామీ ...
సింపుల్ గా ...ఒక్కటి చెప్పొచ్చుగా ...
స్త్రీలు ఉత్తమ ఇల్లాలు కావాలి ...
భర్తల గురించి ఏం మాట్లాడకూడదు ....అంతేగా...!?

ఇది నాకు నచ్చిన సినిమా ...ముగింపుతో సహా ...!

 చాలా రోజులకు The Great Indian Kitchen సినిమా చూసే అవకాశం కలిగింది ....

అసలు ...ఇండియన్ కిచెన్ గ్రేట్ అని, ఎందుకు పేరు పెట్టాడో నాకు అర్ధం కాలేదు ...
నాకు తెలిసి వ్యంగ్యంగా ఈ పేరు పెట్టి ఉండొచ్చు ...
నిజానికి మన కిచెన్ ఒక KGF లాంటిది ..అంటే GIK (Great Indian Kitchen) అన్నమాట ....
అందులోకి వెళ్లడమే కానీ బయటపడడం ఉండదు ...
KGF లో ముసలివాళ్ళయిపోయి ...పని చేయలేనప్పుడు చంపేస్తారు ...
మన GIK లో నుండి ...మరణం ఒక్కటే స్త్రీని బయట పడేస్తుంది ...
వంట చేయలేను ...గెస్ట్ లు వస్తే పని ఎక్కువైంది ...పార్టీలు ఇవ్వడం కుదరదు ...ఇవ్వాళ ఆదివారం ...వంట్లో బాగాలేదు ...
ఇలాంటివి GIK లో వినిపించకూడదు ...
ఇది కదా GIK అంటే...
-----------------------
నిజానికి ఈ సినిమా గురించి ఆత్మీయుల విశ్లేషణలు చూశాక...ఎప్పటినుండో చూడాలని ఎదురు చూస్తున్న సినిమా ఇది ...
ఇలాంటి సినిమా తీసినందుకు ...మలయాళీ సినిమా పరిశ్రమకు ముందుగా కృతఙ్ఞతలు చెప్పాలి ....
సినిమా మొదటినుండి ....చివరి సీన్ వరకు ...ఎక్కడా కళ్ళార్పకుండా చూస్తూ ఉండిపోయా ....
సినిమా అయిపోయాక కూడా సినిమాలోనుండి బయటకు రాలేకపోయా ...
ఎందుకో ఒక్క క్షణం అనిపించింది ....ఆ సినిమాలో ఆ హీరోయిన్ చాలా మంచి పని చేసింది ...అలా ప్రతి స్త్రీ చేయగలిగితే ఎంత బాగుండు అని ...
ప్రతి స్త్రీ కాకపోయినా నాలాంటి కొందరైనా చేయగలిగితే ఎంత బాగుండు అనుకున్నా ....
అలా అనుకోగానే ఎందుకో జీవితం మీద చాలా ఆశ కలిగింది ....
ఈ ఊహ చాలా బాగుంది అనిపించింది ....
సినిమాలో హీరోయిన్ ని ఎక్కడా ఏడిపించడు డైరెక్టర్ ....
కానీ నాకెందుకో బొట బొటా కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి ..ఆగలేదు ....
భార్య భర్తలు ఇద్దరు కలిసి హోటల్ కి వెళ్ళినప్పుడు ...ట్రాష్ అంతా.. తిని టేబుల్ మీద పడేయకుండా ...ఒక ప్లేట్ లో పెట్టినప్పుడు ....టేబుల్ మానర్స్ ఇంట్లో లేదా బయట మాత్రమేనా అని అడుగుతుంది హీరోయిన్ ...
ఇంటికొచ్చాక ..అది తప్పు అని క్షమాపణ చెప్పమంటాడు భర్త ...
అప్పుడు ఆ అమ్మాయి ...కళ్ళల్లో సుడులు తిరుగుతున్న కన్నీళ్లు ఆపుకుని క్షమాపణ చెబుతుంది ...
స్త్రీ మనసులో పురుషుడి స్థానాన్ని దిగజార్చిన క్షణమది ...పురుషుడిగా ప్రతి పురుషుడు మరణించే సన్నివేశమది ...
ఏదో ఒక సీన్ ఉదాహరణగా చెప్పానే కానీ ...ఇందులో ప్రతి సీన్ కి ఒక జీవిత కథ చెప్పొచ్చు ....
ప్రతి జీవిత కథ పురుషుడు సిగ్గుతో చచ్చిపోయేది కావచ్చు ...
ఇందులోని సంభాషణలు కూడా ఒక రకంగా పురుష జాతిని నిగ్గదీసి అడిగే సంభాషణలే ...
దర్శకుడు ఎక్కడా సామజిక సంకోచం లేకుండా సంభాషణల్ని మలిచాడు ...
ఒక భార్య ...భర్తని ...సెక్స్ కి ముందు ఫోర్ ప్లే కావాలని ...అడగడం అంటే ... స్త్రీ సమాజంలో (అది కూడా భారతీయ సమాజంలో )ఒక అడుగు ముందుకు వేయడం అనే చెప్పాలి ...
ఇలాంటి సున్నితమైన అంశాలు సమాజంలో ఎంతమందికి అర్ధం అవుతాయి ...
ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు మాట్లాడితే కానీ ఇలాంటివి అర్ధం కావు ...
ఏమో ...ఒకవేళ అర్ధం అయినా ... అహం అడ్డొచ్చే అల్ప ప్రాణులు ఎన్నో మన సమాజంలో ...
---------------------
సమాజంలో మార్పు కు ...అర్ధవంతమైన ఆలోచనలకు...ఇలాంటి సినిమాలు పునాది రాళ్లు వేయాలి ..
స్త్రీ శరీరంలో నెల నెలా వచ్చే ప్రకృతి సహజమైన మార్పులకు మూర్ఖత్వపు సంకెళ్లు వేయడం ఆపాలి ...
స్త్రీ కి ఇష్టాలు ఉంటాయని ...అభిప్రాయాలు ఉంటాయని ...మనసు ఉంటుందని ...ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకోవాలి ....ముఖ్యంగా స్త్రీ అర్ధం చేసుకోవాలి ...!
చివరిగా ....ఇది నాకు నచ్చిన సినిమా ...ముగింపుతో సహా ...!

Sunday, February 28, 2021

క్వారంటైన్ హాలిడేస్ అలా గడిచాయన్నమాట ...!








 మా నాయనమ్మ చెప్పేది ...

"ఉప్పూ ...కారం ...వేసి ..తాలింపు వేస్తే ...గడ్డి కూడా కూరే ...రుచిగానే ఉంటుంది అని ..."
అదే సూత్రం నేనెప్పుడూ ఫాలో అవుతూ ఉంటా ...కిచెన్ రూమ్ లో ....
అంటే ...గడ్డి కూర చేస్తానని కాదు ....
కానీ ...నేను చేసే రెసిపీ నాకే గుర్తుండదు ఒక్కోసారి ...
ఏది అందుబాటులో ఉంటే అదే పడేస్తూ ఉంటా ...ఇదే రెసిపీ ఉండాలి దీనికి ....ఇలాగే చేయాలి అని ఫిక్స్ అవను...
అందుబాటులో ఉన్నవాటిలో ...ఆ కూరలో ఏం వేయగలిగితే అది వేసి చేసేస్తా ..
ఇప్పటివరకూ అందరూ ఏం వంకలు పెట్టకుండా బాగానే తినడం వలన ....నేనూ ఆ పద్ధతి తప్పు అని ఎప్పుడూ అనుకోలేదు ...
నేను వంట మొదలుపెట్టాక వెతుక్కుంటా ఏమున్నాయో ఏం లేవో .... పిల్లలు అలా కాదు ...అందులోకి కావాల్సిన పదార్ధాలన్నీ తెచ్చుకుని ...వంట చేయడం మొదలు పెడతారు ...
నేను ఉజ్జాయింపుగా ఉప్పు కారం వేసేస్తా ....ఉప్పు కారం రుచి చూసే అలవాటు కూడా లేదు ...అదే సరిపోతుందిలే అనుకుంటా ....
పిల్లలు అన్ని కొలతల ప్రకారం వేసుకుని ....వీడియోలో ఆలా చెప్పారు ...ఇలా చెప్పారు అంటారు ...
నేను ఏ విధమైన డెకరేషన్ లు చేయను ...వాళ్ళు ఆకర్షణీయంగా ఉండేలా అలంకరణ చేస్తూ ఉంటారు ...
ఇలా ..నాదొక స్టైల్ వాళ్ళదొక స్టైల్ అన్నట్టు వంటలో ...
మా అయన మా అందరికంటే డిఫరెంట్ స్టైల్ లో చేస్తారు ...అది వేరే టాపిక్ అనుకోండి ....
అయితే ఇదిలా ఉంచితే ....లాస్ట్ ఇయర్ ....క్వారంటైన్ మొదలైన కొత్తలో ...నా డాటర్ హాలిడేస్ కి ఇంటికి వచ్చింది ....
వచ్చింది మొదలు ...పాపం ఎక్కడికీ వెళ్లే వీలే లేదు ....మాస్క్ పెట్టుకుని వెళ్ళమన్నా కూడా తనకు మా మీద ఉన్న కన్సర్న్ వలన ... మాకెక్కడ కరోనా వస్తుందో అని భయపడి ...ఇంట్లోనే ఉండిపోయింది ...
అయితే ...
ఇంట్లో ఉండడం వలన ....ఇంట్లో చేసుకునే ఆర్ట్ వర్క్ చేసుకోవడం, కుకింగ్ ...రీడింగ్ ...ఇలాంటివేవో చేసుకునేది ...
ఆర్ట్ వర్క్ అంటే ...ఒకసారి బయటికి వెళ్లి కావాల్సిన వస్తువులన్నీ తెచ్చుకోవచ్చు ...కానీ వంట అలా కాదు .... ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా తెచ్చుకోవాలి ....
పైగా పిల్లలు చేసే డిషెష్ డిఫరెంట్ ....అందులో ఏ సాస్ ...కెచప్ లాంటివి తక్కువైనా రుచిగా ఉండవు (అని వాళ్ళ ఫీలింగ్ )
అందులోనూ నా డాటర్ కి ...త్రీ మినిట్స్ రూల్ ఒకటి ఉంది ....మూడు నిమిషాల్లో తనకు కావాల్సిన వస్తువు కిచెన్ లో కనిపించకపోతే ....వెంటనే షాప్ కి వెళ్లి కొనాల్సిందే ....
అయితే ....ఈ రూల్ క్వారంటైన్ లో వర్కౌట్ కాదు అని నాకు అర్ధమైంది ....
అందుకే ...మా నయనమ్మలాగా ....నేను కూడా తన మైండ్ ని కాస్త ట్యూన్ చేశా ...
"నీకు కావాల్సినవి తెచ్చుకుని ...అన్ని ఉంటే రుచికరమైన వంట చేయడం క్రియేటివిటీ కాదు ....నీకు ఇంట్లో ఉన్నవి ..అందుబాటులో ఉన్నవి వాడుకుని ...రుచికరమైన వంట చేయడం క్రియేటివిటీ ...అలా చేయడానికి ప్రయత్నించు ....రోజూ ఇలా షాప్స్ కి వెళ్లడం ఈ టైం లో సేఫ్ కాదు" అని చెప్పా ....
ఇంకా కాస్త మసాలా జోడించి ...."నువ్వు ఎక్కడైనా అడవుల్లో చిక్కుకుని పోయి ...అక్కడ దొరికే ఆకుల్లాంటివే తినాల్సి వస్తే ..."అప్పుడెలా ఆలోచిస్తావు ... అని కూడా అడిగా ...
పిల్లలు చాలా షార్ప్ ...నేను చెప్పినదాని గురించి ఆలోచించడమే కాదు ...ఆచరణలో కూడా పెట్టింది ...
ఫలితం ...
ఎన్నో రుచికరమైన డిషెస్ చేసి వాటిని డెకరేట్ చేసి మరీ నాకు అందించేది ....
ఒక స్పూన్ తినేవరకు వెయిట్ చేసి ...మెరిసే కళ్ళతో ...నేను మెచ్చుకుంటే ...ఎంతో సంతోషపడిపోయేది ...
"థాంక్స్ మమ్మి ....నువ్వలా చెప్పడం వలన నా స్వంత రెసిపీస్ నేను క్రియేట్ చేసుకోగలిగా ...ఇప్పుడు ఇంకా తృప్తిగా ఉంది ....ఒక డిష్ చేసినప్పుడు ...ఒక ఆర్ట్ క్రియేట్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది ..." అని హాలిడేస్ లాస్ట్ లో చెప్పింది ...
నాకూ హాపీ గా అనిపించింది ....
నిజమే వంట చేయడం అనేది ఒక ఆర్ట్ ...అదీ మన స్వంతంగా తయారు చేస్తే ఇంకా ఆ సంతృప్తే వేరు ...
అదిగో ఆ క్వారంటైన్ హాలిడేస్ అలా గడిచాయన్నమాట ...!
గమనిక : ఈ పిక్స్ లో ఉన్న డిషెస్ / ఆర్ట్ వర్క్ ..అన్ని నా కూతురు తయారు చేసినవే ...అన్ని నాకు ఫెవరెట్ డిషెస్ ...












నాకు అర్ధమైంది ...రాముడికి సీత లా ఉండడం ఎంత కష్టమో ...

 నాకు తెలిసిన ...రాముడు , సీత అనే భార్య భర్తలున్నారు ...

అంటే ...ఆ రాముడు సీత కాదు ...వీళ్ళ పేర్లు యాదృచ్చికంగా రాముడు సీత అయ్యాయి అన్నమాట ...
ఆఫ్కోర్స్ ...ఆ పేర్లలో ఉన్న మహాత్మ్యం కానివ్వండి ...లేదా వీళ్ళు ఆ పేర్లు పెట్టుకోవడం వలన వాళ్ళ గుణాల్ని పుణికిపుచ్చుకోవడం కానివ్వండి ....వాళ్ళు నిజంగానే గుణగణాల్లో రాముడు సీతలా ఉండేవారుట ...
కానీ ఆయన రాముడిలా ఉండడం వలన ఈవిడ సీతలా ఉండడం వలన సంసారం అనే బండి సాఫీగా సాగలేదు ...
"ఆయన రాముడిలాగే ఉండడం వలన నేను శూర్పణఖలా మారాల్సి వచ్చింది" ఒక సందర్భంలో తను నాతో ...
నాకు అర్ధమైంది ...
ఎందుకు తను సీతలా ఎందుకు ఉండలేకపోయిందో ....
నాకు అర్ధమైంది ...శూర్పణఖలా మారడానికి తను ఎంత బాధ పడిందో ...
నాకు అర్ధమైంది ...రాముడికి సీత లా ఉండడం ఎంత కష్టమో ...
నాకు అర్ధమైంది ...
ఎంత మంది సీతల త్యాగఫలమో ఈ రాముళ్లు అని .... !🙏