Wednesday, April 15, 2020

కొన్ని కథలు అంతే ....

నా అమ్మా నాన్న ఆట కథ..
================
అప్పుడు నాకు ఓ పదేళ్లు ఉండొచ్చేమో ...సరిగా గుర్తులేదు వయసెంతో ....ఎక్కువ కావచ్చు ...తక్కువ కావచ్చు ...చెప్పలేను ....
కానీ ఓ జ్ఞాపకం మాత్రం పదిలంగా ఉండిపోయింది ...
అది ..జ్ఞాపకాల పొరల్లోనుండి ..మనసు గది కాస్త ఖాళీ అయినప్పుడు తొంగి చూస్తూ ఉంటుంది ...
----------------------
వారాంతంలో అప్పుడప్పుడూ పిల్లలతో కలిసి సరదాగా గేదెలను తోలుకుని పొలం వెళ్లేదాన్ని ...
ఇలా వెళ్లడం కోసం ఇంట్లో వాళ్ళను ఎంతో నమ్మించాల్సి ఉండేది ...మళ్ళీ క్షేమంగా ఇంటికి తీసుకొచ్చే వరకు గేదెల్ని నేను బాగానే చూసుకుంటానని ...ఎక్కడికీ పంట పొలాల్లోకి వెళ్లనివ్వకుండా చూసుకుంటా అని ...ఎవరితోనూ గొడవలు పడను అని ..ఇలా ...
పిల్లలందరం సరదాగా ఆడుకోవచ్చు అని నా అసలు ప్లాన్ అనుకోండి ...అది చిన్నపిల్లల విషయం ..పెద్దవాళ్ళు పట్టించుకోకూడదు ...
ఒకరోజు ...అలాగే పిల్లలు అందరం కలిసి ...వెళ్లాలని ...నిర్ణయించుకున్నాం ....
పొలం అన్నం కూడా తీసుకుని వెళ్దాం అని ...పిల్లలు పెట్టుకుని రమ్మన్నారు ...
ఇంటికొచ్చి పొలం అన్నం పెట్టుకుంటుంటే .."ఇక్కడే కాలవదాకా తోలుకెళ్లే దానికి ...పొలం అన్నం ఎందుకే...." అడిగారు ఇంట్లో ...
"ఏమో తెలీదు ....పిల్లలందరూ తెచ్చుకుంటున్నారు ...." చెప్పా
"కొండ పొలం అంత దూరం పోవద్దు ...." బెదిరించారు ...
"సరే ....మేం ఇక్కడిక్కడే ఉంటాం ...అందరూ అదే చెప్పారు" చెప్పా
"వాళ్ళు పోతే పోయారు ...నువ్వు వెనక్కి తోలుకురా ...." హుకుం జరీ చేసారు ...
అన్నిటికి బుద్ధిమంతుల్లా తలూపి ...క్యారేజ్ చేతబట్టుకుని ....గేదెల్ని తీసుకుని పొలానికి బయల్దేరామ్ ...అందులో కొందరు అబ్బాయిలు కూడా ఉన్నారు ....
దారిలో ...పిల్ల గ్రూప్ చెప్పింది ఏంటంటే ...మేం ఆ రోజు వంకాయలపాడు డొంకకు పోతున్నాం అని ...
అది కొత్త ప్రదేశం నాకు ...ఎప్పుడూ చూడలేదు ...
సరే దారిలో చెట్లు పుట్టలకు దొరికినవి కోసుకుని తింటూ ..వెళ్తూ ఉన్నాం ....కాలవ గట్టు దగ్గర కాసేపు కూర్చున్నాం ....
మా పడమర పొలం కూడా దాటేశాం ...
ఆ తరువాత ఇక నేను దారి గుర్తుపట్టలేకపోయా ...కానీ నా పక్కన ఉన్న పిల్లలందరికీ తెలుసు కాబట్టి భరోసాతో ఉన్నా ....
చాలా దూరం వెళ్ళాక ...అదే వంకాయలపాడు అన్నారు పిల్లలు దూరంగా కనిపిస్తున్న కొన్ని ఇళ్లు చూపించి ...
వింతగా అనిపించింది ....మేం నడుచుకుంటూ వేరే ఊరు వచ్చేసామా అని ...
అక్కడ కొన్ని ఉప్పు గడ్డి దిబ్బలు కనిపించాయి ....అవి గేదెలు తినకుండా చూడాలన్నారు అందరూ ....
కానీ తినకుండా కంట్రోల్ చేయడం మా వల్ల కాలేదు ...ఏదో ఒకటి పాపం ఇష్టంగా తింటున్నాయి కదా అని ఒక దశలో మేం వాటిని వదిలేశాం ....
మమ్మల్ని అవి డిస్ట్రర్బ్ చెయ్యట్లేదు అనే ఆలోచించాం కానీ అవి తినే గడ్డి ఎలాంటిదో మాకు అవగాహన లేదు అప్పట్లో ....
ఇక్కడ నీళ్ల చెలమలు ఉంటాయి ...అవి తవ్వితే నీళ్లు వస్తాయి అన్నారు పిల్లలు ......
నేను అంతకు ముందు ఎప్పుడూ అలాంటివి చూడలేదు ...
ఒక చిన్న పుల్ల తీసుకుని ....ఒకచోట ఇసుక ను తవ్వడం మొదలుపెట్టారు అందరూ ....
కాస్త తవ్వగానే అందులోనుండి నీళ్లు ఊరడం మొదలయ్యింది ....అవి తాగొచ్చు అన్నారు ....అవి నిజంగానే చాలా బాగున్నాయి ....
అలా సరదాగా ఒక్కో చెలమ తవ్వడం ....నీళ్లు రాగానే సరదా పడిపోవడం ....
అన్ని రుచి చూడడం ....కొన్ని తియ్యగా ఉన్నాయని , మరికొన్ని చప్పగా ఉన్నాయని ....కొన్ని ఉప్పగా ఉన్నాయని సర్టిఫికెట్స్ ఇచ్చెయ్యడం ....
చాలా సమయం అక్కడే ఇసుకలో చెలమలు తవ్వుతూ గడిపేసాం ....
ఇక ఆకలేస్తుందని ....తెచ్చుకున్న కారేజీల్ని అందరం కలిసి తినేసాం ...
అయితే ..ఇవన్నీ జరుగుతున్నంతసేపూ ...ఎక్కడో ఏదో అసహజంగా ఉన్న వాతావరణం ....ఎవరో నన్ను అదే పనిగా గమనిస్తున్న స్పర్శ ....నన్నే చూడాలని తపిస్తున్న కళ్ళు ...నా పక్కనే ఉండాలని ఆరాటపడుతున్న ఓ ఉనికిని నా మెదడు , శరీరం గమనిస్తుందని నాకు తెలియకుండానే అనిపించింది ...
అదేమిటో నాకు అప్పుడు అర్ధం కాలేదు ...
సరే అన్నం తినడం అయిపోయాక ....మా క్యారేజీలు మేం తీసుకుని ...గేదెల్ని తోలుకుని ఇంకో చోటుకి వెళ్దాం అని బయల్దేరాం ....
కొంత దూరం వచ్చాక ...ఎండగా ఉందని కాసేపు గేదెల్ని చెట్లు కింద నిలబెడదాం అని ....మేం చెట్లకిందకు చేరుకున్నాం ....
అప్పుడు పిల్లలు ఏవైనా ఆటలు ఆడుకుందాం అన్నారు ...
ఏం ఆటలు అక్కడ ఆడామో నాకు సరిగా గుర్తులేదు ...కానీ ఒకే ఒక్క ఆట గుర్తుంది ...
అమ్మ నాన్న ఆట ...
అందులో ఉన్న మగ పిల్లలు ....అమ్మా నాన్న ఆట ఆడదాం అన్నారు ....
ఎవరెవరు అమ్మా నాన్న ....ఎవరు పిల్లలు ..అని అందరూ నిర్ణయించేసారు ....
నేను ఒకబ్బాయికి పెళ్ళాం గా (అప్పట్లో భార్య అనే పదం తెలియదు అసలు మాకు...మొగుడు పెళ్ళాం ఇంతే తెలుసు) ఉండాలన్నారు ...
సరే అంటే ...సరే అనుకున్నాం ...
నాకు తెలిసి నేను అమ్మా నాన్న ఆట ఆడిన మొదటి / చివరి సందర్భం అదే ...
ఇంట్లో అమ్మ నాన్న ఏం చేస్తారో అవన్నీ చేయాలి ....
అక్కడున్న మట్టి గడ్డలు , పుల్లలు , మేం తెచ్చుకున్న టిఫిన్ బాక్స్ లు ...ఉపయోగించి ....అన్నం కూర లాంటివి వండి వడ్డించడం చేసాం ...ఉత్తుత్తి వంట చేయడం , ఉత్తుత్తిగా వడ్డించడం ...వాళ్ళు తిన్నాక ...చేయి కడుక్కోవడానికి నీళ్లివ్వడం ...పిల్లలకి పెట్టడం (పిల్లల క్యారెక్టర్స్ కొందరు ఉంటారుగా )
ఇంట్లో చూసినవి గుర్తున్నవి చేసాం ....
ఇక పడుకుందాం రాత్రయింది అన్నారు ...
ఇప్పుడు మొగుడు పెళ్ళాం పక్క పక్కనే పడుకోవాలి అన్నారు ....
అప్పుడు నాకు కొంచెం కొత్తగా అనిపించింది ....
మేం మాతో తెచ్చుకున్న కండువా వోణిలాగా చుట్టుకున్నది ...అక్కడే పరిచేసి ....పక్కనే పడుకోమన్నారు...
ఆ అబ్బాయి నేను పక్క పక్కనే పడుకున్నాం ...
కాసేపు నిద్రపోయినట్టు నటించి ...లేచాం ...
పిల్లలందరూ మా ఇద్దర్నీ మొగుడూ పెళ్లాలుగా గుర్తించారు ....అప్పటినుండి ....అలాగే పిలవడం మొదలు పెట్టారు ....ఆ అబ్బాయి కూడా ...నన్ను అలాగే చూసుకోవడం మొదలు పెట్టాడు ....
పిల్లలందరూ మీ ఆయన అనడం ...నాకు విచిత్రంగా అనిపించడం మొదలు పెట్టింది ...
మీ ఆవిడ అంటుంటే ...అందుకు ఆ అబ్బాయి ముసి ముసిగా నవ్వడం ఇంకా చిత్రంగా అనిపించింది ....
సరే అందరం సాయంత్రానికి ఇంటికి వచ్చేసాం ....
ఇంటికి వచ్చాక ...ఎటూ అంత దూరం వెళ్లినందుకు ....గేదెలకు ఉప్పు గడ్డి తినిపించినందుకు అక్షింతలయితే పడ్డాయ్ ...
కానీ ..నాకు అందుకు భయం వేయలేదు ఈ సారి ...
నేను తప్పు చేసానని భయం వేసింది ....ఆ తప్పు మా పెద్దవాళ్లకు ఎక్కడ తెలిసిపోతుందో అని భయం వేసింది ...అమ్మ నాన్న ఆట ఆడడం తప్పని భయం వేసింది ....
అంతకంటే ఎక్కువ భయం వేసింది ఒకటి ఉంది ....చెప్తే నవ్వకూడదు ...ఇది ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు ....
మేం పక్క పక్కనే పడుకున్నాం కదా ....నాకు కడుపొస్తుందేమో ...పిల్లలు పుడతారేమో అని భయం వేసింది ....
అప్పుడు మా అమ్మ వాళ్ళు నన్ను కొడతారేమో అని భయం వేసింది ....
పక్క పక్కనే పడుకుంటే పిల్లలు పుడతారా లేదా అనే భయంతో కూడిన సందేహం వచ్చింది ...ఎలా నా సందేహం తీరేది ...సినిమాల్లో అలాగే చూపిస్తారు కదా ...
పక్కపక్కనే పడుకున్నప్పుడు ఆ పిల్లాడు నా మీద చెయ్యి కూడా వేసాడని గుర్తు ...అంటే తాకితే ఖచ్చితంగా పిల్లలు పుట్టేస్తారా ....ఈ రోజు పొట్ట కాస్త లావయింది ....అంటే పిల్లలు పొట్టలోకి వచ్చేసారా ...ఎన్ని రోజులు పడుతుంది నాకు పిల్లలు పుడతారా లేదో తెలుసుకోవడానికి ...ఓ రెండు మూడు రోజులు పడుతుందా ...దేవుడా ఇంక ఈ తప్పు ఎప్పుడూ చేయను ....ఈ ఒక్కసారికి పిల్లలు పుట్టకుండా చూడు ....ఇలా సాగింది నా ఆలోచనల ప్రవాహం ...
ఈ తప్పు చేశాననే భయంతో ....ఇంట్లో వాళ్ళు ఏం చెప్పినా మంచిగా వినేదాన్ని కొన్ని రోజులు ....
ఆ తర్వాత పిల్లలు బయట ఎక్కడ కనిపించినా ...మీ ఆయన అడుగో అనడం ....ఏడిపించడం మొదలుపెట్టారు ....
కానీ ఇదంతా చిన్ననాటి ఆటలుగా పక్కన పెడితే ...ఆ ఫీలింగ్ ఎప్పటికీ నా మనసులో ఉండిపోయింది ...ఆ అబ్బాయితో నేను ఎప్పటికీ మాట్లాడలేదు ఆ తర్వాత ....
చిన్నప్పుడు భయంతో ....తర్వాత సిగ్గుతో ....ఎప్పుడు చూసినా ఆ ఆట గుర్తుకు వచ్చేది ...నన్ను మాట్లాడనిచ్చేది కాదు ...
తను ఎందుకు మాట్లాడలేదో నాకు తెలియదు ....బహుశా సామజిక అంతరాలు , భయం కావచ్చు ...
కానీ ...తను నాకు తారసపడుతున్నప్పుడల్లా .... ఎక్కడో ఏదో అసహజంగా ఉన్న వాతావరణం ....ఎవరో నన్ను అదే పనిగా గమనిస్తున్న స్పర్శ ....నన్నే చూడాలని తపిస్తున్న కళ్ళు ...నా పక్కనే ఉండాలని ఆరాటపడుతున్న ఓ ఉనికిని నా మెదడు , శరీరం గమనిస్తుందని నాకు తెలిసీ అనిపించేది ...
అదేమిటో నాకు అప్పుడు అర్ధం అయింది ...
కానీ ఎక్కడో ఏదో అజ్ఞాతంగా ఎప్పుడూ అడ్డు పడుతూ ఉండేది ...
మేం ఇద్దరం ఆ ఆతర్వాత ఎప్పటికీ మాట్లాడుకోకుండానే మిగిలిపోయాం ....
ఇంకెప్పటికీ ఖచ్చితంగా అలాగే మిగిలిపోతాం ....😢
కొన్ని కథలు అంతే ....నా అమ్మా నాన్న ఆట కథ కూడా అంతే ...!
************************************

No comments:

Post a Comment