Tuesday, October 17, 2017

ఒక్క డాలర్ ఖర్చు పెట్టి మిలియన్ డాలర్ రావాలని కోరుకోవడం తప్పే ...


(హెచ్చరిక ....లాటరీ టికెట్ కొనడం వ్యసనం ..అనుసరించుటకు అనర్హం ....)


ఒక్క డాలర్ ఖర్చు పెట్టి మిలియన్ డాలర్ రావాలని కోరుకోవడం తప్పే ...
ఖచ్చితంగా వ్యసనం అయిన లాటరీ టికెట్ కొనడం కూడా తప్పే .....
కానీ అందులో నా జ్ఞాపకాలను వెతుక్కోవడం ....జ్ఞాపకాలలో ఉన్న అనుభూతులను చెమరింపు కోరడం తప్పు కాదుగా .....
అలాంటి సందర్భాలను స్నేహితులతో పంచుకోవడం కూడా తప్పు కాదు కదా .....
ఒకానొక రోజుల్లో .............................
నాన్న వేరే ఊరులొ జాబ్ చేసే రోజుల్లో 15 రోజులకు లేదా నెలకోసారి ఇంటికి వచ్చేవారు ...మూడు బస్సులు మారాల్సి రావడమే అందుకు ఒక కారణం ....ఇంటికి వచ్చే రోజు నేను నాన్న కోసం ఎంత రాత్రయినా మేలుకునే ఉండేదాన్ని ....(అసలే మనం లేట్ గా నిద్ర పోయే అలవాటు ...ఇంకా మేలుకోవడం ఏమిటి )...నాన్నతో అర్ధరాత్రి వరకు కబుర్లు చెప్పడం(చెప్పించుకోవడం) అంటే నాకు చాలా ఇష్టం ....మేమిద్దరం ఒకేలా మాట్లాడుకునేవాళ్ళం ....సరదాగా సాగేవి మా కబుర్లు ....మా ఊరులొ కబుర్లన్ని నేను చెబితే ...తను జాబ్ చేసే ఊరులొ కబుర్లన్నీ నాన్న చెప్పేవారు .....ఊరు నిశ్శబ్దంగా ఉండటం వలన మా మాటలు విని మా నాన్న వచ్చారని అందరికి తెలిసిపోయేది ....అందరికీ నిద్ర లేకుండా చేస్తున్నామని మా అమ్మ విసుక్కున్నా మా కబుర్లు వినడం మా అమ్మకు కూడా ఇష్టమని నాకు లీలగా తెలిసిపోయేది ....
అలా కోడికూసే వేళకు అతి కష్టంగా కునుకు తీసేదాన్ని ....రోజూ ఎంత నిద్రలేపినా లేవనిదాన్ని పొద్దున్నే నిద్రలేచేదాన్ని .....అన్ని పనుల్లో నాన్నతో కలిసి ఉండటం కోసం ...వేపపుల్లతో పళ్ళు తోముకుని ....అరుగుమీద కూర్చునేవారు ....కుర్చున్న వెంటనే ఏం చేయాలో నాకు బాగా తెలుసు ....ఇంట్లోకి పరుగు పరుగున వెళ్లి బియ్యం డబ్బాలో ఉన్న చెక్కరకేళి అరటి పళ్ళల్లో బాగా మగ్గిన పండు ఒకటి తీసుకుని కొడవలితో దాన్నితొక్క తీయకుండా ముక్కలుగా కోసి (అలా తినడం నాన్నకు ఇష్టం) నాన్నకు ఇచ్చేదాన్ని ....అది తిని తర్వాత కాఫీ తాగేవారు నాన్న ....అంతలో మా నాయనమ్మ కూడా వచ్చి కూర్చునేది ...నాయనమ్మ రాగానే నాన్న తన జీతం ఇవ్వడం కోసం ఇంట్లో గోడకున్న కొక్కేనికి తగిలించిన చొక్కా తెమ్మని నాతో చెప్పేవారు ......
అదేమిటో తన జీతం ఎప్పుడు తెచ్చినా నాయనమ్మకే ఇచ్చేవారు ......మళ్లీ అక్కడే మా అమ్మను పిలిచి మా నాయనమ్మ అమ్మ చేతిలో పెట్టేది ......
ఇంతోటి దానికి నాయనమ్మకివ్వడం ఎందుకో అర్ధమయ్యేది కాదు .....కానీ అదే తల్లిని గౌరవించడం అంటే అని జీవితంలో తర్వాత గానీ నాకు అర్ధం కాలేదు .....
సరే నాకు అందులో సరదా ఏంటంటే నాన్న జేబులో ఏమున్నాయో చూడటం ....నాకు కావాల్సినవి అడగటం .....
కొత్త రూపాయి నోట్లు ...రెండు రూపాయల నోట్లు ....ఇదు రూపాయల నోట్లు అంటే నాకిష్టం ....అవి తళ తళా మెరిసిపోవాలి ...అవి నాకిష్టం అని తెలిసి నా కోసమే తెచ్చేవారు నాన్న .....అవి తీసుకుని మడత నలగకుండా పెట్టుకుని సంబరపడిపోయేదాన్ని ......ఎందుకో అవి ఖర్చుపెట్టాలంటే ప్రాణం పోయేది .....వేడి వేడి బెల్లం జిలేబి కొనుక్కోవాలంటే మాత్రం రెండింటికి సమానంగా ఓట్లు పడేవి .......
అయితే జేబులో పనికి రాని కాగితాలన్నీ నాన్న పడేస్తున్నప్పుడు నా దృష్టిని ఒకటి చాలా ఆకర్షించేది ....అదే లాటరీ టికెట్ ...."నాన్నా..... ఈ లాటరీ టికెట్ ఎక్కడిది నాన్నా" అని అడిగేదాన్ని .....
అది..... ఆ షాపు అతను "ఒక్కటి కొనండి మాష్టారూ" అని బ్రతిమాలతాడమ్మా ....అందుకే కొంటాను ....అనేవారు ...
ఆ షాపు అతని కోసం నెల నెలా తప్పనిసరిగా ఒక లాటరీ టికెట్ మాత్రం కొనేవారు ....
ప్రైజ్ వచ్చిందా నాన్నా అని అడిగితే మాత్రం ...."ఏమో ....చూడలేదమ్మా ..."అనేవారు ....
కానీ నాకు మాత్రం ప్రతినెలా ఆ లాటరీ టికెట్ చూడటం .....ప్రైజ్ వచ్చిందా నాన్నా అని అడగటం ....ఆ తర్వాత ఫక్కుమని నవ్వడం అలవాటైపోయింది ....నాతోపాటు నాన్న కూడా నవ్వేవారు ....
.........................................................................................................................
ఈ రోజు ఒక చోట ఒక అరగంట వెయిట్ చేయాల్సి వచ్చింది ....అనుకోకుండా ఎదురుగా లాటరీ టికెట్ కనపడింది .....ఎందుకో నాన్న గుర్తొచ్చారు ...వెంటనే ఒక డాలర్ నోట్ తీసి ఆ మెషిన్ లో వేసా ....అది ఒక టికెట్ ఇచ్చింది .....(జీవితంలో మొదటిసారి లాటరీ టికెట్ కొన్నా ....)అది ఎంతో ఏమిటో కూడా చూడలేదు .... సన్నటి నీటిపొర అనుకుంటాను టికెట్ మీద ఏం రాసుందో సరిగా కనబడనివ్వలేదు ....టికెట్ పర్సులో దాచుకున్నా ....
కానీ ఒక్క డాలర్ కి మిలియన్ డాలర్స్ వస్తాయా ....అని తల్చుకుని ఫక్కుమని నవ్వేసా ....నాతోపాటు నాన్న కూడా నవ్వినట్టే అనిపించింది ....!!

(wrote and published on October 17 2014 )

No comments:

Post a Comment