Monday, November 14, 2016

అప్పుడెప్పుడో లగాన్ సినిమా వచ్చిన కొత్తలో ....

అప్పుడెప్పుడో లగాన్ సినిమా వచ్చిన కొత్తలో ....

సాధారణంగా నేను హిందీ సినిమాలు ఎక్కువగా చూడను .....ఇంగ్లిష్ అసలు అప్పట్లో చూసే అవకాశమే ఉండేది కాదనుకోండి ....తెలుగు మాత్రమే చూస్తూ ఉంటా .........

ఆ రోజుల్లో మనతో స్నేహం చేయాలన్నా ....మన వ్యక్తిత్వం గురించి ఒక అంచనాకు రావాలన్నా కొన్ని సాధారణ ప్రశ్నలు ఉండేవి  ......మీకిష్టమైన సినిమాలు ఏంటి అని ,మీకిష్టమైన రచయిత ఎవరూ అని ,మీ అభిమాన నటులు ఎవరూ అని, మీకిష్టమైన రంగు ఏమిటని .....ఇలా ....,మనం చెప్పిన సమాధానాన్ని బట్టి మన అభిప్రాయాలు ఇలా ఉంటాయి అని ఒక అంచనాకు వచ్చేవాళ్ళు .....
అది, ఒకరు అడిగినా ....మరొకరు చెప్పినా..... ఒకరి తో ఒకరు కాసేపు ఆహ్లాదంగా స్నేహం చేయడానికే తప్ప ....నా అంతటి వాడు అడిగితే చెప్పారు అనో .....నా అంతటి వాళ్ళని అడిగారు అనో ...ఎవరూ భావించేవాళ్ళు కాదు .....
పిడక ప్రశ్నలు వేసి .....అందులో నుండి పేడ పిసుక్కుందాం అనే ఆలోచన ప్రశ్నలు వేసేవాళ్లకి ......,పేడ సమాధానాలు చెప్పి... దాన్ని ఉపయోగించి పిడకలు చేసుకుందాం అనే ఆలోచన సమాధానాలు చెప్పేవాళ్లకి ఎంత మాత్రం ఉండేవి కాదు .....
అదలా ఉంచితే లగాన్ సినిమా అందరూ చూసి, ఆహా ఏం సినిమా ....ఓహో ఏం సినిమా అని అందరూ చెప్పేశారు ....మేం కూడా సినిమాకు వెళ్ళాం .....హిందీ నాకు చదవడం రాయడం వచ్చినంతగా మాట్లాడటం రాదు ....మా నాన్న దగ్గర చదువుకుని సరదాగా ప్రాధమిక,మాధ్యమిక కూడా పూర్తి చేశా ....అందువలనే హిందీ బాగా వచ్చు అని ఫీలయ్యేదాన్ని ( :) ) ....కానీ లగాన్ సినిమా చాలా వరకు నాకు మొదటిసారి చూసినప్పుడు అర్ధం కాలేదు ....భాష చాలా కష్టంగా అనిపించింది .....సరే అన్నీ అర్ధం కావాలని ఏముంది .....ఎవరడిగినా నాకు అంతగా అర్ధం కాలేదండీ అనే చెప్పేదాన్ని .....
ఆ సందర్భంలో ఒక ఫ్యామిలీతో హోటల్ కి భోజనానికి వెళ్ళాల్సొచ్చింది ....వాళ్ళు కొన్ని రోజుల క్రితం సిటీ కి వచ్చారు .... బిజినెస్ లో అప్పుడప్పుడే కాస్త కలిసిరావడం వలన .....కొందరు ప్రముఖులతో స్నేహం చేయడం ,ఆ ప్రముఖుల పేర్లు ప్రతి ఒక్కరి దగ్గరా ప్రస్తావిస్తూ ....మాకు వాళ్ళు ఫ్రెండ్స్ ,వీళ్ళు ఫ్రెండ్స్ అని చెప్పుకునే వాళ్ళు ....
అంతే కాకుండా ఆ స్నేహితుల్లో ఎవరెవరిని ఒరేయ్ అరేయ్ అనగలమో కూడా చెప్పేవాళ్ళు ....ఆ ప్రముఖుల్లో రాజకీయ నాయకులు,డాక్టర్లు ,లాయర్లు ,పోలీసులు ,సినిమా ప్రముఖులు ఉండేవారు ....ఇంతకీ వీళ్ళు ఏంటి అంటే పోట్టకొస్తే అక్షరం ముక్క లేదు ....వాళ్ళందరికీ డబ్బులిచ్చి స్నేహం చేస్తున్నామని పచ్చిగా వాళ్ళే చెప్పేవాళ్ళు ......నిజం చెప్పొద్దూ నాకు అలాంటి వాళ్ళను భరించడం కాస్త కష్టమే అయినా ....మా వారికి వాళ్ళు చాలా కావాల్సిన వాళ్ళు కావడం వలన భరించక తప్పేది కాదు .....
ఆ రోజు హోటల్లో భోజనం చేసేటప్పుడు లగాన్ సినిమా గురించి టాపిక్ వచ్చింది ....
ఆ సినిమా మా ఫేవరేట్ సినిమా ఐపోయింది .....మేం ఎన్నిసార్లు చూసామో ...మాకెంత నచ్చిందో ...అంటూ చెబుతూ ఉన్నారు .....
నా అభిప్రాయం అడిగారు ...."నాకంతగా అర్ధం కాలేదు " అని చెప్పా ....
నా వంక వాళ్ళు ఒక చూపు చూసారు.....వాళ్ళ చూపుకర్ధం..... 
"జాకెట్టు లేకుండా ...మోకాళ్ళ దాకా చీరకట్టి ,బుట్ట నెత్తిన పెట్టుకుని ,నడినెత్తిమీద ఒక కొప్పు పెట్టుకుని ,కొప్పునిండా ముద్ద బంతి పూలు పెట్టుకుని ....అప్పుడే పట్నానికి వచ్చిన ఎంకిని నేనని ......"
నేను కూడా వాళ్ళ వంక చూసాను ...నా చూపుకర్ధం.......
"మీ ప్రముఖుల లిస్టు లో లగాన్ ని కూడా చేర్చారా ....."అని  :)
-----------------------------------------------------------------------------------------
రోజులు అలా సంవత్సరాలుగా గడిచిపోయి ఆ మధ్య మహేష్ బాబు వన్ సినిమా వచ్చింది .....అది చూసినప్పుడు నేను నా సినిమా అభిరుచి గురించి ఒక నిర్ణయానికి వచ్చేసాను .....
నా మెదడుని ఎక్కువగా ఆలోచింపజేసే సినిమాల కన్నా ....ఆ కాసేపు మెదడుకి విశ్రాంతి నిచ్చి ఆహ్లాదాన్ని పంచే సినిమాలకు నేను ప్రముఖ్యతనిస్తాను అని...... 
పేస్ బుక్ లో ఆ సినిమా అర్ధం కాని వాళ్ళని కొంతమంది పిచ్చోళ్ళ కింద జమ కట్టారనుకోండి ....అది వేరే విషయం .....
----------------------------------------------------------------------------------------
మొన్నీ మధ్య interstellar సినిమా వచ్చిన కొత్తలో .....ఒక మిత్రుడు, పేస్ బుక్ లో "వన్ సినిమానే అర్ధం కాలేదు వీళ్ళకి .....ఇంకా interstellar ఏం అర్ధం అవుద్ది " అని పోస్ట్ పెట్టారు (మీ పోస్ట్ ఇక్కడ ఉపయోగించుకున్నందుకు క్షమించాలి ).....ఆ మిత్రుని సినిమా అభిప్రాయాలకు నేను విలువ ఇస్తూ ఉంటాను ....విశ్లేషనాత్మకంగా ఉంటాయి .... 
అప్పుడే నిర్ణయించుకున్నా ఇంక interstellar సినిమాకు వెళ్లకూడదని ...కానీ పిల్లలు, నువ్వు సినిమాకి తప్పనిసరిగా రావాల్సిందే ....మేం పక్కన కూర్చుని నీకు వివరిస్తాం అని హామీ ఇచ్చాక సరే అని సినిమాకి వెళ్ళా .....పాపం వాళ్ళు కూడా అర్ధం చేసుకోవాలిగా .....అయినా స్టొరీ కాస్త అక్కడక్కడ  చెప్పారు .....తర్వాత బయటికొచ్చాక వివరంగా చెప్పారు ....పర్వాలేదనిపించింది ....(అర్ధం చేసుకోవడంలో ) 
ఈ రకంగా అప్పుడప్పుడూ బ్రెయిన్ కి పని పెడుతూ వెళ్తే ....రాబోయే సినిమాలు (ఇలాంటివి ) బాగానే అర్ధం చేసుకోగలను అనిపించింది ......
ఇవన్నినా బ్రెయిన్ ని తికమక చేసే సినిమాలనుకోండి ........
-------------------------------------------------------------------------------
నాకు గుర్తున్నంతవరకు నా మెదడుని నేను సినిమాలకెళ్ళి కష్టపెట్టిన సందర్భాలు అవి ....
అయితే నిజ జీవితంలో కూడా మెదడుని పిండి ఆరేసే మనుషులు ఉంటారని .....ఇప్పుడు .....గత వారం రోజుల్లో నాకెదురైన కొందరి మాహానుభావుల దయ వల్ల.....వాళ్ళు వేసిన... వరస ...అర్ధం కాని,అర్ధం లేని ప్రశ్నల వల్ల నాకర్ధమైంది  ............
అందుకే రెండు రోజుల నించి పేస్ బుక్ లో ఒక ఆర్టికల్ రాసుకోవడం ,తినడం , మిగతా సమయం అంతా నిద్ర పోవడమే చేస్తున్నా .....ఎంత నిద్రపోతున్నానో గమనించాక కానీ నా మెదడు ఎంత అలసిపోయిందో నాకు అర్ధం కాలేదు .....నా పరిస్థితి లగాన్ ,వన్ , interstellar కలిపి మిక్సీలో వేసి గిర్రున తిప్పి నా బుర్రలో పోస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ....


ఇప్పుడు ఈ క్షణంలో ఆలోచిస్తుంటే నాకనిపిస్తుంది .....సినిమాలే కాదు నిజ జీవితంలో కూడా మన అభిరుచికి తగిన వాళ్ళనే మన స్నేహితులుగా ఎందుకు ఎంచుకుంటూ ఉంటామో .........??!! :) :) :)

========================

(గమనిక : ఈ ఆర్టికల్ నవంబర్ 14 , 2014  తేదీన వ్రాశాను ...)