Monday, July 31, 2017

నేనూ అమ్మనే కదా ....??!! అందుకే బాగా తెలుసు ...!! :)

అమ్మకు నేను పెద్దదాన్ని అయి చూపించాలి అని ఎప్పుడూ అనుకుంటూ ఉంటా ....
అది నా సంతోషం కోసం కాదు ....అమ్మ సంతోషం కోసం .....
--------------------------------
చిన్నతనంలో ....
అమ్మా ముల్లు గుచ్చుకుంది అంటే.... ఆదారిలో నుండి ఎందుకెళ్లావ్ అని అమ్మ కోప్పడేది ....
అమ్మా కడుపులో నొప్పిగా ఉంది అంటే .....రెండు మూడు రోజుల క్రితం
నుండి నేనేం తిన్నానో అమ్మ లిస్ట్ చదివి ....అందులో నా కడుపులో నొప్పికి కారణమైన వాటిని ....దూరంగా ఉంచాలని ప్రయత్నించి ....అవి తిన్నందుకు నన్ను తిట్టి పోసేది ....
వేడి చేసింది అంటే ...ఎండలో బయటకు వెళ్లకుండా ఉండమని హెచ్చరికలు చేసేది ....
ఇంజక్షన్ అంటే భయం అని ఏడిస్తే ....అందుకు బదులు టాబ్లెట్స్ తీసుకుంటానని డాక్టర్ ని అడిగేది .....
ముక్కు కుట్టించుకుంటాను అని సరదా పడితే ....ఆ నొప్పి నువ్వు తట్టుకోలేవు అని వాయిదా వేసేది ....
ఎక్కడైనా పడి దెబ్బలు తగిలించుకుంటే ....అసలు ఆటల్లోకి ఎందుకు వెళ్లావని నిలదీసేది....
ఇవన్నీ అమ్మ చేసినప్పుడల్లా ....అప్పట్లో అమ్మ అన్నిటికి అడ్డు పడుతుందని అమ్మ మీద కోపం వచ్చినా ....నేను చిన్నదాన్ని కాబట్టి నొప్పి తట్టుకోలేనని నా మీద ప్రేమతో అలా నన్ను కోప్పడి ఉంటుందని ఇప్పుడు అనుకుంటూ ఉంటా ....
కానీ ఇప్పటికీ ....ఇంకా నేను చిన్నదాన్నే అని భావిస్తూ ఉంటే ...నాకే కష్టం కలుగుతుందో అని అమ్మ ఎప్పుడూ కంగారు పడుతూ ఉంటే .....నేను నొప్పి తట్టుకోలేనని...ఆ నొప్పిని తాను తీసుకోవాలని అమ్మ ప్రయత్నిస్తూ ఉంటే ....
నా కష్టాలేమిటో ఎలాగైనా తెలుసుకుని అవన్నీ తాను పంచుకోవాలని అమ్మ ఆరాటపడుతూ ఉంటే ....
అమ్మకు చెప్పాలనిపిస్తుంది ....అవసలు కష్టాలే కాదమ్మా అని ...,,,
ఇంకా నేను చిన్నపిల్లని కాదమ్మా అని ....,,,
నేను చాలా చాలా పెద్దదాన్ని అయిపోయానమ్మా అని ....,,,,
.........................................
కానీ ఒక్కటే భయం వేస్తుంది ....ఎలా పెద్దయ్యావు అని అమ్మ అడిగితే ఏం చెప్పాలా అని ....??!! 
నేను పెద్దయ్యాను అని చెప్పినా భరించలేదు , నేను చిన్నదాన్నే అని చెప్పినా కంగారు పడుతుంది .... 
అందుకే ఒక చిరునవ్వు నవ్వి మౌనంగా ఉంటూ ఉంటా .... 
కానీ నాకెక్కడో చిన్న భయం ....ఈ అమ్మల్ని నమ్మకూడదు ....ఎలాగైనా బిడ్డ మనసు అర్ధం చేసుకునే శక్తి వాళ్లకు ఉంటుంది .... 
నేనూ అమ్మనే కదా ....??!! అందుకే బాగా తెలుసు ...!! 

No comments:

Post a Comment