Friday, September 17, 2021

దేవతలందరు ఒకటై వచ్చి దీవెనలీయాలి ...

 ఇందాక డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటే నా సాంగ్స్ లిస్ట్ లో ఉన్న ..."దేవతలందరు ఒకటై వచ్చి దీవెనలీయాలి ...నీ పసుపు కుంకుమ సౌభాగ్యం ...." అనే పాట ప్లే అయింది ...

నాకెందుకో ....చిన్నతనంలో నోరు వెళ్ళబెట్టుకుని చూసిన కార్తీక దీపం, శ్రీరంగ నీతులు లాంటి సినిమాలు ... ఈ పసుపు కుంకుమ ....ముఖ్యంగా తాళి గొప్పతనం పాటలు ....అమ్మాయి అంటే ....వాటికి విలువ ఇస్తూ ....వాటిని కాపాడుకుంటూ ..వాటిని మొగుడే ప్రసాదించాడని నమ్మేస్తూ ... ఉండడం అంటే ....నాకు నవ్వొస్తూ ఉంటుంది ...ఇలాంటివి సినిమాలు చిన్నప్పుడు ఎలా చూశాం రా బాబూ అనిపిస్తుంది ....
మొన్నెప్పుడో ...వరలక్ష్మి వ్రతం తాంబూలానికి రమ్మని అందరూ బలవంతపెడితే వాళ్ళింటికి వెళ్ళా ...
సరే సాంప్రదాయ వ్రతం కదా ...చీర కట్టుకుని మెడలో చైన్ ...నల్లపూసలు దండ ఉంటే (అది నాకు ఇష్టం లెండి ...) అది వేసుకుని వెళ్ళా ...
నిజానికి చైన్ అంటే ఇక్కడ తాళి అని అర్ధం ....
అదెలా తయారు చేస్తారంటే ...ఆ చైన్ కి రెండు చివర్లలో రెండు హోల్స్ ఉంటాయి ....అందులో పసుపు దారం కట్టుకుని ....రెండు రౌండ్ గా ఉండే బంగారం కాయిన్స్ లాంటివి తగిలించుకుని ....మధ్య మధ్యలో లావుగా ఉండే నాలుగు లేదా ఆరు నల్ల పూసలు గుచ్చుకుని ...(ఎందుకో నాకు తెలియదు ...) అందులో ఓ రెండు ఎర్ర పూసలు కూడా వేసుకుని ....(ఇదెందుకో కూడా తెలియదు ...) ఒక చిన్న బంగారం గొట్టం కూడా వేస్తారంట ....(ఇది కూడా నాకు తెలియదు ) మధ్య మధ్యలో మన కంఫర్ట్ కోసం ....కీ చైన్ లాగా ...పిన్నీసులు పెట్టుకునే స్టాండ్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు ...ఇలా మాన్యుఫ్యాక్చర్ చేస్తారు ....
ఇవన్నీ మా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ....ఫ్యాన్సీ షాప్ కి వెళ్లి పసుపు దారం (తాళి దారం అంటే ఇస్తారు ...అని మా అమ్మ నన్ను అప్పుడప్పుడు తీసుకుని రమ్మని అంటుంది ...) తెచ్చి ...అది తాడులా పేని (పేనడం అంటే ....రెండు చిన్న సైజు గుత్తుల దారాలు తీసుకుని అది మన చేతి మీద లేదా తొడ మీద వేసుకుని అవి రెండూ మెలికలు పడేవరకు తిప్పుతారు....ఇది చిన్న సైజు కాబట్టి చేతి మీద సరిపోతుంది ....చిన్నతనంలో నేను మా నాన్నతో కలిసి తాడులు పేనడం నేర్చుకున్నా ....) దానికి ఈ సరంజామా అంతా గుచ్చి ....ఆ బంగారు గొలుసుకి రెండుపక్కలా ....ఊడిపోకుండా ....(మొగుడూ పెళ్ళాం విడిపోయినా పర్లేదు ) చాలా ముడులు వేస్తారు ....
అప్పుడది తాళిగా తయారవుతుంది అన్నమాట ....
మొన్నామధ్య ఇండియా వచ్చినప్పుడు ....మా అమ్మ ఈ ముడులు వేసే టైం లేక ...నా బ్యాగులో ....ఈ పసుపు తాడు పెట్టి మర్చిపోకుండా ఇక్కడికి వచ్చాక ముడులేసుకోమంది ....
నాకు మా ఆయన్ను ముడేసుకోవడమే రాలేదు ...ఇంకా తాళి ఏం ముడేస్తా ....
అవి భద్రంగా పెట్టినవి పెట్టినట్టే ఉన్నాయి ...
శ్రావణ శుక్రవారం వ్రతానికి పోయినప్పుడు ...అందరూ పసుపు , కుంకుమ తాళికి పెట్టుకోమన్నారు ....
నేనేమో తీసుకుని ....తాళి లేదు లోపల అంటే ఫీల్ అవుతారని ...ఆ చైన్ కే పూసుకున్నా ....
అంటే ....ఇది కాస్ట్లీ తాళి అన్నట్టు ....
ఇలా కాకుండా ...పేదవాళ్ళు ఒక దారానికి పసుపు కొమ్ము కట్టి ...అమ్మాయి మెళ్ళో మూడు ముళ్ళు వేస్తే అది కూడా తాళే అవుతుంది అన్నట్టు ....
చంటి సినిమాలో ....అమ్మా ... నందినికి ఏం తెలియదమ్మా ...మేళ తాళాలు ...పప్పన్నాలు..ఊరేగింపులు లేకుండా పెళ్లయిపోయింది అంటుంది ....అంటాడు చంటి ....
అవన్నీ లేకపోయినా కూడా పెళ్లి జరగొచ్చు ....కానీ పసుపు కొమ్ము లేకుండా పెళ్లి జరగదు బాబూ అంటుంది ....వాళ్ళ అమ్మ ....
అంటే అమెరికాలో అయితే ...ఆ పసుపు కొమ్ము వజ్రాలతో చేయించినా కూడా ...ప్రేమ లేకుండా పెళ్లి జరగదనుకోండి ....అది పూర్తిగా మన సంప్రదాయానికి సంబంధం లేని విషయం .....
ఇంతకీ నేనెక్కడున్నా ...
ఆ ఫంక్షన్ లో ఉన్న కదా ....
దొంగ లాగా ఆ పసుపు ..."లోపల తాళి దాచి ఉంచా ....అది బయటకి వేసుకోను" అన్నట్టు బిల్డప్ ఇచ్చి ....పసుపు , కుంకుమ లోపల ఎక్కడ పూసానో తెలియకుండా పూసి "మమ" అనేశా ...
వాళ్ళల్లో ఎవరూ హరిశ్చంద్రులు కాదు ....నేను చంద్రమతిని కాదు కాబట్టి వాళ్ళు నన్ను పతివ్రత అనే అనుకున్నారు ....
లేకపోతేనా ...."అది మాంగల్యము కాదు కాబోలు ....అది మాంగల్యము కాదు కాబోలు" అని గగ్గోలు పెట్టేవాళ్ళు ...."నా వద్ద తాళి ఉన్నదే ....తాళి ఉన్నదే " అని నమ్మించాల్సి వచ్చేది ....
ఇంతకూ పాటగురించి కదూ తలచుకుంటున్నా ....
ఆడపిల్ల కు చిన్నతనం నుండి ఎంత నూరిపోస్తారు ....ఆ పసుపు , కుంకుమ , తాళి కాపాడుకోవాలి ....అప్పుడే నీకు సౌభాగ్యం ఉంటుంది అని ...అవి భద్రంగా ఉంటే నీ భర్త క్షేమంగా ఉంటాడు ...నీ భర్త క్షేమంగా ఉంటే నువ్వు నీ పిల్లలు క్షేమంగా ఉంటారు ....అని...
మాయల ఫకీరు ప్రాణాలు చిలకలో ఉన్నట్టు ....మొగుళ్ళ ప్రాణాలు తాళిలో ఉన్నాయి ....అన్నమాట ....
మరి చిలకని పట్టుకుంటే మాయల ఫకీరు గిల గిల మంటాడు ....
తాళి అవతల పడేస్తే మొగుడు బాగానే ఉంటాడుగా ....
అంటే ...మొగుడి ప్రాణాలు అక్కడ లేవు ....ఇంకెక్కడో ఉన్నాయని అర్ధం ....పిచ్చి తల్లులకు అర్ధమయ్యేది ఎప్పుడో ....
కాబట్టి ఈ నమ్మకాన్ని మన బ్రెయిన్ ల మీద రుద్దిన ఈ సమాజాన్ని కాసేపు బజ్జోమని చెప్పి ...అందరూ తన పనుల మీద ....అభివృద్ధి మీద ....తన మీద తను .... నమ్మకం పెంచుకుంటే ....స్త్రీ జీవితం పురుషుడు కట్టిన తాళి కంటే బాగుంటుంది ....
ఎందుకో అనిపిస్తుంది ....కొన్ని విషయాల్లో సమాజాన్ని నమ్మించడానికి నేను కూడా చాలాసార్లు దొంగలా బ్రతికా ....
మా అమ్మ దగ్గరకు వెళ్ళినప్పుడు మాత్రం ఆ తాళి భద్రంగా ఓ రెండు రోజులు వేసుకుంటా ....తరువాత ఆ తాళి ఎక్కడకు పోతుందో నాకే తెలియదు ....భద్రంగా పెట్టెలో పెట్టేస్తా ....
కానీ కొన్ని పాటలు వింటుంటే మాత్రం నవ్వుకోకుండా ఉండలేను ....
అన్నట్టు జీవితంలో ఒక్కసారి కూడా నేను తాళిని తీసి కళ్ళకు అద్దుకోలేదు ...కళ్ళు పోతాయేమో నాకు ...
అప్పుడు తాళి పాటలన్ని ఏమైపోవాలి ....
ఏమాటకామాటే చెప్పుకోవాలి ....ఎల్లో త్రెడ్ , ఎల్లో హార్న్ ....సంప్రదాయాన్ని తమ నెత్తిన పెట్టుకుని ఎంతగా మోశాయో....మన సినిమా పరిశ్రమని కూడా అంతగా బ్రతికించాయి ...
తాళి ఆడవాళ్ళ మెడల్లో వేసుకుని మోసినా ....బాగు పడింది మగవాళ్లే ఎక్కువ ....
ఏమైనా తాళికి రెండువైపులా పదునుంది... సంప్రదాయం వెర్సెస్ సినిమా (కమర్షియల్ )
ఇంత చెప్పాను కాదా పిక్ తీద్దాం అని వెతికితే ....ఆ షాప్ లో కొన్న పసుపు దారం కనిపించలేదు ....ఎక్కడ పడేశానో ...
ఎప్పుడో తవ్వకాల్లో బయట పడుతుందిలే ...
కానీ ఎప్పుడో పాతికేళ్ల క్రితం మా ఆయన పెళ్ళిలో కట్టిన పసుపు దారం మాత్రం భద్రంగా ఉంది ...
జీవితాన్ని తలక్రిందులు చేసిన దాన్ని అంత తేలికగా ఎలా పడేసుకుంటాం చెప్పండి ....
నా గురించి ...జీవితం గురించి ..మర్చిపోయినప్పుడు ...అప్పుడప్పుడూ గుర్తు చేసుకోవద్దూ ....
పైగా ...నీకూ నాకూ పెళ్లి కాలేదు అని మా ఆయన ఎప్పుడైనా అంటే ........దాని మీద వేలి ముద్రలు నావి , మా ఆయనవే ఉంటాయి కాబట్టి ....ఈజీగా పెళ్లయిందని ప్రూవ్ చెయ్యొచ్చు ....
ఏమంటారు ...?!
హాపీ వీకెండ్ ....!


No comments:

Post a Comment