Monday, November 14, 2016

నా పిల్లలు ఇలాంటి పనులు చేసినప్పుడు అభినందించడం నాకిష్టమైన చర్య ....

నా చిన్నతనంలో మా నాయనమ్మ దగ్గరకు ఒక వ్యక్తి వచ్చేవాడు
.....అతని పేరు బుల్లియ్య......అందరూ బుల్లాయ్ అని పిలిచేవాళ్ళు .....మనం చేసే చర్యలే సమాజంలో మన గౌరవాన్ని నిర్ణయిస్తాయి అనడానికి అతను పేరును అందరూ ఒక నిర్లక్ష్య ధోరణితో పిలవడం కూడా ఒక ఉదాహరణ .....
అతను పచ్చి తాగుబోతు .....అతను తాగాడంటే అతనికి ఒళ్ళు తెలియదు .....కళ్ళు ఎర్రగా ఉంటాయి చాలా భయంకరంగా .....ఒక్కోసారి ఒంటిమీద ఉన్న బట్టలు కూడా పోయి రోడ్డు మీద దొర్లుతూ ఉండేవాడు .....ఊరూరా తిరిగి కుంకుడు కాయలు అమ్ముకునేవాడు ..... వచ్చిన లాభంతో తను తాగగా మిగిలిన డబ్బులు ఇంట్లో ఇచ్చేవాడు .....అదంతా సరే .....తాగాడనడానికి గుర్తుగా తన భార్యను రోడ్ల వెంట పరిగెత్తించి మరీ కొట్టేవాడు ..... మత్తు దిగేవరకు వాళ్ళావిడ ఎక్కడైనా తలదాచుకోవలసిందే .......(తల దాచుకోవడం అనే పదం ఇక్కడ సందర్భోచితం కూడా .....పాపం ఆవిడ తల రక్తం కారేలా చాలాసార్లు కొట్టాడు ....) "ఎక్కడ" అనేది మా ఇల్లు అయ్యేది ....మా నాయనమ్మ అంటే అతనికి భయం .....మా ఇంట్లో దాక్కుంటే ఇక ఇక్కడికి రాడు అని ఆమె నమ్మకం ....అనుకున్నట్లుగానే మా ఇంటి దరిదాపులకు కూడా వచ్చేవాడు కాదు ......
మత్తు అంతా దిగాక నెమ్మదిగా ఈవిడే ఇంటికి వెళ్ళిపోయేది .....మళ్లీ మర్నాడు  ఉదయమే  వాళ్ళాయనకు చేపల పులుసులోకి కరివేపాకు కోసం ఇంటింటికి తిరిగేది .....అప్పుడే అనిపించేది ....స్త్రీ ని భోజ్యేషు మాత అని ఎందుకన్నారో .....
అలా అని అతను మాత్రం ఏం తక్కువ కాదు ...తెల్లవారగానే .....రాత్రి ఏం జరగనట్టే అంత పెద్ద బస్తా నెత్తి మీద పెట్టుకుని బేరానికి వెళ్ళేవాడు .....భార్యని బాధ్యతగా చూసుకునేవాడు .....
అతను తాగినప్పుడు మాత్రమే మనిషి కాదని ఊరు అందరికీ అర్ధమయ్యేది ....
అతనికి మా నాయనమ్మని డబ్బులు అప్పు అడగాల్సి వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చేవాడు .....
"అమ్మా ...సీతరామ్మ(సీతరావమ్మ) గారు ఉన్నారా ..." అంటూ అడిగేవాడు  ...
మా నాయనమ్మని పిలవగానే ....."ఒరేయ్ ... ఇంట్లోకి ఎందుకొచ్చావురా....పద బయటికి ...." అనేది ...
"మీ కోసమే వచ్చానండీ" అనేవాడు ..... మాటల్ని బట్టి తాగాడో లేదో కనిపెట్టడం కష్టమయ్యేది .....ఎప్పుడూ తూలుతూనే ఉండేవాడు .....
"పిల్లలున్నారు ...ఇంటికి రావొద్దని చెప్పా కదరా ....పద బయటికి ...."అనేది ...
ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి ....(మా అమ్మని కూడా దృష్టిలో పెట్టుకుని చెప్పేది )ఆవిడ వ్యాపారాలు ,లావాదేవీలు ....అలాంటి వాళ్ళతో ఏవైనా ఉంటే ఇంటి బయటే చూసుకునేది ......ఇంటిదాకా రానిచ్చేది కాదు .....
తాగడం అనేది చెడు అలవాటని ....సమాజంలో ఆమోదయోగ్యం కాని పని అనీ ....రాబోయే తరాలకు తప్పుడు సందేశాలను అందిస్తుందని ....అవి పిల్లలముందు మనం మాట్లాడకూడదని .....పిల్లలకు అవన్నీ తప్పు అని తప్పనిసరిగా మన తప్పు లేకుండా మనం చెప్పాలని ....ఇలాంటి గొప్ప విషయాలు నాకు,మా నాయనమ్మకు అప్పట్లో తెలియకపోయినా ....., మా నాయనమ్మ మా గురించి జాగ్రత్త తీసుకుని ఇల్లుని ఒక పవిత్రమైన స్థలంగా తీర్చి దిద్దటం,మేము కూడా అవన్నీ ద్రుష్టి పెట్టకుండా దూరంగా ఉండాల్సిన విషయాలని తెలుసుకోవడం  నాకెంతో ఇష్టమైన చర్య .....
------------------------------------------------------------------------------------------------------
సరే అదలా ఉంచితే మధ్యే మేము శ్వేతసౌధం చూడటానికి వెళ్ళాం ....
అక్కడ రకరకాల ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాం .....అక్కడికి వచ్చిన ప్రవాస వాసులను కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఒక టి వి ఛానల్ వాళ్ళు కనిపించారు .....వాళ్ళతో కూడా సరదాగా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం .....అక్కడినుండి వచ్చేస్తున్న సమయంలో  మాతో ఉన్న ఒకరు అడిగారు ...."నాకు వైట్ హౌస్ ముందు దమ్ము కొడుతూ ఒక ఫోటో తీసుకోవాలనుంది ...."అన్నారు ...
"దమ్ము అంటే " అన్నా ....నాకు వెంటనే అర్ధం కాలేదు ......
సైగ చేసి చూపించాక అర్ధమై " సిగరెట్టా " అన్నా .....
"పర్మిషన్ ఉందా అసలు " అన్నారు ....
"ఉండదనుకుంటానండీ ....." అన్నా .....
"అదుగో వాళ్ళు తాగుతున్నారు " అంటూ టి వి వాళ్ళ వైపు చూపించారు ....
వాళ్ళల్లో ఒకరు స్మోక్ చేస్తూ కనిపించారు ...
"అయితే నాకు తెలియదు మరి ....ఉందేమో "అన్నా
మా శ్రీవారు పాపం తన శాయశక్తులా అందరికీ అన్ని కోరికలు తీర్చాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ....అది ఎలాంటిదైనా.......,
(అతి మంచితనం అనే కోణం ఒకటుందిలే ..... :) )
"ఇక్కడే ఎవరినైనా సిగరెట్ అడుగుతాను ....."అన్నారు శ్రీవారు .....
"అందర్నీ మీ దగ్గర సిగరెట్ ఉందా ...మీ దగ్గర సిగరెట్ ఉందా అని అడుక్కుంటూ వెళ్తారా... " అని అడిగా ఆశ్చర్యంగా ..... 
"తప్పేముంది" అన్నారు .....
"మీ ఇష్టం ...." చెప్పా .....నాకు సంబంధం లేదు అన్నట్టు ..... 
అంతలో నా చిన్న కూతురు "అంకుల్ అది చాలా తప్పు ....మీరు సిగరెట్ తాగడాన్ని ప్రోమోట్ చేస్తున్నారు ...స్మోకింగ్ ని అలా ప్రోమోట్  చేయకూడదు ...." అంది 
"అది తీసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది ...నేను సిగరెట్ తాగకూడదు అన్నట్టు గా నా ఫేసు చూపిస్తా ....." అన్నారు 
"అయినా అలా చేయడం తప్పు ...."అంది మా పాప ......
"అలా కాదు ....ఛీ ఇలాంటి సిగరెట్ తాగుతున్నాను చూడు అన్నట్టు వికారంగా నా ముఖ కవళికలు పెడతాను" అన్నారు ...
"మీరెన్ని చెప్పినా నేను అగ్రీ అవను అంకుల్ ...." అని చెప్పేసింది ....చివరగా ,,,,ఖచ్చితంగా .....
ఎప్పుడు పరాయి వ్యక్తులతో విషయాల్లో విభేదించినా .....అంగీకరించినా ....నా అభిప్రాయాన్ని ఒకసారి చూపులతోనే తెలుసుకోవడం నా పిల్లలకు అలవాటు(ఫ్రాయిడ్ సిద్ధాంతం ) ......వాళ్ళు చేసింది తప్పు అయితే నెమ్మదిగా వివరిస్తూ ఉంటాను .....ఒప్పయితే కళ్ళతోనే అభినందిస్తా .....
కానీ అప్పుడు మాత్రం ......,
నా కళ్ళు, నా కూతురు నా వైపు చూడకముందే.... అభినందనలు వాటి నిండా నింపుకుని ఎదురుచూస్తూ ఉన్నాయి.... ఎప్పుడెప్పుడు అభినందిద్దామా అన్నట్టు .... 
నా పిల్లలు ఇలాంటి పనులు చేసినప్పుడు అభినందించడం నాకిష్టమైన చర్య ....
-----------------------------------------------------------------------------------------------
ఇందాకే ...చిల్డ్రన్స్ డే గురించి ఒక ఆర్టికల్ రాసుకుంటున్నాను నాన్నా ...చిన్న పిల్లలకు విషెస్ చెప్పాలి....అన్నా .....
అవునా, నేను కూడా చిన్న పాపాయినేగా ...మరి నాకు చెప్పవా అంది .....
అవును నాన్నా నువ్వెప్పటికీ నాకు చిన్ని పాపాయివే ....హాపీ చిల్డ్రన్స్ డే అని చెప్పా .....
--------------------------------------------------------------------------
చిన్న చిన్న పాపాయిలైనా ప్రవర్తనలో ఎంతో ఎత్తు ఎదిగిన వాళ్లకు .....
ఎంతో ఎత్తు ఎదిగినా అమ్మకు చిన్న చిన్న పాపాయిలే అయిన వాళ్లకు ......

హాపీ చిల్డ్రన్స్ డే.......... :) :) :)

======================

(గమనిక : ఈ ఆర్టికల్ నవంబర్ 13 , 2014  తేదీన వ్రాశాను ...)

No comments:

Post a Comment