Monday, September 12, 2016

శాశ్వతంగా అమెరికా వదిలి భారతదేశం వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నారు ఓ తెలుగు కుటుంబం వాళ్ళు ...

(గమనిక : ఇది క్రితం సంవత్సరం ఇదే రోజు వ్రాసిన ఆర్టికల్ ...)
---------------------------------------------------------------
శాశ్వతంగా అమెరికా వదిలి భారతదేశం వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నారు ఓ తెలుగు కుటుంబం వాళ్ళు ...

వాళ్ళ స్వకారణాలు ఏవైనా ....ఏ వైపు నుంచి తరచి తరచి చూసినా ఇది ఆనందించాల్సిన విషయమే తప్ప బాధపడే విషయం కాదు అనిపించి ....వాళ్ళకి నిన్న ఆనందంగా వీడ్కోలు చెబుదామని భోజనానికి పిలిచాం ....

చాలా కష్టపడి వంట చేయాల్సి వచ్చింది ....కష్టపడి అని ఎందుకు అన్నానంటే ...మా కారం(మమకారం) గురించి తెలిసిన కారణంగా ముందుగానే వాళ్ళు ఫోన్ చేసి ..."పిల్లలకు అస్సలు కారం లేకుండా ...., మాకు ….,మీరు తినే కారం కంటే ... కారం తగ్గించి చేయండి లక్ష్మిగారూ ...." అని రిక్వెస్ట్ చేశారు .....

నిజం చెప్పొద్దూ ఇలాంటివి నాకు అగ్ని పరీక్షలే అనుకోండి .....అయినా ధైర్యం చేసి పిల్లలకు ,మాకు మాత్రమే అనుకుని రెండురకాల వంటలు చేశా ....విచిత్రం ఏమిటంటే వచ్చాక పిల్లలు కూడా వాళ్ళ కోసం చేసినవి కాకుండా ...మేం తినే కారం హాయిగా తిన్నారు ....

"మీరు కారం చాలా తగ్గించారు లక్ష్మిగారూ ...." అన్నారు ఆశ్చర్యంగా ....

"కాదు …, మీరు ఎక్కువగా భయపడ్డారు ....."అన్నా నవ్వుతూ ....

అందరం హాయిగా తింటూ ఉన్న సమయంలో ….

మధ్యలో అతను ...."లక్ష్మి గారూ గారెలు చాలా బాగున్నాయండీ ....నూనె అస్సలు పీల్చుకోకుండా ఎలా చేయగలిగారు ....ఏదైనా చిట్కా ఉందా .....చూడు ...ఎలా ఉన్నాయో ....ఇలా చేయమని అడుగుతూ ఉంటా నేను నిన్ను ఎప్పుడూ ...."అంటూ తన భార్య వైపు చూశారు ....
ఏం జరగబోతుందో నాకు అర్ధమైంది .... :)

నేను సమాధానం చెప్పకముందే ....తనకు ఏడుపు వచ్చినంత పనైంది ...."నేను చేసినవి కూడా ఇలాగే ఉంటాయి ...." అంది ఉక్రోషంతో ....

"నువ్వు చేసినవి బాగుండవు అనలేదు నేను ...ఇవి ఇంకాస్త నాకు కావాల్సిన విధంగా ఉన్నాయి ....మనం చేసేవి కూడా ఇలా చేసుకోవచ్చు కదా అని ....తెలుసుకుందామని అడిగాను ...." అన్నాడతను సంజాయిషీ ఇచ్చే ధోరణితో .....

ఇక నేను కల్పించుకోక తప్పలేదు .....సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ...(అసలు ఎలాంటి సందర్భంలో అయినా )నేను స్త్రీలకే సపోర్ట్ చేస్తూ ఉంటా :)

"మీరు బాగా చేస్తారని మీకు నమ్మకం ఉన్నప్పుడు ..ఈ తాటాకు చప్పుళ్ళకు మీరు ఎందుకు భయపడుతున్నారు ...??!! ఒక్కసారి నవ్వుతూ ...."అలాగేనండీ ....ఈసారి నుండి ఇంతకంటే బాగా చేస్తానండీ .." అని చూడండి....మీవారి అహం సంతృప్తి పడి మళ్లీ ఒక్క మాట మాట్లాడకుండా ఎలా ఉంటారో చూడండి .... " అన్నా ...అనునయించే ధోరణిలో ...... 

తాత్కాలికమైన పరిణామాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ....దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని .... అలాంటి సందర్భాల్లో ఎలా మాట్లాడితే ఆమె ఆలోచనల్లో మార్పు తీసుకుని రావచ్చో ఆలోచిస్తూ .....

"కాదండీ ....వీళ్ళు ఎప్పుడూ ఇంతే (మగవాళ్ళు)....నేను కూడా బాగానే చేస్తాను ...." అంది తను ఏడుపు ఆపుకుంటూ ....మిమ్మల్ని పొగిడారని నాకు బాధ లేదు అని నాకు అర్ధమయ్యేలా చెప్పాలని ....

"నాకు తెలుసు ....అందుకే వాళ్ళు ఎప్పుడూ అంతే కాబట్టి ....మీ ఆలోచనల్లో మార్పు రావాలి అంటున్నాను ...మీరు కూడా ఎప్పుడూ వాళ్ళలా ఉండకండి ...ఒక్కసారి నా మాట విని అలా అని చూడండి ....అది కూడా నవ్వుతూ ...." కండిషన్ విధించి మరీ స్థిరంగా చెప్పా ....

"అలాగేనండీ …ఈసారి నుండి ఇంతకంటే చాలా బాగా చేస్తాను ...." నవ్వుతూ చెప్పింది తను తన భర్తతో ....

అతను కాస్త ఇబ్బందిగా ఫీలయ్యాడు ....ఆమె చాలా హాయిగా నవ్వింది ....

నాకు కావాల్సింది కూడా అదే .... :)

హాయిగా భోజనాలు పూర్తయ్యాక ....ఇంకా సర్దుకోవడాలు పూర్తికాలేదని ...త్వరగా వెళ్ళిపోతాం అని బయల్దేరాక ....”హ్యాపీ జర్నీ” .....అంటూ వీడ్కోలు చెప్పాం ...హైదరాబాద్ వస్తే మీరు మా ఇంట్లోనే ఉండాలి అని వాళ్ళూ మనస్పూర్తిగా ఆహ్వానించారు ....

వెళ్ళే ముందు తలుపు దగ్గరకు వచ్చాక ఆమె ...."ఇదివరకు...మనం ఒక పార్టీలో ఉన్నప్పుడు .... మీరు ఒకసారి చెప్పిన మాట నాకెప్పుడూ గుర్తొస్తుంది ....అది తల్చుకుని నేను చాలా సంతోషంగా ఉండడం నేర్చుకున్నాను .....నేనెప్పుడూ ఆ మాట మర్చిపోను ....థాంక్స్ అండీ ...." అంది నాతో ....చాలా ఉద్వేగంగా ....

"ఏమాట ....." అన్నాను ....అంత సంతోషంగా ఉంచిన మాటేమిటో తెలుసుకోవాలనే ఆసక్తితో .....
"అదే మీరు ఒకసారి చెప్పారు ....ఇప్పుడు ,ఈ క్షణంలో ఏదైతే నా దగ్గర ఉందో ....ఏదైతే నేను అనుభవిస్తున్నానో ....అదే నా ఆస్తి . ….ప్రపంచంలో ఇంకెక్కడ ఎంత ఆస్తి ఉన్నా అదేదీ నాది కాదు ....అని చెప్పారు ...గుర్తుందా ....."అంటూ గుర్తు చేసే ప్రయత్నం చేసింది .....

"గుర్తొచ్చింది ...." నవ్వుతూ చెప్పా ....

"అది నేను నమ్మిన సిద్ధాంతం ....అందుకే చెప్పా ...."చెప్పాను....

"అది నాకు చాలా నచ్చింది లక్ష్మిగారూ .....అలా అనుకున్నప్పుడు చాలా సంతోషంగా ఉండగలుగుతున్నా ....." సంతోషంగా చెప్పింది ......
------------------------------------------
మన ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఉన్నాయో అనేది అప్రస్తుతం .... అవి ఎవరికి నచ్చాయో ... ఎవరికి నచ్చలేదో అనేది కూడా అప్రస్తుతం ....

అవి ఒక్కరి ఆలోచనా విధానం మీద అయినా ప్రభావం చూపిస్తున్నాయా లేదా అనేదే ప్రస్తుతం .....
అదీ ....వాళ్లకు కొద్దికాలం సంతోషంగా బ్రతికేందుకు మాత్రమే కావచ్చు ...ఒక్క రోజు కావచ్చు లేదా ఒక్క క్షణం కావచ్చు ...

నాకు మాత్రం ఒక జీవిత కాలం గర్వాన్ని తెచ్చే క్షణాలు అలాంటివి ....!! :) :) :)

No comments:

Post a Comment