Thursday, October 7, 2021

హాయిగా యోగా చేసుకుని ....యాప్ లో యాడ్ చేసుకుందాం ...పదండి ..

 ఈ ఆపిల్ వాచ్ లో ఆక్టివిటీ సెట్టింగ్స్ ఆన్ లో పెట్టా అన్నమాట ....,

పడుకుని ఉంటే ... ఒక నిమిషం లేచి నిలబడు అంటది...
కూర్చుని ఉంటే ...ఇప్పుడు ఒక నిమిషం గట్టిగా గాలి పీల్చుకో అంటది ...
ఏదో పని చేసుకుంటుంటే ...ఒక నిమిషం నడువు అంటది ...
వాక్ చేస్తే ...బయట వాకింగ్ చేస్తున్నట్టున్నావు ...గుడ్ జాబ్ అంటది ...
ఇలా ఏ పని చేసినా కనిపెట్టడం ...పని చెయ్యకపోయినా కనిపెట్టడం ...
దేవుడా ...జీవితంలో ఎవ్వరూ ఇలా ఆర్డర్స్ వేయలేదు నాకు ...
కానీ విచిత్రం ఏమిటంటే ....గిన్నెలు కడిగినా ...వంట చేసినా ...ఇల్లు శుభ్రం చేసినా గుర్తు పట్టదు ....ఉలకదు ...పలకదు ....
ఒక వెల్నెస్ ప్రోగ్రాం లో పాల్గొంటున్నా కొన్ని రోజులు ......
రోజూ ఎన్ని స్టెప్స్ చేసాము ....ఎంత వర్కౌట్ చేసామో యాడ్ చేయాలి ...
అందులో నేను రోజూ చేసే స్టెప్స్ ఆటోమాటిక్ గా యాడ్ అవుతాయి ....
కానీ ఏదైనా ఆక్టివిటీ చేస్తే మనం ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసి మాన్యువల్ గా యాడ్ చేయాలి ....
అందులో ...గార్డెనింగ్ ....యోగా ....సైక్లింగ్ ....ఇలా ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి ....
వంట / గిన్నెలు కడగడం అనే ఆప్షన్ మాత్రం లేదు ....
చూశారా ....కానీ మనం వంట చేసిన గిన్నెలు కడగాలంటే ....నిజం చెబుతున్నాను ఎన్ని కాలరీస్ ఖర్చవుతాయి అనేది ....లెక్కపెట్టడం కష్టం ....
మన కూరలు ...ఆ కూరలు చేయడానికి ....అందులో మసాలాలు నూరి పోసి ....సన్నటి ముక్కలు తరిగి ....కుక్కర్ లో పెట్టకుండా ...మంచిగా ...రుచిగా వండి ....అడుగంటిన కుక్కర్ ...గిన్నెలు ....ఇవన్నీ కడగడం ఒక్క మన లేడీస్ కి మాత్రమే సాధ్యం ....
ఆ డిష్ వాషర్ కనిపెట్టిన వాడు కూడా ....ఈ గిన్నెలు శుభ్రం చేసేలా డిజైన్ చేయలేకపోయాడు ...
అది డిజైన్ చేయాలంటే ఎప్పుడైనా ....మనం మటన్ కూర వండిన గిన్నె ఒకసారి అయినా కడిగి ఉండాలిగా ....
ఎక్కడా గుర్తించబడని ....(ఆఖరికి ఇంట్లో కూడా ...) ..ఆఖరికి ....వెల్నెస్ ఆప్ వాడు కూడా లెక్కచేయని ....ఈ గిన్నెలు / వంట అనే విలువ లేని టాస్క్ ల వలన ..ఉపయోగం ఏమన్నా ఉందా అని స్త్రీ జాతి ఆలోచించాలి ....
హాయిగా యోగా చేసుకుని ....యాప్ లో యాడ్ చేసుకుందాం ...పదండి ... ....!🧎‍♀️

Tuesday, September 28, 2021

సక్సెస్ అనేది ప్రత్యేకంగా ఏమీ లేదు ..

 "జీవితంలో చాలాసార్లు నాకు 99 ఫెయిల్యూర్స్ చూశాక ...100 వ ప్రయత్నానికి ...ఒక్క సక్సెస్ వచ్చింది ...

ఆ ఒక్క సక్సెస్ ..జరిగిపోయిన 99 ఫెయిల్యూర్స్ వలనే వచ్చిందని నాకు తెలుసు ....
ఒక్కొక్క ఫెయిల్యూర్ లో నుండి ఒక్కొక్క పాఠాన్ని నేర్చుకుని మెట్లు కట్టుకుంటేనే ...చివరకు వచ్చిన ఫలితాన్ని సక్సెస్ అని పిలుస్తారు ...
సక్సెస్ అనేది ప్రత్యేకంగా ఏమీ లేదు ....నా దృష్టిలో ...
ఇవ్వాళ మళ్ళీ ఒక ఫెయిల్యూర్ వస్తే ....నేనెందుకు నిరాశ చెందుతాను ...
ఇంకా 98 ఫెయిల్యూర్స్ అయ్యేదాకా నాకు ఛాన్స్ ఉందిగా ...అదీ కాకపోతే 198 ...అదికూడా కాకపోతే నిరంతరం ...
కానీ ప్రయత్నం అయితే ఆగదు ....ఇది కాకపోతే ఇంకొకటి ....ఆ ఇంకొకటి కాకపోతే మరొకటి ...
జీవితం అనేది నిరంతర ప్రయాణం మరణించేవరకు ...." disappoint అయ్యావా అని ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పా ఈ రోజు ....!😇

Saturday, September 25, 2021

నాకేదైనా బాధ కలిగితే ....

 నాకేదైనా బాధ కలిగితే ....లేదా బాధ కలిగించే సంఘటన కలిగితే ఎవరికీ చెప్పే అలవాటు నాకు లేదు చిన్నతనం నుండి ...

చిన్నతనంలో అయితే ...ఒంటరిగా కాసేపు ఏడ్చి ...లేదా కొన్ని రోజులు అన్నం తినకుండా అలిగి ...ఆ బాధను మర్చిపోయాక ....మళ్ళీ సాధారణ జీవితంలో పడిపోయేదాన్ని ....
పెళ్లయిన తరువాత ....నాకు ఒక్క అవకాశమే మిగిలింది ...వీలయితే కాసేపు కూర్చుని ఏడవడం ....లేదా ఆ అవకాశం కూడా లేకపోతే కళ్ళు తుడుచుకుంటూ పని చేసుకోవడం ....
ఆ తరువాత బాధ కలిగినప్పుడు డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా ఎదో ఒకటి ఫేస్ బుక్ లో వ్రాసుకుని నా బాధల్ని మర్చిపోయి ....మళ్ళీ దైనందిన కార్యక్రమాల్లో పడిపోయేదాన్ని ....
ఆర్టికల్స్ వ్రాసుకోవడం అనేది నాకెంతో స్ట్రెస్ ని తగ్గించింది .....
ఒక్కసారి ఎప్పుడో చాలా ఏళ్ళ క్రితం ...అమ్మతో ఫోన్ లో మాట్లాడుతూ ఉన్నప్పుడు కంట్రోల్ చేసుకోలేక ఒకే ఒక్క సారి ఏడ్చా ....
కానీ తర్వాత రోజు రియలైజ్ అయ్యా ...."ఛీ నేనేం చేశాను ....తనెంత బాధపడి ఉంటుంది ....నేను ఇంత పిరికిగా తయారయ్యానని ...సమస్యలు పరిష్కరించుకోలేకపోతున్నాను అని అనుకోదూ" అని ...అప్పుడే నిర్ణయించుకున్నా ....ఇక అమ్మ ముందు ఎప్పుడూ బయటపడకూడదు అని ....
క్రమేణా బాధ కలిగినప్పుడు ...ఏడ్చి భారాన్ని దించుకోవడం అనేది కూడా నాకు బాధగా మారింది ....
అందుకే ఈ మధ్య మౌనాన్ని ఆశ్రయిస్తున్నా ....
నాకు బాధగా ఉన్నప్పుడు ఎవరితోనూ మాట్లాడను ....ఎవరినీ కలవను ....
వాళ్ళు అపార్ధం చేసుకున్నా సరే ....
ఓ నాలుగైదు నెలల క్రితం అనుకుంటా ....విపరీతమైన బాధ కలిగింది ....
తలుపులేసుకుని ...ఒక రోజంతా ఏడ్చా ....
విపరీతమైన తలనొప్పి కలిగింది ఏడవలేక ....పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా ...
ఏడవొద్దు అనుకుంటున్నా ...అయినా ఏడుపొస్తుంది ...
కొంత బలహీనత శరీరాన్ని ఆక్రమించినప్పుడు ....మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం కూడా మన చేతుల్లో ఉండదనుకుంటా ....
ఆ రాత్రంతా నిద్ర పోలేదు ... చివరికి అక్షరాల్ని ఆశ్రయిద్దాం అనుకున్నా ....సాధ్యం కాలేదు ....
ఏం చేయాలో అర్ధం కాలేదు ....
తెల్లవారాక ...ఈ బాధ ని కాస్తయినా కంట్రోల్ చేసుకోవాలంటే ....ఎవరో ఒకరితో ఆత్మీయులతో మాట్లాడే తీరాలని అర్ధమైంది ....
ఎవరితో మాట్లాడాలన్నా ఏం జరిగింది అని అడుగుతారు ....
నేను ఏం చెప్పలేను ....
అలా అడగకుండా నాతో మాట్లాడేవాళ్ళు ఎవరా అని ఆలోచించా ....
ఒకరికి ఫోన్ చేశా ....చేయగానే తను ఫోన్ తీసింది ....
"నాతో కాసేపు మాట్లాడు ....నేను కాస్త నార్మల్ స్టేజి కి రావాలి " అడిగా ఏడుపు ఆపుకుంటూ ...
తను నన్నేం ప్రశ్నించలేదు ....కాసేపు మాట్లాడింది ....ఏం జరిగింది అని అడగలేదు ...
అడగొద్దు అని నేను చెప్పాను అంటే ...ఎదో బలమైన కారణం ఉండే ఉంటుంది అని తను అర్ధం చేసుకుంది ....
కాసేపు మాట్లాడాక ...కాస్త మామూలు స్థితిలోకి వచ్చాను అనిపించింది ....
మళ్ళీ తరవాత రోజు "ఛీ నేనేం చేశాను ....తనెంత బాధపడి ఉంటుంది ...." అనుకున్నా ...
మొన్నీ మధ్య నా చిన్న కూతురు "మమ్మి ...సైకాలజిస్టు అపాయింట్మెంట్ తీసుకో ..." చెప్పింది....నాకు ఒంటరిగా ఉంటే హాయిగా ఉంది ...అని అంటే తనతో ....
"అంటే ...ఏవో సమస్యలుంటేనే సైకాలజిస్టు దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు ...నీకేమనిపిస్తుందో చెబితే ...అది సమస్యా .. కాదా అని వాళ్లే చెబుతారు ....నీకు నమ్మకమైన ఒక వ్యక్తి నీ గురించి షేర్ చేసుకోవడానికి దొరికినట్టు కూడా అనిపిస్తుంది ...." మళ్ళీ తనే చెప్పింది ....
"నిజమే ....మంచి సలహా ...తప్పకుండా తీసుకుంటా" అని చెప్పా .....
"ఇక్కడ ...క్లైంట్స్ గురించి ..ఇన్ఫర్మేషన్ చాలా సీక్రెట్ గా ఉంచుతారు ....నీకు తెలుసు కాదా ...." మళ్ళీ చెప్పింది ....
జస్ట్ ఇది కూడా ఎందుకో వ్రాసుకోవాలనిపించింది ....ఎవరికీ చెప్పాలని కాదు ....
శరీరానికి ఎప్పుడూ మనం భరించలేనంత భావం ఇవ్వలేం ....భరించలేనప్పుడు సహాయం కావాలి దానికి ....
అది ఒక నేస్తం కావచ్చు ....అమ్మ కావచ్చు ....అక్షరం కావచ్చు ....లేదా సైకాలజిస్టు కావచ్చు .....!
Like
Comment
Share

Sunday, September 19, 2021

మొన్నామధ్య "My Experiments with Truth"

 మొన్నామధ్య "My Experiments with Truth" బుక్ చదువుతూ ఉంది నా డాటర్ ...

ఏవో అందులో వ్రాసిన విషయాల గురించి ఇద్దరి మధ్య వచ్చిన డిస్కషన్ లో ...
నేను ఆ బుక్ చదవలేదురా ....ఇంగ్లీష్ చదవలేను...తెలుగు లోకి అనువదించిన బుక్ ఎప్పుడైనా దొరికితే చదువుతా ....కానీ చదవాలని ఉంది ....అని చెప్పా ....
ఇవ్వాళ పోస్ట్ లో ఏవో కొన్ని ఆర్డర్ చేసిన బుక్స్ వచ్చాయి ...
అదసలు నా డిపార్ట్మెంట్ కాదు ....పాకెట్ కూడా ఓపెన్ చేయను ....
చిన్నతనంలో రోజూ మా ఇంటి గోడ మీద కాకులు విపరీతంగా వాలేవి ....ఏవో అరుచుకుని పోతాయిలే అని వాటివైపు చూడను కూడా చూడం ...అదే చిలకలయితే కాసిన్ని వచ్చేవి ...ముద్దుగా ఉన్నాయి అని అటే చూస్తూ ఉండేవాళ్ళం ...
నాకు ఈ పుస్తకాలన్నీ కాకుల్లాగే అనిపిస్తాయి ....రోజూ ఎదో ఒకటి ఆర్డర్ చేస్తూ ఉండడం వలన ...
మావారు ఒక బుక్ చూసి ..."ఇది నేను ఆర్డర్ చేసినట్టు లేదే" అన్నారు ....
"మీరు కాకుండా ఎవరు ఆర్డర్ చేస్తారు ...." ఊరికే ఎకసెక్కాలు కాకపోతే అనుకుంటూ ..చెప్పా ....
"ఇది తెలుగు బుక్ ...ఏదో సత్యశోధన అని ఉంది ....అపూర్వ ఆర్డర్ చేసినట్టుంది ....కానీ తను తెలుగు బుక్ చదవదు కదా ...ఇదెందుకు ఆర్డర్ చేసిందో తెలియలేదు ...." ఆలోచిస్తూ చెప్పారు ...
అప్పుడు వెలిగింది నాకు ...మా మధ్య జరిగిన సంభాషణ గుర్తొచ్చింది ....
నా కోసం గుర్తు పెట్టుకుని ....ఇంటర్నెట్ లో వెతికి మరీ ఆర్డర్ చేసిందన్న మాట ...
ఇన్ని పుస్తకాలు ఆర్డర్ చేసుకుంటారు రోజూ ...పిల్ల నా కోసం ఒక్క బుక్ ఆర్డర్ చేసిందని ...కుళ్ళి పోతున్నారు ....(ఎవరో చెప్పను )
ఇక బుక్ చదివే పనిలో ఉంటా మరి ...
ఎంతయినా పిల్లలు పిల్లలే ...అని రోజుకోసారయినా అనుకొందే నిద్రపట్టదు కదా ...! 😘🥰

నిన్న ఒక పని మీద ఒక ఆఫీసుకి వెళ్లాల్సొచ్చింది ...

 నిన్న ఒక పని మీద ఒక ఆఫీసుకి వెళ్లాల్సొచ్చింది ...

ఆమె నేను వెళ్ళగానే చక్కగా రిసీవ్ చేసుకుని ...నా వివరాలడిగింది ...
నాతో కట్టించుకోవాల్సిన ఫీజు కట్టించుకుంటూ ....
మధ్య మధ్యలో నాతో మాట్లాడడం మొదలు పెట్టింది ....
ఫస్ట్ ఎక్కడికి వెళ్లినా నా పేరు పిలిచేటప్పుడు ....కొత్త పెళ్లికూతురు / పెళ్ళికొడుకు ....సిగ్గుతో మెలికలు తిరుగుతూ ....వచ్చి రానట్టు ...పలికీ పలకనట్టు ...క్షత్రియ పుత్రుడు సినిమాలో ....సన్నజాజి పాడాక ....అనే పాటలో ....ఉత్త గాలే వస్తుంది అంటుంది రేవతి ....అలా ...నా పేరుని రకరకాలుగా పలకాలని ట్రై చేస్తారు అందరూ ....
నా జీవిత కాలంలో ఒక్క అమెరికన్ అయినా ....శ్రీలక్ష్మి అనే పేరుని శ్రీలక్ష్మి గానే పలుకుతారనే ఆశ ..., మా ఆయన ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఒక్కసారి కాల్ చేస్తే ఎత్తుతారని ఆశ...ఇలాంటివన్నీ ....ఎండమావుల్లాంటివి ....ఉన్నట్టే అనిపిస్తాయి ..కానీ ఉండవు ...
"సి ...లాక్ ...మీ...." అని ఆమె తిప్పలు పడుతుంటే ....
నేను నవ్వుతూ ...."శ్రీ " అని పిలవండి చాలు అని చెప్పా ....
(అంతకంటే మీకు సీన్ లేదులే అని మనసులో అనుకుని ....)
అసలు ఇంత కష్టమైన పేరు ఎలా పెట్టుకున్నావు అని అడిగింది ....
నా కర్మలే అనుకుని ...."అది మా దేశంలో ఇంటికొకరికి ఉంటుంది ....వెరీ ఫేమస్ నేమ్ " చెప్పా ....
"ఇక్కడికొచ్చాక పేరు షార్ట్ గా చేసుకున్నావా " అడిగింది ....
"తప్పదుగా మీ దేశం వచ్చాక ...." చెప్పా ...
"ఆ పేరుకి అర్ధం ఏంటి " అడిగింది ....
మధ్య మధ్యలో నాకు కావాల్సిన పని గురించి చేయాల్సిన ప్రాసెస్ చేస్తూ ....
"ఒక దేవత పేరు ...ఆ దేవత, డబ్బు , ఆరోగ్యం , ఇంకా మనకు కావాల్సినవన్నీ ఇస్తుందని ....అందరి నమ్మకం " చెప్పా ....
"వ్వావ్ " ఆశ్చర్య పడింది ....
అందులో వ్వావ్ ఏముంది ....అనుకున్నా ....
సరే అలా మాటలు పొడిగిస్తూ ...నీకు కిడ్స్ ఉన్నారా అని అడిగింది ....
ఉన్నారు ....ఒకళ్ళు జాబ్ చేస్తున్నారు ...ఒకళ్ళు కాలేజ్ లో ఉన్నారు అని చెప్పా ....
"నీకు జాబ్ చేస్తున్న డాటర్ ఉందా ...." ఈసారి నిజంగానే ఆశ్చర్య పడింది ...
అవునన్నట్టు తలాడించా ....
"నీకు చిన్న వయసులోనే పెళ్లయి ఉంటుంది బహుశా ...." సందేహంగా అడిగింది ...
"వెల్ ...ఇక్కడ మీ దేశంలో అయితే ....అది చిన్నవయసులో అయినట్టు ....మా ఊర్లో అయితే లేట్ మ్యారేజ్ అంటారు మరి ...." చెప్పా ....
ఏ వయసులో అయిందో అడిగింది ...చెప్పా ....
"ఎందుకలా పెళ్లి చేసుకున్నావు ...." అడిగింది మళ్ళీ...
"నేను చేసుకోలేదు ....మావాళ్లు చేసారు ....ఇక్కడలాగా మాకు డేటింగ్స్ ఏమీ ఉండవు ....
పెళ్లి ఒక్కటే ఫస్ట్ ఆప్షన్...లాస్ట్ ఆప్షన్ కూడా ...
కాబట్టి వాళ్ళు పెళ్లి అనగానే ఎగిరి గంతేసి పెళ్లి చేసుకుంటాం ....
చేసుకున్నాక నచ్చకపోతే ...జీవితాంతం వదిలేయలేం ....అంతే" చెప్పా ...
అంతలో నా పని అయిపొయింది ...
నాకు చేయాల్సిన దానికంటే కొద్దిగా ఎక్కువ ఫేవర్ కూడా చేసింది ...
చాలా థాంక్స్ అని చెప్పి ...,
"ఏదో అప్పుడప్పుడు ఒక చిన్న శాంపిల్స్ వదిలితేనే నోరెళ్ళబెట్టుకుని వింటారు వీళ్ళు ....ఇక మన సాంప్రదాయాల గురించి ....అవి ఎలా ఉంటాయో చెబితే ఏమైపోతారో పాపం ...."అనుకుని నవ్వుకుంటూ ....బయటపడ్డా ....!🙏

Friday, September 17, 2021

దేవతలందరు ఒకటై వచ్చి దీవెనలీయాలి ...

 ఇందాక డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటే నా సాంగ్స్ లిస్ట్ లో ఉన్న ..."దేవతలందరు ఒకటై వచ్చి దీవెనలీయాలి ...నీ పసుపు కుంకుమ సౌభాగ్యం ...." అనే పాట ప్లే అయింది ...

నాకెందుకో ....చిన్నతనంలో నోరు వెళ్ళబెట్టుకుని చూసిన కార్తీక దీపం, శ్రీరంగ నీతులు లాంటి సినిమాలు ... ఈ పసుపు కుంకుమ ....ముఖ్యంగా తాళి గొప్పతనం పాటలు ....అమ్మాయి అంటే ....వాటికి విలువ ఇస్తూ ....వాటిని కాపాడుకుంటూ ..వాటిని మొగుడే ప్రసాదించాడని నమ్మేస్తూ ... ఉండడం అంటే ....నాకు నవ్వొస్తూ ఉంటుంది ...ఇలాంటివి సినిమాలు చిన్నప్పుడు ఎలా చూశాం రా బాబూ అనిపిస్తుంది ....
మొన్నెప్పుడో ...వరలక్ష్మి వ్రతం తాంబూలానికి రమ్మని అందరూ బలవంతపెడితే వాళ్ళింటికి వెళ్ళా ...
సరే సాంప్రదాయ వ్రతం కదా ...చీర కట్టుకుని మెడలో చైన్ ...నల్లపూసలు దండ ఉంటే (అది నాకు ఇష్టం లెండి ...) అది వేసుకుని వెళ్ళా ...
నిజానికి చైన్ అంటే ఇక్కడ తాళి అని అర్ధం ....
అదెలా తయారు చేస్తారంటే ...ఆ చైన్ కి రెండు చివర్లలో రెండు హోల్స్ ఉంటాయి ....అందులో పసుపు దారం కట్టుకుని ....రెండు రౌండ్ గా ఉండే బంగారం కాయిన్స్ లాంటివి తగిలించుకుని ....మధ్య మధ్యలో లావుగా ఉండే నాలుగు లేదా ఆరు నల్ల పూసలు గుచ్చుకుని ...(ఎందుకో నాకు తెలియదు ...) అందులో ఓ రెండు ఎర్ర పూసలు కూడా వేసుకుని ....(ఇదెందుకో కూడా తెలియదు ...) ఒక చిన్న బంగారం గొట్టం కూడా వేస్తారంట ....(ఇది కూడా నాకు తెలియదు ) మధ్య మధ్యలో మన కంఫర్ట్ కోసం ....కీ చైన్ లాగా ...పిన్నీసులు పెట్టుకునే స్టాండ్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు ...ఇలా మాన్యుఫ్యాక్చర్ చేస్తారు ....
ఇవన్నీ మా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ....ఫ్యాన్సీ షాప్ కి వెళ్లి పసుపు దారం (తాళి దారం అంటే ఇస్తారు ...అని మా అమ్మ నన్ను అప్పుడప్పుడు తీసుకుని రమ్మని అంటుంది ...) తెచ్చి ...అది తాడులా పేని (పేనడం అంటే ....రెండు చిన్న సైజు గుత్తుల దారాలు తీసుకుని అది మన చేతి మీద లేదా తొడ మీద వేసుకుని అవి రెండూ మెలికలు పడేవరకు తిప్పుతారు....ఇది చిన్న సైజు కాబట్టి చేతి మీద సరిపోతుంది ....చిన్నతనంలో నేను మా నాన్నతో కలిసి తాడులు పేనడం నేర్చుకున్నా ....) దానికి ఈ సరంజామా అంతా గుచ్చి ....ఆ బంగారు గొలుసుకి రెండుపక్కలా ....ఊడిపోకుండా ....(మొగుడూ పెళ్ళాం విడిపోయినా పర్లేదు ) చాలా ముడులు వేస్తారు ....
అప్పుడది తాళిగా తయారవుతుంది అన్నమాట ....
మొన్నామధ్య ఇండియా వచ్చినప్పుడు ....మా అమ్మ ఈ ముడులు వేసే టైం లేక ...నా బ్యాగులో ....ఈ పసుపు తాడు పెట్టి మర్చిపోకుండా ఇక్కడికి వచ్చాక ముడులేసుకోమంది ....
నాకు మా ఆయన్ను ముడేసుకోవడమే రాలేదు ...ఇంకా తాళి ఏం ముడేస్తా ....
అవి భద్రంగా పెట్టినవి పెట్టినట్టే ఉన్నాయి ...
శ్రావణ శుక్రవారం వ్రతానికి పోయినప్పుడు ...అందరూ పసుపు , కుంకుమ తాళికి పెట్టుకోమన్నారు ....
నేనేమో తీసుకుని ....తాళి లేదు లోపల అంటే ఫీల్ అవుతారని ...ఆ చైన్ కే పూసుకున్నా ....
అంటే ....ఇది కాస్ట్లీ తాళి అన్నట్టు ....
ఇలా కాకుండా ...పేదవాళ్ళు ఒక దారానికి పసుపు కొమ్ము కట్టి ...అమ్మాయి మెళ్ళో మూడు ముళ్ళు వేస్తే అది కూడా తాళే అవుతుంది అన్నట్టు ....
చంటి సినిమాలో ....అమ్మా ... నందినికి ఏం తెలియదమ్మా ...మేళ తాళాలు ...పప్పన్నాలు..ఊరేగింపులు లేకుండా పెళ్లయిపోయింది అంటుంది ....అంటాడు చంటి ....
అవన్నీ లేకపోయినా కూడా పెళ్లి జరగొచ్చు ....కానీ పసుపు కొమ్ము లేకుండా పెళ్లి జరగదు బాబూ అంటుంది ....వాళ్ళ అమ్మ ....
అంటే అమెరికాలో అయితే ...ఆ పసుపు కొమ్ము వజ్రాలతో చేయించినా కూడా ...ప్రేమ లేకుండా పెళ్లి జరగదనుకోండి ....అది పూర్తిగా మన సంప్రదాయానికి సంబంధం లేని విషయం .....
ఇంతకీ నేనెక్కడున్నా ...
ఆ ఫంక్షన్ లో ఉన్న కదా ....
దొంగ లాగా ఆ పసుపు ..."లోపల తాళి దాచి ఉంచా ....అది బయటకి వేసుకోను" అన్నట్టు బిల్డప్ ఇచ్చి ....పసుపు , కుంకుమ లోపల ఎక్కడ పూసానో తెలియకుండా పూసి "మమ" అనేశా ...
వాళ్ళల్లో ఎవరూ హరిశ్చంద్రులు కాదు ....నేను చంద్రమతిని కాదు కాబట్టి వాళ్ళు నన్ను పతివ్రత అనే అనుకున్నారు ....
లేకపోతేనా ...."అది మాంగల్యము కాదు కాబోలు ....అది మాంగల్యము కాదు కాబోలు" అని గగ్గోలు పెట్టేవాళ్ళు ...."నా వద్ద తాళి ఉన్నదే ....తాళి ఉన్నదే " అని నమ్మించాల్సి వచ్చేది ....
ఇంతకూ పాటగురించి కదూ తలచుకుంటున్నా ....
ఆడపిల్ల కు చిన్నతనం నుండి ఎంత నూరిపోస్తారు ....ఆ పసుపు , కుంకుమ , తాళి కాపాడుకోవాలి ....అప్పుడే నీకు సౌభాగ్యం ఉంటుంది అని ...అవి భద్రంగా ఉంటే నీ భర్త క్షేమంగా ఉంటాడు ...నీ భర్త క్షేమంగా ఉంటే నువ్వు నీ పిల్లలు క్షేమంగా ఉంటారు ....అని...
మాయల ఫకీరు ప్రాణాలు చిలకలో ఉన్నట్టు ....మొగుళ్ళ ప్రాణాలు తాళిలో ఉన్నాయి ....అన్నమాట ....
మరి చిలకని పట్టుకుంటే మాయల ఫకీరు గిల గిల మంటాడు ....
తాళి అవతల పడేస్తే మొగుడు బాగానే ఉంటాడుగా ....
అంటే ...మొగుడి ప్రాణాలు అక్కడ లేవు ....ఇంకెక్కడో ఉన్నాయని అర్ధం ....పిచ్చి తల్లులకు అర్ధమయ్యేది ఎప్పుడో ....
కాబట్టి ఈ నమ్మకాన్ని మన బ్రెయిన్ ల మీద రుద్దిన ఈ సమాజాన్ని కాసేపు బజ్జోమని చెప్పి ...అందరూ తన పనుల మీద ....అభివృద్ధి మీద ....తన మీద తను .... నమ్మకం పెంచుకుంటే ....స్త్రీ జీవితం పురుషుడు కట్టిన తాళి కంటే బాగుంటుంది ....
ఎందుకో అనిపిస్తుంది ....కొన్ని విషయాల్లో సమాజాన్ని నమ్మించడానికి నేను కూడా చాలాసార్లు దొంగలా బ్రతికా ....
మా అమ్మ దగ్గరకు వెళ్ళినప్పుడు మాత్రం ఆ తాళి భద్రంగా ఓ రెండు రోజులు వేసుకుంటా ....తరువాత ఆ తాళి ఎక్కడకు పోతుందో నాకే తెలియదు ....భద్రంగా పెట్టెలో పెట్టేస్తా ....
కానీ కొన్ని పాటలు వింటుంటే మాత్రం నవ్వుకోకుండా ఉండలేను ....
అన్నట్టు జీవితంలో ఒక్కసారి కూడా నేను తాళిని తీసి కళ్ళకు అద్దుకోలేదు ...కళ్ళు పోతాయేమో నాకు ...
అప్పుడు తాళి పాటలన్ని ఏమైపోవాలి ....
ఏమాటకామాటే చెప్పుకోవాలి ....ఎల్లో త్రెడ్ , ఎల్లో హార్న్ ....సంప్రదాయాన్ని తమ నెత్తిన పెట్టుకుని ఎంతగా మోశాయో....మన సినిమా పరిశ్రమని కూడా అంతగా బ్రతికించాయి ...
తాళి ఆడవాళ్ళ మెడల్లో వేసుకుని మోసినా ....బాగు పడింది మగవాళ్లే ఎక్కువ ....
ఏమైనా తాళికి రెండువైపులా పదునుంది... సంప్రదాయం వెర్సెస్ సినిమా (కమర్షియల్ )
ఇంత చెప్పాను కాదా పిక్ తీద్దాం అని వెతికితే ....ఆ షాప్ లో కొన్న పసుపు దారం కనిపించలేదు ....ఎక్కడ పడేశానో ...
ఎప్పుడో తవ్వకాల్లో బయట పడుతుందిలే ...
కానీ ఎప్పుడో పాతికేళ్ల క్రితం మా ఆయన పెళ్ళిలో కట్టిన పసుపు దారం మాత్రం భద్రంగా ఉంది ...
జీవితాన్ని తలక్రిందులు చేసిన దాన్ని అంత తేలికగా ఎలా పడేసుకుంటాం చెప్పండి ....
నా గురించి ...జీవితం గురించి ..మర్చిపోయినప్పుడు ...అప్పుడప్పుడూ గుర్తు చేసుకోవద్దూ ....
పైగా ...నీకూ నాకూ పెళ్లి కాలేదు అని మా ఆయన ఎప్పుడైనా అంటే ........దాని మీద వేలి ముద్రలు నావి , మా ఆయనవే ఉంటాయి కాబట్టి ....ఈజీగా పెళ్లయిందని ప్రూవ్ చెయ్యొచ్చు ....
ఏమంటారు ...?!
హాపీ వీకెండ్ ....!


Sunday, September 12, 2021

సమాజమా ..ప్లీజ్ షటప్ .,

స్త్రీ ...పెళ్ళైన తరువాత ...పిల్లలు పుట్టకుముందు మాత్రమే ...తన గురించి తన అవసరాల గురించి ఆలోచిస్తుంది ...అది తన శారీరక అవసరాలైనా కావచ్చు కూడా ....
ఒకసారి పిల్లలు కడుపులో పడిన తర్వాత ....తనకు బిడ్డ కనిపించకపోయినా, స్పర్శ ద్వారా దగ్గరవుతున్న బిడ్డ అయినా కూడా ....ఆ బిడ్డకు ..ఏం కావాలో అని అనుక్షణం ఆలోచనలో పడుతుంది ...
ఒక్కోసారి తనకు ఏడవలనిపించినా కూడా ఏడవలేదు ....
ఏడిస్తే ...తన బాధ తన బిడ్డ ఎక్కడ భరించాల్సి వస్తుందో అని ....ఆ బాధను కూడా వాయిదా వేస్తుంది .. ...ఒక ముద్ద ఎక్కువే తింటుంది ....బిడ్డకు ఎక్కడ ఆకలేస్తుందో అని ....
ఇక పుట్టాక సరే సరి ...క్షణం తీరిక ఉండదు ...24 గంటలూ ..బిడ్డ నిద్రపోయే సమయంలో కూడా లేచాక తనకేం కావాలో రెడీ చేసుకోవడమే ఆమె పని ....
ఈ సమయంలో పురుషుడు ....కుటుంబానికి కావాల్సిన సంపాదనలో ఉంటాడు ....లేదా తనకి కావాల్సిన అవసరాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు ....
తల్లి అలా కాదు ...బిడ్డ స్కూల్ కి వెళ్లినా ...కాలేజ్ కి వెళ్లినా...ఎక్కడకు వెళ్లినా బిడ్డ గురించే ఆలోచన ...
తన గురించి తన అవసరాల గురించి ఆమె మర్చిపోతుంది ....మరుగున పడేస్తుంది ....
ఆమె ఆమె భర్తతో సంసారం చేయడానికి కూడా పిల్లలు నిద్రపోయారా లేదా అని నిర్ధారించుకుని మరీ చేస్తుంది ...
అది కూడా తన గురించిన ఆలోచన తక్కువే అని చెప్పాలి ...భర్తకి ఎక్కడ దూరమైపోతానో అనే కంగారే ఎక్కువ ఉంటుంది ....లేదా భర్త తనకి ఎక్కడ దూరమవుతాడో అనే కంగారే ఉంటుంది....
అలాంటి స్త్రీ ...పిల్లల బాధ్యతలు పూర్తయ్యాక తన గురించి ఆలోచిస్తే ...తన అవసరాల గురించి ఆలోచిస్తే ...తనకేవైనా సరదా ఉంటే ...ఈ సమాజానికేం పని ...
దాని పని అది చేసుకోవచ్చుగా ....
అహ ..అది ఊరుకోదు వేలెత్తి చూపిస్తుంది ...
నీకు వయసైపోయింది అని ....ఈ వయసులోనా అని ...ఇప్పుడు ఇవేం కోరికలు అని ...పిల్లలు ఇంత పెద్దయ్యాక ఇప్పుడీవిడ ఏమిటమ్మా అని ...
ఇంట్లో వాళ్ళు ....వీధిలో వాళ్ళు వేలెత్తి చూపడం మొదలు పెడతారు ....
ఏం నోరుమూసుకుని ఉండలేరా ....ఆమెని ఆమె ఇష్టం వచ్చింది చేసుకోనివ్వలేరా ....
ఆమె పబ్ కి వెళ్తే ....క్లబ్ కి వెళ్తే ....స్విమ్ సూట్ వేసుకుంటే ....ఏం చేస్తే ఈ సమాజానికెందుకు ...
కాబట్టి ....సమాజమా ....స్త్రీ ని వేలెత్తి చూపకు ...ఆమె ఆమెకిష్టమైన పనేదో చేస్తే ...ప్లీజ్ షటప్ ..!🙏