Sunday, August 15, 2021

చాన్నాళ్ల క్రితం ఒకసారి మాటల సందర్భంలో ....

 చాన్నాళ్ల క్రితం ఒకసారి మాటల సందర్భంలో ....

మావారు తన స్నేహితులతో కలిసి వాకింగ్ కి వెళ్ళినప్పుడు ...తనకు తన స్నేహితులకు మధ్య జరిగిన సంభాషణ ఒకటి నాతో షేర్ చేశారు ...
================
ఫ్రెండ్: మీ ఇంట్లో ప్రతినెలా కరెంట్ బిల్ ఎంతొస్తుంది ....
మావారు: తెలియదు ...లక్ష్మి చూసుకుంటుంది ...
- మీ ఇంట్లో వాటర్ బిల్ ఎంతొస్తుంది ....
- తెలియదు ...అది కూడా తనే చూస్తుంది ...
- మీ ఇంట్లో గ్యాస్ బిల్ , ఫోన్ బిల్, ట్రాష్ బిల్, నెట్ బిల్లు , పిల్లల ఫీజులు ....వగైరా వగైరా ...
- నేనేం చూసుకోను ...అన్ని తనే చూసుకుంటుంది ....
- మరి మీరేం చేస్తారండీ ....అన్ని తనే చూసుకుంటే ....
- ఏమోనండీ ...నాకు అలవాటు లేదు ఎప్పుడూ ...నేను అవన్నీ చూడలేను ....మావారి సమాధానం ...
అడిగిన సదరు ఫ్రెండ్ అవాక్కయ్యారని ....తను నాతో చెప్పి ....
"సింపుల్ ...ఆయన ఫామిలీ మాన్ ....నేను ఫ్యామిలీ మాన్ కాదు ..."
చెప్పారు నాతో ముక్తాయింపుగా ....
నేను మౌనంగా వింటూ ఉన్నా ....
ఆ తరువాత ఆయనే వాళ్ళ మిత్రుల గ్రూప్ లో ఒక్కొక్కరి పేరు చెప్పి ...ఆయన ఫ్యామిలీ మాన్ ....ఇంకో ఆయన కూడా ఫ్యామిలీ మాన్ ....అని తేల్చేసారు ....
మరొకాయన్ని ఫ్యామిలీ మానా కదా అనే సందిగ్ధం లో పడేశారు కాసేపు ....
సందిగ్ధం ఎందుకంటే ......,
వాళ్ళావిడ ..., ఆయన్ని ...కొన్ని పనులు చేయడు అని కొన్నిసార్లు ఫిర్యాదుగా మాట్లాడింది కాబట్టి ....
ఆఫ్కోర్స్ ఆయన నేను అన్ని పనులు చేస్తాను అని తరువాత కొన్ని సందర్భాల్లో నిరూపించుకోవడం వలన ....మళ్ళీ ఆయన కూడా ఫ్యామిలీ మాన్ లిస్ట్ లో చోటు సంపాదించగలిగాడు ....
అప్పుడు అందరూ ఫ్యామిలీ మాన్ లు అయిపోగా ....మావారు ఒంటరిగా మిగిలారు ....
========================
ఆ తరువాత కొన్ని రోజులపాటు ....ఒక్కొక్కరి పేరు చెప్పడం ....ఆయన ఫ్యామిలీ మానా కదా అని డిస్కస్ చేయడం ....చివరకు ఫ్యామిలీ మానే అని తేల్చేయడం .....ఇలా జరిగింది ....
"అయినా ఫ్యామిలీ మాన్ ని వెదకడం కంటే ....ఫ్యామిలీ మాన్ కాని వాళ్ళను వెదుకుదామండీ ....అది ఈజీగా ఉంటుందేమో .... " చెప్పా ఆలోచిస్తూ ఒకరోజు ...
అలా వెదుకుతూనే ఉన్నాం సమయం దొరికినప్పుడల్లా ....
================
ఆ సందర్భంలో ఒకరోజు ....,,
ఒక ఫ్యామిలీ ....మమ్మల్ని మదర్స్ డే రోజు పార్టీ ఉంది రమ్మని పిలిచారు ....
సరే ప్రయత్నిస్తానండీ అని చెప్పా ....
ఏ పార్టీకయినా ...పెళ్ళిళ్ళకైనా ...శుభకార్యాలకైనా ....ఇంట్లో ఉన్న ఆడవాళ్లు నా దగ్గరకొచ్చి బొట్టుపెట్టి చెబితేనో ...లేదా ఫోన్ లో నాతో మాట్లాడి నన్ను పిలిస్తేనో నాకు మనస్ఫూర్తిగా వెళ్లాలనిపిస్తుంది ....
మా ఆయనకి చెప్పి నన్ను రమ్మని చెప్పమని చెబితే నేను వెళ్ళను ....
వాళ్ళు పద్ధతి లేని వాళ్ళు అనో ....తెలియని వాళ్ళనో నా అభిప్రాయం ....
నువ్వు సంప్రదాయాలను ఫాలో అవదల్చుకుంటే పూర్తిగా ఫాలో అవ్వాలి ...
ఈ సగం సగం పద్ధతులు నాకంతగా నచ్చవు ...
అలా పిలవలేకపోతే ...వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో చూసుకుంటా ....
ఇక్కడ పార్టీకి పిలిచినవాళ్లు .... చాలా వృద్దులు ...ఇద్దరికీ 75 ఏళ్ళ పైనే ఉంటాయి ....
వాళ్ళు ఆ వయసులో ఫంక్షన్ పెట్టుకోవడమే గొప్ప విషయం ....ఇంకా పిలవలేదని పట్టింపు నాకు ఉండకూడదు ఇక్కడ ....అందుకే వెళదాం అని అనుకున్నా ...
పైగా ...ఆవిడ నన్ను మరీ మరీ రమ్మని చెప్పమని చెప్పారట ...
సరే తప్పకుండా వెళ్దాం అనుకున్నా ....
కానీ ఆ రోజు ...నా పిల్లలిద్దరూ నాతో ఉండడం వలన ....వాళ్లకు కావాల్సినవి వండిపెట్టే ప్రయత్నంలో చాలా పనులు చేసి ....సాయంత్రానికి అలసిపోయి ....కరెక్ట్ గా పార్టీ టైం నిద్రపోయా ....
మావారు నా దగ్గరకొచ్చి చాలాసార్లు లేపడానికి ప్రయత్నం చేసి ...
ఇక రానని డిసైడ్ అయ్యి తనే పార్టీకి వెళ్లిపోయారు ...
తెల్లవారి చెప్పారు...
"నేనేదో చిన్న పార్టీ అనుకుని వెళ్ళాను ....ఆయన చాలా గ్రాండ్ గా చేశారు పార్టీ ....
నువ్వు మిస్ అయ్యావు ...." అని
"ఓహ్ అవునా ...పర్వాలేదులే మీరు ఎంజాయ్ చేశారు కదా ....ఈసారి ప్రయత్నిద్దాం" చెప్పా ...
అందరూ జంటలు వచ్చారు ...నేను ఒక్కడినే ఒంటరిగా వెళ్ళా ....
అందరూ వాళ్ళ వాళ్ళ భార్యలకు మోకాళ్ళ మీద కూర్చుని ఫ్లవర్స్ ఇచ్చి "I love you" చెప్పాలి ....
నువ్వు లేకపోవడం వలన నేను ఒక మూలనే కూర్చున్నా ఒంటరిగా" చెప్పారు ఎంతో బాధ పడుతూ ..
"అవునా" చెప్పా జాలిగా...
"కానీ ఆయన ఎప్పుడూ సింపుల్ గా కనిపిస్తాడు ....ఏం ఖర్చు పెట్టడు ....పార్టీ ఎంత గ్రాండ్ గా చేసాడు ....వాళ్ళావిడంటే ఎంత ప్రేమ ఆయనకి ...." సాలోచనగా అన్నారు ...
"అందరూ డబ్బు రోడ్లు మీద పోసుకుంటూ ....రోజూ అందరికీ ఇంత ఖర్చు చేస్తున్నా అంత ఖర్చు చేస్తున్నా అని చూపిస్తూ తిరగరు ...అవసరమైనంత ఖర్చు పెట్టుకుని ...మిగతా పావలా పావలా మూట గట్టుకుని ....ఇలా భార్యకి , పిల్లలకి , తన కుటుంబానికి అవసరమైన శుభకార్యాలు ఉన్నంతలో ఘనంగా గుర్తుండేలా జరుపుకుంటారు .....జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ....ఈ శుభకార్యాలు , లేదా ఫ్యామిలీ ఈవెంట్స్ ...ఆ శుభకార్యాల్లో తీసుకున్న ఫొటోస్ , జరుపుకున్న విధానం ....పడ్డ ఒడి దుడుకులు ...ఇవి తల్చుకుని ....మనసు పులకరింపజేసుకుని ,....తమని తాము మళ్ళీ మళ్ళీ పలకరించుకుంటారు....జీవితం అంటే ఏముందండీ ...తరచి చూసుకునే జ్ఞాపకాలే కదా ...
అందుకే ఆయన జీవితాన్ని ఈ డెబ్బై ఏళ్ళ వయసులో కూడా మరో జ్ఞాపకంగా మార్చుకోవడానికి తాపత్రయపడుతున్నారు ...." ఏకబిగిన చెప్పి ముగించా ....
"ఆయన ఫ్యామిలీ మాన్ ..." చెప్పారు ...
"అవును ...." చెప్పా...
========================
ఇంట్లో బిల్లుకట్టే పనులు చూసుకుంటే ఫ్యామిలీ మాన్ ....
పిల్లల పనులు చూసుకుంటే ఫామిలీ మాన్ ....
మార్కెట్ కి వెళ్లి కూరగాయలు తెస్తే ఫ్యామిలీ మాన్ ....
ఎక్కడకు వెళ్లినా డ్రైవింగ్ చేస్తే ఫ్యామిలీ మాన్ ....
ఇంట్లో శుభకార్యాలు చేస్తే ఫ్యామిలీ మాన్ ....
భార్యని కాస్త ప్రేమగా చూసుకుని ...ఆమె చెప్పిన మాట వింటే ఫ్యామిలీ మాన్ ....
ఏ కష్టంలో అయినా మీకేమి కాదు నేనున్నాను అని భరోసా కలిగిస్తే ఫ్యామిలీ మాన్ ...
మరి ఫ్యామిలీ మాన్ ఇవన్నీ చేస్తుంటే ....ఫ్యామిలీ మాన్ కానివాళ్ళు ఎవరు ...
ఫ్యామిలీ మాన్ కానివాళ్ళకి ఫ్యామిలీ ఎందుకు కావాలి ...
వాళ్ళు ఫ్యామిలీని ఏం చేసుకుంటారు ....
సమాజానికి నాకో ఫ్యామిలీ ఉందని చూపించడానికా ....
వాళ్ళకి తిండికి ఉండడానికి సరిపడా డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికా ...
లేదా అవి కూడా నీకిష్టం వచ్చినప్పుడో ...సమాజం చూస్తున్నప్పుడో ...ఇస్తూ ఉండడానికా ....
అయినా ఈ ఫ్యామిలీ మాన్ కానివాళ్ళని ఏమని పిలవాలి ....
ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు కాలమే నాకు సమాధానం చెప్పాలి ....!
*********** సశేషం ****************

No comments:

Post a Comment