Wednesday, December 14, 2016

అమ్మ , నాన్న తర్వాత నాకెదురైన రెండో వ్యక్తి ఈమే ....!

ప్రపంచంలో మనకు రోజూ ఎంతో మంది ఎదురవుతూ ఉంటారు ...అందరినీ పలకరిస్తాం ...లేదా వాళ్ళు మనల్ని పలకరిస్తారు ....అంతే ....వాళ్ళు వెళ్ళిపోయాక వెనక్కి తిరిగి వాళ్ళవైపు మళ్ళీ మనం చూడం ....వాళ్ళు మనవైపు చూస్తారో లేదో తెలియదు .....బహుశా అరుదుగా చూడాలని అనిపించొచ్చు ....

ఒకవేళ అలా వాళ్ళను మళ్ళీ చూడాలనిపిస్తే  ....చూశాక ఇంకా ఇంకా వాళ్ళను పదే పదే చూడాలనిపిస్తే  ....వాళ్ళను అలా చూస్తూనే ఉండాలనిపిస్తే ....ఆహా ఎంత అద్భుతమైన హృదయం ఉంది వీళ్ళకి అని అనిపిస్తే .....అలాంటి వాళ్ళు మనకు తారసపడితే ....వాళ్లకు మీరు అద్భుతమైన వ్యక్తి అని చెప్పాలనిపిస్తే .....???!! 

అంతకంటే అదృష్టం లేదని అనుకుంటూ ఉంటా నేనైతే .....అదే మాట రోజు ఒకరితో చెప్పా .....!!

----------------------------------------

ఆమె అక్కడ హాస్పిటల్ లో సిస్టర్ ....

ఆమెని నేను చాలా రోజుల క్రితం చూశాను ....ఒక చిన్న రెండేళ్ల పాపను పలకరిస్తుంటే .....,,,

వాళ్ళ అమ్మ పాపను బాత్ రూమ్ కి తీసుకుని వెళ్ళడానికి అక్కడున్న వాళ్ళను Key అడిగింది ....ఆమె Key తీసుకుని వచ్చి ....వాళ్ళ అమ్మకు Key ఇచ్చింది ....వాళ్ళ అమ్మ ఫోన్ లో మాట్లాడుతుంటే ....
"పర్వాలేదు మీరు మాట్లాడండి ....నేను తీసుకుని వెళతాను పాపను" అని నవ్వుతూ అడిగింది ....
వాళ్ళ అమ్మ "థాంక్స్ ....నేను వెళతాను" అంది ....
నవ్వుతూ సరేనని చెప్పింది ....

చెప్పడంలో , పంపించడంలో ఉన్న భద్రత చూసి ....ఎంత బాగా పలకరిస్తుంది అనుకున్నా క్షణం .....

------------------------------------------

రోజు ...ఆమె ...కాసేపాగాక నన్ను రిసీవ్ చేసుకుంది ....ఓహ్ ఈమే నన్ను చూసుకోబోయే సిస్టర్ అనుకున్నా ....

నేను లోపలికి వెళ్ళాక నా హెల్త్ హిస్టరీ సిస్టం లో ఓపెన్ చేసింది .....అంతా చూసింది ....నేను ట్రీట్ మెంట్ కోసం వచ్చానో నిర్ధారణ చేసుకుంది ....అంతకు ముందు ఉన్న పరిస్థితి అంతా అడిగి తెలుసుకుంది ....
తర్వాత నా అంచనా తప్పు కాలేదు ....ఆమె అద్భుతమైన వ్యక్తి అని ఆమె ప్రతి మాటలో ప్రతిబింబిస్తూనే ఉంది ....నేను నా ట్రీట్మెంట్ సంగతి మర్చిపోయేలా చేసింది ఆమె ....ఆమె ప్రతి కదలికను గమనించడమే నా పనిలా మార్చింది ....

ఆమె సుశిక్షితురాలైన సైనికురాలు ....
ఆమె చేసే పని మీద ఆమెకు పూర్తి అవగాహన కలిగి ఉంటుంది ....ప్రతి చిన్న అంశం ఆమె పరిగణలోకి తీసుకుంటుంది .....డాక్టర్ రాకముందే డాక్టర్ ఏం చేయబోతున్నారో నాకు పూర్తిగా వివరించింది ....డాక్టర్ వచ్చాక ఏం చేయాలో డాక్టర్ తో చర్చించింది ....అందుకు తాను ఏం సిద్ధం చేసుకోవాలో చక చకా సిద్ధం చేసుకుంది .....ఇక అక్కడనుండి ఆమె యంత్రంలా పని చేసుకుంటూ పోయింది ....ఆమెకు డాక్టర్ చెప్పాల్సిన అవసరం లేదు ....డాక్టర్ అడగకముందే అన్ని తెలిసినట్టు ముందే అందుకుంటుంది .....ఎన్నో సంవత్సరాల నుండి చూస్తున్నట్టు ... తర్వాత డాక్టర్ ఏం చేయబోతున్నారో ముందే తెలిసినట్టు .....ఇప్పుడు ఇది చేయబోతున్నారు కదా అని అడుగుతుంది ....అలాంటి సందర్భంలో పేషంట్ పరిస్థితి ఎలా ఉంటుందో ఆమె గమనించడం మర్చిపోదు....

అనస్థీషియా ఇచ్చేటప్పుడు, ఇంజక్షన్ చేసేటప్పుడు మనకు ముందే చెబుతుంది ....అది డాక్టర్ బాధ్యతే అయినా ....అది మనకు ఎంత నొప్పి కలిగించబోతుంది అని ....ఎక్కడ చేస్తున్నారు అని ....

పేషంట్ ఎలా ఫీల్ అవుతాడు అనేది ఆమెకు తెలిసినంతగా డాక్టర్ కు కూడా తెలియదు ....

ఆమె మనకు ఇస్తున్న ట్రీట్మెంట్ గురించి మనకంటే ఎక్కువగా డాక్టర్ ని అడిగి తెలుసుకుని తర్వాత మనకు వివరిస్తుంది ....

ఇదంతా చేస్తున్నప్పుడు ఆమె చిరునవ్వు చెక్కు చెదరదు....అంతా అయిపోయాక నవ్వుతూ వీడ్కోలు చెప్పేవరకు ఆమె కంటికి రెప్పలా మనల్ని చూసుకుంటుంది .....

ఎందుకో ఆరోజు నేను గమనించాను కానీ ....నేను వెంటనే స్పందించలేకపోయాను....ఇంటికొచ్చి నిద్రపోయి లేచాక ఆమె గుర్తొచ్చింది .....అద్భుతంగా అనిపించింది ....ఆమె మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూనే ఉంది ....
ఓహ్ మళ్ళీ కలవబోతున్నాను కదా అనుకున్న తర్వాత ఒకింత నిశ్చింతగా అనిపించింది .....

--------------------------------

రోజు మళ్ళీ కలిశాను ....అదే పలకరింపు .....ఏమీ మార్పు లేదు .....

నా పేరు శ్రీలంక ను పోలి ఉందని .....ఎలా పలకాలి అని అడిగింది .....నేను రాకముందే ప్రాక్టీస్ చేశాను అని పలికి చూపించింది ....నేను నవ్వి ...శ్రీ అని పిలవమని చెప్పాను....వాతావరణం రేపు ఎలా ఉండబోతుందో చెప్పింది .....చాలా చలిగా ఉంటుంది జాగ్రత్తగా ఉండమంది .....

రోజు ట్రీట్మెంట్ మధ్యలో డాక్టర్ బ్రేక్ లో ...ఎలా ఉంది అని అడిగింది .....

అవకాశం దొరికింది కదా అని ....ఆమె గురించి అడిగాను ....

ఇథియోపియా నుండి వచ్చిందట .....ఆమె పేరు అడిగాను, చెప్పింది ....

నీలాంటి హృదయం కలిగిన వ్యక్తులు అరుదుగా కనిపిస్తారు ....నీ హృదయం ఎంతో అందంగా ఉంది అని చెప్పాను .....నీ హృదయం నిండా దైవత్వమే నిండి ఉంది అని చెప్పాను ....

కాస్త సిగ్గుపడింది .....(పొగిడితే వచ్చే అందమైన సిగ్గు <3 ) నేను నా బాధ్యత నిర్వర్తిస్తున్నాను అని చెప్పింది ....

కాదు నీ బాధ్యతను నువ్వు ఎంతో ప్రేమగా చేస్తున్నావు ....అలా బాధ్యతను  ప్రేమించేవాళ్లను నేను నా జీవితంలో అతి కొద్దిమందిని చూశాను అని చెప్పాను  ....

నీ దగ్గర ప్రతి ఒక్కరికీ అందమైన నందనవనాన్ని నిర్మిస్తున్నావు ....అది అందరికీ సాధ్యం కాదు ....నువ్వు అద్భుతమైన వ్యక్తివి .....అని చెప్పా ....

ఫోటో తీసుకోవచ్చా అని అడిగి తీసుకున్నా ....ఆమె ఫోన్ నెంబర్ కూడా ఇచ్చింది .....

అంతలో డాక్టర్ వచ్చారు ....అడిగితే ఆమె గురించి చెప్పా .....

"ఓహ్ రోజు తను నిద్రపోదు.... " అన్నాడు నాతో ఏకీభవించి నవ్వుతూ ....

అది నా అదృష్టం, ప్రతి ఒక్కరూ నవ్వుతూ ఉండాలని కోరుకుంటాను ...అంతే ... అంది ఆమె నవ్వుతూ ....

కాదు ఇలాంటి వాళ్ళను నా జీవితంలో కలిసే అవకాశం రావడం ....వాళ్లు నాకు ఎదురుపడడం నా అదృష్టం అని చెప్పా ....

----------------------------

రోజు నిద్రపోయి లేచాక కూడా ఆమె గుర్తొచ్చింది .....మళ్ళీ కలుస్తాను అని గుర్తొచ్చి నిశ్చింతగా అనిపించింది .....

--------------------------------

కొంతమంది దగ్గర అంతే .....మన ప్రాణాలు వాళ్ళ చేతుల్లో పెట్టి మనం నిశ్చింతగా కాసేపు మన ఆత్మను జో కొట్టొచ్చు అనిపిస్తుంది ..... కాసేపు మన ఆత్మకు వాళ్ళు కాపలా ఉండి....మళ్ళీ మనకు భద్రంగా తిరిగి అప్పగిస్తారని మనకు నమ్మకం కలుగుతుంది .....వాళ్ళ హృదయానికి మన హృదయం అర్పించి మనల్ని మనం మర్చిపోయేలా చేస్తారు ఇలాంటి వ్యక్తులు .....

అలాంటి వ్యక్తులను మనం అరుదుగా కలుస్తాం ..... జీవిత కాలంలో ఎంతమంది అలాంటి వ్యక్తులు మనకు ఎదురవుతారు అనేది మన అవకాశం /అదృష్టం ....నిర్ణయిస్తుంది ....


అలా ...నా జీవితంలో ...నాకు ... అమ్మ , నాన్న తర్వాత నాకెదురైన రెండో వ్యక్తి ఈమే ....!