Sunday, May 14, 2017

మాతృ హృదయం ఉన్న పురుషుడు ఈ రోజుల్లో కూడా ఇంకా ఎక్కడో ఉన్నాడేమో అని ఆశ కలుగుతుంది ....

చరిత్ర చూసి మనం కొన్ని విషయాలు నేర్చుకుని ...అవి వర్తమానంలో ఉన్న విషయాలతో పోల్చుకుంటాం .........
ఏవి పునరావృతం కావాలి ....ఏవి కాకూడదు ....మానవాళి మనుగడకు ఏది నష్టం ఏది లాభం అని నిర్దేశించేది చరిత్రే ....అసలు అందుకే చరిత్ర మనం చదువుకోవాలి కూడా ....
అయితే వర్తమానం చూసి కూడా కొన్ని విషయాలు నేర్చుకుని..అవి మనం చరిత్రతో పోల్చుకుని నేర్చుకోవచ్చు ....వర్తమానంలో ఉన్నవాళ్లు ఎందుకు అలా చేస్తున్నారు .....దానివెనుక ఉన్న కారణాలేమిటి ...అది ఎలా ఇప్పటి జీవన విధానానికి అన్వయించుకోవాలి .... అనేవి.. కొన్ని పరిశోధనలకు అందవు ....
అవి మనం, మన అనుభవాల్లో నుండి వెలికి తీసి ....సరికొత్త అర్ధాలను అన్వయించుకుని ...మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు .....చరిత్ర అందుకు కూడా ఉపయోగపడుతుంది .....
ఇదే భవిష్యత్ చరిత్ర అవుతుంది .....

బహుశా అప్పటి వర్తమానంలో కూడా కొన్ని, అంతకు ముందు ఉన్న చరిత్ర నుండి వచ్చి ఉండొచ్చు ....
ఏది ఏమైనా అదలా ఉంచితే ....ఈ వర్తమానంలో మనం ఒక విషయం తెలుసుకుని తీరాలి అని అర్ధమైంది .....
=========================
"ఆదిమ కాలంలో ఎవరో ఒక పురుషుడు, మాతృ హృదయం అర్ధం చేసుకుని ఉంటాడు .......అందుకే స్త్రీకి ఇంటి పని , పిల్లల పని అప్పగించి ....తను వేటకు వెళ్లి .... ఆహారం వేటాడి తెచ్చేవాడు ....బయటకు వెళ్లి చూసుకోవాల్సి వచ్చిన పనులన్నీ తానే చూసుకునేవాడు ...." అని 
ఆమె బలహీనురాలు అని కాదు ....పిల్లలను వదిలి వెళ్లాల్సి వస్తే ఆమె కన్నపేగు ఎక్కడో కదులుతుంది ....ఆ కదలికకు ఆమె శరీరం కంపిస్తుంది ....ఆ నొప్పిని ఆమెకు కలిగించడం అంటే ....ఓ రకంగా ఆమెను బాధ పెట్టడమే అని ....ఎప్పుడో, ఎక్కడో ... తను అర్ధం చేసుకున్నాడు ....
పిల్లల అవసరాలు తల్లికి తెలిసినంతగా తను తెలుసుకోలేడు అని, ఒకవేళ తెలుసుకున్నా ఆమె చేసినంత శ్రద్ధగా, ప్రేమగా, భక్తిగా తను చేయలేను అని ....అర్ధం చేసుకుని ఉంటాడు ...
అందుకే ఆమెను పిల్లల దగ్గరే ఉంచి ...తను ఆహార అన్వేషణకు వెళ్లి , దానికి కాల క్రమేణా సంప్రదాయం అని పేరు పెట్టాడు ....
తర్వాత దానినే ....తమ అవసరాలకు అనుగుణంగా ......లేదా పురుషుడు లేని సమయంలో , లేదా పురుషుడు ఆదరించని సమయంలో ....తప్పనిసరై పిల్లల పోషణ బాధ్యత తల్లి తీసుకుని ....పిల్లలని వదిలి ఉదర పోషణ నిమిత్తం తల్లి ఆహార అన్వేషణకు వెళ్లాల్సి వచ్చేది ....
ఆ తర్వాత కథ మీకు తెలిసిందే ....
కొందరు పురుషులు స్త్రీని ....
నువ్వు అబలవి కాబట్టి ఇంటిదగ్గర ఉండు అన్నాడు....
నువ్వు ఎందుకూ పనికిరాని దానివి కాబట్టి ఇంటి దగ్గర ఉండు అన్నాడు
....
అందమైన సంప్రదాయాన్ని లోప భూయిష్టం , స్వార్ధహితం చేసి ...మేం చెప్పిందే సంప్రదాయం అన్నాడు .....
నువ్వు పిల్లల్ని చూసుకోవడానికి తప్ప ఎందుకూ పనికిరావు అని ....బయట పనులు నువ్వు చేయలేవు , చేతకాదు అని అవమానించాడు ... ....
ఆమె ఇంటిదగ్గర ఉండి చేసే పనులన్నీ విలువ లేనివిగా తద్వారా ఆమె విలువ లేనిదిగా చిత్రీకరించాడు....
నేను బయటకు వెళ్లి సంపాదిస్తున్నాను కాబట్టి ...నీకు, నీ పిల్లలకు తిండికి బట్టకు అవసరమైనంత ఇచ్చి ....మిగతా డబ్బు నా ఇష్టం వచ్చినవాళ్లకు ఇచ్చుకుంటా అన్నాడు ....
సంపాదించిన డబ్బు నేను సంపాదిస్తున్నా కాబట్టి ఏమైనా చేసుకునే హక్కు నాకుంది అన్నాడు ....
ఇంకా కొందరు ...ఎంతమందితో అయినా సంబంధాలు పెట్టుకునే హక్కు నాకుంది ....కాదని అంటే నీ పిల్లలు, నువ్వు ఇల్లు వదిలి వెళ్ళండి అన్నాడు ....
పిల్లలు అనేది ఆమె బలహీనతగా అనుకుని ....ఆమె ను బంధించాను అనుకుని ....తను విచ్చలవిడితనం నేర్చుకున్నాడు ....
ఇలా చెప్పుకుంటూ పొతే ....అతని అక్రమాలకు అంతే లేకుండా పోయింది ....
ఇంత జరిగినా ...స్త్రీ పురుషుడి గురించి ఆలోచించలేదు ....తన కన్నపేగు గురించే ఆలోచించింది ....అతనితో పోరాడింది ....బ్రతిమాలింది ....కాళ్ళా వెళ్ళా పడింది ....తన పిల్లలకు అన్యాయం చేయొద్దు అని అర్ధించింది ....సంప్రదాయాన్ని ప్రశ్నించింది ....అపార్ధం చేసుకుంది ....అసహ్యించుకుంది ....
చివరకు ....ఆమె పురుషుడు చేసే పని తను ఎందుకు చేయలేను అని ఆలోచించింది ....తను బయటకు వెళ్లి అవకాశాల కోసం ప్రయత్నించింది ....అలవాటు లేని పని నేర్చుకుంది ....అవమానాలను భరించింది ....తన పిల్లలకు కూడా ముందు జాగ్రత్త చర్యలు నేర్పించింది ....అదే అనుసరించాల్సిన జీవన విధానం అని అర్ధం చేసుకుంది ....అదే మనుగడకు అనివార్యం అని భావించింది ....
=======================
కానీ ఎక్కడో ....ఏమూలో ...
పిల్లలని సంరక్షణాలయాల్లో వదులుతున్నప్పుడు ....ఆయాల దగ్గర వదిలి ఆఫీస్ కి బయలుదేరినప్పుడు ....పొలంలో చెట్టుకు వేళ్ళాడుతున్న గుడ్డ ఉయ్యాలలో వదులుతున్నప్పుడు ....కర్మాగారాల్లో ఓ మూలన గుక్కపట్టి ఏడుస్తున్నప్పుడు ........చిన్నపిల్లల బాధ్యత పెద్ద పిల్లలకు అప్పగించినప్పుడు ....ఇంట్లో వదిలి వేరే ఊరుల్లో ఉద్యోగాల కోసం వెళుతున్నప్పుడు ....
ఇంకా కడుపులో కలుక్కుమంటుంది ....కన్నపేగు కోతకు గురవుతుంది ....గుండెల్లో బాధ మెలి తిప్పుతుంది ....
ఆమె కన్న పేగు కోతను అర్ధం చేసుకునే మాతృ హృదయం ఉన్న పురుషుడు ఈ రోజుల్లో కూడా ఇంకా ఎక్కడో ఉన్నాడేమో అని ఆశ కలుగుతుంది ....అలాంటి వాళ్ళు ఎవరైనా ....Happy Mother's Day అని చెప్తే వినాలని ఉంది... <3

No comments:

Post a Comment