Sunday, August 8, 2021

ప్రపంచంలో అందరికీ పొగిడించుకోవాలని ఉంటుంది ...పొగడ్తలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ....

 ప్రపంచంలో అందరికీ పొగిడించుకోవాలని ఉంటుంది ...పొగడ్తలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ....

============================
కొన్నాళ్లక్రితం ఒకరోజు నేను మావారు ....ఏదో ఒక డాక్యుమెంట్ నోటరీ చేయాల్సిన పనుండి దగ్గర్లో ఉన్న పోస్టాఫీస్ కి వెళ్ళాం ... ...
అప్పుడు కరోనా టైం ...మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలి ....ఇంకా వాక్సిన్ కూడా రాలేదు అప్పటికి ....
అందుకే ...మేమిద్దరం మాస్క్ లు పెట్టుకుని లోపలి వెళ్ళాం ...
అప్పటికి ఓ ఇద్దరు మా ముందు లైన్ లో ఉన్నారు ....మేం వారికి ఆరడుగుల దూరంలో నిల్చున్నాం ...
షాపులోకి వెళ్ళగానే ...అక్కడున్న పుస్తకాలు...పెన్నులు తీసుకుని చూసి ....మళ్ళీ అక్కడే పెడుతున్నారు మావారు ....
అలా తాకడం కూడా నాకు ఇబ్బందిగా అనిపించి ....,
"మీరు తీసుకోవాలి అనుకుంటే టచ్ చేయండి ....లేకపోతే తాకకండి ...." చెప్పా తనకు ....
అంటే అప్పట్లో అంత జాగ్రతగా ఉండేవాళ్ళం అని చెప్పడానికి ఉదాహరణగా చెప్పా ....
అక్కడ రెండు కౌంటర్ లు ఉన్నాయి ...ఒక కౌంటర్ దగ్గర ...ఒక మేల్ పర్సన్ ....ఒక కౌంటర్ దగ్గర ఒక లేడీ ఉన్నారు ...వాళ్ళు కూడా మాస్క్ పెట్టుకుని ...కరోనాని లెక్కచేయకుండా వర్క్ చేస్తూ ఉన్నారు ...
"మనమేదో సాఫ్ట్ వేర్ లో ఉండడం వలన వర్క్ ఇంటిదగ్గర నుండి చేసుకునే అవకాశం వచ్చింది కానీ ...ఇలాంటి వర్క్ చేయాలంటే ఎంత కష్టం కదా ఇలాంటి పరిస్థితుల్లో ....బ్రతుకుతెరువు కోసం ఎంతో కష్టపడుతున్నారు ఎందరో ...." మా వారితో చెప్పా ....
అంతలో మా వంతు వచ్చింది ....అతని ముందుకు వెళ్ళాం ....
"ఓహ్ ..మీకు నోటరీ కావాలా ....తను చేస్తుంది నోటరీ ....అటువైపు వెళ్ళండి ...." అని ఆమెవైపు వెళ్ళమన్నట్లు చూపించాడు ....
అతనికి థాంక్స్ చెప్పి ...ఆమె వైపు వెళ్ళాం ...
ఆమె చాలా ఫాస్ట్ గా వర్క్ చేస్తుంది ...మధ్యలో ఫోన్ కాల్స్ తీసుకుంటూ ...తన ముందున్న డాకుమెంట్స్ పోస్ట్ చేస్తూ ...మమ్మల్ని కాసేపు ఆగమన్నట్టు సైగ చేసింది ...
మా వంతు వచ్చేవరకు ఆగి ...
మా పని పూర్తి చేసుకుని రాబోయే ముందు ....
"మీరు చాలా ఫాస్ట్ గా వర్క్ చేస్తున్నారు ...ఈ పాండమిక్ లో ఇలా వర్క్ చేయడం ...నిజంగా గ్రేట్ ...మీ హార్డ్ వర్క్ మెచ్చుకోదగింది ...." ఆమెవైపు చూసి మెచ్చుకోలుగా చెప్పారు మావారు ...
ఆమె కాస్త సిగ్గుపడి ....థాంక్స్ చెప్పింది ....
బయటికొచ్చాక నేను ఆలోచనలో పడిపోయా ....సేమ్ ఫీలింగ్ అతనిని చూసినప్పుడు నాకు కలిగింది ....
కానీ ఆ ముక్క అతనికి చెప్పకుండా మావారికి చెప్పా ....
నేనెందుకు అతనికి / ఆమెకు ..చెప్పలేకపోయాను ....అనుకున్నా ....
ఇంటికొచ్చాక ...తను కాసేపు చదువుకుని నిద్రపోయారు ....
నేను ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని ....సింక్ నిండా ఉన్న గిన్నెలు కడుగుదాం అని వాటి మీదకు ఉపక్రమించా ....
అంతలో మావారు నిద్ర లేచి ....ఒక పుస్తకం తీసుకుని ...చదువుకుంటూ నా ఎదురుగానే కూర్చున్నారు ....
నాకెందుకో ఎప్పుడూ అయన అలా కూర్చున్నప్పుడల్లా ....చిన్నప్పుడు ఇంట్లో పని చేసుకుంటూ పిల్లల్ని చదివించే తల్లిదండ్రులు గుర్తొస్తారు ....
ఎక్కడైనా వేరే చోట కు వెళ్లి చదువుకోవచ్చుగా ....నా ఎదురుగానే చదువుకుంటూ కూర్చుంటారు ...అది నాకు ఇంకా విసుగు తెప్పిస్తుంది ....నేనొక పని చేస్తే తను వేరే పని చేయొచ్చుగా అనుకుంటా ....
కానీ జరగనివి అనుకుంటూ బ్రతకడమే జీవితం అని అర్ధం కావడం వలన ఏం మాట్లాడకుండా నా పని నేను చేసుకుంటూ ఉంటా ...
అయినా ఆ రోజు ఇలాంటి రొటీన్ ఆలోచనలు కాకుండా ...వేరే ఆలోచనలు నా మైండ్ లో గిర్రున తిరుగుతున్నాయి ....
ఆ అమ్మాయి ని అంత బాగా పొగిడారు కదా ....ఇన్ని పనులు నెత్తి మీద వేసుకుని చేస్తాను ....నన్నెప్పుడూ అలా ఎందుకు అనరు అని ....
సరే అడిగి చూద్దాం అని సంభాషణ మొదలు పెట్టా ....
"ఏమండీ ...నేను ఒక విషయం మిమ్మల్ని అడగొచ్చా "అడిగా
"అడుగు " అన్నట్టు చూశారు ...
"మీరు ఇందాక పోస్టాఫీస్ కి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని మెచ్చుకున్నారు కదా ..."
"అవును "అన్నట్టు నా వైపు చూశారు ...
"మరీ ఆ అమ్మాయి అంత కాకపోయినా ....నేను కూడా ఎన్నో పనులు చేస్తూ ఉంటాను ....
డ్రైవింగ్ నేనే చేస్తాను ....ఇంట్లో సరుకులు నేనే తెస్తాను ....వంటలు నేనే చేసి పెడతాను ...పిల్లలని ఎక్కడికి తీసుకు వెళ్లాలన్నా నేనే చేస్తాను ...మీరెప్పుడూ వేరేచోట జాబ్ చేసినా కూడా పిల్లలని ఒక్కదాన్నే చూసుకుంటాను ....ఇంట్లో బిల్లులు కట్టడం నేనే చేస్తాను ....మీరు తిన్న ఎంగిలి కంచాలన్ని నేనే శుభ్రం చేస్తాను ....ఇల్లు శుభ్రం చేస్తాను ....ఎక్కడికైనా ప్రయాణాలు చేస్తే ఆ ఏర్పాట్లు నేనే చేస్తాను ...ఇంకా మీ స్నేహితులొస్తే వంటలన్నీ చేసి పెడతాను ....వాళ్ళ రుచులకు తగ్గట్టు .....కాస్తో కూస్తో మీ మీద ఆధారపడకుండా నా కాళ్ళ మీద నేను నిలబడాలని ప్రయత్నిస్తుంటాను ...ఒక్క ముక్క ఇంగ్లిష్ రాకపోయినా ...కష్టపడి కాస్తో కూస్తో ఇంగ్లిష్ నేర్చుకున్నాను ... మీకు బోర్ కొట్టకుండా జోక్స్ వేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేసి పెడతాను ....ఒక్కటేమిటి ...ఏది అవసరం అయితే అది నేర్చుకుంటూనే ఉన్నాను ... ఇన్ని చేసినప్పుడు ...ఎప్పుడూ మీకు ఇది హార్డ్ వర్క్ అని అనిపించలేదా ....ఎప్పుడైనా జీవితంలో ఒక్కసారైనా మీకు మెచ్చుకోవాలని అనిపించలేదా ....అహ ...ఊరికే...ఎదో ఉత్సుకత కొద్దీ అడుగుతున్నా ....మీరు ఇప్పుడు మెచ్చుకోవాలని కాదు ....మిమ్మల్ని అర్ధం చేసుకుందాం అని ...నా ప్రయత్నం ...నిజాయితీగా చెప్పండి" అడగడం ముగించా...
పుస్తకంలోనుండి తల పైకెత్తి చూసి ..."ఆ ....నిజమే కదా ..." అని గడ్డం కింద చేయి పెట్టుకుని రుద్దుకుంటూ ఆలోచనలో పడ్డారు ...
"అయితే ..భలే అడిగాను కదా ...." నన్ను నేను మెచ్చుకున్నా మనసులో ....
"ఎందుకో ....ప్రపంచాన్ని అంతా మెచ్చుకోవాలనిపిస్తుంది .....కానీ నిన్ను మాత్రం మెచ్చుకోవాలనిపించదు...అది బలహీనత కావచ్చు ...మరింకేదైనా కావచ్చు ..." చెప్పారు ...నిజాయితీగా ...
కారణాలేవైనా కానివ్వండి నిజాయితీగా ఒప్పుకున్నందుకు థాంక్స్ చెప్పా ...
"ఇంకో సందేహం ..." అడిగా ...
ఏమిటన్నట్టు చూశారు ....
"మరి...ప్రపంచంలో ఎవరు నన్ను మెచ్చుకున్నా కూడా మీరు భరించలేరెందుకు....ఆఖరికి పిల్లలు నన్ను మెచ్చుకుంటే కూడా భరించలేరు ...ఇలా ఎందుకు ...నాకు కూడా ఎవరైనా పొగిడితే బాగుండు అని అనిపిస్తుంది కదా ....నేనూ మనిషినే కదా ...." అడిగా సాధ్యమైనంత మృదువుగా ...
సమాధానం లేదు.....రాదు కూడా ...
============================
మరొక సందర్భంలో ....,
మొన్నామధ్య ఒకరోజు ...."వచ్చే జన్మలో నువ్వు నా భార్యగా కాకుండా... ఏ స్నేహితురాలిగానో ....ప్రేమికురాలిగానో ...ఉండు ....నా భర్యగా మాత్రం ఉండొద్దు ...." చెప్పారు ఎంతో బాధగా ...
"ఎందుకలా ....వచ్చే జన్మలో ఎలా ఉండాలో కూడా మీరే డిసైడ్ చేస్తున్నారా " అడిగా నవ్వుతూ ..
"ఎందుకంటే ....నిన్ను పొగడాలనిపిస్తుంది ...కానీ పొగడలేకపోతున్నా ....అదే భార్య కాకుండా ఉంటే ఈజీగా పొగడొచ్చు కదా " చెప్పారు ఇబ్బందిని వివరిస్తూ ...
"దానికి వచ్చే జన్మదాకా ఎందుకు వెయిట్ చేయడం ....ఈ జన్మలోనే అవకాశం ఉంది ...మీరొప్పుకుంటే వేరే వాళ్ళ భార్యనవుతా ...అప్పుడు మీరు కావాల్సినంత పొగడొచ్చు ...." చెప్పా ఇంకా ఛాన్స్ మిగిలే ఉందని నమ్మకం కలిగిస్తూ ...
సమాధానం ఇంకా రాలేదు ....
అప్పుడెప్పుడో వాళ్ళ గురువు గారు కూడా చెప్పారట ....లక్ష్మి ని నీ భార్య అనుకోవద్దు ...ప్రేమికురాలు అనుకో ...అప్పుడు నువ్వు ప్రేమించగలవు అని ....
అయినా ఆయనేం గురువండీ ...భార్యని భార్య అనుకుని ప్రేమించలేకపోవడం నీ బలహీనత బాబూ అని చెప్పాలి కానీ ...భార్యని ఫ్రెండ్ అనుకో ....లవర్ అనుకో ....ఇలా ఏమిటో నాకు అర్ధం కాలేదు …
సరే పోనివ్వండి ...మన బంగారం మంచిదైతే కంసలోడిని అనుకునే పనేమొచ్చే ...
========================
అసలెందుకు ఈ పొగడడం ...పొగిడించుకోవడం ....అని ఆలోచిస్తే ....
ప్రపంచంలో అందరికీ పొగిడించుకోవాలని ఉంటుంది ...పొగడ్తలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ....
అది మానవ సహజ నైజం ...ఎప్పుడైనా ఏదైనా మంచి పని చేసినప్పుడు ....మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు ..కష్టపడి పని చేసినప్పుడు ...అందరికీ ఉపయోగపడే పని చేసినప్పుడు ...మంచి రుచికరమైన వంట చేసినప్పుడు ...అందరికీ ఇష్టమైన పని చేసినప్పుడు ....ఇలా ...
నేను అందుకు అతీతురాలిని ఏం కాదు ...
చిన్నతనంలో అయితే ...మా అమ్మా నాన్నలు పొగిడేలా వాళ్ళకి నచ్చే పనులు ఎన్నో చేసేదాన్ని ...
తర్వాత టీచర్స్ మెచ్చుకునేలా కొన్ని చేసేదాన్ని ...
ఇక ఫ్రెండ్స్ కూడా కాస్తో కూస్తో నన్ను మెచ్చుకోవాలని కోరుకునేదాన్ని ...
ఇక ఇంటి ఇరుగు పొరుగు వాళ్ళు సరే సరి ...
నాకు బాగా గుర్తు ...మా ఊరులోకి చెంచులవాళ్ళు అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు ....వచ్చినప్పుడు ఒక నెల రోజులు మా ఊరులో చింతచెట్టు కింద బస చేసేవాళ్ళు ...
అందులో చిన్నవాళ్లు దగ్గరనుండి పెద్దవాళ్ళ వరకు భిక్షాటనకు వచ్చేవాళ్ళు ...
అందులో కొందరు పాటలు పాడుతూ వచ్చేవాళ్ళు ...వాళ్ళ పాటల్లో చివర ...."ఓ చెంచు లచ్చిమి " అని రిథమిక్ సౌండ్ తో ఓ పదం ఉచ్ఛరించేవాళ్ళు ...
వాళ్ళు చద్ది అన్నం , కూరలు లాంటివి తీసుకోరు ...
బియ్యం ...ఇతర ధాన్యాలు తీసుకునేవాళ్ళు ఓ సంచీలో ...
మా నాయనమ్మ ముందుగానే మమ్మల్ని హెచ్చరించేది ...చెంచుల్లోళ్లు వచ్చారు ...వరస కడతారు ఇక ...ఎవరికీ ఏం పెట్టొద్దు ....దొంగతనాలు అవీ జరుగుతాయి ...ఇంట్లోనే జాగ్రత్తగా ఉండండి అని ...
కానీ వాళ్ళు దొంగతనాలు చేసేవాళ్ళు కాదు ...
ఆవిడ పిచ్చి కానీ ...దొంగతనం నేర్చినవాళ్లు ...బిక్షాటన ఎలా చేస్తారు ...
ఆ గ్రూప్ లో ఒకతను చాలా బాగా పాడేవాడు ...
అతను ఇంటిముందుకు వచ్చి పాడుతున్నప్పుడల్లా ఇంకా ఇంకా అతని పాట వినాలనిపించేది ...
"ఓ చెంచు లచ్చిమి " అనేది ...వాళ్ళ దేవత ను ఉద్దేశించి అనుకుంటా ...
కానీ అతను నన్ను ఉద్దేశించి ...ఓ చెంచు లచ్చిమి అని ...నావైపు చూసి ...అమ్మా మా లచ్చిమి లాగా ఉన్నావమ్మా ...అని పొగిడేవాడు ...
నేను సోల తో కొలత చూడకుండా బియ్యం తీసుకొచ్చి అతని జోలెలో పోసేదాన్ని ...
అతను ఇంకాస్త పొగిడి పాడుకుంటూ వెళ్లిపోయేవాడు ...
మా ఇంట్లో డబ్బా నిండా ఓ క్వింటా బియ్యం ఎప్పుడూ ఉంటాయి కాబట్టి ..ఎవరికి ఎంతిచ్చానో మావాళ్లు కనిపెట్టేవాళ్ళు కాదు ....
అలా వాళ్ళు ఉన్నన్ని రోజులు వాళ్ళ పాట ...నన్ను పొడగడం ...అతని ఆత్మీయత నాకు చాలా ఆనందాన్ని కలిగించేది ...
ఎంత ఆనందం ఇవ్వకపోతే ఇప్పటిదాకా గుర్తు పెట్టుకుని ఉంటాను ....
అలా అని తిట్టేవాళ్ళు ఉండరని కాదు ...తిట్టినప్పుడు బాధపడే సందర్భాలు ఎలాగైతే సహజమో పొగిడినప్పుడు సంతోషించే సందర్భాలు కూడా అంతే సహజం ...
అందరూ కాకపోయినా ఆత్మీయులు పొగిడితే బాగుండు అని కోరుకుంటాం ...
కొన్నిసార్లు పొగిడిన వాళ్ళని కూడా ఆత్మీయులు అనుకుంటాం అనుకోండి అది వేరే విషయం ..
చిన్నతనంలో అప్పుడప్పుడు నన్ను కూడా మా ఇంట్లో పొగిడేవాళ్లు ...వాళ్లకిష్టమైన పని చేసినప్పుడు ...
మా అత్తయ్య నన్ను ఒక్కోసారి బాగా తిట్టేది ...
"ఏమ్మా ..ఇంట్లో పనులు అన్ని ఆడపిల్లలు చేయకపోతే ఎవరు చేస్తారు ...ఆడపిల్ల ఉంటే తల్లికి సుఖం ..మగపిల్లాడు ఉంటే తండ్రికి సుఖం ....అంటారు ...ఇవతల పుల్ల తీసి అవతల పెట్టరు ...రేపు పోయినకాడ ఇలాగే చేస్తే ...." అని మొదలు పెట్టేది ...
అబ్బా నస అని తిట్టుకునే దాన్ని ..
సాయంత్రం అయితే చాలు ....ఆ సన్నజాజి పూలు అలా చెట్టుకే రాలిపోకపోతే ...కోసుకుని జడలేసుకుని శుభ్రంగా పూలు పెట్టుకోరాదూ ...ఆడపిల్లలు కాదూ అని తిట్టేది ...
అలాగే కొన్నిసార్లు పొగిడేది కూడా ...మా లక్ష్మికేం ..బంగారం ...అది పొద్దున్నే కాస్త ఆలస్యంగా లేస్తుందనే కానీ ....తర్వాత దానిపని అది శుభ్రంగా చేసుకుంటది...దానికెవరు పోటీ రారు ...
మా అబ్బాయిని చేసుకోమ్మా అనేది ...
మరి మొన్న ఇవతల పుల్ల తీసి అవతల పెట్టానని తిట్టావ్ కదా అనేదాన్ని ....ఛాన్స్ దొరికింది కదా అని ...
ఇలా కాసిన్ని పొగడ్తలు ....కాసిన్ని తిట్లతో అలా గడిచిపోయింది నేనెరుగని నా బాల్యం ...
నా పెళ్లయిన తర్వాత ....
మావారితో నా సహజీవనం మొదలైంది..
సరే ఇక తిట్లు పొగడ్తలు ఇద్దరికీ సమానంగా వస్తాయి అనుకునేదాన్ని ...
కానీ ఏమాటకామాటే చెప్పాలి మావారికి పొగడ్తలంటే చాలా ఇష్టం ...
మళ్ళీ మొదట చెప్పుకున్నట్టు పొగడ్తలంటే ఎవరికి ఇష్టం ఉండదు ...
వాళ్ళ చుట్టాలు ...మా చుట్టాలు ...నా ఫ్రెండ్స్ , అయన ఫ్రెండ్స్ ...వాళ్ళ ఊరు మా ఊరు అందరూ ఆయన్ని పొగడాలని ఆయన కోరుకునేవారు ...
ఇంత మంచి భర్త ...ఇంత మంచి వ్యక్తి ....ఇంత మంచి కొడుకు ....ఇంత మంచి అన్న ....ఇంత మంచి మావ ...ఇంత మంచి బావ ...చివరకు ఇంత మంచి అపరిచితుడు అనే పొగడ్త కూడా తనకు ఎంతో సంతోషాన్నిచ్చేది ....
పొగడ్తలు అనేవి ఊరికే రావని నాకు ఊహ తెలిసిన తర్వాత కానీ అర్ధం కాలేదు ....
అందుకు భారీ మూల్యం చెల్లించాలి అని కూడా అర్ధం అయింది ....
చిన్నతనంలో జోలెలో పోసిన బియ్యం కు వచ్చిన పొగడ్తలు కావు ఇవి ...
ఇక్కడ డబ్బు , వస్తువులు సమర్పించుకోవాలి ప్రతి ఒక్కరికీ ....మన స్థాయి పెరిగేకొద్దీ ....సమర్పించుకునే డబ్బు , వస్తువుల విలువ పెరుగుతూ వస్తుంది ...
బహుమానాలు పుచ్చుకునేవాళ్ళు కూడా ...మాకింత అవసరం కాబట్టి ఇంత ఇవ్వండి అని కాదు ....మీకు ఇంత సంపాదన వస్తుంది కాబట్టి మాకింత ఇవ్వాలి ....అనే స్థాయికి ఎదిగింది ప్రపంచం ....
నాకు ఒక దశలో బాగా అర్ధమైంది ....అంటే బహుశా అప్పటికి నాకు పిల్లలు పుట్టి అవసరాలు పెరిగి ఉండొచ్చు ....
పిల్లలకు చిరుతిళ్ళు కొనిపించడానికి ...కొన్ని నో చెప్పి ...లేకపోతే ఏదైనా కొనుక్కోవాలంటే మన నోరు కట్టుకుని ...కాస్త డీసెంట్ గా కనిపించే బట్టలు కొనుక్కోవడానికి ఆలోచించి ...ఈ కాస్త పొదుపు చేసుకుంటే ఈ వస్తువు కొనుక్కోవచ్చు అని ఆలోచించినప్పుడు ....నాకు పొగడ్తలు గుర్తుకు రాలేదు ...
నేను పొదుపు మీద ...పిల్లల మీద ద్రుష్టి కేంద్రీకరించా ...
మావారు ఆ పొగడ్తల వలయంలోనుండి బయట పడలేకపోయారు ....
ఫలితం ...
నాకు తెలియకుండా ...ఇంట్లో నుండి చేరాల్సిన ....డబ్బు, వస్తువులు ...వాళ్లకు చేరేవి
ఇంట్లో నాకే లేకుండా ....వాళ్ళకెలా ఇస్తున్నారు అనే ప్రశ్న మొదలైనప్పుడు ...వాదోపవాదాలు మొదలయ్యేవి ....
చివరకు ఆ అందుకునేవాళ్ళతో నేను శత్రుత్వం పెట్టుకుంటే ఈయన ఇవ్వడం ఆపేస్తారేమో అని వెర్రిగా ఆలోచించిన సందర్భాలు కూడా ఉన్నాయి ...
అప్పుడు వాళ్లంతా నన్ను తిట్టుకోవడం ....ఆయన్ని పొగడడం చేసేవాళ్ళు ...
అయినా నా పిచ్చి గానీ ...వాళ్ళు పొతే ఆ స్థానంలో ఇంకొకరు వచ్చేవారు ... ఇచ్చే వ్యక్తులు మారొచ్చు ...ఇవ్వడం కామన్ అన్నట్టు ....
ఇక బంధువులైతే ....మా ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువైతే ...వాళ్ళ ప్రయోజనాలని పూర్తి చేసుకోవచ్చు కదా అని ఆలోచించేవాళ్ళు ...
దాని ఫలితం ఆయన్ని ఇంకా ఎక్కువగా పొగిడేవాళ్లు ....ఎంత ఎక్కువగా అంటే ....దేవుడనే వాడు లేడు...నువ్వే మా దేవుడివి అనేంతగా ...
అంత స్థాయిలో నేను ఆయన్ని పొగడలేకపోవడం వలన ...మాకు దక్కాల్సిన సాధారణ ప్రయోజనాలు కూడా దక్కేవి కావు ...
అప్పుడు నా స్నేహితురాలు నాకు ఒకటే చెప్పింది ..."మీ అయన సంపాదించిందంతా నీది అని అనుకోకు ...నీ దగ్గరకు ఏదైతే వచ్చిందే అదే నీ పిల్లల కోసం ఖర్చుపెట్టు ....మిగతాదంతా నీది కాదనుకో ..." అని ...
అలాగే అనుకోవడం మొదలుపెట్టా ...
పిల్లల అవసరాల కోసం మాత్రమే చూసుకునేదాన్ని ...నా అవసరాల కోసం నేను కష్టపడి పని చేసుకోవాలి అని నిర్ణయించుకునేదాన్ని ...
అలా నన్ను నేను వేరు చేసుకుని ...పిల్ల బాధ్యతల్ని వేరు చేసి ....ఆయన ప్రపంచాన్ని వేరు చేసి ....
అందులో లాభ నష్టాలు బేరీజు వేయకుండా ...బాధ్యతల్ని మాత్రమే లెక్క కట్టుకుని ...మా వారు ఇచ్చినదాన్ని కూడుకుని ...నా శ్రమని తీసివేసి ... శేషం నా జీవితానికి అన్వయించుకునేదాన్ని ...
ఈ ప్రయాణంలో నాకు ఒక్క పొగడ్త కూడా లభించలేదు ....కేవలం తిట్లు మాత్రమే మిగిలాయి ...
చివరకు మా అమ్మ కూడా నన్ను తిట్టింది ..నేను నా హక్కుల కోసం పూర్తిగా పోరాటం చేయలేదని ....తప్పు చేసినవాళ్ళని ఇది తప్పు అని నిలదీయలేదని ...
నాకు నా పిల్లల మీద ఉన్న ప్రేమ కానివ్వండి ....నా భవిష్యత్తు మీద ఉన్న ఆశ కానివ్వండి ....నా బ్రతుకు మీద ఉన్న తీపి కానివ్వండి ... ఆ తిట్లు ని లెక్కచేయనీయకుండా చేసింది ...
నన్ను ఓ బండరాయిగా మార్చింది ...
నేను నా శక్తిని పోరాటం మీద కన్నా ...బ్రతుకు మీద ఉన్న ఆరాటానికి ఉపయోగించడం మంచిదని నిర్ణయించుకున్నా ....
అప్పుడు నాకు ...నా పిల్లలకు ఒక గూడు అల్లుకున్నా...ఆ గూటిమీదకు ఎవరొచ్చినా ఒప్పుకునేదాన్ని కాదు ....గూటి బయట ఎవరైనా రానీ ఏమైనా చేసుకోనీ ....పట్టించుకోవడం మానేశా ..
చివరకు పొగడ్త గురించి ఏదైనా చేయడం ...ఆశించడం ...అదెలా ఉంటుందో ఆలోచించడం పూర్తిగా మర్చిపోయా ...
ఒక్కోసారి పిల్లలు ...వాళ్ళకిష్టం లేని ఫ్రెండ్స్ తో ఎక్కడికైనా రావడం ఇష్టం లేకపోతే..."మా మమ్మి ఒప్పుకోదు అని ...బయటికెళ్తే తిడుతుంది అని ....(మనం అలా చేయకపోయినా ) చెప్పి తప్పించుకుంటారు ...
అలాంటప్పుడు ..."సారీ మమ్మి ఇలా చెప్పాల్సొచ్చింది నీ మీద ..."అని తప్పు చేసాం సారీ అన్నట్టు ఫీల్ అయేవాళ్లు ....
పర్వాలేదురా ....మీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకోండి ....హాయిగా ఉపయోగించుకోండి అవసరం అయినప్పుడు అని చిన్నతనం చేష్టలు కదా అని ఆహ్లాదంగా నువ్వుకునేదాన్ని ...
"మా ఆవిడ ఒప్పుకోదు ...లక్ష్మికి ఇష్టం ఉండదు ...తనకు తెలియకుండా ఇస్తున్నా ...తనకు తెలియకుండా చేయాలి ...మా ఆవిడకి తెలిస్తే చంపేస్తుంది ....రాక్షసి ..." అని మావారు చెప్పుకున్నారని తెలిసినప్పుడూ పోనీలే పిరికి చేష్టలు అని నవ్వుకుంటూ అనుకునేదాన్ని ...
ఇప్పుడు ఒకవేళ మావారు ఎప్పుడైనా మెచ్చుకున్నా కూడా ఏమీ అనిపించదు ...
సరే థాంక్స్ అని చెప్పి ఊరుకుంటా ....
ఇప్పటికీ ....మావారిని పొగిడే వారికి నెలా నెలా కొంత మొత్తం జమ అవుతూనే ఉంటుంది ....
అది పట్టించుకోవడం ఎప్పుడో మానేశా ....
డబ్బులిచ్చి పొగిడించుకునే బలహీనత కు నేను బానిసను కాకుండా నన్ను నేను పదిలంగా కాపాడుకుంటూ ఉంటా ...అలాగే పొగడ్తల కోసం ఏమీ చేయకుండా కూడా ఉంటా ..
మనస్ఫూర్తిగా నాకు చేయాలనిపించి ....ఇష్టమై చేస్తూ ఉంటా ...
=========================
ఇలా గడిచిపోతున్నా ఈ జీవితంలో ....
ఇప్పుడు నాకు ఎవరైనా పొగిడినా...తిట్టినా వెంటనే తేడా తట్టదు...
వేళ్ళ మీద లెక్కించగలిగిన కొందరు స్నేహితులు ...పిల్లలు మాత్రం ఎప్పుడైనా నన్ను కూడా మెచ్చుకుంటూ ఉంటారు ...
అప్పుడు మాత్రం ...లోలోపలే కాస్త సంతోషపడుతూ ఉంటా ...
ఏమాటకామాటే చెప్పాలి....
మళ్ళీ మొదట చెప్పుకున్నట్టు ....ప్రపంచంలో అందరికీ పొగిడించుకోవాలని ఉంటుంది ...పొగడ్తలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ...!

No comments:

Post a Comment