Monday, April 6, 2020

నా చిన్నతనంలో మా ఇంట్లో ఎక్కువగా కూరగాయలు కొనేవాళ్ళు కాదు ..

క్వారంటైన్ కబుర్లు ...
==============
నా చిన్నతనంలో మా ఇంట్లో ఎక్కువగా కూరగాయలు కొనేవాళ్ళు కాదు ...ఎక్కువగా ఏమిటి ...అసలు కొనేవాళ్ళు కాదు ....ఎంతో అవసరం అయితే తప్ప ....
మరి కూరలు ఎలా తిన్నారు అని అనుకోకండి ...బోలెడన్ని కూరలు ఉండేవి తరుగు లేకుండా ...అన్ని ఆర్గానిక్ వే ...
మా పొలంలో ....గోంగూర , తోటకూర , వంకాయలు , టమాటో, మిరపకాయలు (మధ్యలో బంతి పూవులు కూడా పెట్టుకునేదాన్ని నేను ) , చిక్కుడు కాయలు (గోరు చిక్కుడు ), తంబ కాయలు (ఇవి ఒకసారి చూసినట్టు గుర్తు ), బెండకాయలు లాంటివి ...మా అమ్మ కుంట పక్కన కాస్త చోటు కేటాయించి ...ఈ మొక్కలన్నీ వేసేది ....
ఇవే కాకుండా ...అక్కడున్న జమ్మి చెట్లు, గట్టు మీద .... చిక్కుడు, సొర , గుమ్మడి , బీర , కాకర , దొండ, దోస (ఇది కిందే అల్లుకుంటది) ....మొదలైన కూరగాయలు ...చెట్టు మొదట్లో పాదు పెట్టేది ...
ఇంకా ఎక్కడ పడితే అక్కడ ...పొన్నగంటి కూర , ఇంకా ఏవో ఆకులు తెచ్చేది మా నాయనమ్మ ....
వర్షాలు పడగానే ...పొలంలో పుట్టగొడుగులు వచ్చేవి ...
సంవత్సరం అంతా కూరగాయలకు కరువుండేది కాదు ...మేం తినగా మిగిలినవి నలుగురికి పంచడానికి కూడా వీలుండేది ....
మరి వేసవి కాలం ఎలా అంటే ...అప్పుడు కూడా కూరగాయలు కొనేవాళ్ళు కాదు ...
పొలంలో పండిన కందిపప్పు ఎలాగూ ఉండేది ...జాడీల నిండా పచ్చళ్ళు ఉండేవి ....
మునక్కాయల చెట్టు ఉండనే ఉంది ...పప్పు చారుకి ....
నాన్ వెజ్ కూడా కొనే పని ఉండేది కాదు ...మా నాయనమ్మ దగ్గర అవి కూడా ఉండేవి ...
పాలు చెప్పనవసరం లేదు ....
ఎప్పుడూ మార్కెట్ కి వెళ్లి కూరగాయలు కొని తేవడం నేను చూడలేదు ...
ఇక చింతపండు, నూనె, వడ్లు ...మొదలైన సరుకులు ఆరు నెలలకు/ సంవత్సరానికి సరిపడా ....తెచ్చి ఇంట్లో పడేసేవాళ్ళు ...
ఎప్పుడైనా ఊరెళ్ళినప్పుడు...మా అమ్మని నేను క్యారెట్ తెమ్మని అడిగేదాన్ని...నాకు పచ్చివి తినడం ఇష్టం ఉండేది ....
అది కూడా తెచ్చేవాళ్ళు కాదు ...."అమ్మో.... రేట్లు మండిపోతున్నాయి ...ఎక్కడ కొంటాం " అని చెప్పేవాళ్ళు ఇంటికొచ్చి ....(అన్ని అబద్దాలే 😥)
ఏడ్చి ఏడ్చి అన్నం తినకుండా అలిగి పడుకునేదాన్ని ....
ఓసారి ఇలాగే ఓ రోజు నాకు నచ్చిన కూర ఏం లేదని నేను అన్నం తినను అని పేచీ పెడితే ...మా నాయనమ్మ ...,
నువ్వు ఎప్పుడూ తినని కూర ...పది నిమిషాల్లో రెడీ చేస్తా ఉండు అని చెప్పింది నాతో ...
దానికసలు కూరలు చేయడమే రాదు ....పది నిమిషాల్లో నాకిష్టమైన కూర ఏం చేసిద్దా అనుకుని ....కోడిగుడ్డు పొరుటు చేస్తుందేమో అని నాకొద్దు అని చెప్పేశా ...
కాదు నేను చేస్తా కదా అని ....
నిజంగానే పది నిమిషాల్లో బెల్లం వేసి పచ్చి పులుసు పెట్టేసింది ....వేసుకుని తింటే ...భలే ఉంది అనిపించింది ...నిజంగానే బాగా చేసావే ....అని లొట్టలేసుకుని తినేసా ....
మా నాయనమ్మకు ఇలాంటి క్రియేటివిటీ బాగానే ఉంటుంది కొన్నిసార్లు ....
ఏం లేదు ....చింతపండు పులుసు తీసి ....అందులో రెండు పచ్చిమిరపకాయలు , కాసిన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి ....ఉప్పు , పసుపు , కారం ...బెల్లం వేసింది అనుకోండి ....
అలాగే అప్పుడప్పుడు మజ్జిగ పులుసు పెట్టేది ....
ఇలా ఎన్నో ...ఇంట్లోనే క్రియేట్ చేసి చేసేవాళ్ళు కానీ ...పొద్దస్తమానూ బయటికెళ్లి కొనుక్కురావడం ఉండేది కాదు ....
ఏంటో ఇప్పుడు రెండు రోజులకోసారి ....బయటికెళ్లి మార్కెటింగ్ చేయకపోతే జరగని పరిస్థితులు ....
ఇలాంటి లోక్ డౌన్ సమయాల్లో మా నాయనమ్మలా....క్రియేటివిటీ తో ....వంటలు చేయాలని నాకు అర్ధం అవుతుంది ....🤔
అలాగే మీరు కూడా ఇంట్లో దొరికేవాటితో ఏవైనా చేసుకోగలిగితే ...అలాంటివి ప్రయత్నించండి ....నాకూ చెప్పండి ....👍
లాక్ డౌన్ ...జిందాబాద్ ...😊😎

No comments:

Post a Comment