Monday, June 12, 2017

ఇప్పడు కొన్ని బంధాలు కూడా చనిపోయిన లేగ దూడలే ....


హెచ్చరిక: రెండు లైన్ల కంటే ఎక్కువ చదవలేని వారు ....ఈ ఆర్టికల్ ను చదివే సాహసోపేతమైన చర్యకు పాల్పడవద్దని హెచ్చరిక ....(మిత్రులకు ఈ హెచ్చరిక వర్తించదు .... :P )
=================================
మా నాయనమ్మ నాకు ఓ సామాజిక శాస్త్రం ...నేను సామాజిక శాస్త్రం చదివినప్పుడు ...అస్సలు టెక్స్ట్ బుక్స్ చదివే అవసరం లేకుండా పరీక్షలు వ్రాయగలిగాను అంటే అంతకు ముందే మా నాయనమ్మను క్షుణ్ణంగా చదవడం వలన అని ఖచ్చితంగా చెప్పగలను ....
అయితే చిన్నతనంలో 'మా నాయనమ్మకు - నాకు' ఉన్న అనుబంధం అంతా ఒక ఎత్తయితే ....'మా నాయనమ్మకు - తను పెంచే గేదె' కు ఉన్న అనుబంధం ఒక ఎత్తు ....నాకు వీళ్లిద్దరితో ఉన్న అనుబంధం మరొక ఎత్తు ....
ఆ గేదెకు సరిపోయినన్ని నీళ్ళు తెచ్చిపోయడం ....
కుడితి కలపడం ...
మా నాయనమ్మ వేకువఝామునే గడ్డి కోయడానికి వెళ్తే ...
కాస్త పొద్దెక్కాక నేను కూడా వెళ్లి మోయగలిగినంత గడ్డి నెత్తిన పెట్టుకుని తేవడం ....
మోయలేక మెడ నొప్పి పుట్టేస్తే ...మధ్యలో ఎవరైనా గడ్డి మూట ఎత్తగలిగే వాళ్ళు ఎదురుగా వస్తుంటే ....మూట కింద పడేసి ....కాసేపు కూర్చుని...వాళ్ళు దగ్గరకొచ్చాక ...మూట మళ్లీ నెత్తి మీదకు ఎత్తించుకోవడం....
ఒకవేళ గడ్డి దొరికే సీజన్ కాకపోతే ....ఎండు గడ్డి వాము దగ్గరకు వెళ్లి .....కాస్త ఎండు గడ్డి తెచ్చి గేదెకు వేయడం ....
సెలవు రోజుల్లో ఎప్పుడైనా సరదాగా గేదెల దగ్గరకు పిల్లలతో కలిసి వెళ్ళడం ....
కొష్టం దగ్గరనుండి తాడు విప్పుకుని ఇంటికి తెచ్చి నీళ్ళు తాగే వరకు ఆగి, తాగాక మళ్లీ కొష్టం దగ్గర కట్టేయడం ,
పేడ శుభ్రం చేయడం ....
బకెట్లు బకెట్లు నీళ్ళు తెచ్చి దానికి ఒళ్ళు కడగడం ....
అది శుభ్రంగా ఉంటే సంతృప్తి చెందడం ,
కడుపునిండా తిని దాని డొక్కలు నిండితే ఆనంద పడడం....మొదలైనవన్ని....మా నాయనమ్మతో నేను పంచుకునే చిన్న చిన్న బాధ్యతలు …..ఆనందాలు (చెప్పినప్పుడు ....మాట వినకపోతే వీపు పగిలే బాధ్యతలు కూడా …)
-----------------------------------
అయితే ఇది కాకుండా మరో బాధ్యత కూడా ఉండేది ...గేదె ఈనేటప్పుడు....(అంటే ప్రసవించడం ) దాని దగ్గరే ఉండి మా నాయనమ్మకు సహాయం చేయడం ....
కానీ ...ఏ మాటకామాటే చెప్పాలి ....మా నాయనమ్మ ...పరమ గయ్యాళి గా కనిపిస్తుంది కానీ ....ఆ గేదె మీద చూపించే ప్రేమ గమనిస్తే.... ఎంత మానవత్వం ఉందా మా నాయనమ్మకు ..అని ఆశ్చర్యం వేస్తుంది ....
స్త్రీలు ప్రసవించేటప్పుడు కూడా ఎవరూ అన్ని సేవలు చేయలేరేమో అనిపిస్తుంది ....
"ఎందుకే నీకు దానిమీద అంత ప్రేమ" అంటే ....
"నోరు లేని గొడ్డు ...దాని బాధ ఆ దేవుడికి కూడా తెలియదు" అంటుంది ....
భగవంతుడే తెలుసుకోలేని బాధను తను గుర్తించింది అంటే .... ఆ క్షణంలో ఆ గేదెకు / నాకు మా నాయనమ్మ భగవంతుడి కన్నా ఎక్కువే అనిపించేది ........
గేదె నొప్పులు పడుతుంటే ఆముదం వేసి దాని వీపు మీద సవర తీస్తుంది ....దాని తల నిమురుతుంది ..దానికి తిండి , నీళ్ళు సహించక నెప్పులు పడుతుంటే ...జొన్న అన్నం వండి పెడుతుంది ....అయినా అది తినదు ….(బిడ్డను భూమి మీదకు తీసుకుని రావడం మీదే దాని ప్రాణాలన్ని పెడితే ఇక తిండి ఎలా సహిస్తుంది ….)
పాపం అంటుంది ...అది పడుకుంటుంది ,లేస్తుంది ....లేచేటప్పుడు లేవలేక లేవలేక లేస్తుంది ....
నొప్పులు భరించలేక అరుస్తుంది ....అది అరచినప్పుడల్లా మా నాయనమ్మ కలవరపడుతుంది ……
నేను దగ్గరుండి చూస్తూ ఉంటా ...ఏదైనా ఇంటి దగ్గర నుండి తేవాలంటే నేను అందుబాటులో ఉండాలి తనకు …..అందుకే నేను అక్కడే ఉంటా ....మా నాయనమ్మ గేదెను వదిలి ఎక్కడికీ వెళ్ళదు ఆ సమయంలో .....
కొన్ని గంటలు... సృష్టి ధర్మాన్ని అనుసరించి ... సృష్టిలో కష్టపడే ప్రతి తల్లి లాగే ....కష్టపడిన తర్వాత ....ముందుగా ఉమ్మనీరు బయటకు వచ్చేది ....కాసేపట్లో నేను కూడా వస్తున్నా అని బిడ్డ ప్రేమగా ఇచ్చే సందేశంలా .....
అన్న మాట నిలబెట్టుకోవడానికి అన్నట్టు ...కాసేపటికి ....దూడ కాళ్ళు కొద్దిగా బయటకు వస్తాయి .....నిజంగా అప్పుడు నాకు ఎవరు ఎక్కువ కష్టపడుతున్నారో అర్ధం కాదు ....ఒక వైపు గేదె అరుస్తూ ఉంటుంది (నొప్పులతో ..)….ఒక వైపు మా నాయనమ్మ దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది (దానికేమవుతుందో అనే కంగారుతో …)….ఆ సమయంలో నేను ....అడిగింది చేయడం ఆలస్యం అయిందో ....నా వీపు పగులుతుంది ....అందుకే నేను చాలా అలర్ట్ గా ....ఏం అడుగుతుందో అన్నట్టు ,చెవులు రిక్కించి వింటూ , కళ్లార్పకుండా చూస్తూ ఉండేదాన్ని ...
ఇంకా కాసేపట్లో సృష్టి తల్లికి నియమించిన కష్టాలు అయిపోతాయనగా ......రెండు ముందరి కాళ్ళతో పాటు ....తల కూడా కాస్త బయటకు వచ్చేది .......అప్పుడు మా నాయనమ్మ …ఎన్నో వందల డెలివరీలు చేసిన ఒక గైనకాలజిస్ట్ లాగా ….ఏ మాత్రం కంగారు లేకుండా ....ఏం పర్వాలేదు ....ఇంకాస్త కష్టపడు ....నేనూ నీకు సాయం చేస్తున్నా …అని మాటలతోనే తల్లికి భరోసా ఇస్తూ దూడను పట్టుకుని బయటకు లాగేది....అది మిగిలిన ఉమ్మనీరు తో సహా బయటకు వచ్చేది .....
(మనుషులు కంటే కొన్ని విషయాల్లో నాకు గేదెలే నయం అనిపిస్తుంది ....గేదెలకు ఆడ దూడ పుడితే సంతోషపడతారు ....అదే మనుషులకు ఆడపిల్ల పుడితే ఏడుస్తారు ....అప్పట్లో అర్ధం కాకపోయినా ....తర్వాత కొన్నాళ్ళకి అర్ధం అయింది .....ఏదైనా భవిష్యత్తు లాభ నష్టాలు దృష్టిలో పెట్టుకుని వ్యాపారంలా ఆలోచిస్తారు కొందరు అని ....కానీ గేదెకు ఈ తేడా తెలియదు ...తన బిడ్డ అంటే బిడ్డ అనే తెలుసు ....)
అక్కడే పరిచిన మెత్తటి చెత్త మీద ...గేదెకు అందుబాటులో ఉండేలా పడుకోబెట్టేది ....ఇంత సేపు అరచిన అరుపులు మర్చిపోయి ....గేదె దాని ఉమ్మనీరు అంతా ప్రశాంతంగా నాకుతూ ఉంటే ...మా నాయనమ్మ కాళ్ళ గిట్టలు గిల్లేది ....గిల్లి అవి అరచేతిలో పట్టుకుని గేదెకు తినిపించేది .....అది ప్రేమగా తినేది ....నిజం చెప్పొద్దూ నేనూ కాసిని గిల్లి గేదెకు తినిపించేదాన్ని ...తర్వాత ముక్కుల్లోకి, కళ్ళల్లోకి పోయిన ఉమ్మనీరు పిండాలి ....చాలా జాగ్రత్తగా ఆ పని కూడా చేసేది ....నేనూ చేశానని మీకు చెప్పకపోయినా అర్ధం అయింది కదా ....ఇదంతా మేం చేస్తుంటే గేదె దాని బిడ్డ మీద ప్రపంచంలో ఉన్న ప్రేమంతా ఒలకపోస్తూ నాకుతూనే ఉంటుంది ....బహుశా ఈ నాకడంలో దానికి బిడ్డకు మధ్య ఒక అనుబంధం ఏర్పరచుకుంటుందేమో అని నా ప్రగాఢ అభిప్రాయం .....
---------------------------------
ఓ రెండు మూడు రోజుల వరకు దూడ నడవలేదు ....మొదటి రోజు పొదుగు దగ్గరకు తీసుకుని వెళ్లి మొదటి సారి వచ్చిన పాలు తప్పనిసరిగా దానికే పట్టించాలి .....అవి ముర్రు పాలు అంటారు ....
ఆ రోజు పాలు కాసినే ఇస్తుంది .....రెండో రోజు నుండి బాగా ఇస్తుంది ...అయితే లేగ దూడకు నడవడం రాదు కాబట్టి ....ఉదయం ,సాయంత్రం రెండు పూటలా ....దాన్ని తప్పటడుగులు వేయిస్తూ తల్లి దగ్గరకు తీసుకుని వెళ్లి పాలు తాగించాలి ....వచ్చిన పాలన్నీ దానికే పట్టించకూడదు ....ఎక్కువవుతాయి ....పాలు పిండడానికి ముందు ఒకసారి ,కాసిన్ని పిండాక చివర్లో ఒకసారి దానికి సరిపోయినన్ని మిగిల్చి పట్టించాలి ...మధ్యలో పిండిన పాలు జున్ను తయారు చేసేవారు ....మేం కూడా తినేవాళ్ళం .....
అయితే ...ఇక్కడ తల్లులందరికీ తెలిసిన విషయమే అయినా.... తెలియని కొందరికి చెప్పాల్సిన విషయం ఏమిటంటే ....ముందుగా లేగదూడకు పాలు పట్టిస్తేనే ....బిడ్డ పెదవుల స్పర్శ పొదుగుకు తగలడం వలన తల్లిలో కలిగే మాతృ స్పందనకే పాలు తయారవుతాయి ....లేదా పాలు రావు....
అలా కొద్ది రోజులకే ....నడక నేర్చుకోవడమే కాకుండా లేగదూడ పరుగులు కూడా నేర్చుకునేది ....పాలు కోసం వదిలినప్పుడు దాని పరుగులు చూడాలి ....దాన్ని పట్టుకోవడం నా వల్ల అయ్యేది కాదు ....
అది నిన్న కాక మొన్న నడకలు నేర్చుకుని నన్ను పడేసేది....అయినా ఎంత ముద్దుగా ఉండేదో ....మా నాయనమ్మను ,నన్ను తప్ప దాని బిడ్డను ఎవరు తాకినా తల్లికి చాలా కోపం వచ్చేది .....మేమిద్దరం దానికి నమ్మకస్తులం అన్నట్టు ....
అలా లేగ దూడ గంతులు , దానికి పాలు పట్టడం , నీళ్ళు తాగించడం , కాస్త గడ్డి చిన్న చిన్నది తెచ్చి నోటికి అందించడం ....అది తినేవరకు అక్కడే కూర్చోవడం ....వాళ్ళ అమ్మ పొలం మేతకు వెళ్ళినా ....ఇంటికి వచ్చేటప్పుడు ఒక్క పరుగున రావడం ....తృప్తిగా బిడ్డను చూసుకోవడం .....ఇలా కొన్నాళ్ళు ఆనందంగా గడిచిపోయేది ......
------------------------------
ఆ తర్వాత ....కొన్నాళ్ళకు...అరుదుగా ..కొన్నిసార్లు ....ఏదో కారణాల వలన ఆ దూడ బ్రతకలేక చనిపోయేది .....అప్పుడు ఏం చేయాలో అర్ధం కాదు ....తల్లి అరుస్తూ ఉంటుంది ....బిడ్డ కోసం ....పాలు ఇవ్వదు ....ఒక్కోసారి నిలవ ఉన్న పాలు గడ్డ కట్టి తల్లికే ప్రమాదం జరగొచ్చు.....ఎంత మభ్య పెట్టినా ఇచ్చేది కాదు ....పొదుగు దగ్గర కూర్చుంటే తన్నేది ....కట్టేసిన గాట చుట్టూ ఊపిరాడకుండా తిరిగేది ....మేత మెయ్యదు, నీళ్ళు తాగదు....ఒకటే అరుపులు .....
అదిగో అప్పుడు ఒక క్రూరమైన (నాకు అనిపించేది ) పని చేసేవాళ్ళు ....కొందరు లేక అందరూ అదే చేసేవారు .......
దాని బిడ్డలాంటి డమ్మీ బొమ్మని తయారు చేస్తారు ....చెత్తతోనో , పాత గుడ్డలతోనో తయారు చేస్తారు .....
కాస్త చీకటి పడిన తర్వాత ....చీకట్లో దాన్ని దూరంగా నిలబెట్టి ....ఇక్కడ దాని పొదుగుని అచ్చం దూడలాగే....ముందు కాసేపు సరి చేసి ....పాలు పిండడానికి ప్రయత్నించేవాళ్ళు ....
కాసేపు తర్వాత ....చీకట్లో ఉన్న తన బిడ్డ నిజమా కాదా అని చూసుకోవడానికే దానికి కాస్త సమయం పట్టేది ....ఆ సందేహంలో రాని తన బిడ్డ కోసం పాలు దాచి ఉంచాలనే సగంతి కాసేపు పక్కన పెట్టేది .....ఈ మభ్య పెట్టిన సమయంలో ఏదో కాసిని పాలు పిండేవాళ్ళు ...
ఆ తర్వాత కొన్నాళ్ళకు అరచీ అరచీ అది అలసి పోతుంది ....బిడ్డ విషయం నెమ్మదిగా మరచిపోవాలని తల్లి మనసు అలవాటు చేసుకుంటుంది...
కొన్ని రోజులకు చీకట్లో డమ్మీ బిడ్డను పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు ....
అవసరం ఉండకపోవడానికి కారణం.... బహుశా ....
ఏ నీడనో చూసి తన బిడ్డే అని నమ్మడం ఆ తల్లి మనసు నేర్చుకుని ఉండొచ్చు ....
ఆ నీడ మీదే తన తల్లి మనసులోని ప్రేమను మౌనంగా కురిపించడం అలవాటు చేసుకుని ఉండొచ్చు .....
కొన్నాళ్ళకు ఒక బిడ్డ తనకు ఉండేదనే విషయమే మర్చిపోయి ...మరో బిడ్డ కోసం తన తల్లి ప్రయాణం మొదలు పెడుతుంది ....
ఇది సృష్టిలోని ….కొంత సృష్టించబడిన తప్పనిసరి జీవన విధానం
------------------------------------------
అయితే ....
ఇప్పడు కొన్ని బంధాలు కూడా చనిపోయిన లేగ దూడలే ....
చీకట్లో నీడను చూసి .... నమ్ముతున్నాం ....
నమ్మాలి ....నమ్ముతూనే ఉండాలి ...
బిడ్డను మర్చిపోయి బ్రతికే తల్లిలా ....మరో బిడ్డ కోసం బ్రతకాలనుకునే తల్లిలా ....
బంధాలు మర్చిపోయిన మనిషిలా ....మరో బంధం కోసం బ్రతకాలనుకునే ఆశలా ….!

(Note: Wrote and published on June 12, 2016)