Monday, November 14, 2016

అప్పుడెప్పుడో లగాన్ సినిమా వచ్చిన కొత్తలో ....

అప్పుడెప్పుడో లగాన్ సినిమా వచ్చిన కొత్తలో ....

సాధారణంగా నేను హిందీ సినిమాలు ఎక్కువగా చూడను .....ఇంగ్లిష్ అసలు అప్పట్లో చూసే అవకాశమే ఉండేది కాదనుకోండి ....తెలుగు మాత్రమే చూస్తూ ఉంటా .........

ఆ రోజుల్లో మనతో స్నేహం చేయాలన్నా ....మన వ్యక్తిత్వం గురించి ఒక అంచనాకు రావాలన్నా కొన్ని సాధారణ ప్రశ్నలు ఉండేవి  ......మీకిష్టమైన సినిమాలు ఏంటి అని ,మీకిష్టమైన రచయిత ఎవరూ అని ,మీ అభిమాన నటులు ఎవరూ అని, మీకిష్టమైన రంగు ఏమిటని .....ఇలా ....,మనం చెప్పిన సమాధానాన్ని బట్టి మన అభిప్రాయాలు ఇలా ఉంటాయి అని ఒక అంచనాకు వచ్చేవాళ్ళు .....
అది, ఒకరు అడిగినా ....మరొకరు చెప్పినా..... ఒకరి తో ఒకరు కాసేపు ఆహ్లాదంగా స్నేహం చేయడానికే తప్ప ....నా అంతటి వాడు అడిగితే చెప్పారు అనో .....నా అంతటి వాళ్ళని అడిగారు అనో ...ఎవరూ భావించేవాళ్ళు కాదు .....
పిడక ప్రశ్నలు వేసి .....అందులో నుండి పేడ పిసుక్కుందాం అనే ఆలోచన ప్రశ్నలు వేసేవాళ్లకి ......,పేడ సమాధానాలు చెప్పి... దాన్ని ఉపయోగించి పిడకలు చేసుకుందాం అనే ఆలోచన సమాధానాలు చెప్పేవాళ్లకి ఎంత మాత్రం ఉండేవి కాదు .....
అదలా ఉంచితే లగాన్ సినిమా అందరూ చూసి, ఆహా ఏం సినిమా ....ఓహో ఏం సినిమా అని అందరూ చెప్పేశారు ....మేం కూడా సినిమాకు వెళ్ళాం .....హిందీ నాకు చదవడం రాయడం వచ్చినంతగా మాట్లాడటం రాదు ....మా నాన్న దగ్గర చదువుకుని సరదాగా ప్రాధమిక,మాధ్యమిక కూడా పూర్తి చేశా ....అందువలనే హిందీ బాగా వచ్చు అని ఫీలయ్యేదాన్ని ( :) ) ....కానీ లగాన్ సినిమా చాలా వరకు నాకు మొదటిసారి చూసినప్పుడు అర్ధం కాలేదు ....భాష చాలా కష్టంగా అనిపించింది .....సరే అన్నీ అర్ధం కావాలని ఏముంది .....ఎవరడిగినా నాకు అంతగా అర్ధం కాలేదండీ అనే చెప్పేదాన్ని .....
ఆ సందర్భంలో ఒక ఫ్యామిలీతో హోటల్ కి భోజనానికి వెళ్ళాల్సొచ్చింది ....వాళ్ళు కొన్ని రోజుల క్రితం సిటీ కి వచ్చారు .... బిజినెస్ లో అప్పుడప్పుడే కాస్త కలిసిరావడం వలన .....కొందరు ప్రముఖులతో స్నేహం చేయడం ,ఆ ప్రముఖుల పేర్లు ప్రతి ఒక్కరి దగ్గరా ప్రస్తావిస్తూ ....మాకు వాళ్ళు ఫ్రెండ్స్ ,వీళ్ళు ఫ్రెండ్స్ అని చెప్పుకునే వాళ్ళు ....
అంతే కాకుండా ఆ స్నేహితుల్లో ఎవరెవరిని ఒరేయ్ అరేయ్ అనగలమో కూడా చెప్పేవాళ్ళు ....ఆ ప్రముఖుల్లో రాజకీయ నాయకులు,డాక్టర్లు ,లాయర్లు ,పోలీసులు ,సినిమా ప్రముఖులు ఉండేవారు ....ఇంతకీ వీళ్ళు ఏంటి అంటే పోట్టకొస్తే అక్షరం ముక్క లేదు ....వాళ్ళందరికీ డబ్బులిచ్చి స్నేహం చేస్తున్నామని పచ్చిగా వాళ్ళే చెప్పేవాళ్ళు ......నిజం చెప్పొద్దూ నాకు అలాంటి వాళ్ళను భరించడం కాస్త కష్టమే అయినా ....మా వారికి వాళ్ళు చాలా కావాల్సిన వాళ్ళు కావడం వలన భరించక తప్పేది కాదు .....
ఆ రోజు హోటల్లో భోజనం చేసేటప్పుడు లగాన్ సినిమా గురించి టాపిక్ వచ్చింది ....
ఆ సినిమా మా ఫేవరేట్ సినిమా ఐపోయింది .....మేం ఎన్నిసార్లు చూసామో ...మాకెంత నచ్చిందో ...అంటూ చెబుతూ ఉన్నారు .....
నా అభిప్రాయం అడిగారు ...."నాకంతగా అర్ధం కాలేదు " అని చెప్పా ....
నా వంక వాళ్ళు ఒక చూపు చూసారు.....వాళ్ళ చూపుకర్ధం..... 
"జాకెట్టు లేకుండా ...మోకాళ్ళ దాకా చీరకట్టి ,బుట్ట నెత్తిన పెట్టుకుని ,నడినెత్తిమీద ఒక కొప్పు పెట్టుకుని ,కొప్పునిండా ముద్ద బంతి పూలు పెట్టుకుని ....అప్పుడే పట్నానికి వచ్చిన ఎంకిని నేనని ......"
నేను కూడా వాళ్ళ వంక చూసాను ...నా చూపుకర్ధం.......
"మీ ప్రముఖుల లిస్టు లో లగాన్ ని కూడా చేర్చారా ....."అని  :)
-----------------------------------------------------------------------------------------
రోజులు అలా సంవత్సరాలుగా గడిచిపోయి ఆ మధ్య మహేష్ బాబు వన్ సినిమా వచ్చింది .....అది చూసినప్పుడు నేను నా సినిమా అభిరుచి గురించి ఒక నిర్ణయానికి వచ్చేసాను .....
నా మెదడుని ఎక్కువగా ఆలోచింపజేసే సినిమాల కన్నా ....ఆ కాసేపు మెదడుకి విశ్రాంతి నిచ్చి ఆహ్లాదాన్ని పంచే సినిమాలకు నేను ప్రముఖ్యతనిస్తాను అని...... 
పేస్ బుక్ లో ఆ సినిమా అర్ధం కాని వాళ్ళని కొంతమంది పిచ్చోళ్ళ కింద జమ కట్టారనుకోండి ....అది వేరే విషయం .....
----------------------------------------------------------------------------------------
మొన్నీ మధ్య interstellar సినిమా వచ్చిన కొత్తలో .....ఒక మిత్రుడు, పేస్ బుక్ లో "వన్ సినిమానే అర్ధం కాలేదు వీళ్ళకి .....ఇంకా interstellar ఏం అర్ధం అవుద్ది " అని పోస్ట్ పెట్టారు (మీ పోస్ట్ ఇక్కడ ఉపయోగించుకున్నందుకు క్షమించాలి ).....ఆ మిత్రుని సినిమా అభిప్రాయాలకు నేను విలువ ఇస్తూ ఉంటాను ....విశ్లేషనాత్మకంగా ఉంటాయి .... 
అప్పుడే నిర్ణయించుకున్నా ఇంక interstellar సినిమాకు వెళ్లకూడదని ...కానీ పిల్లలు, నువ్వు సినిమాకి తప్పనిసరిగా రావాల్సిందే ....మేం పక్కన కూర్చుని నీకు వివరిస్తాం అని హామీ ఇచ్చాక సరే అని సినిమాకి వెళ్ళా .....పాపం వాళ్ళు కూడా అర్ధం చేసుకోవాలిగా .....అయినా స్టొరీ కాస్త అక్కడక్కడ  చెప్పారు .....తర్వాత బయటికొచ్చాక వివరంగా చెప్పారు ....పర్వాలేదనిపించింది ....(అర్ధం చేసుకోవడంలో ) 
ఈ రకంగా అప్పుడప్పుడూ బ్రెయిన్ కి పని పెడుతూ వెళ్తే ....రాబోయే సినిమాలు (ఇలాంటివి ) బాగానే అర్ధం చేసుకోగలను అనిపించింది ......
ఇవన్నినా బ్రెయిన్ ని తికమక చేసే సినిమాలనుకోండి ........
-------------------------------------------------------------------------------
నాకు గుర్తున్నంతవరకు నా మెదడుని నేను సినిమాలకెళ్ళి కష్టపెట్టిన సందర్భాలు అవి ....
అయితే నిజ జీవితంలో కూడా మెదడుని పిండి ఆరేసే మనుషులు ఉంటారని .....ఇప్పుడు .....గత వారం రోజుల్లో నాకెదురైన కొందరి మాహానుభావుల దయ వల్ల.....వాళ్ళు వేసిన... వరస ...అర్ధం కాని,అర్ధం లేని ప్రశ్నల వల్ల నాకర్ధమైంది  ............
అందుకే రెండు రోజుల నించి పేస్ బుక్ లో ఒక ఆర్టికల్ రాసుకోవడం ,తినడం , మిగతా సమయం అంతా నిద్ర పోవడమే చేస్తున్నా .....ఎంత నిద్రపోతున్నానో గమనించాక కానీ నా మెదడు ఎంత అలసిపోయిందో నాకు అర్ధం కాలేదు .....నా పరిస్థితి లగాన్ ,వన్ , interstellar కలిపి మిక్సీలో వేసి గిర్రున తిప్పి నా బుర్రలో పోస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ....


ఇప్పుడు ఈ క్షణంలో ఆలోచిస్తుంటే నాకనిపిస్తుంది .....సినిమాలే కాదు నిజ జీవితంలో కూడా మన అభిరుచికి తగిన వాళ్ళనే మన స్నేహితులుగా ఎందుకు ఎంచుకుంటూ ఉంటామో .........??!! :) :) :)

========================

(గమనిక : ఈ ఆర్టికల్ నవంబర్ 14 , 2014  తేదీన వ్రాశాను ...)

మీ పిల్లలందరికీ "బాలల దినోత్సవ శుభాకాంక్షలు....."చెప్పాలని......!!!!!


నా చిన్నతనంలో నన్ను పిల్లలకోడి అని పిలిచేవాళ్ళు....వయసుతో నిమిత్తం లేకుండా చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ నాకు స్నేహితులే......ఇంతకుముందు మా సీనియర్స్ కనిపెట్టిన ఆటలే కాకుండా....మేము ఏవేవో కొత్త ఆటలు సృష్టించాలని చూసేవాళ్ళం....అలా ఒకసారి నా స్నేహితులంతా కలిసి ఒక ఆట కనిపెట్టారు..దానిపేరే "మట్టిలో పట్టీ"..నా కాళ్ళకి ఉన్న పట్టీలు ఒకటి తీసి ఇస్తే ,అవి మట్టిలో దాచేస్తే ...మేము తర్వాత ఎక్కడ దాచారో కనిపెట్టడం.....,
అప్పుడే కొత్తగా కొన్న పట్టీలు ....పడిపోతాయని మా అమ్మ అన్నా వినకుండా....మా నాన్నతో సిఫార్సు చేపించి మరీ పెట్టుకున్నాను.....అయినా ఫ్రెండ్స్ అడిగినప్పుడు మనం కాదు అనం కదా.....చాలా సార్లు ఆట ఆడాం.....మట్టిలో దాచిన పట్టీ దొరికినప్పుడల్లా మురిసిపోయాం.....చివరికి ఇక ఇంటికి వెళ్లిపోతాం  అనగా జరిగింది.....ఒక అద్భుతమైన సంఘటన....మట్టిలో దాచిన పట్టీని కనిపెట్టలేకపోయాం...... :)
ఇంటికెళ్ళాక అంతకంటే అద్భుతంగా నా వీపు విమానం మోత మోగిందనుకోండి.......
తర్వాత పెద్దవాళ్లందరూ.....చిన్నపిల్లల్లా "మట్టిలో పట్టీ"ఆట ఆడుకుంటుంటే..... నవ్వకుండా ఉండలేక ..ఏడుస్తున్నట్టు నటించలేక, మేము అనుభవించిన బాధ వర్ణించలేనిది......!!! :)
పిల్లలందరూ పేస్ బుక్ లోకి వచ్చి చూడలేరు కాబట్టి .....ఇక్కడున్న పేరెంట్స్ అందరికీ....మా వీధిలో వయ్యారంగా రంగులు ఒలికిస్తున్న ఈ చెట్టు సాక్షిగా మనవి చేస్తున్నా....!!!!!

మీ పిల్లలందరికీ "బాలల దినోత్సవ శుభాకాంక్షలు....."చెప్పాలని......!!!!!

=====================
(గమనిక : ఈ ఆర్టికల్ నవంబర్ 14 , 2013  తేదీన వ్రాశాను ...)

నా పిల్లలు ఇలాంటి పనులు చేసినప్పుడు అభినందించడం నాకిష్టమైన చర్య ....

నా చిన్నతనంలో మా నాయనమ్మ దగ్గరకు ఒక వ్యక్తి వచ్చేవాడు
.....అతని పేరు బుల్లియ్య......అందరూ బుల్లాయ్ అని పిలిచేవాళ్ళు .....మనం చేసే చర్యలే సమాజంలో మన గౌరవాన్ని నిర్ణయిస్తాయి అనడానికి అతను పేరును అందరూ ఒక నిర్లక్ష్య ధోరణితో పిలవడం కూడా ఒక ఉదాహరణ .....
అతను పచ్చి తాగుబోతు .....అతను తాగాడంటే అతనికి ఒళ్ళు తెలియదు .....కళ్ళు ఎర్రగా ఉంటాయి చాలా భయంకరంగా .....ఒక్కోసారి ఒంటిమీద ఉన్న బట్టలు కూడా పోయి రోడ్డు మీద దొర్లుతూ ఉండేవాడు .....ఊరూరా తిరిగి కుంకుడు కాయలు అమ్ముకునేవాడు .....ఆ వచ్చిన లాభంతో తను తాగగా మిగిలిన డబ్బులు ఇంట్లో ఇచ్చేవాడు .....అదంతా సరే .....తాగాడనడానికి గుర్తుగా తన భార్యను రోడ్ల వెంట పరిగెత్తించి మరీ కొట్టేవాడు .....ఆ మత్తు దిగేవరకు వాళ్ళావిడ ఎక్కడైనా తలదాచుకోవలసిందే .......(తల దాచుకోవడం అనే పదం ఇక్కడ సందర్భోచితం కూడా .....పాపం ఆవిడ తల రక్తం కారేలా చాలాసార్లు కొట్టాడు ....)ఆ "ఎక్కడ" అనేది మా ఇల్లు అయ్యేది ....మా నాయనమ్మ అంటే అతనికి భయం .....మా ఇంట్లో దాక్కుంటే ఇక ఇక్కడికి రాడు అని ఆమె నమ్మకం ....అనుకున్నట్లుగానే మా ఇంటి దరిదాపులకు కూడా వచ్చేవాడు కాదు ......
ఆ మత్తు అంతా దిగాక నెమ్మదిగా ఈవిడే ఇంటికి వెళ్ళిపోయేది .....మళ్లీ మర్నాడు  ఉదయమే  వాళ్ళాయనకు చేపల పులుసులోకి కరివేపాకు కోసం ఇంటింటికి తిరిగేది .....అప్పుడే అనిపించేది ....స్త్రీ ని భోజ్యేషు మాత అని ఎందుకన్నారో .....
అలా అని అతను మాత్రం ఏం తక్కువ కాదు ...తెల్లవారగానే .....రాత్రి ఏం జరగనట్టే అంత పెద్ద బస్తా నెత్తి మీద పెట్టుకుని బేరానికి వెళ్ళేవాడు .....భార్యని బాధ్యతగా చూసుకునేవాడు .....
అతను తాగినప్పుడు మాత్రమే మనిషి కాదని ఊరు అందరికీ అర్ధమయ్యేది ....
అతనికి మా నాయనమ్మని డబ్బులు అప్పు అడగాల్సి వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చేవాడు .....
"అమ్మా ...సీతరామ్మ(సీతరావమ్మ) గారు ఉన్నారా ..." అంటూ అడిగేవాడు  ...
మా నాయనమ్మని పిలవగానే ....."ఒరేయ్ ... ఇంట్లోకి ఎందుకొచ్చావురా....పద బయటికి ...." అనేది ...
"మీ కోసమే వచ్చానండీ" అనేవాడు ..... మాటల్ని బట్టి తాగాడో లేదో కనిపెట్టడం కష్టమయ్యేది .....ఎప్పుడూ తూలుతూనే ఉండేవాడు .....
"పిల్లలున్నారు ...ఇంటికి రావొద్దని చెప్పా కదరా ....పద బయటికి ...."అనేది ...
ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి ....(మా అమ్మని కూడా దృష్టిలో పెట్టుకుని చెప్పేది )ఆవిడ వ్యాపారాలు ,లావాదేవీలు ....అలాంటి వాళ్ళతో ఏవైనా ఉంటే ఇంటి బయటే చూసుకునేది ......ఇంటిదాకా రానిచ్చేది కాదు .....
తాగడం అనేది చెడు అలవాటని ....సమాజంలో ఆమోదయోగ్యం కాని పని అనీ ....రాబోయే తరాలకు తప్పుడు సందేశాలను అందిస్తుందని ....అవి పిల్లలముందు మనం మాట్లాడకూడదని .....పిల్లలకు అవన్నీ తప్పు అని తప్పనిసరిగా మన తప్పు లేకుండా మనం చెప్పాలని ....ఇలాంటి గొప్ప విషయాలు నాకు,మా నాయనమ్మకు అప్పట్లో తెలియకపోయినా ....., మా నాయనమ్మ మా గురించి జాగ్రత్త తీసుకుని ఇల్లుని ఒక పవిత్రమైన స్థలంగా తీర్చి దిద్దటం,మేము కూడా అవన్నీ ద్రుష్టి పెట్టకుండా దూరంగా ఉండాల్సిన విషయాలని తెలుసుకోవడం  నాకెంతో ఇష్టమైన చర్య .....
------------------------------------------------------------------------------------------------------
సరే అదలా ఉంచితే ఈ మధ్యే మేము శ్వేతసౌధం చూడటానికి వెళ్ళాం ....
అక్కడ రకరకాల ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాం .....అక్కడికి వచ్చిన ప్రవాస వాసులను కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఒక టి వి ఛానల్ వాళ్ళు కనిపించారు .....వాళ్ళతో కూడా సరదాగా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం .....అక్కడినుండి వచ్చేస్తున్న సమయంలో  మాతో ఉన్న ఒకరు అడిగారు ...."నాకు ఈ వైట్ హౌస్ ముందు దమ్ము కొడుతూ ఒక ఫోటో తీసుకోవాలనుంది ...."అన్నారు ...
"దమ్ము అంటే " అన్నా ....నాకు వెంటనే అర్ధం కాలేదు ......
సైగ చేసి చూపించాక అర్ధమై "ఓ సిగరెట్టా " అన్నా .....
"పర్మిషన్ ఉందా అసలు " అన్నారు ....
"ఉండదనుకుంటానండీ ....." అన్నా .....
"అదుగో వాళ్ళు తాగుతున్నారు " అంటూ ఆ టి వి వాళ్ళ వైపు చూపించారు ....
వాళ్ళల్లో ఒకరు స్మోక్ చేస్తూ కనిపించారు ...
"అయితే నాకు తెలియదు మరి ....ఉందేమో "అన్నా
మా శ్రీవారు పాపం తన శాయశక్తులా అందరికీ అన్ని కోరికలు తీర్చాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ....అది ఎలాంటిదైనా.......,
(అతి మంచితనం అనే కోణం ఒకటుందిలే ..... :) )
"ఇక్కడే ఎవరినైనా సిగరెట్ అడుగుతాను ....."అన్నారు శ్రీవారు .....
"అందర్నీ మీ దగ్గర సిగరెట్ ఉందా ...మీ దగ్గర సిగరెట్ ఉందా అని అడుక్కుంటూ వెళ్తారా... " అని అడిగా ఆశ్చర్యంగా ..... 
"తప్పేముంది" అన్నారు .....
"మీ ఇష్టం ...." చెప్పా .....నాకు సంబంధం లేదు అన్నట్టు ..... 
అంతలో నా చిన్న కూతురు "అంకుల్ అది చాలా తప్పు ....మీరు సిగరెట్ తాగడాన్ని ప్రోమోట్ చేస్తున్నారు ...స్మోకింగ్ ని అలా ప్రోమోట్  చేయకూడదు ...." అంది 
"అది తీసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది ...నేను సిగరెట్ తాగకూడదు అన్నట్టు గా నా ఫేసు చూపిస్తా ....." అన్నారు 
"అయినా అలా చేయడం తప్పు ...."అంది మా పాప ......
"అలా కాదు ....ఛీ ఇలాంటి సిగరెట్ తాగుతున్నాను చూడు అన్నట్టు వికారంగా నా ముఖ కవళికలు పెడతాను" అన్నారు ...
"మీరెన్ని చెప్పినా నేను అగ్రీ అవను అంకుల్ ...." అని చెప్పేసింది ....చివరగా ,,,,ఖచ్చితంగా .....
ఎప్పుడు పరాయి వ్యక్తులతో ఏ విషయాల్లో విభేదించినా .....అంగీకరించినా ....నా అభిప్రాయాన్ని ఒకసారి చూపులతోనే తెలుసుకోవడం నా పిల్లలకు అలవాటు(ఫ్రాయిడ్ సిద్ధాంతం ) ......వాళ్ళు చేసింది తప్పు అయితే నెమ్మదిగా వివరిస్తూ ఉంటాను .....ఒప్పయితే కళ్ళతోనే అభినందిస్తా .....
కానీ అప్పుడు మాత్రం ......,
నా కళ్ళు, నా కూతురు నా వైపు చూడకముందే.... అభినందనలు వాటి నిండా నింపుకుని ఎదురుచూస్తూ ఉన్నాయి.... ఎప్పుడెప్పుడు అభినందిద్దామా అన్నట్టు .... 
నా పిల్లలు ఇలాంటి పనులు చేసినప్పుడు అభినందించడం నాకిష్టమైన చర్య ....
-----------------------------------------------------------------------------------------------
ఇందాకే ...చిల్డ్రన్స్ డే గురించి ఒక ఆర్టికల్ రాసుకుంటున్నాను నాన్నా ...చిన్న పిల్లలకు విషెస్ చెప్పాలి....అన్నా .....
అవునా, నేను కూడా చిన్న పాపాయినేగా ...మరి నాకు చెప్పవా అంది .....
అవును నాన్నా నువ్వెప్పటికీ నాకు చిన్ని పాపాయివే ....హాపీ చిల్డ్రన్స్ డే అని చెప్పా .....
--------------------------------------------------------------------------
చిన్న చిన్న పాపాయిలైనా ప్రవర్తనలో ఎంతో ఎత్తు ఎదిగిన వాళ్లకు .....
ఎంతో ఎత్తు ఎదిగినా అమ్మకు చిన్న చిన్న పాపాయిలే అయిన వాళ్లకు ......

హాపీ చిల్డ్రన్స్ డే.......... :) :) :)

======================

(గమనిక : ఈ ఆర్టికల్ నవంబర్ 13 , 2014  తేదీన వ్రాశాను ...)

Wednesday, November 9, 2016

బ్రతుకంటూ బ్రతికితే ....మనిషి జన్మ మన కోసం ఆరాట పడే బ్రతుకు బ్రతకాలబ్బా ...

కొందరు ఉంటారు.....,,

వాళ్లకు మనతో ఏదైనా అవసరం ఉంటే .....మెత్తగా అడిగి ....లేనిపోని ప్రేమలు ఒలకబోసి.....వంగి వంగి దండాలు పెట్టి , మరీ వాళ్ళ పనులు చేయించుకుంటారు .....

అదే మనకు వాళ్ళతో ఏదైనా అవసరం పడితే వాళ్ళు వేసే వేషాలు అన్ని ఇన్ని కాదు .....

- టైం లేదు అంటారు , 
- ఇప్పుడు చెయ్యాలా అని బద్ధకం ఫేస్ పెడతారు , 
- చేస్తే నాకేమిస్తావ్ అంటారు , 
- సర్లే ...ఈ ఒక్కసారీ చేస్తా ఇంకెప్పుడూ అడగకు అని మొహం మొటమొట లాడించుకుంటూ చేస్తారు , 
- ఎక్కడ చేయాల్సి వస్తుందో అని మొహం చాటేస్తారు  ......,
- ఖర్మ ....ఏం చేస్తాం అని తప్పనిసరి అన్నట్టు చేస్తారు , 
- చేశాక ... గోరంత చేసి కొండంత చేసాం అని ప్రపంచానికి చాటింపు వేస్తారు .....,
- మనం పడుకున్నా , తింటున్నా , పనిలో ఉన్నా , నిద్రపోతున్నా నేను నీకు ఈ పని చేశాను , నిన్న , మొన్న , అటుమొన్న , నెల క్రితం , సంవత్సరం క్రితం , పదేళ్ల క్రితం , అంటూ చచ్చేవరకు ...వాళ్ళు చేసిన పనిని గుచ్చి గుచ్చి గుర్తుచేస్తూ ఉంటారు ....

వీళ్లకు మళ్ళీ ఏదైనా సహాయం అవసరం అయితే.... పిల్లి , కుక్క , పంది తదితర జంతువుల సహాయం తీసుకుని ...వాటి అవతారం ఎత్తి మనముందు ప్రత్యక్షం అవుతారు ....

వీళ్ళను చూస్తేనే మనిషి జన్మ ....వీళ్ళకెందుకు జన్మ నిచ్చానురా బాబూ అని నీళ్లు లేని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది ....

=======================

మరి కొందరు ....ఉంటారు ....,,,

వీళ్లకు ఇతరులతో ఏదైనా అవసరం ఉంటే మర్యాదగా , పద్దతిగా అడిగి .....వాళ్లకు నష్టం లేకుండా , వాళ్ళ సమయానుకూలత చూసుకుని సహాయం చేయమని అడుగుతారు ....వాళ్ళు చేయలేము అంటే ...పర్వాలేదండీ నేను మరెవరి సహాయం అయినా అడుగుతాను అని నవ్వుతూ చెప్పేస్తారు .....

చేస్తే ...,,, వాళ్లకు మళ్ళీ నేనే విధంగా సహాయం చేయగలను అని కృతజ్ఞతా పూర్వకంగా ఆలోచిస్తారు ....

వీళ్ళు ఎవరికైనా సహాయం చేయాల్సి వస్తే , అడిగిన వెంటనే , కొన్నిసార్లు అడగడానికి మొహమాటపడినా... వారి మనసు తెలుసుకుని ....వాళ్లకు చేయూతనిస్తారు ....సహాయం చేయడానికి ముందుంటారు .....
చేశాక ఆ సహాయం మరుక్షణమే మర్చిపోతారు ....సహాయం తీసుకున్న వాళ్ళే తిరిగి గుర్తుచేసినా ....
"ఎప్పుడూ ....ఓ అదా .....అదేమంత పెద్ద సహాయం అని ....మీరు కూడా మర్చిపోండి ....." అని నవ్వుతూ చెప్పేస్తారు ....

వీళ్లకు ఎవరితోనైనా మళ్ళీ అవసరం వస్తే .....కాదు కాదు, అవసరం ఎప్పుడొస్తుందా.... ఎప్పుడు సహాయం చేద్దామా అని.... ప్రపంచం మొత్తం ఎదురు చూస్తూ ఉంటుంది .... <3 

వీళ్ళను చూస్తే .....మనిషి జన్మ ....జన్మంటూ ఇస్తే ...మళ్ళీ మళ్ళీ ఇలాంటి వాళ్లకి జన్మనివ్వాలిరా అని ఆశతో ఆరాటపడుతూ ఉంటుంది .... <3 

===================
ఏమైనా సరే ....బ్రతుకంటూ బ్రతికితే ....మనిషి జన్మ మన కోసం ఆరాట పడే బ్రతుకు బ్రతకాలబ్బా ....అది పది రోజులైతేనేం ....పది క్షణాలు అయితేనేం ...??!! <3 <3 <3 

=====================

మనిషి జన్మ అసహ్యించుకునే బ్రతుకు ..... అది బ్రతికేవాళ్లు .... ఎంతకాలం బ్రతకాలో , అసలు బ్రతకాలో వద్దో వాళ్ళే నిర్ణయించుకుంటారు .... :P :P :P 
ఆల్ ద బెస్ట్ .... :P :) 


Friday, November 4, 2016

"సమస్త సమస్యోభవః సుఖినోభవంతు ...."

నిన్న ... 

బయటకు వెళ్లినప్పుడు పనుండి దారిలోనే ఉన్న AT&T కి వెళ్ళా ....

అక్కడ ఎవరో ఒక కస్టమర్ ఉన్నారు ...కస్టమర్స్ గురించి కేర్ తీసుకునేవాళ్ళు నలుగురు ఉన్నారు ....

ఒకతను, నేను వెళ్ళగానే ఏం కావాలో అడిగాడు ....

సరే ....నాపని చూసుకుని నేను బయటకు రాబోతుంటే ....."బాగున్నారాండీ" అని పలకరించాడు ఆ మరో కస్టమర్ ....తెలుగులో ....

"బాగున్నానండీ" అంటూనే ఎక్కడ చూశాను అని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నా .... :( 

నేను వ్యక్తుల ముఖాలను సరిగా గుర్తుపెట్టుకోలేను అని ఆత్మీయ వర్గాల అభియోగం నిజం అవుతుందేమో అని సంశయం.... వెంటనే వారెవరో గుర్తుకు తెచ్చి నన్ను రక్షించింది ....:P 
(ఎందుకు గుర్తుపెట్టుకోలేనో ఆమధ్య పరిశోధించిన రహస్యం .... మరో సారి వివరంగా చెప్తాను :) )

"ఓహ్ మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను .....మీరు బాగున్నారా ...." పలకరించాను .....గుర్తుపట్టలేకపోవడం అనేది తప్పు కాదు కాబట్టి సారీ చెప్పకుండా .... :P 

అతను నన్ను పలకరించడం కూడా అదే మొదటిసారి ....ఎప్పుడూ చూస్తూ ఉండేవాడు ..కానీ పలకరించేవారు కాదు ......

కొన్ని పలకరింపులు తర్వాత .......మర్యాదపూర్వక కబుర్లు తర్వాత ....

"మీకు ఆ సమస్య ఉందనుకుంటా కదండీ ....." అడిగాడు ....
"అదేమంత పెద్ద సమస్య కాదండీ ....అది ఇలా పరిష్కరించొచ్చు ...." చెప్పా .... :) 

"ఆ ...మీకు ఈ సమస్య కూడా ఉన్నట్టు గుర్తు ...." సాలోచనగా మరో ప్రశ్న ....
"అది కూడా సమస్య కాదండీ ....అందరూ సమస్య అనుకుంటారు .....అది కూడా ఇలా పరిష్కరించొచ్చు ...."ప్రశాంతంగా చెప్పా .... :) 

"లేదండీ తప్పనిసరిగా ఇది మాత్రం మీకు సమస్యే అయి ఉంటుంది కదా ....." ఖచ్చితంగా అయి ఉంటుంది అని నొక్కి మరీ అడుగుతూ ....
"ఎక్కడ ఉండే సమస్యలు అక్కడ ఉంటాయి కదండీ ....ఆ మాత్రం సమస్యలు లేకుండా మనిషి జీవితం ఎలా ఉంటుంది ....కాబట్టి ఇది కూడా సమస్యే కాదు ....." చిరునవ్వుతో నేను .... :) 

"మీరు ఎన్నయినా చెప్పండి .....ఇది మాత్రం సమస్యే ...." మీరు ఇది ఒప్పుకోకపోతే నేను ఒప్పుకోను అనే ధోరణిలో అతను ..... :P 

ఇంత ఖచ్చితంగా నొక్కి చెప్పాడు అంటే .....ఏదో కారణం ఉండి ఉంటుంది అని ....నేను అతన్ని వారించి మాట్లాడడం ఆపేసి ....అతని దారిలోకి వెళ్లి మాట్లాడాలని నిర్ణయించుకుని ....
"నిజమేనండీ .....అది మాత్రం సమస్యే ....ఎంతో కష్టమే ...." చెప్పా నవ్వుతూ ... :) :P 

"అవునండీ నాకు నాలుగునెలల నుండి చుక్కలు కనపడుతున్నాయి ...." అని తన వ్యక్తిగత సమస్యతో తాను ఎంత బాధ పడుతుందీ వివరిస్తూ ....అతను ...

==========================

"నేను మనసులో బాధపడుతున్నాను .....మీరు కూడా బాధగా ఉండే తీరాలి .....మీరు బాధల్ని అధిగమించి సంతోషంగా ఉండే అవకాశం లేదు ....మనిషన్న వాడు ఎవడూ అలా ఉండే అవకాశం లేదని నేను నమ్ముతూ ఉన్నాను ....నా నమ్మకం ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం కావాలి ......అనే ముక్క ... ముందే చెప్పొచ్చు కదా ....మన సంభాషణ మొదటివాక్యం లోనే ముగిసిపోయేది ...." మనసులో నవ్వుకుంటూ అనుకున్నా ..... :) :) :P 

========================

అలాంటి వ్యక్తులకు సమస్యలే కావాలి ....పరిష్కారాలు అవసరం లేదు ....పరిష్కారాలు కనిపించినా సమస్యల కొరకు భూతద్దం పెట్టి అన్వేషిస్తూ ఉంటారు ....వాళ్ళని కూర్చోపెట్టి ...."ఎంత క్లిష్టమైన సమస్య అయినా ఒక పరిష్కారం ఉంటుంది ....ప్రతి సమస్యనూ పరిష్కరించుకోవచ్చు ...." అని మనం చిలక్కి చెప్పినట్టు చెప్పినా ......"చాల్లే పోవమ్మా నాకు సమస్యలు లేక చచ్చిపోతుంటే .....నువ్వు కష్టపడి వెతుక్కుని ఆనందంగా బాధపడుతున్న సమస్యల్ని పరిష్కరిస్తాను అంటావు ...." అని మొహమ్మీదే దుమ్మెత్తి పోస్తారు :) :) 

కాబట్టి ....."నా సమస్య భరించలేకపోతున్నాను ఎవరైనా పరిష్కారం చెప్పండి అని గగ్గోలు పెట్టి అరిచేవరకు ఎవరికీ మనం ఏ సలహాలూ ఇవ్వకూడదు అనే జీవిత సత్యం బాగా తెలుసుకొని ఉండడం వలన  .....


"సమస్త సమస్యోభవః సుఖినోభవంతు ...." అని దీవించి వీడ్కోలు చెప్పా .. :) :)

Sunday, October 30, 2016

నిద్రలోంచి తట్టి లేపే అంతగా...!!!!

హెలెన్ కెల్లెర్ ని(She was the first deafblind person to earn a Bachelor of Arts degree. )...ఒక విలేకరి, "చూపు లేకపోడం కన్నా దురదృష్టవంతులు ఈ ప్రపంచం లో ఉన్నారా ....?! "అని ప్రశ్నించారట....

"ఉన్నారు.....కలలు లేనివాళ్ళు"అని చెప్పారట.....

ఒక స్టోర్ కీపర్ గా పని చేసి ....ప్రపంచంలో అత్యధిక ధనవంతుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన JC Penney ని 90 సంవత్సరాల వయసులో "ఇప్పుడు మీ కంటి చూపు ఎలా ఉంది ?! "అని విలేకరులు అడిగిన ప్రశ్నకు .."కంటి చూపు మందగిస్తుంది.....కానీ భవిష్యత్తు ఇంకా సుస్పష్టంగా కనిపిస్తుంది " అని సమాధానమిచ్చారట.....

అబ్దుల్ కలాం కూడా ఎప్పుడూ చెప్పేది ఒక్కటే "కలలు కనండి " అని.....

ఇంతమంది ఇన్ని విధాలుగా చెప్తే....భవిష్యత్తు గురించి ఈ రోజే మనం ఒక కల కనకుండా ఉంటే మనకన్నా దురదృష్టవంతులు ఎవరూ ఉండరు.......ఆ కల ఎలా ఉండాలంటే మనకు నిద్ర పట్టనివ్వనంతగా.....నిద్రలోంచి తట్టి లేపే అంతగా...!!!!


(ఒక ఫ్రెండ్ కోసం మూడు సంవత్సరాల క్రితం ఇది రాసాను.....)

Saturday, October 29, 2016

ఎలా అయితేనేం అందరూ ఆనందంగా ఉండడమే పండగ కదా ....

నాకు దీపావళి టపాసులు అన్నిటిలోకి చిచ్చుబుడ్లు అంటే ఎక్కువ ఇష్టం .... <3

అవి వెలిగించాక పువ్వులా వెలుగులు చిమ్ముకుంటూ ఆకాశానికి ఎగురుతాయి ... :) 

కానీ అవి ఎక్కువ రేటు ఉండేవి.....అందుకే ఓ 10 కంటే ఎక్కువ తెచ్చేవారు కాదు చిన్నతనంలో ....

మిగతావన్నీ చీకటి పడకముందే ఆత్రంగా కాల్చేవాళ్ళం కానీ ఇవి ఒక్కటి మాత్రం, చిక్కటి చీకట్లో పంచిన వెలుగుల్ని చూడడానికి ....అన్నీ కాల్చడం అయిపోయాక ...చివరలో కాల్చుకునే వాళ్ళం ...... <3

ఇవి కాల్చడానికి ముందే ఓ పదిమంది చుట్టూ గుమికూడేవాళ్లు ...ఎంత ఎత్తు వెళ్తుందో చూడాలని .....
చిచ్చుబుడ్డి సైజుని బట్టి ఎంత ఎత్తు వెళ్ళొచ్చో ముందుగానే అంచనా వేసేవాళ్ళం  .....అదిగో ఆ వేపచెట్టు కొమ్మ దాటి వెళ్తుందిరా .....అని ....లేదురా ఇది ఇందాక కాల్చిన దానికంటే చిన్నది ....ఈ గోడ దాటుతుంది అంతే అని ....పందెం వేసుకునేవాళ్ళం ..

అనుకున్నదానికంటే ఇంకా ఎత్తు ఎగిరితే సంబరంతో గంతులు వేసేవాళ్ళం ....ఎగరకపోతే మరో చిచ్చుబుడ్డిమీద ఆశలు పెట్టుకునేవాళ్ళం .....

దీపావళి పండగంటే ఆ వీధిలో ఒక్కరు టపాసులు కాల్చినా వీధి అందరూ ఆనందిస్తారు అది చూసి ....కాల్చినవాళ్లు కాల్చినందుకు ....చూసినవాళ్లు చూసినందుకు .....ఎలా అయితేనేం అందరూ ఆనందంగా ఉండడమే పండగ కదా .....


మిత్రులందరికీ దీపావళి శుభాకంక్షాలు .... :) :) :)