Wednesday, October 4, 2017

నేను ఎప్పటికీ శ్రీలక్ష్మి లాగే ఉండాలి ..!

"నేను ఈ రోజు, (ఇంతకుముందు అభిప్రాయ బేధాలు వచ్చి కొన్నాళ్ళు దూరంగా ఉన్న) నా స్నేహితురాలిని కలిశాను ....ఇప్పుడు నాకు స్పష్టంగా తెలుస్తుంది ....తన మాటలు చేతలు అన్ని ఎంత అబద్ధంగా ఉన్నాయో ....అంతకు ముందు ఎన్నో సంవత్సరాలు స్నేహంలో ఉన్నప్పటికంటే ....కొన్నాళ్ళు దూరం అయ్యాక ....మళ్ళీ కలిశాక ఆ తేడా స్పష్టంగా తెలుస్తుంది ...అందులో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది స్పష్టంగా గుర్తించగలుగుతున్నాను .... " చెప్పింది నా డాటర్ బాధగా నాతో ....
"నువ్వు చూసేది అబద్ధం అని ఇప్పుడు తెలుసుకున్నావు ....దగ్గరగా ఉన్నప్పుడు ఆ అబద్ధాన్ని గుర్తించలేకపోయావు ....అదే నిజమని నమ్మావు...
ఇప్పుడు నువ్వు ఇది అబద్ధం అనుకుంటున్నావు సరే ...కానీ మరొకటి ఏదో నువ్వు నిజమని నమ్ముతున్నావు ....అది కూడా కొన్నాళ్ళు పోయాక అబద్ధం అని తెలుస్తుంది ....
బహుశా, ఇప్పుడు అబద్ధం అని నమ్ముతున్నది అప్పుడు నిజం అని నీకు సందిగ్ధం కలిగే అవకాశం ఉంది ....
భవిష్యత్తులో మరో నిజం నీకు కనిపించినప్పుడు ఇప్పుడు ఉన్నవన్నీ అబద్ధాలు గా కనిపించొచ్చు ....లేదా నిజాలుగా మారిపోవచ్చు ....ఇలా నువ్వు జీవితం అంతా నిజం అని నమ్మినవే అబద్ధాలుగా మారిపోతూ ఉంటాయి ....మళ్ళీ మళ్ళీ నిజం కోసం అన్వేషిస్తూనే ఉంటావు ....
నాకు తెలిసి నేను ఇంతవరకూ నిజాన్ని ఎప్పుడూ చూడలేదు ......జీవితంలో ఎప్పుడైనా కనిపిస్తుంది అనే ఆశతో అన్వేషించడమే జీవితం అని ....మనం ఏర్పరచుకున్న నమ్మకం మాత్రమే నిజం అని అర్ధం అయింది ...." వివరించా ...
"అయితే నిజమే లేకపోతే.. ఇక దేనికోసం ఈ పరుగు ....?"
"అందుకే దేనికోసం పరుగులు పెట్టొద్దు ....ఒక్క క్షణం నువ్వు దేనికోసమో ఆశించి పరుగులు పెట్టావా ....ఆ క్షణం నువ్వు నీ జీవితాన్ని కోల్పోయినట్టే .....
ఈ క్షణం , ఈ రోజు .....నీ మనసుకు , శరీరానికి ఏం కావాలి అని ఆలోచించుకో ....అవి ఇవ్వడానికి కృషి చేయి ....ఏదైనా నీ దగ్గరనుండి ఆశించి ఎవరైనా వస్తే ....నీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వు ....లేదా ఎవరి దగ్గరనుండి అయినా నువ్వు ఏదైనా ఆశిస్తే అడుగు ....
మొత్తానికి నీకు కావాల్సింది నీకు దొరికిందా... సంతృప్తిగా సంతోషంగా బ్రతుకు ....నీకు దొరకలేదా ...అయినా సంతోషంగా సంతృప్తిగా బ్రతుకు ...
ప్రతి క్షణాన్ని ఆస్వాదించు ....అది ఎలా ఉన్నా సరే ....!"
నేను అనుసరించే జీవితాన్ని వివరించా ...దగ్గరగా ఉండి వాళ్ళు చూసేదే అయినా .....!
"నువ్వు మమ్మల్ని కనకుండా ఉంటే....ఓషో అయి ఉండేదానివి అనిపిస్తుంది ...." చెప్పింది ....ఏదో ఆలోచిస్తూ ....
"హ హ ....నాకు ఓషో అవ్వాలని లేదు నాన్నా ....నేను ఎప్పటికీ శ్రీలక్ష్మి లాగే ఉండాలి ....నా జీవితాన్ని నేను ఆస్వాదించాలి .....నాకు మరొకరిలా ఉండాలని ఎప్పటికీ ఉండదు ...." నవ్వుతూ చెప్పా ....
"అలా ఎందుకు చెప్పాను అంటే ... నీకు గొప్ప పేరొస్తుంది కాదా ...అందరికీ అర్ధమయ్యేలా ఇంకా బాగా చెప్పగలుగుతావు ...." అభిప్రాయ వ్యక్తీకరణ ...
"ఆ పేరు కోసం ...ఎవరిలాగో అవ్వాలనుకోవడం కూడా అబద్ధమేగా ....దాని కోసం పరుగులు పెట్టడమే కదా ....అప్పుడు మనం మన జీవితాన్ని ఎక్కడ ఆస్వాదిస్తున్నాం ....ఈ క్షణం ఎక్కడ జీవిస్తున్నాం ....నా దృష్టిలో ఓషో ఓషోనే ....నేను నేనే ..." ఆ ఓషో ఏం చెప్పాడో నాకేం తెలియకపోయినా వివరించా ....
"నాకు నీతో మాట్లాడాక చాలా సంతోషంగా అనిపిస్తుంది ....థాంక్స్ " చెప్పింది ప్రేమగా .....😍

No comments:

Post a Comment