Friday, April 3, 2020

చిన్నతనంలో అద్దెషాపులో నావెల్స్ తెచ్చుకుని ...

క్వారంటైన్ కబుర్లు ...
==============

చిన్నతనంలో అద్దెషాపులో నావెల్స్ తెచ్చుకుని ...రోజుకొకటి చొప్పున అదో పిచ్చిలాగా చదివేవాళ్ళం ...
మా ఊరులో అద్దె షాపు ఉండేది కాదు ...పొరుగూరు వెళ్ళినప్పుడే తెచ్చుకోవాలి ...
రోజుకో పుస్తకం అద్దె కట్టి తెచ్చుకోవడం కష్టం అని ....సభ్యత్వ రుసుము చెల్లించి ...ఒక్కో పుస్తకానికి పది రోజులకు సరిపడా అద్దె కట్టి ...ఓ పది పుస్తకాలు తెచ్చుకుని ...చదివేవాళ్ళం ...

పొద్దున్న పనవ్వగానే మొదలు పెట్టి ....మళ్ళీ సాయంత్రం పని చేసే టైం కే పుస్తకం లోనుండి బయటకు వచ్చేది ....
మధ్యలో ఎవరైనా పిలిచినా ..పని చెప్పినా ...విసుగు ...
తప్పించుకోవడానికే చూసేదాన్ని ...
పాపం మా నాయనమ్మ, పిల్ల చదువుకుంటుంది ..కదిలించొద్దు ....మనం పోదాం పద ...అని మిగతావాళ్ళని డిస్టర్బ్ చేయనీయకుండా చేస్తుంటే ...వామ్మో దీనికి అసలు విషయం తెలిస్తే ..ఆ గేదె బదులు నన్నే బాది పడేసిద్ది అని భయం వేసేది ....
తిండి గురించి ధ్యాస ఉండేది కాదు ...
మళ్ళీ రాత్రి పనై పోయి ...అందరూ పడుకోగానే ...లోపల గడేసుకుని ...పుస్తకం మొదలు ...అర్ధరాత్రి లైట్ ఆపెయ్యలేదని ...బయటనుండి పెట్టె కేకల్ని లెక్క చేయకుండా ...చదవడమే పని .......
ఒక్కో పుస్తకం అయిపోయేసరికి ....వేకువ జాము అయిపోయేది ...
ఒక పుస్తకం అయిపోయాక ఆ పుస్తకం ఫ్రెండ్స్ కి ఇచ్చి ...వాళ్ళ దగ్గర ఉన్న పుస్తకాలు నేను తెచ్చుకునేదాన్ని ...
ఏమాటకామాటే చెప్పాలి ...పుస్తకం ఒక్క పేజీ వదలకుండా చదవాల్సిందే ....
ఎవరైనా అండర్ లైన్ చేసి ఉంటే చిరాకు పుట్టేది ...వీళ్ళకేం పనిలేదా అని ...
అయితే అసలు కారణం తెలిసాక ఇప్పుడు నవ్వొస్తూ ఉంటుంది ....పాపం అనిపిస్తుంది ....(అది నేను ఊహించింది కాబట్టి ఇక్కడ చెప్పలేను ...)
లాస్ట్ పేజీ చిరిగి పోయి ఉంటే ...నిద్ర పట్టేది కాదు ..
ఏది ఏమైనా ...అందరూ ఇంట్లో ఉండి ఓ రెండు వారాలు హాయిగా పుస్తకాలు చదువుకోవచ్చు కదా అనిపిస్తుంది ...
ఆలోచించండి ....
నవారు మంచం ..పరుపు ...ఓ మూలకి హాయిగా బోర్లా పడుకుని ...పక్కనే చక్కరాలు పెట్టుకుని ...హాయిగా తింటూ ...నవలకి తగ్గ హావభావాలతో మునిగి తేలుతూ ...
భలే ఉంటుందిగా ...😍

Note: Wrote and published on March 23, 2010

No comments:

Post a Comment