Friday, October 21, 2016

సర్వేజనాః సుఖినోభవంతు ...!!

సంవత్సరం అంతా .....పొలం దున్ని , విత్తునాటి , మొలక కంటే వేగంగా పెరుగుతున్న కలుపు పీకి , లేత చిగుర్లని ఆశిస్తున్న చీడ పీడలను సంహరించి ...ఎండకు ఎండినప్పుడు నీళ్లు పోసి , వానకు తడిసినప్పుడు ఎండ నిచ్చి , గాలి కి కొమ్మలు విరగకుండా ఆసరా ఇచ్చి ....పంట పండించి చూసుకుని మురిసి ....ఆప్యాయంగా పంట ఇంటికి తెచ్చుకుంటే ....

సంతోషం చెప్పనలవి కానిది ...ఇక తరవాత పంట ఎవరి నోటిలోకి పోతుంది అనేది ....పండించిన వారి చేతుల్లో ఉండదు ....

కొంత పొలంలో ఉండగానే పక్షుల పాలైపోతుంది .....ఇంటికి తెచ్చే సమయంలో కొన్ని గింజలు నేల పాలు కావచ్చు ....ఇంటికి తెచ్చాక కొంత ఎలుకల పాలు , ఇక దళారీలు , మిగిలింది కాస్తో కూస్తో తన కోసం ఉంచుకుంటే .... ....బంధువుల్లాంటి రాబందులు ..

దీనికి తోడు ....పరిగె ఏరుకునే వాళ్లకు (పంటలన్నీ అయిపోయాక కొందరు పొలంలో కింద మట్టిలో పడిపోయినవి ఏరుకుంటారు ....) చివరకు మిగిలేది ..... 

ఆఖరికి పండించిన వారి ఆకలి ప్రశ్నార్ధకమే .... ??!!

మరి సంవత్సరం అంతా రేయనక , పగలనక కష్ట పడింది ఎవరు అంటే .....ఒక్కరే ....రైతు ....

కానీ రైతు లేకుండా ఉంటే.... సమస్త జీవకోటి ఎలా బ్రతుకుతారు ....???!! 

అందుకే రైతు తనకు ఉందా లేదా అని ఆలోచించకుండా .....మళ్ళీ శ్రమించడం మొదటినుండి మొదలు పెట్టాలి .....

మళ్ళీ దుక్కి దున్ని , విత్తు నాటటడం మీదే తన దృష్టి అంతా కేంద్రీకరించాలి ....ఇంకా వానలు పడలేదే అని ఆకాశం వైపు ఆత్రంగా ఎదురు చూస్తూ ఉండాలి  ....

రైతు పని వైపు చూస్తుంటే ....

మిగతా అందరూ రైతు మొహం వైపు చూస్తూ ఉంటారు ....వాళ్లకి వేరే పని లేదు ....రైతు పండించేవరకు ఎదురు చూసి ....దోచుకునే సమయం వరకు కాచుకుని కూర్చోవడమే పని .......!! 

============================

ఇక్కడ సమాజంలో జీవన చిత్రం కూడా అదే ......

సంవత్సరాల తరబడి ....మనం పని చేస్తాం .... పనికి సమాజంలో గుర్తింపు వచ్చే సమయానికి ఫలితాన్ని చుట్టూ పదిమంది దోచుకోవడానికి సిద్ధపడతారు .....

పని చేసేవాళ్ళు .....పని, పని, పని ఇదే ఆలోచిస్తూ పని చేసుకుంటూ పోతారు .....

ఫలితం మీద వాళ్ళ దృష్టి ఉండదు .....వాళ్లకు పని చేయాలనే బాధ్యత కనిపిస్తుంది అంతే....అది చేశాక మేము పని చేసాం అని ఎవరితో చెప్పరు...చెప్పే తీరిక ఉండదు ....అయ్యో ఆపని ఇంకా పూర్తి కాలేదు .... బాధ్యత ఇంకా నెరవేర్చలేదు ....అనే ఆలోచనే ....

తలవంచుకుని ..... సైనికునిలా , సుశిక్షితుడిలా .... కార్యకర్తగా , సేవకుడిలా , భావకుడిలా ... పని చేసుకొంటూ పోతూనే ఉంటారు .....

ఇక దోచుకునే దొంగలు .....

చూసుకుంటూ ఉంటారు .....

వాళ్ళు చేసే పనిని వీళ్ళు చేసే పనిగా చిత్రీకరించి మెప్పు పొంది ఆనందించడం , వాళ్ళు అనుసరించే మార్గాలను వీళ్ళు నిర్మించిన మార్గాలుగా పదిమందికీ చూపించి ప్రచారం చేసుకోవడం , వాళ్ళ ఫలితాన్ని వీళ్ళు సాధించిన విజయాలుగా పల్లకీలో వూరేగించుకోవడం .....ఇదే వీరి దినచర్య ......

పని చేసుకుంటూ పోయేవారు ఇది గమనించినా ....,,,, నవ్వుకుంటూ వదిలేయడం ....వారికి లేదని , రాలేదని , రాబోదని చింతించకుండా ..పూర్తయిన పని తాలూకు ఫలితాన్ని ....పరిగె ఏరుకునే పరికముగ్గుల వాళ్లకు ధారపోసి .....

మరో పని వైపు ....దానిని మొదలు పెట్టడం వైపు , పని చేయడం అనే శ్రమైక జీవన సౌందర్యాన్ని సొంతం చేసుకునే వైపు ....విశ్రాంతి ఎరుగని ప్రయాణానికి సన్నద్ధమవుతూ ఉంటారు ....

వాళ్ళు మళ్ళీ పని చేస్తున్నారు  .....అందులో మనం ఏం దోచుకొని... మనకు ఆపాదించుకోగలం అని ... దోచుకునే బాచ్ వాళ్ళవైపు కళ్ళార్పకుండా చూస్తూ ఉంటుంది .....

సమాజానికి రైతు , శ్రమ జీవులు .....వెన్నెముకల్లాంటి వాళ్లు .....
దోచుకు తినేవాళ్లు ..... వెన్నెముకే లేనివాళ్లు ....

వాళ్ళు శ్రమిస్తారు ...అందరూ జీవిస్తారు ....

సర్వేజనాః సుఖినోభవంతు ...!!



No comments:

Post a Comment