Saturday, September 25, 2021

నాకేదైనా బాధ కలిగితే ....

 నాకేదైనా బాధ కలిగితే ....లేదా బాధ కలిగించే సంఘటన కలిగితే ఎవరికీ చెప్పే అలవాటు నాకు లేదు చిన్నతనం నుండి ...

చిన్నతనంలో అయితే ...ఒంటరిగా కాసేపు ఏడ్చి ...లేదా కొన్ని రోజులు అన్నం తినకుండా అలిగి ...ఆ బాధను మర్చిపోయాక ....మళ్ళీ సాధారణ జీవితంలో పడిపోయేదాన్ని ....
పెళ్లయిన తరువాత ....నాకు ఒక్క అవకాశమే మిగిలింది ...వీలయితే కాసేపు కూర్చుని ఏడవడం ....లేదా ఆ అవకాశం కూడా లేకపోతే కళ్ళు తుడుచుకుంటూ పని చేసుకోవడం ....
ఆ తరువాత బాధ కలిగినప్పుడు డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా ఎదో ఒకటి ఫేస్ బుక్ లో వ్రాసుకుని నా బాధల్ని మర్చిపోయి ....మళ్ళీ దైనందిన కార్యక్రమాల్లో పడిపోయేదాన్ని ....
ఆర్టికల్స్ వ్రాసుకోవడం అనేది నాకెంతో స్ట్రెస్ ని తగ్గించింది .....
ఒక్కసారి ఎప్పుడో చాలా ఏళ్ళ క్రితం ...అమ్మతో ఫోన్ లో మాట్లాడుతూ ఉన్నప్పుడు కంట్రోల్ చేసుకోలేక ఒకే ఒక్క సారి ఏడ్చా ....
కానీ తర్వాత రోజు రియలైజ్ అయ్యా ...."ఛీ నేనేం చేశాను ....తనెంత బాధపడి ఉంటుంది ....నేను ఇంత పిరికిగా తయారయ్యానని ...సమస్యలు పరిష్కరించుకోలేకపోతున్నాను అని అనుకోదూ" అని ...అప్పుడే నిర్ణయించుకున్నా ....ఇక అమ్మ ముందు ఎప్పుడూ బయటపడకూడదు అని ....
క్రమేణా బాధ కలిగినప్పుడు ...ఏడ్చి భారాన్ని దించుకోవడం అనేది కూడా నాకు బాధగా మారింది ....
అందుకే ఈ మధ్య మౌనాన్ని ఆశ్రయిస్తున్నా ....
నాకు బాధగా ఉన్నప్పుడు ఎవరితోనూ మాట్లాడను ....ఎవరినీ కలవను ....
వాళ్ళు అపార్ధం చేసుకున్నా సరే ....
ఓ నాలుగైదు నెలల క్రితం అనుకుంటా ....విపరీతమైన బాధ కలిగింది ....
తలుపులేసుకుని ...ఒక రోజంతా ఏడ్చా ....
విపరీతమైన తలనొప్పి కలిగింది ఏడవలేక ....పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా ...
ఏడవొద్దు అనుకుంటున్నా ...అయినా ఏడుపొస్తుంది ...
కొంత బలహీనత శరీరాన్ని ఆక్రమించినప్పుడు ....మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం కూడా మన చేతుల్లో ఉండదనుకుంటా ....
ఆ రాత్రంతా నిద్ర పోలేదు ... చివరికి అక్షరాల్ని ఆశ్రయిద్దాం అనుకున్నా ....సాధ్యం కాలేదు ....
ఏం చేయాలో అర్ధం కాలేదు ....
తెల్లవారాక ...ఈ బాధ ని కాస్తయినా కంట్రోల్ చేసుకోవాలంటే ....ఎవరో ఒకరితో ఆత్మీయులతో మాట్లాడే తీరాలని అర్ధమైంది ....
ఎవరితో మాట్లాడాలన్నా ఏం జరిగింది అని అడుగుతారు ....
నేను ఏం చెప్పలేను ....
అలా అడగకుండా నాతో మాట్లాడేవాళ్ళు ఎవరా అని ఆలోచించా ....
ఒకరికి ఫోన్ చేశా ....చేయగానే తను ఫోన్ తీసింది ....
"నాతో కాసేపు మాట్లాడు ....నేను కాస్త నార్మల్ స్టేజి కి రావాలి " అడిగా ఏడుపు ఆపుకుంటూ ...
తను నన్నేం ప్రశ్నించలేదు ....కాసేపు మాట్లాడింది ....ఏం జరిగింది అని అడగలేదు ...
అడగొద్దు అని నేను చెప్పాను అంటే ...ఎదో బలమైన కారణం ఉండే ఉంటుంది అని తను అర్ధం చేసుకుంది ....
కాసేపు మాట్లాడాక ...కాస్త మామూలు స్థితిలోకి వచ్చాను అనిపించింది ....
మళ్ళీ తరవాత రోజు "ఛీ నేనేం చేశాను ....తనెంత బాధపడి ఉంటుంది ...." అనుకున్నా ...
మొన్నీ మధ్య నా చిన్న కూతురు "మమ్మి ...సైకాలజిస్టు అపాయింట్మెంట్ తీసుకో ..." చెప్పింది....నాకు ఒంటరిగా ఉంటే హాయిగా ఉంది ...అని అంటే తనతో ....
"అంటే ...ఏవో సమస్యలుంటేనే సైకాలజిస్టు దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు ...నీకేమనిపిస్తుందో చెబితే ...అది సమస్యా .. కాదా అని వాళ్లే చెబుతారు ....నీకు నమ్మకమైన ఒక వ్యక్తి నీ గురించి షేర్ చేసుకోవడానికి దొరికినట్టు కూడా అనిపిస్తుంది ...." మళ్ళీ తనే చెప్పింది ....
"నిజమే ....మంచి సలహా ...తప్పకుండా తీసుకుంటా" అని చెప్పా .....
"ఇక్కడ ...క్లైంట్స్ గురించి ..ఇన్ఫర్మేషన్ చాలా సీక్రెట్ గా ఉంచుతారు ....నీకు తెలుసు కాదా ...." మళ్ళీ చెప్పింది ....
జస్ట్ ఇది కూడా ఎందుకో వ్రాసుకోవాలనిపించింది ....ఎవరికీ చెప్పాలని కాదు ....
శరీరానికి ఎప్పుడూ మనం భరించలేనంత భావం ఇవ్వలేం ....భరించలేనప్పుడు సహాయం కావాలి దానికి ....
అది ఒక నేస్తం కావచ్చు ....అమ్మ కావచ్చు ....అక్షరం కావచ్చు ....లేదా సైకాలజిస్టు కావచ్చు .....!
Like
Comment
Share

No comments:

Post a Comment