Friday, October 28, 2016

లక్ష్యాలనే బంధాలుగా మార్చుకోవడం కష్టమా ....??!!









కొంతమంది ఎలా ఆలోచిస్తూ ...మాట్లాడుతూ ...ఉంటారంటే ...,,,,
జీవితంలో …..

ఫలానా ఉద్యోగం వస్తే చాలు ....
పెళ్ళయితే చాలు ...
పిల్లలకు చదువులు చెప్పిస్తే చాలు ....
పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తే చాలు .....
రిటైర్ అయ్యేవరకు చాలు .....
తర్వాత కృష్ణా రామా అనుకుంటూ కూర్చోవడమే ..

....ఎందుకు అలా జీవితానికి అంతిమ క్షణాలు ముందుగానే నిర్ణయించుకుంటారో ....నిర్ణయించుకోమని అందరికీ చెబుతూ ఉంటారో నాకర్ధం కాదు ....

ఏం ఒక ఉద్యోగం వచ్చాక …..కెరీర్ మారకూడదా  ....ఒక ఉద్యోగం ఇష్టం లేకపోతేమరో ఇష్టమైన ఉద్యోగానికి వెళ్ళకూడదా ...అందులో మన లక్ష్యాలను వెతుక్కోకూడదా .... ఇష్టమైన ఉద్యోగం వదిలి ఇష్టం లేని ఉద్యోగానికి వెళ్లి అయినా ఇష్టంగా మార్చుకుని ఆనందంగా చేసుకోకూడదా ....

పెళ్ళయితే ....,ఖర్మకాలి వైవాహిక జీవితం అస్తవ్యస్తం అయితే ....మనుషుల మనస్తత్వాల్లో మార్పు వస్తే ....జీవితం అయిపోయినట్టేనా ... మనకు వేరే బంధాలే ఉండవా .... బంధాలను అనుబంధాలుగా ఆస్వాదించలేమా ....ఇంకా బంధాలు ఏర్పడవా....లేదా లక్ష్యాలనే బంధాలుగా మార్చుకోవడం కష్టమా ....
  
పిల్లలకు చదువు చెప్పించి ....లేదా పెళ్లి చేస్తే ....వాళ్ళ బాధ్యత అయిపోయినట్టేనా ....ఏం బాధ్యత జీవితాంతం ఎందుకు ఉండకూడదు ....అసలు అది బాధ్యత అని ఎందుకు అనుకోవాలి ...బంధంగా మార్చుకూడదా ....వాళ్లను  జీవితాంతం చేయి పట్టుకుని నడిపించాల్సిన అవసరం ఉండదుగా ....పరుగులు పెడుతూ పడిపోతామనుకుంటే ఎప్పుడైనా మన సలహా అవసరం కావచ్చు ....అప్పుడు మన అనుభవాలతో కాస్త ఆసరా ఇస్తే అల్లుకుపోతారు కదా ....వాళ్లకు కూడా ఎప్పుడూ మనకోసం ఒకరు ఉన్నారనే భావం కలిగించినవాళ్ళం అవుతాం కదా ....

రిటైర్ అయిపోతే ....అయినవాళ్ళు, కానివాళ్ళు ,మనం ...చావు కోసం ఎదురుచూస్తూ ఉంటామా ....తినడం , పడుకోవడం ....కాకుండా మనకు వేరే పనే ఉండదా ....జీవితంలో మనం ఏవేవో ఆశలు పెట్టుకుని అవి సమయం కుదరక చేయలేకపోయి ఉన్నవి అప్పుడు చేయడానికి ప్రయత్నం చేయొచ్చు కదా ...మన జీవితంలో ఇతరులకు ఉపయోగపడతాయి అనుకున్న అమూల్యమైన అనుభవాలు ఏవైనా ....ఏదో ఒక రూపంలో పంచుకోవచ్చు కదా ....
...................................

నాకైతే జీవితం ఆఖరి క్షణం వరకు ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉండాలనిపిస్తుంది ....ఎప్పటికప్పుడు ఏదో ఒక లక్ష్యం పెట్టుకోవాలని ....అది సాధించడం కోసం కృషి చేయాలని .......ఎప్పుడూ కలలు కంటూనే ఉండాలని ....జీవితం మీద ప్రయోగాలు చేస్తూ ఉండాలని ....ఎప్పుడూ ఏదీ అయిపోలేదని .....దేనికీ చాలు అనేది లేదని ..... 

ఆఖరి క్షణం నా జీవితం కోసం ఎదురుచూస్తూ ఉండేలా నా జీవితాన్ని మలచుకోవాలని ....ఇలా ఎన్నో ....

...................................

ఇదంతా ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందో తెలుసా ..... రోజు విపరీతమైన వర్షం ....అలా డ్రైవ్ చేసుకుంటూ వెళుతుంటే ...రాలిపోతున్న (Fall Colours) రంగు రంగుల ఆకుల్ని చూస్తుంటే ఎంతో ఆహ్లాదంగా ,అందంగా ,ఆనందంగా అనిపించింది .... రంగుల్ని చూడడం కోసం ఎన్నో ప్రదేశాల నుండి ఎందరో వస్తూ ఉంటారు ...... ఆకులు రాలిపోతూ కూడా తమ జీవితాన్ని ఎంత అందంగా మలచుకున్నాయా అని ఆలోచిస్తే నాకు అద్భుతంగా అనిపించింది ….
మరణంలో కూడా ...చూసే వాళ్ళ కళ్ళకి ఆనందం ....ప్రకృతికి అందం పంచుతూ ఎంతటి స్పూర్తిని కలిగిస్తున్నాయి అనిపించింది .....


రాలిపోతున్న ఆకులే మన జీవితానికి స్పూర్తి ఎందుకు కాకూడదు అనిపించింది....!!
======================
గమనిక : (( ఈ ఆర్టికల్ క్రితం సంవత్సరం ఇదే రోజు వ్రాసిన ఆర్టికల్))

No comments:

Post a Comment